గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2012, శనివారం

శ్రీ కొమ్మూరి వేంకటేశ్వర రావు గారికి పదవీ విరమణ సందర్భంగా సన్మాన కుసుమాంజలి.

శ్రీరస్తు                                         శుభమస్తు                           అవిఘ్నమస్తు.
శ్రీ కొమ్మూరి వేంకటేశ్వర రావు
(సూపరింటెండెంట్, మండల పరిషద్ కార్యాలయము, ప్రత్తి పాడు)  గారి  
పదవీ విరమణ సందర్భముగా తేదీ. 30 - 6 - 2012. న  బంధు మిత్రులు సమర్పించిన 
సన్మాన కుసుమాంజలి.
రచన:- చింతా రామ కృష్ణా రావు.

ఉ:- శ్రీ రమణీ మనోజ్ఞ హరి  చిద్విలసమ్ముగ వేంకటేశుఁడై
కోరినవెల్ల తీర్పగను కొండల రాయఁడుగా జనించె నీ
వీరుఁడు నేటి నుండి పదవిన్ విరమించెడు వేంకటేశ్వరున్ 
కోరిన కోర్కె తీర్చి, కడు కూర్మిని రక్షణ చేయు గావుతన్. 1.

సీ:- శ్రీ యుత కొమ్మూరి శ్రీ నరసింహరావ్ - వేంకట రమణమ్మ ప్రీతి నంద
రెండవ పుత్రుఁడై ప్రేమ స్వరూపుఁడై - వేంకటేశ్వర రావు వెలసె నింట.
వేంకట రత్నము ప్రియతమ భార్యగా - జీవన యానంబు చేయుచుండ
శైలజ పుత్రిగా, సద్గుణ రవి కుమార్ - శ్రీకాంతు పుత్రులై చెలగినారు.
గీ:- ఫణి కుమారుఁడల్లుఁడు కాగ, భాగ్య రాశి
కనక శేష హవీషయు వినుత శాంతి 
యింటి కోడళ్ళుగా వచ్చె నీశ్వరేచ్ఛ
నరయ సంతోషు దౌహిత్రుఁడై రహించె. 2.

సీ:- అడ్డ తీగల చేరి అచట రెండేళ్ళును - నాలుగేండ్లట కాకినాడ లోను.
ఓ పదినెల్లు పిఠాపుర గ్రామాన - కాకినాడైదేండ్లు ప్రాకటముగ
రామచంద్ర పురాన రాణించె నైదేండ్లు - తినిలోన వర్షంబు ఘనతఁ గాంచె.
కోటనందూరులో కొలువయ్యె నెల లెమ్ది. - తునిలోన వర్షంబు వినుతిఁ జేసె.
చల్లని మారేఁడుమిల్లిలో నెల చేసె. - కత్తిపూడైదేళ్ళు ఘనతఁ జేసె.
సఖినేటిపల్లిలో చక్కగా ఆరేళ్ళు. - రెండేళ్ళు శంఖ పురిన్ రహించె.
బిక్కవోలునఁ జేసె చక్కగా నెలలెమ్ది. - సూపరిండెంటుగా ప్రాపుఁ గొల్పె.
గీ:- మండ పేట నాల్గేళ్ళటుండె పేర్మి,
గండిపల్లిని వర్షంబు ఘనతఁ గాంచె.
ప్రత్తిపాడున మూడేళ్ళు ప్రతిభ చూపి,
విశ్రమించెడు నేడు సద్వినుత ఘనుఁడు. 3.

కందద్వయ గీత గర్భ చంపక మాల:-
ఘన సుగుణాకరా! వినుతిఁ గాంచగ నైపుణి వెల్లువెత్తి, స
జ్జన వినుతాస్పదా! ఘన యశంబును కొల్పెడి కాంతివీవు. భూ
జన సుగణా!  సదా కొలువ జాలగ కల్గిన కూర్మి నీవురా! 
జన సునుతాద్భుతా!  శుభము సగుణమొప్పెడు శోభఁ గొల్పదే! 4.

చంపక గర్భస్థ ఒకటవ కందము:-
సుగుణాకరా! వినుతిఁ గాం
చగ నైపుణి వెల్లువెత్తి, సజ్జన వినుతా
సుగణా!  సదా కొలువ జా
లగ కల్గిన కూర్మి నీవురా! జన సునుతా!

చంపక గర్భస్థ రెండవ కందము:-
సుగణా!  సదా కొలువ జా
లగ కల్గిన కూర్మి నీవురా! జన సునుతా
సుగుణాకరా! వినుతిఁ గాం
చగ నైపుణి వెల్లువెత్తి, సజ్జన వినుతా!

చంపక గర్భస్థ మూడవ కందము:-
వినుతాస్పదా! ఘన యశం
బును కొల్పెడి కాంతివీవు. భూజన సుగణా!
సునుతాద్భుతా!  శుభము సద్
గుణమొప్పెడు శోభఁ గొల్పదే!ఘన సుగుణా!

చంపక గర్భస్థ నాల్గవ కందము:-
సునుతాద్భుతా!  శుభము సద్
గుణమొప్పెడు శోభఁ గొల్పదే!ఘన సుగుణా
వినుతాస్పదా! ఘన యశం
బును కొల్పెడి కాంతివీవు. భూజన సుగణా!

చంపక గర్భస్థ తేట గీతి:-
వినుతిఁ గాంచగ నైపుణి వెల్లువెత్తి, 
ఘన యశంబును కొల్పెడి కాంతివీవు.
కొలువ జాలగ కల్గిన కూర్మి నీవు! 
శుభము సగుణమొప్పెడు శోభఁ గొల్ప!

ఉ:- మంగళమీ మహాత్మునికి, మంగళమౌత కుటుంబమంతకున్.
మంగళమౌత మిత్రులకు, మంగళమౌ తమ బంధుకోటికిన్.
మంగళమౌత లోకులకు, మంగళమౌ నుత భారతాంబకున్.
మంగళమౌత శ్రీపతికి మంగళమౌత సమస్త సృష్టికిన్. 5.
      
   మంగళం                            మహత్                         శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పదవీ విరమణ సందర్భంగా , మీ కలం నుంచి జాలువారిన పద్యములు హృద్యమంగా ఉన్నాయి . వ్రాసిన , వ్రాయించ గలిగిన , ఘనతకు , మీరంతా ధన్యులు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.