గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఫిబ్రవరి 2012, సోమవారం

అష్టావధాన నిర్వహణకు మానసిక స్థైర్యాన్ని అందించి ఆశీర్వదించిన మీ అందరికీ ధన్యవాదములు.

జైశ్రీరామ్.
సాహితీ ప్రియ మిత్రులారా!
సహృదయులైన మీ అందరి శుభాభినందనలతో శుభాకాంక్షలతో నిన్నటి అష్టావధానంలో డా. కట్టమూరి చంద్రశేఖరమ్ తన ప్రతిభా ప్రదర్శన నిర్విఘ్నంగా జరిగింది . ఆద్యంతము అవధానము ప్రశంసనీయంగా సాగింది.
వీటి వివరములు చిత్రములు త్వరలో మీ ముందుంచ కలను.
అంత వరకు మన రచనా పాటవాన్ని పరీక్షించుకోవడానికి వీలుగా అవధానంలో అడిగిన అంశాలను మీ ముందుంచుతున్నాను.
౧) సమస్యాపూరణముః-
రామా! నా దరి రాకు రాకుమనియెన్ రక్షార్తియై రంభయే.
౨) దత్త పదిః-
నష్టము - ఇష్టము - కష్టము - భ్రష్టము. రామునక్నయిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో వ్రాయవలయును.
౩) వర్ణనముః-
ఈ వేంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ చల్లని సాయంకాలాన్ని వర్ణించండి.
౪. నిషేధాక్షరి.
మల్లె మొగ్గను వర్ణించండి.
(ఇది మనము వ్రాయదలిస్తే మరొక పండితుని నిషేధాక్షరి పృచ్ఛకునిగా తాత్కాలికంగా ఉంచి, నిషేధాక్షరాలు చెప్పమంటూ మనం పూరణ చేయాలి.)
మిగిలిన నాలుగు అంశాలు
౫) అప్రస్తుత ప్రసంగము.
౬) తేదీకి వార ప్రకటనము.
౭) గణిత గణనము.
౮. ఘంటా గణనము.
కావున పై నాలుగింటికీ మనం వ్రాయ వచ్చును.
ప్రయత్నించ గలరు.
ధన్యవాదములు.
జైహింద్.
Print this post

12 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం చెప్పారు...

అవధాన కార్యక్రమం విజయవంతమైనందుకు అభినందనలు. మీరు సహృదయంతో నన్ను ఆహ్వానించారు. నేను కార్యాంతరాల వల్ల రాలేకపోయాను. పెద్దమనసుతో క్షమించగలరని ఆశిస్తున్నాను,

అజ్ఞాత చెప్పారు...

కవిత రాయలేను.,తలవూచగలను...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సంతోషమండి.

హేమాంగీ! సరి సాటి నీకు దివిలో నెవ్వారు లేరంచునున్
భామా! నేనును నొప్పుకొందునికపై బాలామణీ! యూర్వశీ!
లేమా! స్పర్ధను బూని రావలదొకో, లేదింక నే ధైర్యముం
రామా! నా దరి రాకు రాకుమనియెన్ రంభే భయ భ్రాంతయై.

ఊర్వశితో నృత్యస్పర్ధలో ఓడిన రంభ శరణనుట. రామా = స్త్రీ

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

స్వర్నదీ ప్రవాహంలా సాగిందమ్మా పద్యము నడక.
మందాకినీ! అభినందనలమ్మా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అయ్యా! కష్టే ఫలే. తప్పక ప్రయత్నించండి. తప్పక పద్యం వ్రాయ గలరు.
మీ ఉత్సాహానికి సంతోషిస్తున్నాను.

Pandita Nemani చెప్పారు...

మా పూరణను తిలకించండి:

కామావేశము వీడుమా యబలపై కారుణ్యమున్ జూపుమా
ప్రేమన్ జిల్కుచు సుందరీ మణులు వేవేలుందురే నీ కడన్
మా మర్యాదను కావుమా దశముఖా! మండోదరీ మానసా
రామా! నా దరి రాకు రాకుమనియెన్ రంభే భయభ్రాంతయై

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ధన్యవాదాలండి.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

అరుణకిరణాలు క్రమ్మగ నాకసమున
వెంకటేశ్వరు చరణాలె వెలుగులాయె
దీపకాంతులు శోభిల్లె దేవళమున
పద్యసుమములు గుడిలోన పరిమళించె
సాగెనవధాన క్రతువంత స్వామి కృపన

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

"మామా రావణ నీకు నేను స్నుషనే!, మాకర్మ మిట్లున్నదే
రామా!, నా దరి రాకు రాకుమని"యెన్ రంభే భయ భ్రాంతయై
కామాంధుడగు రావణాసురునితోన్ కన్నీటితో పల్కినన్
క్షేమంబెంచకపోయె, గర్వమున లంకేశుండు తాన్ కౄరుడై

రంభ రావణునితో పల్కుతూ స్వగతంలో రామా, నా కర్మ ఇలా ఉన్నదే అని అనుకొన్నట్లుగా (కష్టకాలంలో అయ్యో రామా అని అంటూ ఉంటాము కదా! ఆవిధంగా)

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

వేంకటేశుని గుడియందు వెలుగు జిలుగు
గగన మందున హంసల కలకలమ్ము
పలుక రించును కుసుమాల పరిమళమ్ము
భక్తి గీతాలు వినిపించు ముక్తి నియగ

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

లేమా ! యేటికి భీతి జెందెదవు నీలేబ్రాయమున్ మెచ్చితిన్
కామోద్రేకము కాదుకాదిది నినున్ కాంక్షించి మోహంబు నన్
భామా వీడను నిన్నునేనిక నభంబే క్రుంగి భీతిల్ల గన్
రామా ! నాదరి రాకురాకు మనియెన్ రంభే భయభ్రాంత యై

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

కష్ట నష్టము లెన్నైన నిష్ట పడుచు
హనుమ యేతెంచె లంకకు వినుతుఁడగుచు
దుష్ట రావణ రాజ్యము భ్రష్ట మవగ
రాముడేతెంచి వధియించె రావణు నిల `

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.