జైశ్రీరామ్.
నిర్విఘ్నమస్తు.
సుహృద్భావ సమృద్ధులారా! మన బొజ్జ గణపయ్య మన ముందుకు వచ్చెస్తున్నాడు. మీలో నిబిడీకృతమై ఉన్న ప్రేమోద్భాసిత కవితామృత ధారలతో మన బొజ్జ గణపయ్యను అభిషేకించండి. మీ జీవనాన్ని నిర్విఘ్నం చేసుకోండి.
ప్రథమ సుపూజ్య విఘ్నపతి, భక్తుల పాలిట కల్పవల్లియై
మధుర మనోజ్ఞ జీవన సుమాధురి నందగ జేసి, ప్రేమతో
వ్యధలను బాపుచున్, సుగుణ భాగ్యమొసంగుచు, బ్రోచు భక్తులన్.
మధుర కవిత్వ వైఖరిని, మాన్యుని, విఘ్న పతిన్ నుతించరే!
గౌరవ మొప్పగా తలచి, గడ్డిని గైకొని పూజ సేయ, సం
సారమహాంబుధిన్ తరియ సాయము చేయుచు కాచు దైవమే
చేరగ వచ్చె మీ గృహము క్షేమము గొల్పగ. భక్తి పూర్ణులై
గారవ మొప్ప పద్యశతకంబుల పుష్పములిచ్చి గొల్వరే!
శ్రీయాంధ్రామృత పాన లబ్ధ కవితా శ్రీమంతులే! భూమిపై
మాయా దూర విశేష బోధ కలితామందాననోద్భాసులే!
మీ యాతిథ్యము స్వీకరింప కృపతో మీ యింటికే వచ్చు, సు
జ్ఞేయున్ విఘ్నపతిన్ కవిత్వ సరణిన్ కీర్తింపలేకుందురే?
ఒక్కొకరొక శతకంబును
మక్కువతో వ్రాయ గలగు మాన్యులు మీరల్.
లెక్కకు మించుగ పద్యము
లక్కజముగ వ్రాసి, పంచు డాంధ్రామృతమున్.
నాకోరిక మన్నింపుడు.
నే కోరను మిమ్ము ధనము. నిర్విఘ్నముగా
శ్రీకారము చుట్టి కవులు
ప్రాకటముగ కవిత లల్లి, పంపుఁడు వ్యాఖ్యల్.
మీ అపురూపమైన సమాధానములకై ఎదురు చూస్తూ, నమస్కారములతో
మీ రామ కృష్ణా రావు.
జైహింద్
16 comments:
ఓ విఘ్నేశ్వర! ఓ మహాగణపతీ! ఓ పార్వతీనందనా!
ఓ వేదస్తుత! ఓ కృపాజలనిధీ! ఓంకార నాదాత్మకా!
ఓ విద్యానిధి! ఓ కవీంద్రప్రముఖా! ఓ దేవదేవోత్తమా!
ఓ విశ్వేశ మనఃప్రమోదనకరా! ఓ స్వామి నిన్ గొల్చెదన్
జయము శుభవిలాసా! సాధు చేతోబ్జవాసా!
జయము విమల కీర్తీ! సచ్చిదానందమూర్తీ!
జయము ప్రమథనేతా! సర్వసంపత్ప్రదాతా!
జయము జయము దేవా! సర్వదా శాంత భావా!
వందనమ్ము దేవ! వందారు మందార!
గంధ సింధురాస్య! కలుషనాశ!
మూషకవర వాహ! మునిజన వందిత!
పార్వతీ తనూజ! భవ్య తేజ!
Nemani Ramajogi Sanyasi Rao
గురుదేవులకు ధన్యవాదములు.
శ్రీ నేమాని గురుదేవుల వారి సవరణలతో నా గణేశ స్తుతి
మూషిక వాహన!దేవ!మునిజన స్తుత్య సద్భావ!
ద్వేష రాగాది విహీన!దీవ్యద్వివేక నిధాన!
పోషిత పరిజన బృంద!పుణ్యైక కంద!సానంద!
దోష వినాశ!గణేశ!స్తోత్రమ్మొనర్తు విఘ్నేశ!
అద్రిసుతాత్మజ!గణప!అనవద్య చరిత!విఘ్నేశ!
భద్ర గజానన!గణప!భవభయనాశ!విఘ్నేశ!
సద్రూప వైభవ!గణప!సద్భక్త వినుత! విఘ్నేశ!
భద్రగుణాకర!గణప!ప్రమథ గణేశ!విఘ్నేశ!
అగ్రగణ్యా!మహాకాయ!ఆరోగ్యమిమ్ము విఘ్నేశ!
అగ్రపూజ్యా!మహానంద!ఆనందమిమ్ము విఘ్నేశ!
అగ్రనాయక!మహైశ్వర్య!ఐశ్వర్యమిమ్ము విఘ్నేశ!
అగ్రణీ!కవిలోక వంద్య!ఆశ్రిత రక్ష!విఘ్నేశ!
శ్రీ చిన్తా రామకృష్ణారావు గారికి నమస్సులతో చిన్న ప్రయత్నము
మహాక్కర.
పార్వతీ నందనా! హే గణేశా! కృపాకరా! మూషికవాహనా! హే
సర్వ దేవతా పూజిత ద్విదేహ శంకర తనయా! హజాననా! హే
సర్వ విఘ్న విదూర విఘ్నేశ్వరా! సకల పూజాదులన్ ప్రథమ పూజ్యా!
సర్వ కాలంబులన్ మమ్ము కావుమా! సకల విద్యాబుద్ధు లిడి బ్రోవుమా!
శ్రీ చిన్తా రామకృష్ణారావు గారికి నమస్సులతో చిన్న ప్రయత్నము
మహాక్కర.
పార్వతీ నందనా! హే గణేశా! కృపాకరా! మూషికవాహనా! హే
సర్వ దేవతా పూజిత ద్విదేహ శంకర తనయా! హజాననా! హే
సర్వ విఘ్న విదూర విఘ్నేశ్వరా! సకల పూజాదులన్ ప్రథమ పూజ్యా!
సర్వ కాలంబులన్ మమ్ము కావుమా! సకల విద్యాబుద్ధు లిడి బ్రోవుమా!
లంబోదర వందన మిదె
సంబరముగ గొల్తు నిన్ను సౌభాగ్య మిడన్ !
అంబర మంటిన భక్తిని
శంభు కుమార నిన్ను శమి పత్రములన్ !
తమ్ముడు ! తప్పులుంటే ప్రింటు చేయ వద్దు మళ్ళే రాస్తాను సరేనా ?
శ్రీపండిత నేమాని గురువులకు అభినందనాపూర్వక నమ:ప్రసూనము
కామిత వరదు వినాయక
సామిని మధురామృతపద సాహిత్యమునన్
వైమాల గొలుచు పండిత
నేమాని గురూత్తములకు నే ప్రణతింతున్.
శ్రీపండిత నేమాని గురువులకు అభినందనాపూర్వక నమ:ప్రసూనము
కామిత వరదు వినాయక
సామిని మధురామృతపద సాహిత్యమునన్
వైమాల గొలుచు పండిత
నేమాని గురూత్తములకు నే ప్రణతింతున్.
శ్రీ చిన్తా రామకృష్ణారావు గారికి నమస్సులతో
పద్మశ్రీ బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి సోదరి మనుమడు మరియు మా పెదతండ్రి గారి దౌహిత్రుడు ( మేనల్లుడు/శిష్యుడు) అగు చి. గొర్తి బాలసుబ్రహ్మణ్యం, చార్టెడ్ ఆక్కౌంటెంట్ వ్రాసిన “ గణపతి” గణపా! మకుట శతకమునందలి నవ కంద ప్రసూనములు
౧. శ్రీకర! శుభకర మూర్తీ!
ప్రాకటముగ విద్యలిచ్చి పదవుల నిడుమా!
వేకువ నిన్నెద గొలుతును
చేకొని దీవింపుమయ్య శివనుత గణపా!
౨. విద్యల నేర్పుట నేర్చిన
విద్యల కిలవేల్పు! దేవ! విహిత పథమ్మునన్
హృద్యముగా నివసించుచు
సద్యోజాతాది రూప! సాకుము గణపా!
౩. వ్రాసెద కైతలు ముదమున
భాసిల్లెడి భవుకతను భారతి కృప, నా
ధ్యాసను నిరతము గల్గగ
న్యాసమునన్ నన్నుగూడి నడుపుము గణపా!
౪. కర్మల సలుపుచు ధరణిని
శర్మదమౌ నీదు చరణ సంస్తుతి జేయన్
మర్మము నీవే చెప్పుము
నిర్మలమౌ యెదను గూర్చి నిత్యము గణపా!
౫. బ్రాహ్మీ సుముహూర్తంబున
బ్రహ్మీభూతంపు శక్తి ప్రార్థన జేయన్
బ్రహ్మీ భావము నెలకొన
బ్రాహ్మీ రూపంబునిమ్ము పాయక గణపా!
౬. శరణంటి యీశ నందన
శరణంటిని పాదమంటి శక్తి కుమారా!
శరణంటి కుమారానుజ!
శరణంటిని విఘ్నరాజ! సాకుము గణపా!
౭. మూలాధారాధిష్టిత!
శైలాధిప తనయ పుత్ర! సామజ వదనా!
లీలా కల్పిత వేషా!
వాలాయము నిన్ను గొల్చు వాడను గణపా!
౮. ఆగమ నియమాదులచే
యోగుల హృద్ధ్యానములను యోగీశ్వరుగా
వేగమె నుతులందెడి నిన్
సాగిలి నతులిడుచు గొల్వ జాలను గణపా!
౯. తరుణారుణ పద యుగళా!
కరుణామయ! విఘ్నరాజ! కామిత ఫలదా!
ధరణీధర పుత్రీ సుత!
కరి రాణ్ముఖ! కాంచుమయ్య కరుణను గణపా!.
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ.
భాషకాని భాషా ప్రాంతంలో ఉంటూ మాతృభాషపై ఎంతో మమకారంతో సాంప్రదాయబద్ద పద్య కవిత్వంలో మీరు (వరప్రసాదు గారు) చేయు ప్రయోగాలు మరింత వన్నెకెక్కాలని ఆ గణేశుని ఆశిస్సులు గురువులు శ్రీ పండిత నేమాని వారి ఆశీస్సులు సదా మీకు కలగాలని ఆగణేశుని ప్రార్థించుచూ అభినందనా ప్రసూనము.
అందంబగు పద్యంబుల
డెందంబానందమొందెడి పగిది వ్రాయన్
కందుల కుల వరధీవర!
అందుకొనుము వరప్రసాద! అభినందనముల్.
భాషకాని భాషా ప్రాంతంలో ఉంటూ మాతృభాషపై ఎంతో మమకారంతో సాంప్రదాయబద్ద పద్య కవిత్వంలో మీరు (వరప్రసాదు గారు) చేయు ప్రయోగాలు మరింత వన్నెకెక్కాలని ఆ గణేశుని ఆశిస్సులు గురువులు శ్రీ పండిత నేమాని వారి ఆశీస్సులు సదా మీకు కలగాలని ఆగణేశుని ప్రార్థించుచూ అభినందనా ప్రసూనము.
అందంబగు పద్యంబుల
డెందంబానందమొందెడి పగిది వ్రాయన్
కందుల కుల వరధీవర!
అందుకొనుము వరప్రసాద! అభినందనముల్.
విఘ్నేశ్వరుడికి సరసపద సంకీర్తనం
( సరసపద పద్య లక్షణాలు )
శ్రీవిఘ్నరాజ రావయ్య నీకు చేసెదము మంచి పూజ
సర్వజ్ఞ నిన్ను నమ్మి యున్నాము స్వాగతమ్మో మహాత్మ
చంద్రేంద్రవిష్ణువంద్యప్రభావ సర్వార్తినాశచరణ
సంతోషపూర్ణ సోమార్కఘంట సద్భక్తలోకవరద
ప్రమధగణనాథ భక్తజనపాల పాపసంతాపనచణ
విఘ్నాంధకారభాస్వంత సకలవిద్యాప్రదాననిపుణ
ఓ వారణాస్య ఓ యేకదంత ఓ శశివిరోధి రావె
ఓ బొజ్జదేవరా సూర్యతేజ ఓ గణపతయ్య రావె
మారేడు పత్రి నెలవంక పత్రి నేరేడు పత్రి దెచ్చి
అశ్వత్థ పత్రి కరవీర పత్రి యని చాల పత్రి దెచ్చి
పత్రంబు లేక వింశతిని తెచ్చి పరమోత్సవముగ నిన్ను
పూజించుకొనగ వేచితిమి శంభుపుత్ర విచ్చేయ వయ్య
కస్తూరి గంధములు దెచ్చి నాము కరివదన వేగ రావె
పూజింప నిన్ను వివిధంబు లైన పూవులును దెచ్చి నాము
జిల్లేడుకాయ లుండ్రాళ్ళు నీకు కొల్లలుగ నిత్తు మయ్య
బెల్లంబు పాలతాలికలు చాల పెట్టెదము గణపతయ్య
ఈ ముద్దపప్పు ఈ మంచి నెయ్యి ఈ గడ్డపెరుగు చూడు
ఇవియెల్ల నీకు నైవేద్యమయ్య ఇక జాగు చేయ కయ్య
ఖర్జూర ద్రాక్ష దానిమ్మ పనస కదళీ ఫలంబు లివిగొ
హాయిగా వచ్చి విందారగించి ఆశీర్వదించ వయ్య
ఆనందపడుచు అమితప్రభావ హారతుల నిచ్చి నిన్ను
వేనోళ్ళ పొగడు భాగ్యమ్ము కొఱకు వేచితిమి నేడు తండ్రి
లంబోదర వందనములు
సంబరముగ గొల్తు మేము సౌభాగ్యద ! ని
న్నంబర మంటెడు భక్తి
న్నంబాసుత కనుమ పూజ లందుమ కృపతో
శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి ధన్యవాదములు.
శ్రీ శర్మ గారి అభిమానమునకు పాదాభివందనములు. నా పద్యములకు నడక నేర్పిన శ్రీ కంది శంకరయ్య గారు మరియు శ్రీ నేమాని గురుదేవులు మీ ప్రశంసలు జెందు గాక. నా పద్యములు మీ అందరికి మోదము గూర్చుట నా పూర్వ జన్మ పుణ్య ఫలము.
మీ పద్య రాశులు పున్నమి వెన్నెలల వలె జూడ ముచ్చట గొలుపు చున్నవి.మీ వంశపు కవులు సాహితీ ప్రియులకు ప్రియ కవులు గావలెనని భగవంతుని ప్రార్థిస్తూ,
మరిన్ని పద్యములతో మన బొజ్జ గణపయ్యను అభిషేకించునటుల కవులను గణపయ్య దీవించు గాక.
పాదప :
శ్రీగణనాథ! భజించుచు నిన్నున్
మాగిన తియ్యని మామిడి పండ్లన్
బాగుగ నిచ్చెదు పాలును తేనెల్
సాగిలి మ్రొక్కుదు సద్గతు లిమ్మా!
మధుర కందం :
వేదము వ్రాసిన విభుడవు విఘ్నవినాశా!
మోదక ఖాదివి గణపతి! పొంకము తోడన్
పాదములూనితి మరువక పావన మూర్తీ!
మీదయ గోరుదు నిరత మమేయ కృపాళూ!
మధ్యాక్కర :
లంబోదర! సుముఖ!గణప!ప్రజ్ఞానిధాన! విఘ్నేశ!
కంబు సుధానిధి!గణప!కర్పూర గౌర! విఘ్నేశ!
సాంబశివాత్మజ!గణప!సజ్జన వరద! విఘ్నేశ!
అంబుజహిత తేజ! గణప!ప్రార్థింతు నిన్ను విఘ్నేశ!
నమస్కారములు
సోదరులు శ్రీ చింతా వారు నా పద్యమును సవరణ జేసి ప్రచు రించి నందులకు ధన్య వాదములు
ఆర్యులకు ప్రణామములతో:
శ్రీ విఘ్నేశ! వినాయకా! గజముఖా! శ్రీ పార్వతీనందనా!
భావింపందగు నన్ని కార్యములలో ప్రారంభమందున్ నినున్!
రావే విఘ్నము లెందునన్, కొలువ దూర్వారమ్ములన్, నిత్యమున్,
భావిన్ మంచి శుభమ్ము, కీర్తి గలుగున్ ప్రార్థించ నిన్ భక్తితో.
భాద్రపదమ్మున చవితిని
భద్రేభముఖున్ భజింప భక్తిని సర్వుల్
భద్రంబగు, రావు దరి యు-
పద్రవములు విఘ్ననాధు పటుతర కృపచే.
కొల్తును నే గజవక్త్రుని,
కొల్తును నే గౌరిసుతుని, కొల్తును దంతున్,
కొల్తును నే విఘ్నేశ్వరు,
కొల్తును నే భక్తితోడ కొల్తును సతమున్.
వరములనిమ్మా గణపతి!
కరిముఖ! గౌరీకుమార! కల్పోక్త విధిన్
కరమొప్ప భక్తి మనమున
వరదా యని పూజ సేతు పత్రిని, పూలన్.
గణనాథున్ భజియింపరే సతతమున్ గల్గున్ గదా సంపదల్!
వణకున్ విఘ్నము లెల్ల విఘ్నపతిఁ సంభావింపగా, దేవతా
గణముల్, యక్షులు, రాక్షసప్రభృతు లేకార్యమ్ము చేపట్టినన్
ప్రణతుల్ జేతురు దొల్త దంతిముఖునిన్ ప్రార్థించి సఛ్ఛ్రీలకై.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.