గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, డిసెంబర్ 2010, శనివారం

బంధ కవిత్వంలో దైవ బలం.( కంద గీత గర్భ ఉత్పలమాల)


యుద్ధము నందు సైనికునకు సాధనము దైవ శక్తియే.
కం:-
రణమందు సాధనము త
త్వ నవాశ్రిత దైవ శక్తి వందారునకున్!
రణమందటన్ కుజన రీ
తి నశింపగు గొప్పగాను దేవా! రమణా!
భావము:-
ఓ పరమాత్మా! ఓ వేంకట రమణా! వందనీయునకు యుద్ధ రంగమున తత్వ నవాశ్రిత మైన దైవ శక్తియే సాధనముకదా! ఆక్కడ యుద్ధ రంగమున కుజనుల యొక్క పద్ధతి గొప్పగా నశించి పోవును కదా!
దైవ మనెడి ధనమే నిజమైన ధనము.
తే.గీ:-
ధనము తత్వ నవాశ్రిత దైవ శక్తి.
ధనము దర్పిలఁ గొల్పును తంత్ర శక్తి.
కుజన రీతి నశింపగు గొప్పగాను.
సుజన వాణి యదార్థము. శోభనిచ్చు.
భావము:-
ధనమనగా తత్వ నవాశ్రితమైన దైవ శక్తియే కదా! అట్టి ధనము తంత్ర శక్తిని దర్పిల తగిన విధముగా కలుగఁ జేయును. అట్టి ధనము కలవానిలో కుజన రీతి పూర్తిగా నశించి పోవును. ఇది సుజన వాణి. సత్యమైనది. ఇది తప్పక శోభను కలుగఁ జేయును.
అవధానికి ధారణా శక్తి దైవ బలమే.
కంద గీత గర్భ ఉత్పలమాల:-
‘ధారణమందు సాధనము తత్వ నవాశ్రిత దైవ శక్తి వం
దారునకున్ సుబోధనము దర్పిలఁ గొల్పును తంత్ర శక్తియున్.
ప్రేరణమందటన్ కుజన రీతి నశింపగు గొప్పగాను. దే
వా! రమణా! కనన్ సుజన వాణి యదార్థము. శోభనిచ్చుగా!
భావము:-
ఓ దేవాదిదేవా! ఓ వేంకట రమణా! నమస్కరింపఁ దగిన సద్గుణ సంపన్నునకు అవధారణము చేయు సమయమందు సాధనమైనది తత్వ నవాశ్రితమైన దైవశక్తియే కదా తంత్ర శక్తియు; సుబోధనమును దర్పిలు నట్లు కలుగఁ జేయును! అక్కడ ఆ సమయమున ప్రేరణమును పొందును. దుష్టుల విధానము నశించి పోవుట జరుగును. ఆలోచించి చూచినట్లైతే సుజనుల యొక్క మాటలు సత్యము సుమా! 
అవి తప్పక శోభను కలుగఁ జేయును కదా!
జైశ్రీరాం. 
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

చక్కని పాండిత్యాన్ని అమ్మ ఉగ్గు పాలతొ రంగరించింది మరి.భగవంతుడు కృష్ణ భగవానుని భగవత్ స్వరూపుడు సాయి బాబాజీని ,అవధాన సరస్వతి శ్రీ నాగఫణి శర్మ గారిని " కంద గీత మాలలతొ అలంక రించ గల అదృష్టం చింతా వారికి గాక మరెవరికి ? [ అభినందన మందార మాలలు తమ్మునికి..]

నాగగురునాథ శర్మ చెప్పారు...

మహదానందకరమ్ రామకృష్ణారావు గారూ!
గురువు(చిన్నాన్న) గారి నుతి... మీ నోట...
ఇంతకన్నా ఏం కావాలి?

ఒక గురుపౌర్ణమి నాడు నేను చేసిన గురునుతి కూడా, ఈ సందర్భంలో...

గురువును కొల్వనిప్పటికి కోవెలజేరితినల్పమైన మ
ద్గురుతర మానసంబునకు కోటిపదంబులు గూర్పవే పరా
శరసుతుడాత్మసంతసము సంతతమొందుట సత్యమౌ ముదా
కరహిత వాణి! నాగఫణి! కావుము నన్నిటు ధారణాగ్రణీ!

నాగగురునాథ శర్మ చెప్పారు...

మహదానందకరమ్
గురువుగారి నుతి మీ నోట... ఇంతకన్నా ఏం కావాలి?

ఈ సందర్భంలో ఒక గురుపౌర్ణమి నాడు నేను చేసిన గురునుతి...

గురువును కొల్వనిప్పటికి కోవెలజేరితినల్పమైన మ
ద్గురుతర మానసంబునకు కోటిపదంబులు గూర్పవే పరా
శరసుతుడాత్మసంతసము సంతసమొందుట సత్యమౌ ముదా
కరహితవాణి! నాగఫణి! కావుము నన్నిటు ధారణాగ్రణీ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.