గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2018, ఆదివారం

పిల్లల పెంపకము. శ్రీ పాలకుర్తి రామమూర్తి కవి.

జైశ్రీరామ్.
ఆర్యులారా. శ్రీ పాలకుర్తి రామమూర్తి కవిత్వము ఎంత చక్కగా ఉందో  చూడండి.
పిల్లల పెంపకము

ఇరుగు పొరుగు నుందు రిరువురు మిత్రులు
యొకరు వృద్ధు లందు యువకు డొకరు
ముదము మీర గృహము ముంగిట మొక్కలు
బెంచి రమితమైన ప్రేమ తోడ!

అవసరమ్ము మించి అత్యంత నాణ్యమౌ
యెరువు నీరు యువకు డిచ్చి పెంచ
కొద్ది యెరువు మరియు కొద్దిగా నీరిడి
పెంచె వృద్ధు డంత బెరిగె నవియు!

ఒకనాటి రాతిరి యుద్ధతి జూపించె
ప్రకృతి భీభత్సమై వడక జేసె
గాలి వానలతో కకావిక లంబయ్యె
యూరు వాడ కలగె దారుణముగ
ప్రాభాత మందున ప్రకృతి శాంతింపంగ
ఇరువురు జేరిరి ఇండ్ల ముందు
గనుచున్న యువకుని మనమందు నుదయించె
ఆశ్చర్యయుతమునై నట్టి ప్రశ్న

అహరహమ్మును నాణ్యమై నట్టి నీరు
యెరువు లిచ్చి జాగ్రత్తగా యేను బెంచ
వేళ్ళతో గూడ మొక్కలు పెకిలి పోయె
శ్రద్ధ నంతగా జూపని వృద్ధు నింట
నిశ్చలంబుగా మొక్కలు నిలిచి యుండె!

అటుల చింతించి, కారణ మడగ దలచి
యువకు డిట్లనె వృద్ధుని కోమహాత్మ;
పెడితి శ్రద్ధను మీకన్న వేయి గతుల
చెక్కు చెదరవు మీపెంచు మొక్క లేమొ
యేల నాకడ మొక్కలు కూలె నవని!

అనవిని వృద్ధు డిట్లనియె నయ్యరొ; నీ వధికంపు ప్రేమ లా
లనల సమృద్ధిగా నవసరమ్మును మించి యొసంగ; వాడు చా
వనరులు విస్తరిల్లె నవి పైపయి, భూమిని జీల్చి లోనికిన్
జనుట యెరుంగ లేమి నిల సంకటముల్ భరియింప జాలమిన్!

నీదు మొక్కలు వేళ్లతో నేల కూలె
తమకు అవసర మెంతయో తగిన రీతి
యేను సమకూర్చ మొక్కలు యిలను జీల్చి
యేగె లోనికి స్థిరమునై యిపుడు నిలిచె!

అన్వయింపంగ నిది యుక్త మగును నేడు
మనము మన పిల్లలను పెంచు మాత్ర యందు
అవసరమ్ముకు మించిన యంత ప్రేమ
వనరులు సదుపాయములును వసతు లిచ్చి

కష్ట మెయ్యదొ యెరుగని కరణి బెంచ
సహజ సామర్ధ్యములు ప్రజ్ఞ సన్నగిల్లు
తగిన విధమున యిడకున్న తగిన రీతి
ఆత్మ విశ్వాస మవ్వారి కంత రించు!

అవసరమెంతయో యెరిగి యవ్విధి వారికి నంత మాత్రమే
సవిధిని అందజేయ, మది జాగృతి బొందును ప్రజ్ఞ; బుద్ధియున్
వివృతమునౌ, వివేకమెద విస్తృతమై చెలువారు; బాధ్యతా
ప్రవరులునై జెలంగెదరు బాలకులీ భువనమ్ము లోపలన్!

శ్రీ చింతా రామకృష్ణా రావు గారి "బాలభావన" పద్యాలు మరియు ఒక ప్రవచన కర్త ప్రసంగం ఆధారంగా వ్రాసుకున్న పద్యాలు యివి.
స్వస్తి
పాలకుర్తి రామమూర్తి.
కవిగారికి ధన్యవాదములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని పద్యములను అందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.