గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, సెప్టెంబర్ 2011, సోమవారం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సద్గుణ మూర్తులైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా త్రిమూర్తి స్వరూపులైన గురు దేవులకు 
నా హృదయ పూర్వక ప్రణామములు, 
శుభాకాంక్షలు.
భారత మాత భావి తమ భవ్య సుబోధనలందు నుండె. బో
ద్ ధారకు లైన మీ వలన తప్పక సద్గుణ పూజనీయులై
కారణ జన్ములా యనగ గౌరవ మొప్పగ సంచరించు పల్
ధీరులు భారతాంబ వినుతింప వెలుంగును శిష్య  కోటియై. 
భారతాంబ మెచ్చేవిధంగా సద్గుణ రాశులై యున్న మిమ్ములను ఆదర్శంగా తీసుకొని, మీ శిష్య పరంపర సద్గుణ తేజో మూర్తులై ప్రపంచ దేశలకే భారతావని ఆదర్శప్రాయంగా ఉండే విధంగా సమాజాన్ని తీర్చి దిద్ద గలరని ఆశిస్తూ, ఎంతో ఆశగా ఉపేక్షిస్తున్నాను.     నాలాంటి వారెందరో నాలాగా ఉపేక్షిస్తున్నారు.
మాకోరిక మీవలన తప్పక తీరుతుందని ఆశిస్తూ, మీరు భవ్య భారత సమాజ నిర్మాణానికి చేసే కృషికి అన్ని విధాలా పరమాత్మ అండగా ఉండాలని ఆశిస్తూ,    మరొక్క మారు పాదభివందనం చేస్తున్నాను. 
జైశ్రీరాం.
జైహింద్.   
Print this post

4 comments:

Pandita Nemani చెప్పారు...

గురువులకు నమస్సుమాంజలి ఘటిస్తున్నాను.
సర్వేపల్లి మహానుభావసదృశుల్ సాధుస్వభావుల్ గురుల్
సర్వజ్ఞుల్ పరమార్థ బోధనరతుల్ ఛాత్రాళి శ్రేయమ్మునే
సర్వావస్థలలోన గోరుచును సంస్కారాఢ్యులం జేయుటన్
పర్వంబై గురువైభవోత్సవము విశ్వవ్యాప్తమై యొప్పుతన్

Pandita Nemani చెప్పారు...

వాక్చమత్కృతి

నేను ఎప్పుడో విన్నవి - పూర్తిగా జ్ఞాపకము లేవు.
ఒక రాజుని ప్రశంసిస్తూ ఒక కవి చెప్పెను.
రాజా! నీ కీర్తి వైభవమును
"నలుగురు బలికిరి"
చమత్కృతి చూడండి: విడదీస్తే:
నలు - గురు - బలి - కిరి
అంటే ఆ రాజు అందములో నలుడు, బుద్ధిలో గురుడు, దానములో బలి, మరియు భూభార ధారణలో కిరి (వరాహమూర్తి).
ఇలా చిన్న మాటలలో గొప్ప అర్థము వచ్చుట బాగున్నది కదా!.

Pandita Nemani చెప్పారు...

గురు శబ్దార్థము:
గురు శబ్దానికి 10 అర్థాలు ఉన్నవి. వినండి:
1) విద్యా బోధకుడు, 2) బృహస్పతి, 3) ఇంద్రుడు, 4) సూర్యుడు, 5) చంద్రుడు, 6) యముడు,
7) తండ్రి, 8) తాత, 9) పెద్ద మరియు 10) దీర్ఘాక్షరము
ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవము కదా అందుకే చెప్పాలనిపించింది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

" గురువులు ,పండితులు , పూజ్యులు , సరస్వతీ పుత్రులు , శ్రీ నేమాని వారికి
నమస్కారములు.
ఈ రోజు " గురు శబ్దానికి గల అర్ధములను " వివరించి మరెన్నో " నలుగురు బలికిరి " అనే పద చమత్కృతిని చక్కగా తెలియ జెప్పినందులకు శ్రీ పండిత నేమాని వారికి నమస్కారములు . తమ గ్రంధము " మనీష పంచకము " ఆవిష్కరణ పిమ్మట మాకు చదవగల అదృష్టాన్ని కలిగించ గలరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.