గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, సెప్టెంబర్ 2011, సోమవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ20)

ఆర్యులారా! ఈ నాడు పూరణార్థం మన ముందుకు వచ్చిన సమస్య.
"కైలాసము వీడి యీడ కాపురముంటే? "
ఈ సమస్యకు అవధాని గారి పూరణమును, నా పూరణమును వ్యాఖ్యలలో చూడనగును.
మీ పూరణములతో పాఠకులనలరింప జేయ గలరని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

15 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఏలా శ్రీనాథుడడిగె
ఏలా ఇద్దరు పడతులు, యిమ్మనె గంగన్?
ఫాలాక్షునకున్ దెలియును
కైలాసము వీడి యీడ కాపురముంటే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

నీ లీలలెఱుగ తరమా!
ఫాలాక్షుఁడ!నీ యునికిని భక్త జనులకున్
కైలాసమాయె యీ భువి.
"కైలాసము వీడి యీడ కాపురముంటే?"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

ఏలా నాతో కయ్యము?
నా లీలల చూపినాడ నయముగ భవ్యా!
నీలో గర్వంబడగెనొ?
"కైలాసము వీడి యీడ కాపురముంటే?"

Pandita Nemani చెప్పారు...

శైలజ! ఆంధ్రామృతమును
గ్రోలుచు పదిమంది కవుల కూర్పులు వినుచున్
కాలక్షేపంబగు గద
కైలాసము వీడి యిచట కాపురముంటే.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

డోలాయమానసమమగు,
కోలాహలజీవితమ్ము, కూటికి వగచే
బేలల బాధలు దెలియును
కైలాసము వీడి యిచట కాపురముంటే.

కంది శంకరయ్య చెప్పారు...

లీలం గనె వనిఁ దిన్నఁడు
బాలార్కుం దలను దాల్చు భగవంతునిదౌ
యా లింగముఁ గని పల్కెను
"కైలాసము వీడి యీడ కాపురముంటే?"

ఊకదంపుడు చెప్పారు...

సీ!లంచములేగోరవు,
పాలింపగనీకుటుంబ,పరివారముల
న్నేలాగునసాధ్యపడును-
కైలాసము వీడి యీడ కాపురముంటే?

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

తోలున్ బుట్టము గట్టుచు
మేలౌ యా వృషభ మెక్కి మెఱయగఁ దిరుగన్
జాలులె పడతులు పడుదురె
కైలాసము వీడి యీడ కాపుర ముంటే !

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

మౌళిగ చంద్రుడు గుదిరెను
కాలోచిత కంఠ పట్టి కాకోదరమున్
తోలయె పుట్టము దీరుగ
కైలాసము వీడి యీడ కాపురముంటే ?

నిజము చెప్పాలంటే టోపీ,లెదరు జాకెట్టు, మెడలో టై శివుడుకి బాగా కుదిరాయి యీ ప్రపంచములో జీవనానికి !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! సమస్యాపూరణం మీది బాగుంది. అభినందనలు.

పండిత మాన్యా! మీరు
ద్దండులు.శివుడాంధ్ర సుధను తప్పక గ్రోలన్
నిండు మనంబున కోరుచు
నుండుట మేలని వచించె. నొప్పుగ.భళిరా!

సంపత్ కుమార్ శాస్త్రి గారూ! సామాజిక స్పృహతో మీరు చేసిన పూరణము ఆ పరమేశ్వరుని కూడా ఆలోచింప చేస్తోంది. అద్భుతం. అభినందనలండి.

శంకరయ్య గారూ!తిన్నడు చేత ఆ మాటలు పలికించి పూరణకు ఔచిత్యం చేకూర్చారు.ధన్యవాదాలు.

రామ కృష్ణా ! ఇంత అలవోకగా సమస్యా పూరణ చేసే నైపుణ్యం నీలో ఉనందని నీపూరణ చూస్తే తెలుస్తోంది. చాలా సంతోషంగా ఉంది. అభినందనలండి.

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణలో రెండవ పాదాన్ని
"బాలేందున్ దలను దాల్చు భగవంతునిదౌ’ అని చదువుకొన వలసిందిగా మనవి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నరసింహ మూర్తి గారూ! మీ రెండు పూరణలూ బాగున్నాయండి. ధన్యవాదములు.

శంకరయ్య గారు నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

వేళాకోళము లాడకు
మేలాభువి నుండ గలము? మేలా ? తినగన్
హాలా హలధర ' కల్తీ '
కైలాసము వీడి యీడ కాపురముంటే !

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

లీలోద్యానము నందున
పాలాక్షుడు విన్నవించె పార్వతి తోడన్ !
భూలోకపు సొగసులు గన
కైలాసము వీడి యీడ కాపురముంటే !

లంకా రవీంద్ర చెప్పారు...

భూలోకానికి వచ్చి,ఇక్కడే సెటిల్ అవుదామన్న శివుణ్ణి హెచ్చరిస్తూ పార్వతి చెప్పిన పద్యం:

వేలగు పాముల పాలకు;
వేళకు మేతాడ నంది వేరే రుసుముల్;
భూలోక వాసమంటివి!
కైలాసము వీడి యీడ కాపురముంటే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.