గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2012, శనివారం

డా.నండూరి వారి ‘జ్యోత్స్నాభిసారిక’ నృత్య నాటిక C.D.ఆవిష్కరణ.

జైశ్రీరామ్.
సాహితీ సంపన్నులారా! నమస్తే. నిన్న త్యాగరాయ గాన సభ ((చిక్కడి పల్లి) లో డా.ఆశావాది ప్రకాశరావు గారి అధ్యక్షతన డా.నండూరి కృష్ణమాచార్యులు గారు రచించిన జ్యోత్స్నాభిసారిక అనెడి నృత్య నాటిక శ్రీ ఉదయ్ ముద్గల్ సంగీతం సమ కూర్చగా శ్రీ యుతులు సాందీప్  -  లలిత  -  సాగరిక  -  హరిప్రియ లు గానం చేసిన సీ.డీ. ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత మనోజ్ఞంగా జరిగింది
తెలుగు భాషా దిగ్దంతులని చెప్పుకొన తగిన డా.ఆశావాది ప్రకాశ రావు గారితో పాటు డా.తిరునగరి-శ్రీ చిక్కారామారావు - ఆచార్య వి.యల్.ఎన్.భీమశంకరం, డా. ఆచార్య ఫణిధర్- కవి దత్తాత్రేయ-అవధాని అంజయ్య మున్నగు అనేకమంది సభలో పాల్గొనడంతో తెలుగు కాంతులు వెల్లివిరిశాయి. డా.నండూరి రామకృష్ణమాచార్యుల వారి సాహితీ మహా ప్రస్థానం కళ్ళకు కట్టించారు.
కవి సమ్మేళన కార్యక్రమంలో అనేక అంది కవులు తమ కవితాగానం చేసి సభకు పరిపూర్ణత సమకూర్చారు. అదే సందర్భంలో నేను వ్రాసి అక్కడ పఠించిన పద్యములను మీ ముందుంచుతున్నాను.

శ్రీరస్తు                                         శుభమస్తు                                అవిఘ్నమస్తు.
నండూరి వంశజం వందే -  రామకృష్ణ మహా కవిమ్.
శ్రీ నండూరి రామ కృష్ణమాచార్యుల వారి వైశిష్యము.
వేదిక:- త్యాగరాయ గాన సభ, చిక్కడపల్లిలోతే.30-11-2012. సాయంత్రం  5 గంటలకు.
రచన :-  చింతా రామ కృష్ణా రావు.(సెల్.9247238537) chinta.vijaya123@gmail.com
:- సోదర సోదరీ మణులు  సుందర భావ సమృద్ధు లీరు. నే
మీ దరి పల్క నుంటి నిట మేలగు నండురి రామ కృష్ణ సద్
బోధన నొప్పు సత్కృతుల పూజ్యత నెన్నుచు, సత్ కవిత్వ సన్
మాధురి నెంచుచున్, గలుగు మంచిని గాంచెడి మీకు మ్రొక్కెదన్. 1.
శా:- శ్రీ నండూరి సుధాబ్ధి చంద్రుఁ డగునీ శ్రీ రామ కృష్ణుం డిలన్
నీ నా భేదము వీడి పల్కె నిజముల్ నిద్రాణ మైయున్న సత్
జ్ఞానాగ్నిన్ జ్వలియింపఁ జేయుచును ప్రజ్ఞానంబు దీపింపగా
వీణా కల్పిత పంచమస్వర ఝరిన్ వేవేల పద్యంబులన్. 2.
:- జాను తెలుగులోన చక్కగా వ్రాసిరి.  
జ్ఞాన దృష్టి తోడ కవులు మెచ్చ
ప్రాణ శక్తి కలుగు పద్యంబులగుటచే 
దీన జనుల పాలి దేవుఁడైరి. 3.
:- ఎంతటి వింత! లోకుల ననేకుల నేరిని లెక్క చేయరే !
స్వంత మనో గతంబులగు భావము లెట్టివి యైన గాని తా
నింతయు జంక కుండ వెలయించిరి పద్యములందు నేర్పుతో
నింతటి పుణ్య మూర్తి నిట నేమని చెప్పగ నేర్తు మీ దరిన్. 4.
:- బుడిబుడి పదములఁ గయికొని  
గడుసుందన మొప్ప కవిత ఘనముగ వ్రాయన్
నడచెడుపద్యములయి, యవి  
జడిపించెను దుర్ మతులను శాసనములటుల్. 5.
:- నగ్న సత్యములను, నయవర్తనములను,  
నవత మెచ్చునట్టి నానుడులను,
పలికి పద్యములుగ ప్రావీణ్యతనుఁ  జూపి
కులికె మంచి వారి గుండె లందు. 6.
:- కవి, తా మార్గ కవిత్వ తత్వ విదుడై కావ్యార్థమున్ గొల్పుచున్.
కవితా మార్గము చెప్పినాఁడు కవితా కల్హారమున్ మాలికన్.
కవి, తామిస్రము రూపు మాప కవితా కల్హారమున్ గాంచు. సత్
కవి, తా మన్నన బొందకున్నె జనినన్ కల్హార మార్గంబునన్. 7.
(ద్వాదశ కంద) ద్వివిధ కంద షట్కగీత గర్భ :- 
మన కవి యైన యీ మనుజ మాన్య విశారద మార్గ దర్శియై
ఘన కవితన్ మహా కవుల గ్రంథ వివర్ధన కల్గఁ జేసె ధా
రణ జవమున్ సదా మదికి క్రాంతి వరంబుగ మాకు నిచ్చె తృ
ప్తిని భువిపై మహా శ్రయ సుధేయి వరిష్టుఁడు రామ కృష్ణయే. 8.
(చంపక గర్భస్థ గీత-కందాలు)
గీ.మనుజ మాన్య విశారద మార్గ దర్శి  
కవుల గ్రంథ వివర్ధన కల్గఁ జేసె
మదికి క్రాంతి వరంబుగ మాకు నిచ్చె  
శ్రయ సుధేయి వరిష్టుఁడు రామ కృష్ణ..

.) కవి యైన యీ మనుజ మా 
న్య విశారద మార్గ దర్శియై ఘన కవితన్
కవితన్ మహా కవుల గ్రం  
థ వివర్ధన కల్గఁ జేసె ధారణ జవమున్.
.) కవి యైన యీ మనుజ మా  
న్య విశారద మార్గ దర్శియై ఘన కవితన్
జవమున్ సదా మదికి క్రాం  
తి వరంబుగ మాకు నిచ్చె తృప్తిని భువిపై.
.) కవి యైన యీ మనుజ మా  
న్య విశారద మార్గ దర్శియై ఘన కవితన్
భువిపై మహా శ్రయ సుధే 
యి వరిష్టుఁడు రామ కృష్ణయే. మన కవి యై.
.) కవితన్ మహా కవుల గ్రం  
థ వివర్ధన కల్గఁ జేసె ధారణ జవమున్
జవమున్ సదా మదికి క్రాం  
తి వరంబుగ మాకు నిచ్చె తృప్తిని భువిపై .
.) కవితన్ మహా కవుల గ్రం 
థ వివర్ధన కల్గఁ జేసె ధారణ జవమున్
భువిపై మహా శ్రయ సుధే  
యి వరిష్టుఁడు రామ కృష్ణయే. మన కవి యై.
.) జవమున్ సదా మదికి క్రాం  
తి వరంబుగ మాకు నిచ్చె తృప్తిని భువిపై
భువిపై మహా శ్రయ సుధే  
యి వరిష్టుఁడు రామ కృష్ణయే. మన కవి యై.
.) కవితన్ మహా కవుల గ్రం 
వివర్ధన కల్గఁ జేసె ధారణ జవమున్
కవి యైన యీ మనుజ మా  
న్య విశారద మార్గ దర్శియై ఘన కవితన్.
.) జవమున్ సదా మదికి క్రాం  
తి వరంబుగ మాకు నిచ్చె తృప్తిని భువిపై
కవి యైన యీ మనుజ మా  
న్య విశారద మార్గ దర్శియై ఘన కవితన్.
.) భువిపై మహా శ్రయ సుధే  
యి వరిష్టుఁడు రామ కృష్ణయే. మన కవి యై
కవి యైన యీ మనుజ మా  
న్య విశారద మార్గ దర్శియై ఘన కవితన్.
.౧౦) జవమున్ సదా మదికి క్రాం  
తి వరంబుగ మాకు నిచ్చె తృప్తిని భువిపై
కవితన్ మహా కవుల గ్రం  
థ వివర్ధన కల్గఁ జేసె ధారణ జవమున్ .
.౧౧) భువిపై మహా శ్రయ సుధే  
యి వరిష్టుఁడు రామ కృష్ణయే. మన కవి యై.
కవితన్ మహా కవుల గ్రం 
థ వివర్ధన కల్గఁ జేసె ధారణ జవమున్.
.౧౨) భువిపై మహా శ్రయ సుధే 
యి వరిష్టుఁడు రామ కృష్ణయే. మన కవి యై.
జవమున్ సదా మదికి క్రాం  
తి వరంబుగ మాకు నిచ్చె తృప్తిని భువిపై.
గీ:- జగతి దుష్టము శిష్టము  ప్రగతిఁ గొలుపు
కవిత ధారకు లొంగక కలిగెనెద్ది?
మహిత నండూరి సత్కవి మాన్యు కవన  
నిహిత సద్భావ మందిన సుహితము గను. 9.
పంచ.చా:- మనోజ్ఞ రామ కృష్ణ పద్య మర్మ మెన్ను వారికిన్  
ఘనంబుగా నిబద్ధమైన జ్ఞానమెన్నువారికిన్,
వినూత్న భావ దివ్య పద్య విద్య నెన్ను వారికిన్  
మనోజ్ఞ భావ సత్కవిత్వ మాన్యతల్ లభించెడున్. 10.
గీ:- అమర కవి సింహు లాచార్యు లరయ భువిని  
కవిత రూపంబులో జగత్ సువిదితుండు.
భావ దారిద్ర్య శమనుండు పద్య కవికి  
మంగళంబులు కలిగించు మంగళుండు. 11.
మంగళం                          మహత్                         శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
సహృదయులారా! మీరు పాల్గొనుచున్న సాహితీ కార్యక్రమాలను గూర్చి మీరు కూడా ఆంధ్రామృతం ద్వారా సాహితీప్రియులకు పంచడం ద్వారా ఆత్మానందంతో పాటు సాహితీ సంసేవనము కూడా చేసినట్లౌతుందని నా అభిప్రాయము. 
ఇక ప్రపంచ తెలుగు మహా సభలకు మీలో చాలామంది వెళ్ళుతున్నట్లు తలంతును. అక్కడ మీరు చూచినవి మీకు ఆనందానుభూతిని కలిగించినవి దృశ్యశ్రవణ రూపాలను కెమేరాలలో బ్రద్రపరచి అవి ఆంధ్రామృతం కు పంపడం ద్వారా ఆంధ్రామృత పాఠకాళికి అందరికీ పంచ గలరని ఆశిస్తూ పంప వలసినదిగా కోరుచున్నాను.
నమస్తే.

జైహింద్.                
Print this post

3 comments:

Pandita Nemani చెప్పారు...

అయ్యా! రామకృష్ణా రావు గారూ! శుభాశీస్సులు.
మీ కృషి అభినందనీయము. మీ పద్య రచన అనుపమము. స్వస్తి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మీ యాశీర్వాదంబే
శ్రేయోమార్గంబు మాకు.శ్రీరామాఖ్యా!
జ్ఞేయంబున్ జూపించున్,
ధ్యేయంబున్ జేరఁ జేయు తృప్తిన్ గొల్పున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ అర్క సోమయాజి ఇలాగన్నారు
చాలా చాలా బాగున్నాయి రామకృష్ణ కవిచంద్రా! అద్భుతం.
Arka Somayaji

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.