గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, సెప్టెంబర్ 2013, సోమవారం

వినాయక చతుర్హి సందర్భముగా ఆంధ్రామృత పాఠకు లందరికీ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఆర్యులారా! పుణ్య సంపన్నులారా! అపురూపమైన శ్రీ వరసిద్ధి వినాయక చతుర్థి మన ముంగిళ్ళకు ఆ మూషిక వాహనుని తీసుకు వచ్చిన శుభ దినమీనాడు. ఎంతటి ఆనంద ప్రదమీ పండుగ మనకు! ఇట్టి మహోత్కృష్టమైన  యీ పండుగ సందర్భముగా యావజ్జనావళికి శుభాకాంక్షలు. ఆ గణపతి అపురూపమైన శుభాశీస్సులు మీ అందరికీ లభించు గాక అని మనసారా ఆ స్వామిని ప్రార్థించుచున్నాను.
పరమ దయాపరా! శుభద! పార్వతి నందన! విఘ్న నాయకా.
కరుణను కావుమయ్య, వర కామ్యద! భక్తుల నెల్ల వేళలన్.
ధరణికి భారమైన దురితత్వము బాపుమ దుష్ట సంహతిన్
మరలిచి మంచిగా, సుగుణ మాన్యుల జేసి, శుభంబు కూర్చుమా.
నిను గని, పూజ చేసి, యను నిత్యము సమ్మతి మెల్గు భక్తులన్
కనుమయ. సన్మహోన్నతిని గాంచగ చేయుమ. విఘ్న రాజ! స
ద్వినయము తోడ మ్రొక్కెదను. దివ్య కవిత్వ పటుత్వ మిచ్చి, స
జ్జనులకు మేలు చేయు కృతి చక్కగ వ్రాయగ జేయుమా కృపన్.
గుణ గణులైన పెద్దలకు, కోవిద పాళికి, కమ్మనైన స
న్మనమున నొప్పు తల్లులకు, మంజులవాఙ్మహనీయ సాధు స
ద్గుణమణులెల్లవారలకు, తోడుగ నుండుమ విఘ్న రాజ! మా
కనయము  నీడగా నిలిచి, హాయిగ వర్ధిల జేయ వేడెదన్.
వినాయక చతుర్థి శుభాకాంక్షలతో
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గజాననుని కటాక్ష వీక్షణామృత వర్షంలో తడిసి తరింప జేసిన శ్రీ చింతా వారి ప్రతిభ శ్లాఘ నీయం వారి పుణ్యం ఎంత జెప్పినా కొంత మిగిలి పోతూనే ఉంటుంది.
బ్లాగు నిండుగా విఘ్న నాయకుడు కన్నుల విం దు జేయడం ఎంత అదృష్టం ? చాలా ఆనందంగా ఉంది
వారికీ వారి కుటుంబ సభ్యు లందరికీ శుభాభి నందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.