జైశ్రీరామ్.
గుణ శేఖరులారా! శ్రీ గొర్తి బాలసుబ్రహ్మణ్యం (చార్టెడ్ ఆక్కౌంటెంట్) వ్రాసిన “ గణపతి” గణపా! మకుట శతకమునందలి నవ కంద ప్రసూన సౌరభమునాఘ్రాణించండి.
౧. శ్రీకర! శుభకర మూర్తీ!
ప్రాకటముగ విద్యలిచ్చి పదవుల నిడుమా!
వేకువ నిన్నెద గొలుతును
చేకొని దీవింపుమయ్య శివనుత గణపా!
ప్రాకటముగ విద్యలిచ్చి పదవుల నిడుమా!
వేకువ నిన్నెద గొలుతును
చేకొని దీవింపుమయ్య శివనుత గణపా!
౨. విద్యల నేర్పుట నేర్చిన
విద్యల కిలవేల్పు! దేవ! విహిత పథమ్మునన్
హృద్యముగా నివసించుచు
సద్యోజాతాది రూప! సాకుము గణపా!
౩. వ్రాసెద కైతలు ముదమున
భాసిల్లెడి భవుకతను భారతి కృప, నా
ధ్యాసను నిరతము గల్గగ
న్యాసమునన్ నన్నుగూడి నడుపుము గణపా!
౪. కర్మల సలుపుచు ధరణిని
శర్మదమౌ నీదు చరణ సంస్తుతి జేయన్
మర్మము నీవే చెప్పుము
నిర్మలమౌ యెదను గూర్చి నిత్యము గణపా!
౫. బ్రాహ్మీ సుముహూర్తంబున
బ్రహ్మీభూతంపు శక్తి ప్రార్థన జేయన్
బ్రహ్మీ భావము నెలకొన
బ్రాహ్మీ రూపంబునిమ్ము పాయక గణపా!
౬. శరణంటి యీశ నందన
శరణంటిని పాదమంటి శక్తి కుమారా!
శరణంటి కుమారానుజ!
శరణంటిని విఘ్నరాజ! సాకుము గణపా!
౭. మూలాధారాధిష్టిత!
శైలాధిప తనయ పుత్ర! సామజ వదనా!
లీలా కల్పిత వేషా!
వాలాయము నిన్ను గొల్చు వాడను గణపా!
౮. ఆగమ నియమాదులచే
యోగుల హృద్ధ్యానములను యోగీశ్వరుగా
వేగమె నుతులందెడి నిన్
సాగిలి నతులిడుచు గొల్వ జాలను గణపా!
౯. తరుణారుణ పద యుగళా!
కరుణామయ! విఘ్నరాజ! కామిత ఫలదా!
ధరణీధర పుత్రీ సుత!
కరి రాణ్ముఖ! కాంచుమయ్య కరుణను గణపా!.
గొర్తి బాలసుబ్రహ్మణ్యం.
నవ రత్నంబుల నర్ధి నిన్ను కొలిచెం ధన్యాత్ముఁడౌ గొర్తి సం
స్తవనీయుండగు పుణ్య మూర్తి. సుగుణాధారా! గణేశా! కృపన్
జవ సత్వంబులు, భవ్య సంపదలు, ధీశక్తిన్, మహద్భక్తియున్,
శివ పుత్రా! కలిగించి బ్రోవుమెపుడున్. శ్రీపార్వతీ నందనా!
శ్రీ గొర్తి కవి వరునకు, ఈ పద్యములనందించిన తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి ధన్యవాదములు.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.