జైశ్రీరామ్.
జ్ఞానామృత పాన లోలులారా! కవివతంస బిరుదాంకితులు శ్రీ బులుసు వేంకటేశ్వర్లు కవి కృత శివాలాపము నారికేళ పాకమో, కదళీ పాకమో, ద్రాక్షాపాకమో చదివి మీరే నిర్ణయించండి. తాను విద్యార్థిగా ఉన్న రోజులలోనే ఈ శివాలాపము రచన చేసిన సుకవి
శ్రీ బులుసు వేంకటేశ్వర్లు.
ఇక చవిచూడండి ఈ శివాలాపము 4 వభాగాన్ని. నమస్తే.
శివాలాపము. 31 నుండి 40.
శా:- నిద్రాణంబులు దివ్య మోక్ష పదవీ నిర్ధూత వాంఛా విని
ర్ణిద్ర ప్రాభవముల్ మదీయములు తండ్రీ! భావ కల్హారముల్.
త్వద్రాఘిష్ఠ జటాటవీ ఘటిత భాస్వచ్చంద్రమ శ్శ్రీకళా
ముద్రా స్వీకృతి విచ్చె నేటికివిగో పూమాలలయ్యెన్, శివా! 31.
శా:- విస్మేరాంబుజ వక్త్ర! నీ కృపకు నైవేద్యంబుగా నిల్చితిన్
అస్మత్ స్వాదు మరంద బిందు సుషమానంత ప్రభా మాధురీ
క స్మేరంబులు పద్య పుష్పములు దుఃఖ ప్రాభవద్గూఢమా
కస్మాత్పాతిత మోహ బంధనములన్ ఖండింపుమయ్యా! శివా! 32.
శా:- త్వత్కంఠాగ్ర విలగ్న బంధమది దేవా! యొక్క సర్పంబెగా
మత్కంఠాగ్రమునందగుల్కొనిన సంసారార్ణవోద్భూతముల్
ఛూత్కార క్రమ సంచరద్భయద చక్షుః శ్రోత్రముల్, వేలు, సం
విత్కల్యాణ! భరింప నేఱనిక నన్ వేధింపకయ్యా! శివా! 33.
శా:-ఉద్బీజంబులు పుత్ర పౌత్ర ధన దారోదార సంధాన దీ
వ్యద్బద్ధస్థితికిన్ సుధామల కళావైశద్య సమ్మోహ సం
వి ద్బింబాగమ కాంతికిన్ సుర పురీ వీధీ చరద్రేఖకున్
మద్బంధూ! భవదీయ సార పద పద్మస్ఫార పూజల్. శివా! 34.
శా:- ఉద్యోగంబులు పొట్ట కూటి కొఱకోహో! స్వామి లౌక్య క్రియన్
సద్యోలగ్నుఁడ వోలె కన్పడెదు, నేనా! సర్వ మాంగళ్య చి
ద్విద్యా మూర్తిని నిన్ను గాంచెదను హృద్వీధిం దివా రాత్రులన్
శ్రీద్యోగాఁగ జలాభిషిక్త సరసార్ధీభూత జూటా శివా! 35.
శా:- విద్వాంసుల్ పలుమంది సర్వ పరిషత్ వీధ్యంతరంబుండి రా
గ ద్వేష వ్యతిరిక్త భావ సుషమా గాంభీర్యముంగూర్చి ధ
ర్మాద్వైతంబుల గూర్చి పల్కుచును కర్మానేక సంప్రాప్త సం
పద్వైభోగ సుఖానుభూతినిఁ దలంపం జూతు రాత్మన్ శివా! 36.
శా:- శశ్వత్ సుందర శుభ్ర కార్తికిక భాస్వజ్జ్యోత్స్నవద్రమ్యమా!
విశ్వైక స్థిర మంగళంబయిన నీవిస్ఫూర్జిత శ్రీ కృపల్
విశ్వాసంబున నా పయిన్ జినుక రావే, చాలు, మద్దుఃఖముల్
నిశ్వాసల్ వలె జారిపోవును భవానీ ప్రాణ మూలా! శివా! 37.
శా:- వార్ధుల్ దాటెద, మిన్ను
నెక్కెద, భవద్వాల్లభ్యముం బొందగా
స్పర్థల్ ద్రోచెదఁ గాన దూరెద భవత్పాదంబులం బట్టగా
నిర్ధూతాఖిల మోహ బంధన కళా నిర్ణిద్ర భావాప్తి స
ర్వార్ధ స్వామిని నిన్నుఁ బట్టితిని దేవా! గాఢ భావా! శివా! 38.
శా:- శర్వాణీ హృదయానురాగ పదవీ సమ్రాట్కళా మంగళా!
ఖర్వ ప్రాభవుఁడాదిదేవుఁడగు నిన్ గాఢానురాగ ప్రభా
సర్వాంగీణ మనోజ్ఞమౌ గతి సమర్చల్ సేతునయ్యా! మహా
నిర్వాణైక పదమ్ము లక్ష్యముగ తండ్రీ! శూల పాణీ! శివా! 39.
శా:- అర్హ ప్రస్తుతముల్ మదీయ కవితా వ్యాహారముల్, వారి భృ
న్నిర్హాదంబులు నీల కంఠమగు నిన్నే తండ్రీ! యాడించెడున్.
గర్హింపం బని లేదు. కావ్య గుణముల్ కాసంత లేవంచు దృక్
బర్హిశ్శుష్మ, మదీయ భక్తిని తలంపంజూడుమయ్యా! శివా! 40.
(సశేషం)
జైహింద్.