గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జూన్ 2012, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 119.

జైశ్రీరామ్.
శ్లో:-
దీపనం వృష్య మాయుష్యం - స్నానమోజోబలప్రదః.
కండూ మలశ్రమ స్వేద - తంద్రాయృడ్దాహపాపనుత్.
గీ:- స్నానమునుఁ జేయ జఠరాగ్నిచక్కఁ బెరుగు,
ధాతు పుష్టి, దీర్ఘాయువు, తగిన బలము,
తేజమొలయు. దురదఁ బాపు దివ్యముగను
మురికి, చెమట, దప్పిక, శ్రమ, మొద్దుతనము
పాప చింతన నశియించు. ప్రభను గొలుపు. 
భావము:-
స్నానము వలన జఠరాగ్ని దీపనము, ధాతు పుష్టి, దీర్ఘాయువు, తేజస్సు, బలము కలుగును. దురదలు, మురికి, బడలిక, చెమట, సోమరితనము, దప్పిక, పాప చింతన నశించును.
స్నానము చేసే నీటిని ఉద్దేశించి ఈ క్రింది శ్లోకము చదువుతూ ఆ గంగలో ఓంకారాన్ని వ్రాసి ఆ నీటితో స్నానం చేయాలి.
శ్లో:-
గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, 
నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు.
శ్లో:-పంచ స్నానాని విప్రాణాం కీర్తితాని మహర్షిభిః |
ఆగ్నేయం వారుణం బ్రాహ్మ్యం వాయవ్యం దివ్యమేవచ || 
ఈ స్నానము 5 విధములు.
౧.నిత్య స్నానము:-
ప్రతీ రోజూ చేసే స్నానము.
౨.నైమిత్తిక స్నానము:-
గ్రహణాది నిమిత్తముగా చేసే స్నానము.
౩.కామ్య స్నానము:-
కోరికతో పర్వదినాలలో చేసే స్నానము.
౪.ముఖ్య స్నానము:-
నీటితో చేసే స్నానము.
౫.మంత్రం లేదా బ్రాహ్మ్య స్నానము:-
నమకాది మంత్ర యుక్తముగా చేసే స్నానము.
ఈ స్నానము 2 రకములు. 
౧.వారుణ స్నానము - వారి అంటే నీరు. నీటితో చేసే స్నానము.
౨.గౌణ స్నానము. - నీరు లేకుండా చేసే స్నానము. 
ఇది 5 రకములు.
౧.ఆగ్నేయస్నానము:-
(విభూతి స్నానము)
శ్లో:-శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం|| 
మగవారికి సంపదలను చేకూర్చే, పరమ పవిత్రమైన,  బాధలను నివారించే,  అనారోగ్యాలను పోగొట్టే,   అందరినీ వశంలో ఉంచుకునే విధంగా చేసే ఈ విభూతి ముల్లోకములందును పవిత్రమైనది.

౨.భౌమస్నానము:-
(మృత్తికా స్నానము)
౩.వాయవ్యస్నానము:-
(రేగుతున్న గోధూళితో స్నానము)
౪.దివ్యస్నానము:-
(వర్షములో తడిసి చేసే స్నానము)
౫.మానసిక స్నానము:-
(దైవ చింతనచేస్తూ, కామాది అరిష్డ్వర్గాలు అనే మాలిన్యాలను వీడుట. ఇదియే నిజమైన స్నానము. బాహ్యంగా జలంతో చేసే స్నానం కేవలం కాకి స్నానమే ఔతుంది)
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

స్నానములు , వాటి విశిష్టతను గురించి చక్కని వివరణ ఇచ్చారు . ఇలా తెలియని ఎన్నో విషయాలను తెలుసు కో గలగడం మా అదృష్టం . ధన్య వాదములు . ఆశీర్వ దించి .అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.