గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మే 2016, గురువారం

ఈశావాస్యోపనిత్ శ్రీ చర్ల గణపతి శాస్త్రి గారిపద్య భావములు

జైశ్రీరామ్
ఈశావాస్యోపనిత్.
శాంతి మంత్రః
ఓం.  పూర్ణమద: పూర్ణమిదం - పూర్ణాత్ పూర్ణముదచ్చ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ - పూర్ణమేవావిశిష్యతే
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
శాంతి మంత్రము
కం. పూర్ణము బ్రహ్మము జగ మిది - పూర్ణమ; యాపూర్ణునుండి పూర్ణము వెడలెన్
పూర్ణం బగు నీ జగతికిఁ - బూర్ణత్వము గూర్చి యింకఁ బూర్ణమె మిగులున్
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
శాంతి మంత్రము
భావము. ఆ బ్రహ్మమంతట వ్యాపించినది. నామరూపసహితమైన యీ జగమును అంతట వ్యాపించినదె. ఆ పూర్ణమైన బ్రహ్మమునుండి పూర్ణమైనజగము బయలుదేరుచున్నది. జగమునకు పూర్ణత్వమును గలిగించి యాపూర్ణమైన బ్రహ్మమె మిగిలినది.
ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
1 వ మంత్రము.
ఈశావాస్య మిదంసర్వం - యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తే న భుంజీథాః - మాగృధః కస్య స్విద్ధనం. 
కం. భగవంతుడు భువి మాఱుచు - నగపడు నీ ప్రతిపదార్ధమందును నుండెన్
తగ నది త్యాగము చే నిపు - డె గాచికొను; మిది యెవరి ధనంబౌ. 1
భావము. జగతి యందు మార్పుచెందు నిది యంతయుఁ బరమేశ్వరునిచే నిండియుండెను. దానిని త్యాగముచే నిన్ను రక్షించుకొనుము. దేనిని గోరకుము . ఇది యెవరి ధనము ?
సంస్కృతమున "ఈశావాస్య " అని మొదలు పెట్టఁబడుటచే ఈశావాస్యోపనిషత్తు అని పేరు వచ్చెను. అవిద్యను అజ్ఞానమును నశింపఁ జేయునది గాన ఉపనిషత్తు అని వ్యుత్పత్తి.
2 వ మంత్రము.
కుర్వన్నేనేహ కర్మాణి - జిజీవిషే చ్ఛతం సమాః
ఏవం త్వయి నాన్యధేతో2స్తి - న కర్మ లిప్యతే నరే 2'
కం.ధర గర్మలు చేయుచునే - నిరతము నూరేండ్లు బ్రతుక నెంచఁగ వలయున్
మఱొకగతి లేదు నీ కిఁక - నరసి యిటులు చేయఁ గర్మ లంటవు నరునిన్. 2
భావము. ఈ లోకమందు కర్మలు చేయుచునే నూరు సంవత్సరములు జీవింపఁ గోరవలయును. మఱియొక మార్గము లేదు . ఇట్లు జీవింపం గోరు నరుఁడవయిన నీకు అశుభకర్మలు అంటుకొనవు.
కర్మలు - అగ్నిహోత్రాది కర్మలని పూర్వులు, స్వస్వభావోచిత కర్మలని నవీనులు .
3 వ మంత్రము.
అసూర్యా నామ తే లోకాః - అంధేన తమసా వృతాః
తాం స్తే ప్రేత్యాభిగచ్ఛంతి - యే కే చాత్మహనో జనాః 3
తే.గీ.  కల వసుర్యంబు లనెడి లోకములు గొన్ని - నిరత మజ్ఞానతిమిరబంధురము లవ్వి
అజ్ఞులై యాత్మ నిరసించు నట్టిజనులు - పోదు రాలోకములు చనిపోవు పిదప. 3
భావము. అజ్ఞానాంధకారముతో నావరింపఁబడిన యసుర్యము లను లోకములు గలవు. ఆత్మను నిరసించు జనులు చనిపోయిన పిదప ఆలోకములను పొందుదురు. కట్టెలు, బొగ్గులు, వత్తి కంటె వేఱుగా అగ్ని యున్నట్లు దేహములకంటె వేఱుగా ఆత్మ యున్నది. అది లేదని నిరసించువారు స్థావరాదులైన యాసురజన్మములను బొందుదురని భావము. లోకములు = చూడఁబడునవి అనఁగా అనుభవింపఁబడునవి అని శంకరులు. అసు - ప్రాణములందు, ర - క్రీడించువారు, అసురులు = విషయంబులందు ఆసక్తి గలవారు, వీరు పొందు లోకములు - అసుర్యలోకములు అనఁగా స్థావరతిర్యగాది జన్మలని భావము.
4 వ మంత్రము.
అనేజ దేకం మనసో జవీయో - నై నద్ధేవా అప్ను వన్ పూర్వమర్షత్
తద్దావతో2న్యా నత్యేతి తిష్ఠత్త - స్మిన్నపో మాతరిశ్వాదధాతి. 4

"యచ్ఛాప్నోతి య దాదత్తే - యచ్ఛాతి విషయా నిహ
య చ్ఛాస్య సంతతో భావ - స్తస్మా దాత్మేతి కీర్త్యతే"
మధురాక్కర
మొదల దొకటె యాత్మము, కాని మించు మనోజవంబు
గదియలేరు దేవులు దాని ; కాని ముందదియె పోవు
అది కదలకయె పరువెత్తు నన్నింటి దాటిపోవు
అదియె యుండఁగ వాయువు ప్రాణులు పనులు దిద్దు. 4
భావము. ఆత్మ కలదు, ఒకటె . మనసుకంటె వేగము కలది . దీనిని దేవులు -(ఇంద్రియములు) సమీపింపలేరు . అది ముందుగనే పోవును . అది కదలనిదై పరువెత్తుకొని పోవునట్టి యితరేంద్రియములను అతిక్రమించి పోవును . ఆ యాత్మ యన్నపుడు వాయువు ప్రాణులకు ఆయా చేష్టాదిశక్తులను విభజించుచున్నది . ఆత్మ పదమునకు వ్యుత్పత్తి యీ విధముగాఁ జెప్పబడినది . "అన్నిటిని వ్యాపించునది, అన్నిటిని దనయందు లయింప జేయునది, విషయముల ననుభవించునది, త్రాటియందుఁ బాముగుణమువలె దీనియందు ప్రపంచరూపము లారోపింపబడును గాన "ఆత్మ" అని వ్యుత్పత్తి." దేవులు - ద్యోతన స్వభావముగల నేత్రాది జ్ఞానేంద్రియములని శంకరులు . ఆకాశము వలె సర్వవ్యాపియు నామరూపాదులు లేనిదియుఁ గాన కదలకయె యన్నిటిని దాటి యుండు నని భావము.
5 వ మంత్రము.
త దేజతి తన్మైజతి - తద్దూరే తద్వ దంతికే
తదంత రస్య సర్వస్య - తదు సర్వ స్యాస్య బాహ్యతః5
కం. అది కదలదు మఱి కదలదు - అదెవరి కందనిది గాని యందఱ కందున్
అది అన్నిటిలోపలఁ గల - దది యన్నిటి బయటఁ గూడ నగపడుచుండున్ 5
భావము. ఆయాత్మ కదులును , అది కదలదు , అది దూరముగ నున్నది . అట్లే దగ్గరగ నున్నది . అది యీ సర్వప్రపంచముయొక్క లోపల నున్నది . అది యీ సర్వ ప్రపంచముయొక్క వెలుపలను ఉన్నది . ఆత్మ యాకాశమువలెఁ గదలనిదానను గదలు చున్నట్లు గనిపించును . దానిని బొందఁ గోరినవారి కందును . కోరనివారి కందదని భావము .
6 వ మంత్రము.
యస్తు సర్వాణి భూతాని - ఆత్మ న్యేవానుపశ్యతి
సర్వభూతేషు చాత్మానం - తతో స విజుగుప్సతే. 6
తే.గీ. ఆత్మ జ్యోతియందె యఖిలభూతంబులు - అఖిలభూతములను నాత్మ జ్యోతి
నరసి వానియందు నై క్య మొందుటవల్ల - నీతఁ డెవని నేవగించుకొనఁడు .6
భావము. ఎవఁడు సర్వ ప్రాణులను ఆత్మయందే చూచునో , అన్ని ప్రాణులందు ఆత్మను జూచునో వాఁడు అట్లు చూచుటవల్ల ఇతరులను ఏవగించుకొనఁడు .
7 వ మంత్రము.
యస్మిన్ సర్వాణి భూతాని - ఆత్మైవా2భూ ద్విజానతః
తత్రకో మోహః కః శోక - ఏకత్వ మనుపశ్యతః. 7
ఆ.వె. జ్ఞానియో నరునకు సర్వభూతంబులు - నాత్మ జ్యోతి రూపమైన యపుడు
అన్ని యెడల నైక్య మరసెడు వానికిఁ - జూడ మోహమేది శోకమేది . 7
భావము. ఎప్పుడు తెలిసినవానికి సర్వభూతములు ఆత్మగనే యయ్యెనో అప్పుడు అన్నిచోట్ల ఏకత్వమును జూచువానికి మోహమేది ? శోక మేది ?
8 వ మంత్రము.
స పర్యగా చ్ఛుక్ర మకాయ మవ్రణ - మస్థావిరం శుద్ధ మపాపవిద్ధం
కవి ర్మనీషీ పరిభూః స్వయంభూ - ర్యాథాతథ్యతో2ర్థాన్ వ్యదధా చ్చాశ్వతీభ్యః సమాభ్యః. 8
మధురాక్కర
ఆత్మ యఖిలజగత్పూర్ణ మమలంబు ద్యుతిమయంబు
ఆత్మ కొడలు నాడులు లేవు వ్యాధి పాపమ్ములంట
వాత్మ సర్వద్రష్ట , మనీషి యఖిలస్రష్టయు స్వయంభు
వాత్మ తీర్చె శాశ్వత ముండునటు లన్ని యుక్తరీతి. 8
భావము. ఆ యాత్మ అంతట వ్యాపించినది , శుద్ధమైనది , కాంతిమయమైనది , శరీరము లేనిది , నరములు లేనిది , పాపము లేనిది , అన్నిటిని జూచునది , మనస్సునకుఁ బ్రభువైనది , అన్నిటిపైని నున్నది , తనకుఁ దానె పుట్టినది , అది తగినట్లు సర్వపదార్థములను శాశ్వత సంవత్సరముల వఱకుండునట్లు గావించెను . అగ్నికి బొగ్గు, కట్టెలు, వత్తి లేనట్లు ఆత్మకు ఒడలు, నాడులు మొదలైనవి లేవు. ఎట్లు అగ్ని యొక జ్యోతియో అట్లే ఆత్మయుఁ దేజస్సే , బొగ్గు మొదలైనవి అగ్నిని బైకిఁ గనిపింపఁ జేయునట్లు ఒడలు ఆత్మను బైకిఁ గనిపింపఁ జేయును . కాన బొగ్గు మొదలైనవి ఆఱిపోయినను అగ్ని ఆఱనట్లు ఒడలు పోయినను ఆత్మ నశించదని భావము.
9 వ మంత్రము.
అంధం తమః ప్రవిశంతి - యే2విద్యా ముపాసతే
తతో భూయ ఇవ తే - తమోయ ఉ విద్యాయాం రతాః 9
కం. నిరతము కర్మనె గొలిచెడు - నరుఁ డజ్ఞానాంధకార నరకమునఁ బడున్
నిరతము విద్యనె గోరెడు - నరుఁ డింక మహాంధకార నరకమునఁ బడున్. 9
భావము. ఎవరు అవిద్యను= ( కర్మను ) ఉపాసింతురో వారు అజ్ఞానాంధకారమునఁ బ్రవేశింతురు . ఎవరు విద్యయందె= ( దేవతోపాసన యందే ) ఆసక్తులై యుందురో వారంతకంటె ఎక్కువ అజ్ఞానాంధకారమునఁ బ్రవేశింతురు . విద్యను = దేవతోపాసనను అని పూర్వులు . కర్మను = జ్ఞానరహిత కేవల కర్మను . విద్యను = ఆచరణరహిత కేవల విద్యను అని నవీనులు.
10 వ మంత్రము.
అన్య దేవా హు ర్విద్యయా - అన్య దాహు రవిద్యయా
ఇది శుశ్రుమ ధీరాణాం - యే సస్తద్వ్యచ చక్షిరే. 10
తే.గీ. ఒక్క కర్మనె గొలిచిన నొక ఫలంబు - ఒక్క విద్యనె గొలువ నింకొక ఫలంబు
ప్రాప్తమగునని ప్రాజ్ఞులు పలుకుచుంద్రు - పెద్దలు వచింప దీనిని వింటి మేము. 10
భావము. విద్యచేత ఒక విధమైన ఫలమును అవిద్యచేత మఱియొక విధమైన ఫలమును గలుగునని పండితులనిరి. ఎవరు మాకు ఆ కర్మను జ్ఞానమును వివరించి చెప్పిరో యట్టి ధీరులనుండి యిది వింటిమి." కర్మణా పితృలోకో విద్యయా దేవలోకః " కేవల కర్మోపాసనచే బితృలోకమును కేవల దేవోపాసనచే దేవలోకము గలుగును అని శ్రుతి.
జైహింద్.
Print this post

3 comments:

SGB certificate చెప్పారు...

BHAVALANNI BAGA ANUVADINCHARU.SANTOSHAM.SRI INAPAVULURI PANDURANGARAO GARU GATAMLO CHESINA VYAKHYANAM KOODA BAGUNDI.CHADAVAGALARU.

SGB certificate చెప్పారు...

BHAVALANNI BAGA ANUVADINCHARU.SANTOSHAM.SRI INAPAVULURI PANDURANGARAO GARU GATAMLO CHESINA VYAKHYANAM KOODA BAGUNDI.CHADAVAGALARU.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
పూజ్యులు శ్రీ చర్ల గణపతిశాస్త్రిగారి పద్యభావములను "అసలు ఈసావాస్యోపని షత్తు అనుపేరు ఏవిధముగా వచ్చినది ? అను వివరములను [10 మంత్రముల ద్వారా] ఆశక్తి దాయకముగా చదివించ గలిగి తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.