గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, నవంబర్ 2012, మంగళవారం

ఓ టింగరి నీలమా! కనవటే? జన జీవన శైలి నీవు?

ఆంధ్ర మహాజనులారా! నీల నామక పెను తుపాను మన ఆంధ్రుల జీవితాల్ని ఎలా అతా కుతలం చేసిందో తల్చుకుంటేనే గుండె చెరువైపోతుంది. నా గుండెల్లోంచి ఉప్పొంగిన బాధను పద్యరూపంలో ఈ పెనుకి విన్నవించాను.
హృదయ విదారకంగా ఉండే ఈ పద్యాలను సహృదయుఁడైన మా చిరంజీవి ముక్కు రాఘవ కిరణ్ ఆలపించగా మీకు వినిపించడం కోసం ప్రతీ పద్యమునకు పైన ఆ ఆడియోను ఉంచాను. గమనించి వినగలరు.

నింగిని మేఘమై నిలిచి నింగియు నేలయు నొక్కటైనటుల్
పొంగగ భూమిపై జలము పొంగుచు వర్షము కుర్సినట్టి యో
టింగరి నీలమా! కనవటే? జన జీవన శైలి నీవు? యా
ముంగిళులందు జొచ్చి గృహముల్మునిగించిన వాన లెందుకే? 1.

రాతిరియున్ బవల్ భువిని ప్రాణముగా కని పాడి పంటలన్
చేతికి వచ్చునంచు కృషి చేసెడి శ్రామిక కర్షకాళికిన్
ప్రీతి యొనర్చ చాల మురిపించుచు వర్షము నిచ్చువాడ వే
రీతిగ ముంచినావు? కలరే నినుపోలెడి దుష్ప్రవర్తకుల్? 2.

వ్యవసాయమును నమ్మి అప్పులు  గొని తమ -  భవిత భాగ్యమ్మవన్ పగలు రాత్రి
శ్రమియించి, భూదేవి శ్రమకు తగ్గ ఫలము నిచ్చె  పండియటంచు మెచ్చుకొనుచు
పంటను కోసిరి. పనలపై నుండగా -  మంటిని కలిపె నీ మాయ వాన.
కన్నీరు మున్నీరుగా విలపించెడి  -  కర్షకులను జూడ కరుగు మనసు.
ఎంత నిర్దయ నీకు, నీ వింత వృత్తి  -  కొంత పరికించి చూడుము. కొంపలెన్ని
కూల చేసెనొ నీ వాన? గో గణముల  - ప్రాణములు తీసె. నీకిది భావ్యమౌనె? 3.

అప్పుల యూబిలో మునుగు నర్భక మానవ జాతిపైన నీ
విప్పుడు నీ ప్రతాపములనెల్లెడ జూపగ కోరి వర్షముల్
ముప్పును గొల్పగా కురిసి ముంచితివే! బ్రతుకంగ నెట్లు వా
రిప్పుడు? తప్పు , తప్పు లొనరించుట నీకది మేలు కాదుగా? 4.

కొంపలు కూలగా గోలు గోలుమటంచు -  నార్త నాదము చేసి అలయువారు,
ఉన్న పాటున నీరమన్ని దిక్కుల క్రమ్మి  -  ముంచె సర్వంబని మూల్గువారు,
పశువుల పాకల ప్రవహించి గొనిపోయె  -  పాడి పసులనని వందు వారు.
కోళ్ళను మేకల గొనిపోయె వరదొచ్చి  -  కోలుకొనుటెట్లని కుములువారు,
అన్న పూర్ణగ వెలుగెడి యాంధ్ర మాత  -  చిన్నబోయెను సర్వంబు చేయి జార.
కన్న బిడ్డల నొడి చేర్చి కావ లేక  -  కంట నీరిడి కుమిలెను. గాంచవేమి? 5.

జీవన యానమందు మము చేతిని వీడి, గతించినారు దే
వా! వన యానమందు నిలువంగను చాలక నీటి పోటికిన్.
బ్రోవగ నున్న వార లిక బ్రోవగ నెవ్వరటంచు నేడ్తు,  రా
జీవన వేదనల్ మదికి చేరవొ? నీ మది చింత కల్గదో? 6.
ఎక్కడివారలక్కడ ననేకులు చిక్కిరి వర్షధారచే
నుక్కిరిబిక్కిరై యొదిగి యుండిరి చేయగ జాలకేమియున్.
నిక్కుచు నీల్గుచున్ నిలిచి, నివ్వెరపోవగ నెల్ల లోకమున్
దిక్కులు మ్రోగ ఘూర్ణిలుచు తేజము జిమ్ముచు వృష్టి గొల్పితే? 7.

దారులన్ని కూడ గోదారియయ్యెను  -  దారి లేక జనులు తల్లడిలిరి.
చేర వలయు చోటు చేరక కొందరు  -  చేరినారుధది నచేతనులయి. 8.

జీవన సాగరాన వ్యధ చెందుచు నిత్యము మున్గి తేలుచున్
బ్రోవగనుండు దైవమని పూజలు చేయుచు, భుక్తికై సదా
చేవను చూపి కష్టములు చేయుచు కూలి గడించు వారికిన్
నీవలనన్ పనుల్ కనమి  నివ్వెర పోవుచు నుండ్రి. చూచితే? 9.

కూలి కొఱకని పొలమేగు కూలివార్ని
జాలి విడుచుచు నీటితో చంపితేల?
ఆలు బిడ్డలు కనలేని యవధి చేర్చి
తేల? దుర్ నీలుడా! నిజ మేల కనవు? 10.

మందులు కొట్టెడు భూ కా
మందుల కడ పనికి చేరి మందులు కొట్టున్
మందులు పర భూముల. నీ
వెందులకిటు చంపినా వదేమి సుగుణమా? 11.

నిన్నెన్నడు మెచ్చను నే.
నెన్నను నిను సుకృతి వనుచు నెన్నరు జూడన్.
కన్నీరే మున్నీరై
మిన్నంటగ నేడ్చు జనులు మేదినిఁ గనవే? 12.

దుర్మార్గుల శిక్షింపగ
మార్మోగెడి గర్జనలను మా మదులదరన్
ధర్మంబని చేతువొ, యే
మర్మము లేనట్టి వారు మట్టిని కలియన్? 13.

ఇకనైనను శాంతింపుము.
సకలంబును తెలియు కర్మ సాక్షికి. ప్రజలన్
వికలంబు చేయ దగదిక
సకలము శుభ ఫలములొసగి సద్దుకుపొమ్మా! 14.

ఈ పెను తుపాను కారణంగా ఆస్తులను, అసువులను, మనశ్శాంతిని బాసిన ప్రతి ఒక్కరికీ నా విచారం తెలియజేస్తున్నాను. ఆ పరమాత్మ తప్పక కాపాడాలని మనసారా కోరుకొంటున్నాను.
లోకాః సమస్తాః సుఖినో భవంతు.
జైహింద్.
Print this post

5 comments:

durgeswara చెప్పారు...

నిజమేనండీ
వారి బాధలు చదువుతుంటే మనసు కకావికలమవుతుంది వారి బ్రతుకులాగానే !

Pandita Nemani చెప్పారు...

శుభాశీస్సులు

మోదము నొందు వేళ పలు ముద్దుల మూటల పద్యరత్నముల్
ఖేదము నొందు నట్టియెడ కేవల మశ్రుల చిందు వాక్యముల్
సోదర! రామకృష్ణ కవి! శుద్ధ మనమ్మున వెల్వరింతువే
యాదరణీయ భావ విభవాంచిత సత్కవితా సుధా ప్రియా!

నిలిపితి వాంధ్రామృతమును
సలిపితివి విశేష సేవ సాహిత్యములో
కొలిచితివి తెలుగు తల్లిని
మలిచితివి మనోజ్ఞ రత్నమయ సత్కృతులన్

నాలుగు విధముల కవితల
హేలగ విరచించు సత్కవీంద్రా! నీకున్
మేలగుత నెల్ల వేళల
శ్రీలొందుచు వెలుగుమయ్య! చిరకాల మిలన్

నేమాని రామజోగి సన్యాసి రావు

కంది శంకరయ్య చెప్పారు...

తుఫాను కష్టాలను ఆర్ద్రంగా వివరించిన మీ పద్యాలు హృదయాన్ని కదిలించాయి. బాధితులకు నా సానుభూతి.

పండిత నేమాని వారి పద్యాశీస్సులను పొందిన మీకు నా హార్దిక అభినందనలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

౧)ఆర్యా దుర్గేశ్వర రావు గారూ! మీ అకళంకమైన భక్తి తత్పరతకు మెచ్చే ఆ పరమాత్మ ఇకపైన ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలను కలిగించడని ఆశిద్దాము.

౨)ఆర్యా పండిత సన్యాసి రావు సహృదయా!

అమరుల దీవనాళి వలె యద్భుతమై మహనీయమైన మీ
సుమధుర భావనా గరిమ శోభను గూర్చగ పల్కు పద్యముల్
నమకమటుల్ హృదీశ్వరుని నర్తన చేయగ చేయునయ్య! యో
విమల వచో విలాస!మిము వేడెద నంద కృతజ్ఞతాంజలుల్.

౩)శంకరార్యా! ధన్యవాదములు. ఆ పరమాత్మ దయాపూర్ణుడై ప్రజలు అమాయకంగా చేసే అకృత్యాలను మన్నించి, ప్రకృతివైపరీత్యాలకు గురి కాకుండా చేసి కాపాడాలని కోరుకుందాం.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారము !
హౄదయాన్ని కదిలించే దృస్యాలనూ ,పద్యాలను అందించ డమే గాక పాడి విని పించిన గళ మాధ్యుర్యం విన సొంపుగా వేదనను మరపి స్తోంది. ప్రకృతి వైప రీత్యాలను ధైర్యం గా తట్టుకో కోగల శక్తిని ప్రజలకు ఆ భగ వంతుడు ప్రసా దించు గాక శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.