గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2013, ఆదివారం

శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజికి ఘన సత్కారం

జైశ్రీరాం.
ఆర్యులారా!డా. కోడూరి ప్రభాకర రెడ్డి సాహితీ పీఠం. ప్రొద్దుటూరు. వారు  శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిని ఘనంగా సత్కరించారు.   సభాధ్యక్షులుగా:  డాడీ .వీజీ యేసోమయాజులు. వ్యవహరించారు.. పూర్తి వివరాలతో చిత్రాలతో మళ్ళీ వివరింగా ప్రచురించగలను. వారిని అభినందిన పద్యములు చూడండి.

శ్రీరస్తు                    శుభమస్తు.           అవిఘ్నమస్తు.
అభినందన మందార మాల.
రసవత్ కళా నిధీ! శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి పెన్నిధీ!
మా సాహితీ పురస్కారమును అంగీకరించి విచ్చేసిన మీకుమా స్వాగతం.
ప్రశంసార్హమైన మీ సాహితీ సంసేవనమునకు మిమ్ము మనసారా అభినందిస్తున్నాము.

సహృదయా!
శా. శ్రీ కల్యాణ మనోజ్ఞ పద్య రచనా శీలుండ! సన్మాన్య! సు
శ్లోకుండా! వర పూల వాడ జనితా! శుద్ధాత్ముఁడా! తిక్కనా!
మీ కావ్యామృతమద్భుతంబనదగున్. మీ యామ్రపాలిన్ గనన్
లోకుల్ మెచ్చెడి సత్ కవిత్వగతి నాలోకించితిన్. సత్కవీ!

ఆ. తెనుగు తోట శోభ విని వీధికిన్ జేరె.
నాటి కవులు మెచ్చినారు నిన్ను.
హరువునొప్పునట్టి యక్షర ధామమ్ము
నిలిపెనయ్య జాను తెనుగు కీర్తి.

(కం. గీ. గర్భ) ఉ. 
తొలి రస రమ్యమౌ తెనుగు తోట సుమావళి తేనె చిందుటన్
కల గనితో మహాకవుల కమ్మని భావన గానఁ జేయు మం
జుల సుసరజ్ఝరీ హరువు చూపు సుధాక్షరి అమ్రపాలివో!
తెలుపుమయా కృపన్. ధరణి తేజసమక్షర ధామమయ్యెనా!

గర్భస్థ కం.
రస రమ్యమౌ తెనుగు తో
ట సుమావళి తేనె చిందుటన్కల గనితో
సుసరజ్ఝరీ హరువు చూ
పు సుధాక్షరి అమ్రపాలివో! తెలుపుమయా!

గర్భస్థ గీ.
తెనుగు తోట సుమావళి తేనె చిందు
కవుల కమ్మని భావన గానఁ జేయు 
హరువు చూపు సుధాక్షరి అమ్రపాలి
ధరణి తేజసమక్షర ధామమయ్యె.

మ. రసవత్ కావ్య కళా నిధీ యనుచు నిన్ శ్రావ్యంబుగా పిల్తురే!
దెసలందున్ ఘన కీర్తి చంద్రికలు నీ తేజంబునే జూపునే! 
అసమానుండవటంచు నిన్ను కవులాప్యాయంబుగా జూతురే!
విషయంబేమిటి ఇట్టి కీర్తి మనకున్  దీపించునెట్లేక్రియన్.

ఉ. తిక్కన గూర్చి పల్కు తమ తీయని పల్కుల మర్మ మెన్నగా 
నొక్కటి తోచె నాకు మహిమోన్నత సత్కవి తిక్కనార్యుఁడే
చక్కని పూల వాడ విలసన్నుత తిక్కన సోమయాజిగా
మక్కువతోడ బుట్టెనని. మాన్యుఁడ! నిక్క మెఱుంగ నిద్దియే.
ఇట్లు
డా. కోడూరి ప్రభాకర రెడ్డి సాహితీ పీఠం. ప్రొద్దుటూరు. దీ.29-12-2013.
మంగళం.                మహత్.                శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ 
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.