గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జూన్ 2012, ఆదివారం

సర్వానుగ్రహ హనుమద్ధ్యానము.

జైశ్రీరామ్. 
ప్రియ భగవద్బంధువులారా! 
భగవద్భక్తులకు భగవంతుని సేవకంటే కూడా భగవద్భక్తుల సేవ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. రాముని సేవ కంటే కూడా రామ భక్తుఁడైన హనుమంతుని సేవ మంచి ఫలితాన్నిస్తుంది. ఆ హనుమంతుని తలచుకొనినంతనే మనకు ఎటువంటి సత్ ఫలితాలు కగుతాయో, ఆ పరమ రామ భక్తుని మనం ఏ విధంగా ప్రార్థించాలో  క్రింది శ్లోకాల ద్వారా తెలుస్తుంది.
శ్లో:-
బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్.
ఆ.వె:-
బుద్ధి, బలము, కీర్తి, పూజ్యమౌ ధైర్యము,
నిర్భయత, యరోగ నిగ్రహములు,
కన యజాఢ్యతయును, కమనీయ వాగ్ధాటిఁ
గొలుపు హనుమ తలపు, గురు తరముగ.
భావము:- 
హనుమంతుని యొక్క తలంపు మనకు సద్బుద్ధిని, మంచి బలమును, సత్కీర్తిని, ధైర్యమును, నిర్భయత్వమును, రోగ రాహిత్యమును, అజాఢ్యమును, మంచి వాగ్ధాటిని, సంప్రాప్తింప చేస్తుంది.
శ్లో:-
ఆయుః ప్రజ్ఞా యశో లక్ష్మీః శ్రద్ధాః పుత్రా సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ  కపి నాథ నమోస్తు తే.
తే.గీ:-
ఆయువును, ప్రజ్ఞ, కీర్తియు, నమర చేసి,
శ్రద్ధ, పుత్ర సుశీలత లొద్దిక నిడి,
సౌఖ్య మారోగ్యమమరంగ చక్కఁ గనుమ!
ప్రార్థనలుసేతు గనుమయ్య! భక్త హనుమ!
భావము:-
ఓ రామ భక్త హనుమా! నిన్ను ప్రార్థన సేతును. నాకు ఆయుర్దాయమును, మంచి ప్రజ్ఞను, సత్కీర్తిని, శ్రద్ధను, సత్పుత్రులను, సౌశీల్యాది సద్గుణములను, సౌఖ్యమును, ఆరోగ్యమును, అమరునట్లు కరుణతో చూడుము.

చూచారుకదండీ! మీరు ఆ హనుమద్వరసిద్ధులగుదురుగాక.
జైహింద్.

Print this post

5 comments:

Pandita Nemani చెప్పారు...

జయహే వీరాధివీరా! సకల శుభకరా! శత్రుసంహార ధీరా!
జయహే వాతాత్మజాతా! జలజహితహితా! శాంతి సౌఖ్యప్రదాతా!
జయహే దివ్యస్వరూపా! సరస గుణయుతా! జ్ఞానయోగప్రదీపా!
జయహే భక్తాగ్రగణ్యా! జగదఖిలనుతా! సంజయా! ఆంజనేయా!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గురువర్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి నమస్సులు.

ఉ. దేహము బెంచి మారుతి సుధీరుడు లంకను జేరి యుక్తితో
నూహల కందనట్టి ప్రతివ్యూహముతో రిపునాజి గెల్చి వై
దేహిని రామునిన్ గలిపె, తేజమునన్ వెలుగొందు సూర్యుడౌ
శ్రీహనుమంతదేవునకు శ్రీపతి మ్రొక్కు వినమ్ర చిత్తుడై

Pandita Nemani చెప్పారు...

అయ్యా శ్రీ శ్రీపతి శాస్త్రి గారూ!
మీ పద్యము బాగున్నది. 2వ పాదములో ప్రతివ్యూహము అనే సమాసములో వ్యూ కి ముందున్న తి గురువు అవుతుంది. సవరించండి. స్వస్తి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిత్యం పఠించ వలసిన ఆంజనేయ దండ కాన్నీ శ్లోకాలను హనుమ చిత్రం తోపాటుగా అందించిన చింతా వారికి ధన్య వాదములు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్సులు.

ఆర్యా,క్రిందివిధముగా సవరిస్తున్నాను.

ఉ. దేహము బెంచి మారుతి సుధీరుడు వారిధి దాటి లంకలో
నూహల కందనట్టి రణయోధుడు తాన్ రిపునాజి గెల్చి వై
దేహిని రామునిన్ గలిపె, తేజమునన్ వెలుగొందు సూర్యుడౌ
శ్రీహనుమంతదేవునకు శ్రీపతి మ్రొక్కు వినమ్ర చిత్తుడై

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.