గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, సెప్టెంబర్ 2013, శుక్రవారం

శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్ కవితలో వారి స్నిగ్ధ సుకుమార హృదయావిష్కరణ.

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ సుకుమార సుందర సల్లలిత హృదయం వారి రచనలో మనకు గోచరమగుచుండుట గమనించగలరు.

కలుపు మొక్కలన్ని కలసి తీర్మానించె 
కలసి యుంద మంచు పొలము లోన 
ఒప్పుకున్న రైతు ముప్పుల పాలాయె 
కలతపడకు మిదియె కలియుగమ్ము!

నమ్మ బోకు నవ్వు ! నమ్మకు ఏడుపు ?
నమ్మబోకు మెపుడు నరుని మాట ! 
నటన జీవ లక్షణమ్మురా మనిషికి !
కలతపడకు మిదియెకలియుగమ్ము!

మనిషికన్నపెద్ద మాయామృగము లేదు 
ప్రేమ కన్న గాఢ విషము లేదు 
పెళ్ళి కన్న పెద్ద పెనులంపటము లేదు 
కలతపడకు మిదియె కలియుగమ్ము 

పక్షి యొకటి తనను పజరమ్ము న నుండి 
వెలికి పంపు మంచు వేడు కొనియె 
రెక్క విరిచి తలుపు రెక్కను తెరిచిరే !
కలతపడకు మిదియె కలియుగమ్ము !
శ్రీ రాళ్ళబండి కవితా ప్రసాద్

రాళ్ళబండి  కవిత రసరమ్య హృజ్జనిత
సత్య దివ్య తేజ సౌమ్య కలిత.
కనులఁ గట్ట వ్రాయు కవితా ప్రసాధనుం
డీ యుగాన నరుని మాయ తెలిపె

జైహింద్
Print this post

2 comments:

సో మా ర్క చెప్పారు...

దీనజన రక్షణోదార దీక్ష బూను
మానవుడు....మానవుడుగాడు!.మాధవుండు!
మాధవుండైన....దీనులౌ మానవులను,ధన్యులను జేయలేకున్న...... దానవుండే!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వతులు శ్రీ రాళ్ళ బండి వారి అమృత వర్షంలో తడిసి తరించ గల అదృష్టాన్ని కలిగించిన ఆంధ్రామృతానికి కృతజ్ఞతలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.