గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, డిసెంబర్ 2018, గురువారం

అమరఁగ నాఱు వర్ణముల నర్జును పేరు ప్రహేళికా చిత్రము.

జైశ్రీరామ్.
ప్రహేళిక!
తెలుఁగున దీనిని పొడుపు అందురు.మనకు తెలియని విషయములు పద్యములో గుంభనముగా పొందుపరచి ఆవిశేషమును మనలను తెలుపమని కోరుట ఈపొడుపులలోని విశేషము.మనతెలుఁగు సాహిత్యములో దీనినిగూడా చిత్రకవిత్వముగా భావించుట జరుగుచున్నది. ఈ క్రింది పద్యంలో ఉన్నచమత్కారమేదో తెలిసికొందుము..
"అమరఁగ నాఱు వర్ణముల నర్జును పేరు లిఖి౦చి చూడ, న 
య్యమర విభుండు, షణ్ముఖుడు, పక్షి, పయోరుహవైరి, మేదినీ,
సుమశరులయ్యెడిన్. మఱియుఁ జోద్యము దాని తుదాది చేసినన్
గమలయు, భూమిసంభవుఁడు, కాంతియు, స్వర్గముగా గనంబడున్.

అర్జనుని పేరువచ్చు విధముగా ఆరు అక్షరముల పదము వ్రాసిన ఆపదము వలన, వరుసగా "ఇంద్రుఁడు, కుమారస్వామి,పక్షి, చంద్రుడు, భూమి, మన్మధుడు, రావలయును.
పదము వెనుక నుండి విడదీసినచో, లక్ష్మి, కుజుడు, కాంతి, స్వర్గము అనునవి రావలయును.
పై ప్రహేళికకు సమాధానము " గోరాజకుమార" అనెడి ఆరు అక్షరముల పదము.
గో శబ్దానికి దేవతల పరంగా నానార్ధవివేచన వున్నది.
అప్పుడు
గోరాజకుమారుడు = ఇంద్రసుతుడు". అర్జునుడు
జకు = జక్కవ పక్షి
కుమార = షణ్ముఖుడు
రాజ = చంద్రుడు (పయోరుహవైరి)
గోశబ్దమునకు = భూమియనెడి అర్ధము కూడా ఉన్నది
మార = సుమశరుడు
ఇంక క్రిందినుండి:
రమా = లక్మి
కు = భూమి
కుజ = కుజుడు
రాజ = కాంతి
గో = స్వర్గము
ఇదండీ సమన్వయము
(దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటుపద్యరత్నాకరము నుండి)
ఓంనమోనారాయణాయ.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
" గోరాజకుమార " అనెడి ఆరు అక్షరముల పదము నుండి చేసిన నానార్ధ వివేచనము అద్భుతముగా నున్నది . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.