గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2013, బుధవారం

నేటి మేటి పద్యములు.1.

జైశ్రీరామ్.
ప్రియ సహోదరీ సహోదరులారా!  మన ఆంధ్ర మాత కడుపార గన్న ముద్దు బిడ్డ యైన అభినవ వేమన మన నండూరి రామ కృష్ణమాచార్యుల వారు. 
వారి పద్యాలు సజ్జనులకు హృద్యాలు. సత్ కవి జన వేద్యాలు. పిల్లలకివి బోధ్యాలు.
మనం రోజుకొక్క పద్యమైనా చదివి కంఠస్థం చేయగలిగితే లోకజ్ఞానము, వివేకము తప్పక కలుగుతుందికాబట్టి .
మనం రోజూ కొన్ని పద్యాలైనా నేర్చుకుంటే బాగుంటుందని మీముందు  ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. నా అభిప్రాయమును మన్నించ గలరని ఆశిస్తున్నాను.

నేటి మేటి పద్యములు.1.

1) అచ్చమైన కవిత ఆచు వేయక ముందె  -  నాట్యమాడు ప్రజల నాల్కలందు.
ఘన కవనము తరచు గ్రంథాలయాలలో  -  గాఢ నిద్ర పోవు కనులు మూసి.

2) అచ్చమైన ప్రతిభ అవకాశములు లేక  -  రక్తి కట్టబోదు బ్రతుకు లోన.
అడవి వెన్నెల సిరి, అబ్దిలో రత్నాలు  -  ఎవరి కుపకరించు అవని లోన.

3) అరసి ఎవడు చేయు ఆర్త రోగికి సేవ?  -  ఎవడు దానమిచ్చు ఎఱిగి పాత్రు?
సత్య మెవడు చాటు సాక్షియై తెగువతో  -  ధరణి మీద అతడు ధార్మికుండు.

4) అరుగుదెంచె సభకు అధిక పాఠము వోలె  -  అతని పేరు లేదు అచ్చులోన.
గ్రంథ కర్తమీద గౌరవంబది హెచ్చె  -  వచ్చె శోభ అతని వలన సభకు.

5) అందగత్తెయైన అమ్మాయి గావచ్చు.  -  అద్దమొక్కటామె కవసరంబు.
తెలివితేటలున్న తేజస్వి కావచ్చు  -  ఉండవలెను స్నేహితుం డొకండు. 

(సశేషం)
జైహింద్.
Print this post

2 comments:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

ఎవ్వాని భావాల కివ్వేళయే గాక
భావియున్ తల వంచి ప్రణతు లిడును -
"ఎవ్వాని కావ్యాల నిముడగా వస్తువై
ధరణిలో అణువణ్వు తపన పడును -
ఎవ్వాని మాటయే ఇలలోన చాటువై
నరుల నాల్కల పైన నాట్య మాడు -
ఎవ్వాని కీర్తి మహీ మండలమ్ముపై
దశ దిశాంతమ్ములన్ దాటి సాగు -

అట్టి నండూరి వంశార్ణ వైక సోమ!
రామకృష్ణమాచార్య సన్నామధేయ!
నీకు శిష్యుడన్న ఒకే పతాక చాలు -
ఎత్తి నడయాడి లోకాల నేలుకొనగ!"
అని నేను మా గురువు గారిపై వ్రాసుకొన్న పద్యం గుర్తుకు వస్తున్నది.
గురువు గారి పద్యాలను ధారావాహికగా ప్రచురించడం ఒక మంచి ప్రయత్నం. సాహిత్యాభిరుచి గల యువజనులకు ఎంతో ఉపయుక్తం. మీ కృషికి నా అభినందన!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అందరు పఠించ వలసిన మంచి పద్యాలను అందించిన పూజ్య గురువులకు ప్రణామములు .శ్రీ చింతా వారి కృషికి అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.