గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఈ దత్త పదులతో ఐచ్ఛికమైన ఛందస్సులో జగన్మాతను ఆహ్వానించండి.

ఆర్యులారా! గడిచిన ఇన్ని రోజులూ ఒక ఎత్తైతే,  రేపటి నుండి మనం గడపబోయే తొమ్మిది రోజులూ ఒక యెత్తు.
శరన్నవరాత్రులు సందర్భంగా
1  శైలపుత్రి  
2 బ్రహ్మచారిణి
3 చంద్రఘంట
4 కూష్మాండ
5 స్కందమాత
6 కాత్యాయని
7 కాళరాత్రి
8 మహాగౌరి
9 సిద్ధిధాత్రి 
అనే పదములతో సంబోధిస్తూ మనము మేలుగా వ్రాయ గలిగిన ఐచ్ఛికమైన ఛందస్సులో జగన్మాతకు ఆహ్వానం పలకుదామా?
జైశ్రీరాం.
జైహింద్.  
Print this post

8 comments:

కంది శంకరయ్య చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

సీ.
శైలపుత్రీ! సర్వ సంకటమ్ములఁ బాపు;
బ్రహ్మచారిణి! మాకు రక్షణ నిడు;
చంద్రఘంటా! పాపసంఘంబుఁ దెగటార్చు;
కూష్మాండ! తీర్చు మా కోరికలను;
స్కందమాతా! మాకు సద్బుద్ధి నొసఁగుము;
కాత్యాయినీ! మమ్ముఁ గరుణఁ జూడు;
కాళరాత్రీ! మాకు కల్పవల్లివి నీవె;
శ్రీమహాగౌరి! మా చింతఁ బాపు;
తే.గీ.
సిద్ధిధాత్రీ! శివార్ధాంగి! శీతనగజ!
యనుచు భక్తు లందఱు చేరి యార్తితోడ
నిన్ను ప్రార్థించుచుందురు నిష్ఠ గలిగి
యొనరజేసెదరు నవరాత్ర్యుత్సవములు!

Pandita Nemani చెప్పారు...

Hi all kith and kin in the literary world. Greetings of the Season.

My literary works including Sreemadadhyaatmaraamaayanam can be seen in the following web site:

http://Panditha-nemani.info

Hope you will like to see and let me know your feelings thereon.
Yours truly - Sanyasirao

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీశైలపుత్రీ!వశింపంగ మాయింట
రావమ్మ! నీసత్ ప్రభావ గరిమ.
శ్రీబ్రహ్మచారిణీ!శ్రేయంబులం గొల్ప
రావమ్మ సత్కావ్య రాజివగుచు.
శ్రీచంద్రఘంటా!ప్ర చేతనత్వము గొల్ప
రావమ్మ సత్కవుల్ రాజిలంగ.
కూష్మాండమాతా!ప్రకోపంబుతో దుష్ట
సంహారివై రమ్ము చక్కఁ జేయ.
శ్రీస్కందమాతా!విశేషించి నన్నేల.
రమ్ము!కాత్యాయనీ!ప్రాణమగుచు.
రమ్ము శ్రీ కాళరాత్రీ!వరమ్ము నీవ.
రమ్ము. శ్రీమహాగౌరీ!వరమ్ము వగుచు.
స్వాగ తము సిద్ధిధాత్రీ! ప్రశాంత చిత్త!
స్వాగతమ్మిదె నీకు సుస్వాగతమ్ము.

Pandita Nemani చెప్పారు...

the website is as follows: http://panditha-nemani.info

Pandita Nemani చెప్పారు...

ఓమ్మన నలరెడు నీ త
త్త్వమ్మును పరమాదరమున ధ్యాన మొనర్తున్
తమ్ములలో విహరించెడు
నమ్మా! కరుణాంతరంగ! ఆనందమయీ!

ఓమ్మను నాదమ్మును శ్రా
వ్యమ్ముగ గొలుపుచును విశ్వమంతట చైత
న్యమ్మును నింపుచునుండెడి
యమ్మా! నీ మహిమ దలతు నానందమయీ!

ఓమ్మను మంత్రముతోనే
యమ్మల మువ్వుర సృజించి యధినేత్రివియై
యిమ్ముగ జగములనేలెడు
నమ్మా! నిను గొలుతు సచ్చిదానందమయీ!

Pandita Nemani చెప్పారు...

విద్యాశీస్సులు

దరహాసైందవ శోభితాస్యయగు విద్యాదేవి కావించుచున్
వరవీణామృదు నిక్వణ ప్రతతులన్ వాత్సల్య పూర్ణాత్మయై
పరమార్థమ్ములు కూర్చు నాశిషములన్ వర్షించుచుండెన్ సమా
దర రీతిన్ గొని తద్రసమ్ము నమితోత్సాహాన సేవింపమే

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ! చాలా సునాయాసంగా అర్థ సుబోధకంగా వ్రాసిన మీ సీసం బాగుందండి. అభినందనలు.

ఆర్యా! అవధానిగారూ!
అమ్మ యొక్క తత్వాన్ని చక్కగా వివరించారు.
ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.