గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2012, సోమవారం

అష్టావధానం అంటే ఏమిటి?దీని వలన ప్రయోజనమేమిటి?

జైశ్రీరామ్.
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ సంస్కృతము, తెలుగు కాకుండా వేరే ఏ యితర భాషలోనుఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్పుతూ అవధాని సభాసదులనలరింప జేయడం అన్నది అవధాని ప్రత్యేకత.వీటన్నిటినీ ఏక కాలంలో అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.
అవధానాలు పలు రకములు.
వేదసంబంధ అవధానాలు: 
సాహిత్య అవధానాలు: (అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి)
సాహిత్యేతర అవధానాలు: (శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి)
సాంకేతిక అవధానాలు:
శాస్త్ర సంబంధ అవధానాలు: 
కళా సంబంధ అవధానాలు:
ఇలా అనేకమైన అవధానాలు ప్రాచుర్యం పొంది ఉన్నాయి.
అందు సాహిత్యావధానాలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
అసలు అవధానం అంటే ఏమిటి? అనే ప్రశ్న మనకు వస్తుంది. 
అవధానము = ఎచ్చరిక. మనో యోగము.ఆంగ్లములో ఎటెంక్షన్. కేర్.డివోషన్. రిగార్డ్. ఇంటెంట్నెస్.ఎటెంటీవ్నెస్. అనే అర్థాలున్నాయి. 
అవధాని ప్రారంభము నుండీ పృచ్ఛకులు వేసే ప్రశ్నలను మనసులో ఉంచుకొని, ఒక్కొక్కరి ప్రశ్నకు సమాధానము ఒక్కొక్క ఆవృత్తికి ఒక్కొక్కపాదము వరిసగా ఒకరి తరువాత ఒకరికి చెప్పుతూ, నాలుగు ఆవృత్తులలో పూరించాలి.
పూరణ పూర్తి అయిన తరువాత ధారణ.
అంటే తాను మొదటి నుండీ వరుసగా ఏ యే పృచ్ఛకునకు ఏయే సమాధానం చెప్పారో ఏ పద్యం చెప్పారో అదే పద్యాన్ని నాలుగు పాదాలు కలిపి చెప్పాలి. అలాగ ఆ అందరు పృచ్ఛకులకు చెప్పాలి. ఈ ప్రక్రియను అవాధానం అంటాము.
సాహిత్య అవధానాలలో అష్ట, ద్విగుణీకృతాష్ట, త్రిగుణీకృతాష్ట, శత, ద్విశత, త్రిశత, సహస్ర, ద్విసహస్రాదికమగు అవధానములు సామర్ధ్యంతో నేటి అవధానులు చేస్తున్నాను.
అందు మనకు వెశేషాదరణను పొందుతున్నది అష్టావధానము.
అష్టావధానములో స్వీకరిస్తున్న అంశాలు ఎనిమిది. 
ఆ యెనిమిదీ అవధాని, పృచ్ఛకులు కలిసి నిర్ణయించుకొని నిర్వహిస్తుంటారు.
అవి
సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకము, ఛందో భాషణము, అడిగిన ఆంగ్ల తేదీకి వార ప్రకటన్, మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు.
"ధారణ" తో అవధానం ముగుస్తుంది.  
ఈ అవధానం వలన ప్రయోజనమేమిటి?
అనే సందేహం మనకి రావచ్చును.
అవధానాన్ని మనం చూచినట్లైతే అవధాని ఏక కాలంలో  ఎనిమిదిమంది పృచ్ఛకులడిగిన ప్రశ్నలకు ఒక్కొక్క ఆవృత్తిలో ఒక్కొక్క పాదం ఎవరిది వారికి చెప్పుతూ నాలుగు ఆవృత్తులూ పూర్తయిన తరువాత వరుసగా పృచ్ఛకులందరికి మొత్తం ఎవరి  పద్యం వారికి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియ మెదడును  లొంగదీసుకొని, జ్ఞాపక శక్తిని మెదడుకు పెంచుకొంటూ  సద్యస్ఫూర్తిని పొందుతూ, పృచ్ఛకులడిగే అసందర్భమైన ప్రశ్నలకు కూడా చమత్కారతో సమాధానం చెప్పుతూ, అందరి మనసులనూ ఆకట్టుకోగలగడం అవధాని యొక్క సాధన వలననే సాధ్యమైనదని మనం గ్రహించ గలం.
అంటే మనమూ సాధన చేస్తే మనసుచేత ఎంతటి క్లిష్టమైన పనినైనా చేయించ వచ్చునని, మనసును మా స్వాధీనంలో ఉంచుకోవచ్చునని, జ్ఞాపక శక్తిని అపారంగా పెంచుకో వచ్చునని,మరపు అన్నదానినే మనం పూర్తిగా మరచిపోవచ్చునని, గ్రహించ గలం. ఇది విద్యా విషయంలో సాధన చేయ గలిగితే విద్యార్థులకు అమోఘమైన ఫలితాన్నిస్తుంది. పరీక్షా సమయాల్లో మరచిపోవడం అన్న మాటే ఉండదు. అందుకే ఆబాల గోపాలము తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా వెళ్ళి, ఆకార్యక్రమం ఆద్యంతం చూచి, స్ఫూర్తిని పొందాలి. తమ మేధాశక్తిని పెంచుకోవాలి.
ఇంతటి ప్రయోజనం కలుగ జేస్తున్న ఈ అవధాన ప్రక్రియ పూర్తిగా ఆంధ్రులమైన మన సొంతం. 
ఐతే ఇప్పుడు మనమేంచెయ్యాలి?
మనము, పిల్లలు, మిత్రులు అందరితో కలిసిఇటువంటి కార్యక్రమానికి వెళ్ళాలి.
అదెప్పుడు? ఎక్కడ? 
అంటే
హైదరాబాదు, మియాపూర్, జయప్రకాశ్ నారాయణ్ నగర్, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణంలో
మధ్యాహ్నం 3 గంటల నుండి
డా.కట్టమూరి చంద్రశేఖరావధాని గారిచే జరుప బడుతుంది.
వీరే ఆచంద్రశేఖరం
అందు చేత మనం తప్పక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నమాట.ఆ రోజు ఆదివారం కూడాను.
మరింకేమి? సకుటుంబంగా చూచే సదవకాశం మనం జారవిడుచుకోము కదా?
జైహింద్.
Print this post

11 comments:

మందాకిని చెప్పారు...

అయ్యా,
మీరు చెప్పినట్లు ఈ సమాచారాన్ని నా బ్లాగులో ప్రచురించి నలుగురికి తెలియాలని ఉంచాను.
ఇప్పుడు మీరిచ్చిన ఈ పాఠాన్ని కూడా మీ అనుమతితో అక్కడ వివరంగా ఉంచాలనుకుంటున్నాను.

Sanath Sripathi చెప్పారు...

గురువుగారూ!
మంచి వివరములనందించారు. :-)
కన్నడభాషలో కూడా అవధానములున్నట్టు గుర్తు.. దయచేసి పరిశీలించగలరు

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శ్రీ రామకృష్ణారావు గారూ!
అవధానములోని విశేషములను విపులముగా ఉదహరించారు. మీ వివరణ ప్రశంసార్హము. సంతోషము.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అవధానము గురించి మంచి వివరణ నిచ్చిన చింతా వారికి అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారికి నమస్సులు. అవధాన ప్రక్రియను గూర్చి చక్కగా వివరించినందులకు ధన్యవాదములు. 12.2.12 న శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధాని వారి అవధానకుసుమము శ్రీ శారదా మాత కంఠహారమున సుగంధములను వెదజల్లవలెనని ఆ తల్లి అనుగ్రహమున దిగ్విజయముగా జరుగవలెనని ప్రార్థిస్తున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఎంతో అభిమానంతో అభినందనలు, శుభాకాంక్షలు తెలియ జేసిన బ్రహ్మశ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారికి, మందాకిని గారికి, సనత్ శ్రీపతి గారికి, రాజేశ్వరక్కయ్యగారికి, శ్రీపతి శాస్త్రి గారికి నా ధన్యవాదములు.

buddha murali చెప్పారు...

మంచి ప్రయత్నం ఈ తరం వారికి తెలియని విషయాలు తెలుపుతున్నారు

SRRao చెప్పారు...

శ్రీ రామకృష్ణరావు గారికి
మీరు పంపిన లింక్, వివరాలు నా బ్లాగులో వుంచాను. అయితే అందులో తేదీ ఇవ్వకపోవడంతో మీ పద్య విపంచి బ్లాగు లోను, మందాకిని బ్లాగులోనూ చూసి తీసుకుని ఇవ్వడం జరిగింది.

అజ్ఞాత చెప్పారు...

శ్రీ చింతా రామకృష్ణారావు గారికి,
మీకు మాట ఇచ్చిన ప్రకారం, నా బ్లాగులో ఒక టపా రాసి పరిచయం చేశాను.అష్టావధానం/అప్రస్తుత ప్రసంగం పేరుమీద. ధన్యవాదాలు.

R L NARASIMHA RAO DEVARAKONDA చెప్పారు...

అష్టాధానం గురించి మీ వివరణ బాగుంది.. మీ అనుమతి తో నేను నిర్వహిస్తున్న పేస్ బుక్ సందేహాలు - సమాధానాలు పేజి నందు పోస్ట్ చేద్దామని భావిస్తున్నాను.. దయచేసి సంప్రదించండి ph 9849641936

p vnrao చెప్పారు...

అ0తర్జాలము ద్వారా అష్టావధానం చేయవచ్చు.
పృచ్చకుడి గా నేను పాల్గొoటాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.