గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2018, ఆదివారం

6వ పద్య పక్షమ్. విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం. రచన. చింతా రామ కృష్ణా రావు.

జై శ్రీరామ్.
6 వ పద్య పక్షమ్.  
విచ్ఛిన్నమౌతున్న వివాహ వ్యవస్థ - సంతానంపై దాని ప్రభావం.
రచన. చింతా రామ కృష్ణా రావు.
౧.ఆటవెలదిత్రయ గర్భ సీసము
శ్రీకరంబనుచును జీవన సరళికి - పెండ్లితంతు కొలిపిరిండ్లు వెలుఁగ
దాని వలన వారు తమదైన సంతతి - సుఖముపొందిరపుడు, శుభద కృష్ణ!
దంపతులగువారు తమరిద్దరొక్కటై - కలిసి మెలిసి బాధ్యతలు వహించు.
నొకరికొకరుతోడు సకల శుభములిచ్చు - ననుచునేర్పరచిరి వినుము కృష్ణ!
ఆ.వె. ఇట్టిచక్కనిదగు నీ సంప్రదాయము - మట్టిఁగలియుచుండె మహిని నేడు.
స్వేచ్ఛ పెఱిగి వారలిచ్ఛానుసారము - గొడవలు పడుచుండ విడరె కృష్ణ!
౨.ఆటవెలదిత్రయ గర్భ సీసము
ఆలుమగల మధ్యనన్యోన్యతయె సంతు - హేతువన్నదెఱిఁగి నీతి తోడ
మెలఁగుచున్నఁ గలుగు మేలైన సంతతి - మెలగకున్న జనత కలఁగు కృష్ణ!
ధర్మమార్గము విడి దంపతులున్నచో - కలుగు సంతు దురిత గతుల నడచు
దురితులయిన సంతు దుర్గతిపాలౌను. - చేయరాని పనులు చేసి కృష్ణ!
ఆ.వె. తల్లిదండ్రులొసఁగు ధనము ప్రేమయె కనఁ - బ్రేమ లేని బ్రతుకు బీడువారు.
లోకకంటకులగు లోకాన బిడ్డలు - తల్లిదండ్రుల విడు ధరను కృష్ణ!
౩.ఆటవెలదిత్రయ గర్భ సీసము
భర్తమాట వినని భార్యలుండగరాదు - భార్య మాట వినని భర్తలటులె.
వారసత్వ గతిని వర్ధిలఁ జేసిన - బాగు పడును పృథ్వి బాల కృష్ణ!
వారి సంతు వెలుఁగు భక్తిప్రపత్తులన్ - వరలఁ గలరు వారు వసుధ కృష్ణ!
కానినాడు జగతి గాఢాంధకారాన - కుములు నిజము కాంచ, గోప కృష్ణ!
ఆ.వె. ధర్మబద్ధమయిన దాంపత్య బంధమున్ - గౌరవింపవలెను కాపురమున,
గౌరవింతుమేని ఘనులైన పెద్దలన్ - దైవశక్తి మనకుఁ దక్కు కృష్ణ!
౪. చ. అహము, మదంబు, కామము, గయాళితనంబున నుండు స్త్రీలచే,
మహి ఘన పుంస్త్వ గర్వమున మత్తిలి వర్తిలు పూరుషాళిచే
నిహతమగున్ సుసంస్కృతి. నివృత్తియె లేని దురంత దుస్స్థితుల్
స్పృహను దహించు, ఛిన్నమగు శ్రీకర బాంధవ బంధనాళియున్.
౫. చ. వరలెడి ధర్మ సన్నుత వివాహ వ్యవస్థయె ఛిన్నమైనచో
తెరువిక లేదు. సంతతియు తీరుగ వర్ధిలఁ జాలరిద్ధరన్.
పరమ దురాత్ములౌన్, వినుత భారతి కీర్తి నశించు, వీరిచే.
మరువకుడయ్య వర్తిలుఁడు మన్ననతో ఘన సంస్కృతీప్రభన్.!
స్వస్తి.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అన్నిపద్యములు అలరించు చున్నవి . ధన్య వాదములు

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మన వివాహ వ్యవస్తను గురించి సాంప్ర దాయమును గురించి ఛక్కగా వివరించారు. బాగుంది.ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.