గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, డిసెంబర్ 2010, మంగళవారం

శారదాంబ జన్మ దినం.ఆమెకు మూల రూపమైన ఆ చదువుల తల్లిని ప్రార్థిద్దామా?


సుహృద్భావ పూర్ణులారా!  మార్గశిర బహుళ సప్తమి  లోకమాత ఐన శారదాదేవి తన లీలలో  భాగంగా ఈ భూమిమీద పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ జగన్మాత కటాక్షం మీఅందరికీ లభించాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
ఈ లోకంలో మానవులలో ఏ ఒక్కరైనా సరే ఆ చదువుల తల్లి కృపామృతాన్ని గ్రోలకుండా ఉండరు. ఆమె వాక్ స్వరూపిణి. 
మానవునికి మంచి పేరైనా చెడ్డ పేరైనా కేవలం మాటాడే మాటలపైనే ఆధారపడి వస్తుంది.. 
ప్రియముగా మాటాడేవారు మంచివారుగాను, చెడుగా మాటాడే వారు చెడ్డవారుగాను సమాజంలో ముద్ర వేయబడతారు.
అందుకే 
ప్రియ వాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః.
తస్మాత్తదేవ కర్తవ్యం. వచనే కా దరిద్రతా.
అన్నారు మన పూర్వీకులు.
ఆ మాటాడే శక్తి  మనకు సాక్షాత్తు సరస్వతీ మాత ప్రసాదమే కదా! 
అట్టి జగన్మాత పుట్టిన రోజు మార్ఘశిర బహుళ సప్తమి. 
మంగళప్రదమైన ఈ సమయంలో మనం ఆ శారదాంబను మనసారా భక్తిగా ధ్యానిద్దాం.
అమ్మా! శారదాంబా!
విధి యొనరించు సృష్టికిని విద్యల రాణివి నీవె తోడుగా!
సదయనువాని మోముననె చక్కగ కాపురముంటివమ్మరో!
మృదుమధురోక్తులన్ భువిని మెల్గగ నీ మహనీయ దీవనల్
బుధవరు లందుచుండె. మము బ్రోవ సువాగ్ఝరి మాకొసంగవే?
కలికాలంబు వివర్ధమానమగుటన్ కాంచంగదే తల్లిరో!
ఖలు దుర్భాషణ దుష్ఫలంబు గొనుటల్, ఖ్యాతుల్ సుహృద్భాషణల్
పలుకం జొచ్చి శుభంబు లందుటయు నీ ప్రఖ్యాత సామర్థ్యమే!
కలిదుర్భాషలు బాపి; సత్య మహిమల్ కల్గింపుమా! శారదా!
సత్యము పలుకగ జేయుము.
నిత్యము మా జిహ్వ నిలచి నేర్పుగ పలుకుల్
ముత్యముల బోలి పలుకగ
నత్యద్భుతశక్తిఁ జేయు మజముఖవాణీ!
వందే శారద! బ్రహ్మ రాణి! జననీ! బ్రహ్మాండ సంవర్థినీ!
వందే! సజ్జన పండితాళి విలసత్పాండిత్య సద్రూపిణీ!
వందే! కావ్య సుధా స్వరూపిణి! లసత్ప్రజ్ఞాన తేజస్వినీ!
వందే! భారత భారతీ! సుజన సద్భాషాసముద్భాసినీ!
మంచి పలుకు నటుల మముఁ జేసి, మదిలోన
మంచి భావనలను మించ పెంచి,
త్రుంచి దుష్ట బుద్ధి, త్రుంచి దుర్భాషలు,
గాంచుమమ్మ! వాణి! కరుణఁ జూపి.
ఈ సందర్భంగా పంచవటి నిర్వాహకులు శ్రీ సత్యనారాయణ శర్మగారేమంటున్నారో చూడండి.

మిత్రులారా, 
రేపు, మార్గశిర బహుళ సప్తమి. లోకమాత ఐన శారదాదేవి తన లీలలో  భాగంగా ఈ
భూమిమీద పుట్టినరోజు.
ఈ రోజున పూర్తి జప ధ్యానాలలో కాలం గడపండి. ప్రపంచం ఉన్నదో లేదో మనకనవసరం.
దివ్యజనని కటాక్షం కోసం మనస్సును సిద్ధం చెయ్యండి.అమ్మ కటాక్షం
మనందరిపైనా వర్షించుగాక.

స్వస్తి.
జైశ్రీరాం.
జైహింద్. Print this post

9 comments:

కథా మంజరి చెప్పారు...

వాగ్జననికి ప్రణమిల్లుతూ, మీరు పెట్టిన టపా భువన మోహనంగా ఉంది. వీణా పాణికి ఇవే నా కైమోడ్పలు.

రవి చెప్పారు...

ఈ విషయం నాకు తెలియనే తెలియదండి. కొత్తవిషయం ఇది. వాగ్దేవికి వంద వందనాలు.

astrojoyd చెప్పారు...

suddha spatika sankaasee namo namaha

Wit Real చెప్పారు...

క్షోణితలంబున న్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు, సైకత శ్రోణికి జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికి, నంబుజాత భవచిత్త వశీకరణైక వాణికిన్
వాణికి, నక్షదామ శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్!

durgeswara చెప్పారు...

అమ్మకు సాష్టాంగదండప్రమాణములు .

మైత్రేయి చెప్పారు...

సర్,
మీరు కొద్దిగా పొరపడ్డారు.
శారదామాత అంటే శర్మగారి ఉద్దేశ్యం రామకృష్ణ పరమహంస గారి భార్య శారదా మాత అని.

ఇక్కడ చూడండి,
http://www.vedantany.org/festivals-calendar/
శారదా మాత పుట్టినరోజు మిషన్ లో వారికి ముఖ్యమైన రోజు.

Satya Narayana Sarma IRTS చెప్పారు...

ఆర్యా,
మాతను స్తుతిస్తూ మీరు వ్రాసిన పద్యములు చక్కని ఆనందాన్ని కలిగించాయి.శారదాదేవి సాక్షాత్తూ సరస్వతి మాత్రమే కాదు. "త్రిశక్తులొక్కచోకూడి నిల్చిన లోకమాత" తానేనని శారదామాత స్వయంగా అనేకసార్లు చెప్పినట్లు ఆమె జీవితాన్ని చదివితే మనం గ్రహించవచ్చు.మీ భావనాపటిమా, కవిత్వధారా దివ్యానందాన్నిస్తున్నాయి.మీకివే నా నమస్సులు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నిజంగా నా కసలు తెలియనే తెలియదు.మంచి పద్యాలతొ మంచి విషయాన్ని తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శారదాంబ కృపామృత పాన లోలురైన శ్రీయుతులు జోగారావు గారు,రవి గారు,అష్ట్రోజియో గారు, విట్ రియల్ గారు,దుర్గేశ్వర రావు గారు, మైత్రేయి గారు, సత్యనారాయణ శర్మ గారు, శ్రీమతి రాజేశ్వరక్కయ్య మొదలైన మహద్భాగ్యులకు నా కైమోడ్పులు. ఆ శారదాంబ కృపామృత వృష్టిలో కొట్టుకొని పోయి ఆనందాంభుధిలో తేలి యాడాలని మనసారా కోరుకొంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.