గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జూన్ 2012, శనివారం

శ్రీ నిడమర్తి మధుసూదనరావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించిన సన్మాన మందార మాల.

శ్రీరస్తు                                  శుభమస్తు                       అవిఘ్నమస్తు.
శ్రీ నిడమర్తి మధుసూదనరావు
ఈనాడు వార్తా పత్రిక మార్కెటింగ్ విభాగము మేనేజర్  గారి పదవీ విరమణ సందర్భముగా తే.30 - 6 - 2012. హైదరాబాదులో బంధు  మిత్ర  సహోద్యోగ వర్గము సమర్పించిన
సన్మాన మరంద మందార మాల
రచన:- చింతా రామ కృష్ణా రావు

:- శ్రీ సుఖదాయి. జ్ఞాన సుధ చిద్విభవంబుగ నిచ్చు సాయి, సం 
తోష శుభాస్పదుండగు బుధుండు విరామము పొందు వేళలో
మా సహ వర్తి పూజ్య నిడమర్తి సుధీ మధు సూదనాఖ్యునిన్ 
ధ్యాసను గాచుతన్. గుణవదాన్యుని తోడఁగ నుండి బ్రోచుతన్. 1.

సీ:- జనని కనక దుర్గ జనకుండు సర్వేశ్వ - రాఖులు పొంగఁగ నచట పుట్టి,
కొమ్మర గ్రామాన కొనియాడగ పెరిగి, - వినుత తాడేపల్లి విద్య గరచి,
రేవతిన్ బెండ్లాడి శ్రీవత్సలుండట్లు - నొప్పి సద్బంధుల మెప్పు పొంది,
కనక హవీషయు కల్యాణ సాత్విక్కు - లపురూప సంతుగ నమర పొంగి,
గీ. రవి కుమారుడల్లుండయి రహిని పెంచ
పేర్మి నిడమర్తి వంశ సంప్రీతముగను
మసలు మధుసూదనాఖ్యునిన్ మహిత వరుని 
మన్ననము సేయ తగుదురా మహిని జనులు? 2 .

:- చదువున్ శ్రద్ధగ పూర్తి చేసి కృషితో సాధించి బీకాము (B.Com) సం 
పదలన్ బొందగ నాంధ్ర బేంకు పనియున్, ప్రఖ్యాత మౌ కంపెనీ
పదవిన్ జేకొని, నిర్వహించి, పిదపన్ ప్రఖ్యాత ఈనాడు లో 
పదవిన్పొంది రహించి నేటి దనుకన్ ప్రఖ్యాతి నార్జించిరే! 3.

ద్వివిధ కంద ద్వయ - తేటగీతి - గర్భ చంపక మాల:-
ప్రియ మధు సూదనా! సుగుణ రీతి దయం గను సుస్వభావ. ధీ 
నయ హృదయార్ణవా! మహిత నామ ధరా! ధర మాన్య జీవమా!
జయ మధుపాక్షరా! జయము, సర్వ ధనంబులు చాల నిచ్చురా
దయ హృది తోడ శ్రీ హరి ముదంబు దయన్ వినయంబుఁ గొల్పు మున్. 4.

చంపక గర్భస్థ ద్వివిధ కందము1a:- 
మధు సూదనా! సుగుణ రీ 
తి దయం గను సుస్వభావ. ధీ, నయ హృదయా!
మధుపాక్షరా! జయము, స 
ర్వ ధనంబులు చాల నిచ్చురా! దయ హృదితో!

చంపక గర్భస్థ ద్వివిధ కందము1b:- 
మధుపాక్షరా! జయము, స 
ర్వ ధనంబులు చాల నిచ్చురాదయ హృదితో!
మధు సూదనా! సుగుణ రీ 
తి దయం గను సుస్వభావ. ధీనయ హృదయా!

చంపక గర్భస్థ ద్వివిధ కందము2a:- 
హృదయార్ణవా! మహిత నా 
ధరా! ధర మాన్య జీవమాజయ మధుపా!
హృది తోడ శ్రీ హరి ముదం 
బు దయన్ వినయంబుఁ గొల్పు మున్. ప్రియ మధు సూ!

చంపక గర్భస్థ ద్వివిధ కందము2b:- 
హృది తోడ శ్రీ హరి ముదం 
బు దయన్ వినయంబుఁ గొల్పు మున్. ప్రియ మధు సూ!
హృదయార్ణవా! మహిత నా 
ధరా! ధర మాన్య జీవమా! జయ మధుపా!

చంపక గర్భస్థ తేటగీతి:- 
సుగుణ రీతి దయం గను సుస్వభావ
మహిత నామ ధరా! ధర మాన్య భావ!
జయము, సర్వ ధనంబులు చాల నిచ్చు 
హరిముదంబు దయన్ వినయంబుఁ గొల్పు!

:- మంగళ భావ పూర్ణుఁడ! సుమంగళ భాగ్య పథానువర్తివై 
మంగళ హేతువైతివి సమంచిత రీతి సమాశ్రితాళికిన్.
మంగళ సత్స్వరూపుఁడగు మాన్య రమా హృదయేశ్వరుండు సన్ 
మంగళముల్ నిరంతరము మన్ననతోఁ గలిగించు మీకికన్. 5.

మంగళం                        మహత్                          శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పదవీ విరమణ సందర్భము గా శ్రీ మధుసూధన రావుగారిని మనోహర మైన పద్య రచనతో ముంచెత్తిన మీ ఆత్మీయతాను రాగములు కొనియాడ దగినవి . గొప్ప వారిని గురించి పరిచయం చేసిన మీరు ధన్యులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.