గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జూన్ 2013, శనివారం

తెలుగు తేజాన్ని దశ దిశలా వ్యాపింప జేయుచున్న కళానికేతన్ వారి చంగల్వ పూ దండ నాటిక.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా! 04-6-2013 వతేదీన బి.హెచ్.యి.యల్. కమ్యూనిటీ హాల్ లో శ్రీ కళా నికేతన్ వారిచే "చంగల్వ పూదండ అను నాటిక ప్రదర్శింప బడింది.ప్రపంచ తెలుగు మహా సభలలో ప్రదర్శించి అసంఖ్యాక ప్రజా మన్ననలందిన ఈ నాటిక ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతములలో ఇంతవరకు 24 ప్రదర్శనలిచ్చి, ఇప్పుడు ఇక్కడ 25వ ప్రదర్శన ఇచ్చారు.ఇంత వరకు నిర్వహింప బడిన నాటక పోటీలలో వీరు పన్నెండింట తొమ్మిది బహుమతులను కైవసం చేసుకొన్నారు.ఇంకా వీరి ప్రస్థానం అనంతంగా కొనసాగుతూనే ఉంది.
ఈ నాటకంఇంతటి ఆదరణకు నోచుకోవడానికి  మాతృ భాషాప్రాశస్త్యాన్ని తెలుగులోగల తీయదనాన్ని హృదయాలను కదిలించే సన్నివేశాలతో, లలిత లలిత పదజాలముతో, గాత్రములను పులకరింప జేసే గాన మాధుర్యముతో అత్యద్భుతమైన కళారూపముగా ప్రదర్శించుచు ఉండుటయే ముఖ్య కారణం .
మాతృ భాషకు అన్య భాషకు గల భేదమును స్పష్టముగా సూచించి, మాతృభాష జీవన భాష కావాలని, అన్యభాషలను సమాదరించాలని సందేశమిస్తూ సాగిన ఈ నాటిక బహుళ ప్రజాదరణ పొందుటలో ఆశ్చర్యము లేదు.అన్య భాషలు కాటుక వంటివి. కాటుక కంటికి అదముగా దిద్దుకోవాలే తప్ప ఒళ్ళంటా పూసుకోరాదు అంటూ మాతృభాష మాతృ మూర్తి, మాతృ దేశము మహనీయమైనవి మహిమోన్నతమైన మన తెలుగు భాషకు దూరమౌతున్న వారిని, తెలుగుతనానికి దూరమౌతున్న వారిఇని జూసి జాలిపడాలని, వారిహృదయాలను స్పందింపచేసి ఆంధ్రభాషామృత పానలోలురమైన మనతో పాటు వారూ వారి హక్కుగా ఉన్న మాతృభాష అయిన తెలుగును, తెలుగుతనాన్ని పరిపూర్ణంగా అనుభవించేలాగ మార్పు తేవాలని  ఉద్బోధించారు. 
ఈ నాటికలో పాల్గొనుచున్న కళాకారులు చాలా మంది వయో వృద్ధులైనప్పటికీ మిక్కిలి ఆసక్తితో భాషాభిమానంతో చాలా ఓపికగా ఆంధ్ర దేశమందన్ని ప్రాతములకు తిరుగుచు ప్రదర్శనలిచ్చుచుండను చూచినవారు వారిని ప్రశంసించకుండా ఉండలేరు.
శ్రీ కళానికేతన్ అధ్యక్షుడు శ్రీ ఆర్. శివకుమార్ ను, కార్యదర్శి శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్ ను మరియు మిగిలినవారందరిని, వారు చేయుచున్న కృషిని మెచ్చుకొని ఆంధ్రామృతం మనసారా అభినందిస్తోంది.
తెలుగు తేజము ప్రపంచమున అన్ని ప్రాంతములందు వ్యాపించి కీర్తింపబడు గాక.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.