జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము రచన చేసిన సుకవి
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 9వ భాగాన్ని. నమస్తే.
శా:- భావింపం దగ పొట్టకూటి కొఱకై ప్ర్రాల్మాలి దౌర్గత్యపుం
ద్రోవల్ ద్రొక్కి, యవస్థలం బడి సదా దుర్మార్గులం గొల్చి తత్
శ్రీ వాల్లభ్యముఁ గోరువారి వరుసం జేరంగ నేఱన్. భవత్
సేవా స్వీకృతి దివ్య భాగ్యమునుగా జింతింతునయ్యా! శివా! 81.
శా:- తుచ్ఛాధ్వంబుల నేగగా హృదయమెంతో స్వాభిమానైక భా
వచ్ఛన్నంబయి యొప్పదే యితర త్రోవల్ కానగరావు ని
ర్విచ్ఛేదంబవునట్లు కన్పడెడి దారిద్ర్యాంధకారమ్మునన్
త్వచ్ఛీర్షాంచల లగ్న చంద్ర రుచులన్ దండింపవయ్యా! శివా! 82.
శా:- ప్రాణాధార మరుద్గతి క్రమ లసత్ పాణింధమంబైన దే
హానన్నాంతరమై వెలింగెడు మహేశా! నిన్ను వర్ణింపఁఘా
వాణీనాధుఁడు దొట్టిసర్వ సురలుంభావింపఁఘా నేఱర
య్యా! న్ఏనెంత? మదీయ మూఢత క్షమార్హంబౌనొ కాదో? శివా! 83.
మ:- పిసినారిన్ మరి కర్ణుఁడంచు, జడునిన్ విద్వాంసుఁడంచున్ అస
ద్వ్యసనున్ సచ్చరితుండటంచు, కపట వ్యాపారు శాంతాత్ముగాఁ
బొసగం బల్కుచు, మెచ్చు మా కవుల జబ్బుంగాంచి, భీతిల్లెదన్.
అసదౌతద్గతి నాకు దూరముగ బాయం జేయవయ్యా! శివా! 84.
శా:- నీపై పద్దెము లెన్నియేనికానీ వ్రాయఁఘావచ్చు, ధా
రా పీయూష మనోహరార్ధముగ, వైరాగ్యంబె తా నల్ల పూ
సై పోవున్ మరి పల్క నేటికిక వేదాంతాలు, విద్యా మద
వ్యాపారాళికి నీ శతాంశమునుఁ దెల్పన్ శక్తు యున్నే? శివా! 85.
శా:- నీవున్నిల్చిన చోటు వెండి మలయౌ, నీ నవ్వు కార్తీక రా
కా విశ్వామల కాంతియే యగును. నీ కారుణ్యముల్ వర్షధా
రావిర్భూత వృషత్తుషార కలనాంతశ్మైత్యముల్ త్వత్కృధల్
దావాగ్ని చ్ఛటలై వెలుంగు గిరిజాలావణ్య లోలా శివా! 86.
శా:- విజ్ఞానాంతర మూర్తి! తావక కృపావిస్ఫూర్తి గాంక్షింతులౌ
క్య జ్ఞానంబున నీడ్చునట్టి బ్రతుకయ్యా! నిన్ను దర్శించునో?
తజ్ఞుల్ బ్రహ్మ పదార్థవర్ణన కళా ధౌరేయులూహింప రా
ని జ్ఞానంబవు నిన్ను తల్చుఅయె తండ్రీ! భాగ్యమయ్యా! శివా! 87.
శా:- నిస్వార్థంబుగఁ గొల్వఁ జూతు నిను కానీ జీవ యాత్రా గతుల్
భాస్వద్భాగ్యచయమ్ముఁ గోరుటకు నిర్బంధించు కైవల్య ర
క్షాస్వాదు ప్రభలిచ్చు నిన్నుధనమున్ గాంక్షింప మోమోటమై
నా స్వామీ! యెద లజ్జితుండనయినిన్దర్శింతునయ్యా! శివా! 88.
మ:- మతినొక్కించుక నన్నుఁ జూడుము మహా మాయాంధకారావిల
వ్రతతుల్తాండవ మాడు కట్టెదుట తత్ ప్రాబల్యమోహప్రభా
గతులందించిన కంటకాధ్వములఁ బోఁగాఁ జూచు నాకుం భవత్
స్తుత కారుణ్య కటాక్ష ధారల మహస్సుం జూపరాదో? శివా! 89.
నా కష్టంబులు నీవె దీర్పుదని విజ్ఞానాంకుర శ్రీ కళా
లోకాలోకము వెల్గ జేతువని, నాలో నిల్చు మోహాంధ వీ
చీ కేళిం బరిమార్చి, ప్రోతువని, సు స్నేహార్ద్రభావమ్మునన్
నీ కైలాసముఁ ద్రోవ నిల్చుదని తండ్రీ! నమ్మితయ్యా! శివా! 90.
(సశేషం)
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.