గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, సెప్టెంబర్ 2011, శనివారం

అవధాన ప్రక్రియలో నిషిద్ధాక్షరి1.

అవధాని మేడసాని మోహన్
ఆర్యులారా! అవధానంలో నిషిద్ధాక్షరి అన్నది అవధానిగారి రచనా పాటవాన్నికి పరీక్షగా నిలిచే ఒక  ప్రక్రియ.
నిషిద్ధాక్షరిలో పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు.
ఉదాహరణకు, అవధాని మేడసాని మోహన్ గారిని ఒకసారి
"క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పండి" అన్నారు. ఆయన ఈ విధంగా చెప్పారు.
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవమ్మెసగెన్.
ఎంత సునాయాసంగా చెప్పగలిగారో కదా! వారికి ఆ కల్యాణవేంకటేశ్వరుని అనుగ్రహము నిత్యమూ లభించాలని కోరుకొంటున్నాను.
ఈ పృచ్ఛకుని ప్రశ్నానుగుణంగా నా పూరణము వ్యాఖ్యలో చూడనగును.
మీరూ ప్రయత్నించి ఈ పృచ్ఛకుని నిషిద్ధాక్షరి ప్రశ్నకు చక్కని పూరణను చేసి మీ రచనా పాటవాన్ని పెంచుకోవడంతో పాటు పాఠకులకు తెలుగు భాష మీద ఉన్న గౌరవాన్ని ద్విగుణీకృతం చేసినవారవాలని ఆకాంక్షిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

8 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సుమనోహరుఁడా రాముఁడు
విమలమణియునౌ లలామ- విజయము, శుభముల్
అమరగ వివాహమాడిరి
రమణీయమ్మౌ విదేహ రాజ్యము నందున్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

"నిషిద్ధాక్షరి".
క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు.
ఈ పృచ్ఛకుని ప్రశ్నానుగుణంగా నా పూరణము.

సరస సుమనోజ్జ్ఞ మైథిలి
దరహాసము రాముని హృదిఁ దాగెను వరమై.
సురవర సుజనాశ్రయుఁడీ
వరుఁడా మైథిలిని బడసి వరలెను ఘనుఁడై.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

శుభముల్ అనకుండా శుభమే అనాలి కదా గురువుగారూ!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

వెలుగు లీను విశ్వ విభుడైన రాముని
మోము జాబిలాయె, ముగ్ధ యైన
మైథిలీ ముఖమ్ము మందమౌ వెన్నెల
జల్ల, వేరు గాని జంట యైరి.

మిస్సన్న చెప్పారు...

రాముడు శంభు విల్లు, భళిరా! దరి జేరెను, నవ్వు మోమునన్,
రామ యెడంద నిండగను రమ్యముగా, సరిజేసె! సర్వులున్
మోముల సంభ్రమం బొదవ , మోదము నిండ గనన్ ధనుస్సు మా-
యేమొ యనన్, గుభిల్లుమన నెల్లరి గుండెలు రెండుగా నయెన్!

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శివధనువును విరిచెను రా
ఘవుడిదె భుజబలమునందు ఘనమై వెలయన్,
అవనిజ సిగ్గులమొగ్గై,
రవివంశోద్భవునినొందె లలనా మణియే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ!
పరుష రహితంగా పూరణ చేసి అనుకున్నది సాధించారు. ఐతే మీరు చెప్పినట్టుగా శుభమే అనకుండా శుభము
న్నమరగ అంటే సరిపోతుందండి.అభినందనలు.

హనుమచ్ఛాస్త్రి గారూ!
అద్భుతంగా ఉంది మీ పూరణము.
అభినందనలు.

మిస్సన్న గారూ! సీతా కల్యాణ ఘట్టాన్ని పరుష రహితంగా చాలా సరళంగా కళ్ళకు కట్టించారండి.
అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ!
పరుష రహితంగా ఎంత సునాయాసంగా బహు సరళంగా రచించారు మీరు! చివర మణియే అనడం కన్నా మణియై అంటే ఇంకా ఔచిత్యంతో ఒప్పారుతుందనిపిస్తోందండి నాకు.
అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శివధనుసు విరిచి నందున
అవనిజ మదిని గెలిచి యా రాముడె విభుడౌ !
దివిజులు దీవెన లీయగ
రవికుల సోముని తొపెండ్లి రమణీయము గన్ !

తమ్ముడూ ! తప్పులు లేక పోతేనే !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.