గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2013, ఆదివారం

కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు రచించిన శివాలాపము 91 నుండి సాంతము. 10వ భాగము.

జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము  రచన చేసిన సుకవి
 శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 10వ భాగాన్ని. నమస్తే.
శా:-
శాపంబిచ్చి, విమర్శికాగ్రిణుల గెల్చన్ తప్పు కాదా? కప
ర్దీ! పద్మమ్మునఁ దప్పు పట్టగనె నత్కీరున్ మహా రోగ సం
తాపుం జేసితి వెప్పుడో తుదకు నిన్ ధ్యానింప రక్షించినా
వాపై, నీ మహిమానుభావము భయంబౌనయ్య తల్చన్ శివా! 91.

శా:-
శ్రీనాధాది మహా కవీశ కవితా శ్రీ మగ్నభావుండ  వౌ
రా! నా కైత సు శబ్ద భావ సరసాలంకార పాక ధ్వని
శ్రీ నిర్వ్యూఢముఁ గాక యుండినను నిన్ జేఁ బట్టగాఁ జూచు స్నే
హానం దీని ననుగ్రహింపఁ గదవే, యానంద రూపా! శివా! 92.

శా:-
నీకంటెన్నొడ యుండు వేఱొకఁడు తండ్రీ! నాకు లేడయ్య. నీ
కా! కోకొల్లలు నిత్య పూజ రచనా కైంకర్య భావాత్ముల
స్తోక ధ్యాన తపో విధిక్రమ మహాత్ముల్ భక్తు లవ్వారికిన్
యే కొంచెంబునుఁ బోల్ప రాని నను నెట్లేఁ బ్రోవ వయ్యా! శివా! 93.

శా:-
ఊహాపోహలు నీకు నాకు నడుమన్ ఒక్కింతయున్ లేవు. సం
దేహింపం బని లేదు. సత్కరుణ సంధింపంగ వాంఛింతు. న
య్యా! హాలాహల ఘోర శౌర్య దళనానంత ప్రభావామల
శ్రీ  హేలా మధు మూర్తి! నిన్నును వినా సేవింప నేరిన్. శివా! 94.

 శా:-
వైముఖ్యబు ఘటిల్లు లౌక్య విషయ వ్యాపారముల్ పల్క తత్
శ్రీమద్భావము సుంత నిల్వదు తటిద్రేఖా ప్రభా భాసమై
స్వామీ! వెన్క మహాంధకారము సృజింపం జిత్రమయ్యా! కనుల్
తా మూయంగను, విచ్చినం దిమిర సంతానమ్మె తోచున్ శివా! 95.

శా:-
స్నేహంబీవు. వెలార్పదీవ.శిఖినై నే వెల్గునట్లున్ మహా
మోహ ధ్వాంతము విచ్చి చిద్రుపలుఁగాఁ బోకారునట్లున్ భవ
న్మాహాత్మ్యాంబుధి నోలలాడు నటులున్ మన్నింప రావే, సదా
నీహారాచల కన్యకా హృదయ నిర్ణిద్రైకభావా! శివా! 96.

శా:-
వేలున్ లక్షలు తత్ కృపాగతులు భావింపంగ నల్పాల్పమే
ధోలంకారితమౌ మదీయ భవముందూగాడునో త్వ న్మహా
లీలా సాగర వీచి మధ్యమున . కేళీ తాండవారంభ. దు
శ్శీలంబన్నది త్వత్ కటాక్షముల విచ్ఛిన్నంబు కాదో! శివా! 97.

శా:-
నే నేమీ యొక సత్ కవీశ్వరుని కానే కాను, కానీ, ప్రభూ!
ప్రాణాయామ పథాంతరోజ్వలిత! సర్వ జ్యోతి రూపా!సుర
క్షా!నా యీ కవనమ్ము నీ కరుణకై సత్యమ్ము మీదెత్తితిన్.
ఈ నా భక్తి పదార్పితంబు కద! నీకిష్టంబొ? కాదో? శివా! 98.

శా:-
పదియైదేడుల ప్రాయమందున తలంపం బద్య నిర్మాణ సం
పదకై యఱ్ఱులఁ జాచు నన్నుఁ గని, సంభావించి నా తండ్రి! కా
వ్య దశల్, తత్ కవితా రహస్యములు చెప్పన్ గాంచు మాయమ్మ స
మ్మదముల్ నేటికిఁ బండె నిట్లుగ భవన్మాహాత్మ్య లీలన్. శివా! 99.

మ:-
తలకున్ మించిన భారమిద్ది కృతి ముద్రా కార్య సంభార మం
చెలమిన్ నిస్పృహ నున్నచోఁ దనకు తానే కోరి మద్వాణి మి
క్కిలి పూన్కన్ ప్రకటింపఁ జేసిన హయగ్రీవున్ సుధా స్వాదు పే
శల భావున్, కరుణాంతరంగమునఁ గాంచం గోరెదయ్యా! శివా! 100.

శా:-
ఓ విశ్వేశ్వర! యో జగత్రయ గురో! యో విశ్వ రక్షా! శివా!
యో విశ్వోదయ! యో దయ గుణ నిధే! యో భక్త కల్పా! శివా!
యో వేద స్తుత! యో హృదంతర రుచీ! యో జ్ఞాన రూపా! శివా!
యో విశ్వాం తర సర్వ భూత హృదయ ధ్యేయైక దీపా! శివా! 101.
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి వతంస విరచిత శివాలాపము అను శతకము సమాప్తము. 
స్వస్తి. 
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

భక్తి రసమును కురిపించిన కవివతంస శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి శివాలాప శతకము వీనుల విందుగా నున్నది ప్రముఖుల పరిచయ ములనూ వారి రచనలను మాకందించిన చింతావారికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.