జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భముగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొనే రోజు నేడే.
తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవితకు ఉపాధ్యాయులే ప్రత్యక్ష దైవాలుగా భావించి, తమ పిల్లలను పాఠశాలలో గురువుల వద్ద విద్య నేర్చుకొనుటకు చేర్చుతారు. కొండంత ఆశతో వారి పిల్లల బంగారు భవితకై ఎదురు చూస్తుంటారు. అట్టి అపురూపమైన అసాధారణ ప్రగాఢ వీశ్వాసంతో గురువులను నమ్ముకొనిన ఆ తల్లిదండ్రుల ఆశలను నిజంగా నిజం చేయుట కొఱకు అహర్నిశలూ తమ విద్యార్థుల అభ్యున్నతికై శ్రమించే నిజంగా నిజమైన నిస్వార్థ ఉపాధ్యాయులను ఎంతగా గౌరవించినా అది తక్కువే ఔతుంది. అట్టి ఉపాధ్యాయులీనాడు వ్రేళ్ళపైలెక్కింపదగినంతమంది మాత్రమైనా ఉన్నారు కాబట్టే నిజమైన నిస్వార్థమైన విజ్ఞాన జ్యోతుతులుగా కొందరైనా విద్యార్థులు సమాజంలో ఉన్నారు. భావి భారతానికి వారే జ్ఞాన దీపాలుగా వెలుగుతారు.
అట్టి విద్యార్థులలో నిజమైన విజ్ఞాన బీజాలు బలంగా నాటే ఉపాధ్యాలుంటే వారి పాదాలకు నేను సాష్టాంగప్రణామ ఆచరిస్తున్నాను.
మృగ మద సౌరభంబటుల మేలగు సద్గురు బోధ నిత్యమున్
ప్రగణితమై వసుంధరను ప్రాకుచునుండు నిరంతరంబుగా.
ద్విగుణితమైన ప్రాభవము, ధీ పరిపక్వత గొల్పు పూజ్యులౌ
సుగుణ సుమాలు సద్గురులు శోభిలు గావుత పూజలందుచున్.
అలనాడు నేను విశ్రాంత ఉపాన్యాసకుడనైనప్పటికీ అపురూపమైన తమ ప్రేమామృతంతో నన్ను కూడా అభిషేకించిన అలనాటి నా విద్యార్థుల పవిత్ర ప్రేమకు నేను ఏవిధంగా ఋణం తీర్చుకోగలను, నేడు కూడా వారు నన్ను గుర్తుపెట్టుకొని, అభినందిస్తూ గౌరవిస్తున్నారంటే అది నా పురాకృత సుకృత ఫలం గాక మరేమిటి? ఇట్టి అపురూప ఘన సత్కారాలు నిరంతరం అందుకొనేలా చేసిన నేను నిర్వహించిన ఉపాధ్యార వృత్తి నాకు లభించుట నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను.
భువిని జనించు భాగ్యమె సుపూజ్య ఫలంబిక మానవుండుగా,
కవిగ జనించుటన్నది ప్రగాఢ తపః ఫల,మంతకన్న సం
స్తవమగు నొజ్జగా, సుగుణ సంస్కృతి గొల్పెడి వృత్తినెన్నికన్
ప్రవరుఁడుగా, వెలుంగుటది భాగ్యవిశిష్ట మహత్ఫలంబగున్.
అట్టి విశిష్టసత్ఫలము నందితి నా గురు సత్కృపాసుధల్
గట్టిగ నాపయిన్ కురియ. గణ్యుఁడనైతిని. మీ హృదాబ్జముల్
పట్టితి, నందు నిల్చి మధుపంబుగ సంస్కృతి తేనె జుఱ్ఱుచున్
నెట్టుకు వచ్చుచుంటినిల. నే భవదీయుఁడ. రామ కృష్ణుఁడన్.
జైహింద్.
4 comments:
చాలా బాగుంది మిత్రమా ... గురువు ఒక దీపధారి. సచ్చాత్రుడు అతను చూపిన బాటలో ముందుకు సాగి ఉన్నతి పొందుతాడనడంలో సందేహం లేదు. నీవంటి మంచి వ్యక్తి, కవి గురువుగా పొందిన నీ శిష్యుల భాగదేయం ఎట్టిదో కదా ? వారెప్పటికీ నిన్ను మరువ జాలరు.
మిత్రమా!
నేను చాలా అదృష్టవంతుఁడను. నా జీవనము ప్రారంభము నుండియును నీవంటి సన్మిత్రుల సరసన సుహృద్భావ బంధురముగా సాగిన కారణముగా నీవు పేర్కొన్న సద్గుణ సంపద నాకు ప్రాప్తించినది. నీ సహృదయతకు ధన్యవాదములు.
పూజ్య గురువులు సరస్వతీ పుత్రులకు ప్రణా మములు
గురువు భగవంతుని కంటె గొప్పవాడు ఎందరినో తనఓర్పు నేర్పులతో ఉన్నతులుగా తీర్చి దిద్ది వెలుగు బాటను నడి పించగల అదృష్ట వంతులు అంతటి బృహస్పతికి ఆ అదృష్టం కలకాలం అల్లాగే ఉండాలని శుభా శీస్సులతో అక్క
బ్లాగున నేను వ్రాయు వర భావ సమృద్ధికి మూలమెల్ల నా
బాగును కోరు మీ సుగుణ భాషణ నైపుణి, జ్ఞాన బోధ. మి
మ్మేగతి సన్నుతించెద ననేక విధంబుల నన్ను బ్రోతు రా
హా! గుణ గణ్య దివ్య కరుణామృత వర్షిణి! సోదరీమణీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.