జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా! మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు.
వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.
నేటి మేటి పద్యములు.2.
6) అరసి వేయ దగును అపరాధ సుంకమ్ము - పావు గంట దాటు వక్తపైన.
ధనమునపహరించు మనుజుడే దొంగయా? - కాన రాని దొంగ కాల హర్త.
7) అసలు నిజము చెప్పి అది కల్పనా కథ - యనెడు భ్రాంతిగొల్పునతడు సుకవి.
అసలు సత్యమాడి అఎది నిజమ్మను భ్రాంతి - గొలుప గలుగు వాడు గొప్ప నటుడు.
8) అందమైన పూల ఆయుస్సు అల్పంబు - ఉండు శాశ్వితముగ బండ రాళ్ళు
సృష్టి కర్త కూడ సిద్ధ హస్తుడు కాదు - విశ్వ శిల్పమందు వెలితి గలదు.
9) అచ్చమైన సత్య మాశ్చర్యమును గొల్పు. - కలల కంటె కట్టు కథల కంటె.
జంక కుండ నగ్న సత్యమ్ము వచియింప - అద్భుతమనిపించు అవనికెల్ల.
10) అస్తమించు సూర్యుడడిగె దర్పమ్ముతో - ఎవ్వరింక వెలుగునిచ్చెదరని.
ఓపినంత వరకుఉన్నాననెను ప్రమిద - రమ్య హాస లోల రామ కృష్ణ.
(సశేషం)
జైహింద్.
1 comments:
నమస్కారములు
అలతి అలతి పదాలతొ అందమైన పద్యాలు అద్భుతం గా ఉండటమే కాదు అవన్నీ నిజమైన నిజాలు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.