గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

డా. అనిల్ కుమార్ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం6.

జైశ్రీరామ్.
ఆర్యులారా! డా.మాడుగుల అనిల్ కుమార్ గారు గణపతికి చేసిన కవితామృతాభిషేకం (శ్రీ మహాగణేశ పంచ రత్నములు)తిలకించండి. పఠించి పులకించండి.


కం. బొజ్జంతయు విద్యలయి జ
గజ్జననికి పుత్రుడౌచు గణముల పతియై 
సజ్జనులనేలుచుండెడు 
గుజ్జగు రూపుని వినాయకుని ప్రార్థింతున్ II

కం. భగవంతుండొక్కండే
జగమన్నదియొక్కటే ప్రశస్తంబెన్నన్.
తగవులవేలా వేర్పడ 
నగజాసుత ! అవధరించి యార్పుము పగలన్ II

కం. వినదగునని పెద్ద చెవుల 
ననదగదని తొండమందునణచిన నోటన్ 
కొనియాడ సూక్ష్మ దృక్కుల 
ఘనముగ దాల్చిన వినాయకా నిను గొల్తున్ II

కం. ఘ్రాణేంద్రియమోంకారము
రాణింపగ పార్వతీశ్వర వినుత సుతుడై 
ప్రాణప్రదుడైన జగత్ 
త్రాణున్ భగవంతునేకదంతుని గొలుతున్ II 

కం. కొమ్మా పార్వతినందన ! 
సమ్మతమగు భక్తియుక్త సంస్తుతులన్ నీ 
విమ్మగు విద్యలనిమ్మా 
రమ్మా బెణకయ్య కావ ప్రార్థింప నినున్ II


ఓం తత్సత్
అష్టావధాని డా.మాడుగుల అనిల్ కుమార్. తిరుపతి.

కం. సుందరమగు మాడ్గుల కృత
కందంబులనందుమయ్య! గణ నాయక! హృ
న్మందిరమున వసియించుచు
ముందుకు నడిపింపుమితని పూజ్య పథమునన్.

డా. మాడుగుల అనిల్ కుమార్ అవధాని శేఖరులకు అభినందన పూర్వక ధన్యవాదములు.
జైహింద్.
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గణ నాయకుని స్తుతించిన పండితోత్తము లకు సాహితీ మిత్రులకు ....వినాయక చవితి శుభా కాంక్షలు

డా.మాడుగుల అనిల్ కుమార్ చెప్పారు...

గౌరవనీయులు మాన్యశ్రీ చింతా రామకృష్ణారావు గారు సహృదయ కనబరచారు. హృత్ పూర్వక ధన్యవాదములు తెలియజేయుచున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.