గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, జూన్ 2015, బుధవారం

ఈ రోజు డా. మాడుగుల అనిల్ అవధాని గారికి 46 వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. మాడుగుల అనిల్ అవధానిగారు మునుపుటేడాది అంతర్జాలంలో మొట్టమొదటి సారిగా అవధానం చేసి తన ప్రతిభను కనపరచిన ప్రజ్ఞాశాలి. అట్టి వీరి నలుబదియారవ జన్మదినము నేడే. 
బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారితో డా.మాడుగుల అనిల్ అవధాని గారు.
ఈ సందర్భముగా మన అందరి తరపున వారికి ముఖపుస్తకము ద్వారా శుభాకాంక్షలు తెలియఁ జేసితిని. గమనింపుడు. 
డా. అనిల్ అవధాని గారికి 46 వ జన్మ దిన శుభాకాంక్షలు
కంద గీత గర్భ చంపకమాల.
వర గుణ ధామ శ్రీ అనిలు భవ్య! నయోజ్వల ధ్యాన పూర్ణ భా
స్కర! ప్రణతుల్. సదా వసుధ గౌరవ మొప్పఁగ వర్ధిలుండు! సుం
దర ఘన సాహితీ ప్రనుత ధాత్రిని వెల్గుఁడు! వాఙ్మనోజ్ఞ తి
ర్పుర ఘనుఁడా! వరలు పుట్టిన రోజు శుభంబు లిచ్చుతన్.
గర్భగత కందము.
గుణ ధామ శ్రీ అనిలు భ
వ్య! నయోజ్వల ధ్యాన పూర్ణ భాస్కర! ప్రణతుల్.
ఘన సాహితీ ప్రనుత ధా
త్రిని వెల్గుఁడు! వాఙ్మనోజ్ఞ! తిర్పుర ఘనుఁడా!
గర్భ గత తేట గీతి.
అనిలు భవ్య! నయోజ్వల ధ్యాన పూర్ణ !
వసుధ గౌరవ మొప్పఁగ వర్ధిలుండు! 
ప్రనుత ధాత్రిని వెల్గుఁడు! వాఙ్మనోజ్ఞ! 
వరలు పుట్టిన రోజు శుభంబు లిచ్చు!
దీనికి వారి ప్రతిస్పందన గమనింపుడు.
ఆర్యా! చింతా రామ కృష్ణా రావుగారూ! మీ చంపక మాల గర్భిత కంద, తేటగీతి పద్యాలను చదివి మాధుర్యాన్ని చవి చూశాను.మీ ఆశీస్సులు పొందుటతో ధన్యుఁడనైతిని.
శ్లో. చింతాఖ్యవంశాబుధిసోమ ! విద్వన్ !
శ్రీరామకృష్ణార్య ! మహాకవే ! తే 
ఆశీర్భిరత్యంతముదావహోऽహం 
వినమ్రశీర్షేణ నమామి తుభ్యమ్!!
చూచారా! అనిల్ అవధానిగారు ఎంతటి వినమ్రశీలురో!
వారి సాహితీ సౌరభము దిగంతవ్యాపితమవాలని మనసారా కోరుకొంటూ,
తెరుమల వేంకటేశ్వరుఁడు దివ్య మనోజ్ఞ కవిత్వ  సత్వమున్,
నిరుపమ భావనా పటిమ, నిర్మల భక్తి, వధాన శక్తియున్,
కరుణనొసంగుచున్ గనుత. గౌరవమొప్ప ననిల్ వధానికిన్.
తరుపతి సేవలో సతము తేలుత యీతఁడటంచు నెంచెదన్.!
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతులు శ్రీ మాడుగుల అనిల్ అవధానిగారికి జన్మదిన శుభా కాంక్షలు.శత , సహస్ర అవధానములతో వారి కీర్తి ప్రతిష్టలు దిగ్దిగంతముల వరకు దీప్తి చెందాలని ఆశీర్వ దించి .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.