జైశ్రీరామ్.
శ్రీ చక్ర బంధ సప్త స్వర సర్వ మంగళాష్టకము.
౧. సకలమీవమ్మ శ్రీ గౌరి! సత్ప్రశంస
సహజ పాండిత్య శ్రీనిమ్ము సత్సుపోష
రమ్ము వర చిత్ర శ్రీ కృతి నిమ్ము దేవి
సరస కారణ! సత్పోష సద్ విభాస.
౨. రిక్త జగతిని శ్రీ శక్తి ప్రేరణంబు
విశ్వ జనయిత్రి శ్రీ మాత. వేల్పుసాని.
శివుని శక్తియు శ్రీమాత, శ్రీలఁ ద్రేల్చు
రిపు వినాశిని బుద్ధిని వ్రేల్చు గౌరి.
౩. గర్వమణచఁగ శ్రీమాత, కల్గు శోభ.
మురియఁ బ్రార్థింప శ్రీదివ్య మూర్తి మ్రోల.
జేజె హర సతి శ్రీకాళి చేరి బ్రోచు.
గమ్యమును జేర్చి, భక్తులఁ గాచు వేగ.
౪. మమ్ము కరుణించు శ్రీ జగన్మాత వేగ !
రమ్య గుణ ధామ శ్రీ కావ్య రమ్య భాస.
హిమ తనూద్భవ శ్రీ హర హృత్సుమాన్య
మధుర సాహిత్య గణ్య, సన్ మాన్య నామ !
౫. పరమ పావని ! శ్రీ చక్ర భాస ! నాదు
మనవిఁ గైకొని శ్రీఁ గొల్పు మంచి నెంచి
కలుఁగఁ జేయుమ శ్రీ భక్త కల్ప సేవ్య!
పరమ శ్రీకరీ ! దుర్గ ! చిత్ భవ్య రూప!
౬. దత్తి శుభ గుణ శ్రీఁ గొల్పు తప్పునీక
నిన్నుఁ గనుఁగొను శ్రీదృష్టి నన్నుఁ గాచు.
చేవ కనఁ జూపి, శ్రీకరీ! చీల్చు కర్మ.
ధక్షునిఁగ చేవ కల్గించు ధర్మ మొంద!.
౭. నిత్య శుభదాయి శ్రీ భవానీ శుభాంక
మర్మ మెఱుఁగని శ్రీ బుద్ధి కూర్మిఁ దేల
తోడ నొసఁగుచు శ్రీదేవి నీడఁ గొల్పు.
నిష్ఠమదితోన కన్నుల నిల్పు దేని.
౮. స రి గ మా ప ద శ్రీ ని సత్స్వర్ణమాల
సకల పాఠక శ్రీజ్ఞాన సౌఖ్య దాత.
కనఁగ మంగళ శ్రీ యష్టక స్థ నిత్య,
సరస సత్కవి లక్షిత సత్యభాస!
జైహింద్.
3 comments:
'చిత్ర కవితా సమ్రాట్' చింతా రామకృష్ణారావు గారికి
అనేకానేక నమస్సులతో
ఇంత చక్కని యంత్ర బద్ధ 'చిత్రాన్ని' అందించినందుకు కృతజ్ఞతలు.
ఆహా ! ! !
అద్భుతం కనీ వినీ ఏరుగని నాకు కన్నుల విందు.ఎలా అభినం దించాలో నా
భాష కందడం లేదు.దిగి వచ్చిన వాగ్దేవికి పాదాభి వందనములు
ధన్యులము గురువర్యా !
ఆహా ! అద్భుతం!
మీ మద్విరచితమైన శ్రీ చక్ర బంధ సప్త స్వర సర్వ మంగళాష్టకము జుచితిమి.
మీ వంటి వాగ్దేవికి పుత్రులకు పాదాభి వందనములు జేయుచు .
వరప్రసాదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.