గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, సెప్టెంబర్ 2011, ఆదివారం

అవధాన ప్రక్రియలో నిషిద్ధాక్షరి 2



సరస్వతీ నమస్తుభ్యం.
సాహితీ బంధువులారా!
ఇది వినండి.
1944లో పిసుపాటి చిదంబరశాస్త్రి గారు అవధానం చేస్తుండగా ఒక పృచ్ఛకుడు
మొదటి పాదంలో య, ర, ల, వ, శ, ష, స, హ, 
రెండో పాదంలో ప, ఫ, బ, భ, మ, 
మూడో పాదంలో త, థ, ద, ధ, న, 
నాలుగో పాదంలో క, ఖ, గ, ఘ, జ్ఞ... 
అక్షరాలు రాకుండా 
మత్తేభ ఛందస్సులో సరస్వతీ దేవిని వర్ణించమన్నాడు.

పిసుపాటి వారు దాన్ని అవలీలగా పూరించారిలా... .
'గణుతింతున్‌ మనమంది నుక్తిజననిన్‌ కాంతా మణిన్‌ జండధా
రణ హృత్సారస చంచరీక నవతారస్వైరసంచార, చ
ర్వణ బీయూష కరాభ్యుపేయ రుచపారం పర్య సంశోభ, గా
రణ భూతన్‌ వివిధ శ్రుతి స్మృతి విహారద్యోత మానస్థితిన్‌'

చూచారు కదా వారి పూరణము?
మీరూ రచనలో వారితో పోటీ పడే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నారని మీ పూర్వ పూరణలు ఋజువు చేస్తున్నాయి.మరెందుకాలస్యం. పూరించి మీ పూరణలద్వారా పాఠకాళికి సాహిత్యాభిలాష ద్విగుణీకృతం చెయ్యండి.
నా పూరణమును వ్యాఖ్యలో చూడ గలరు.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.

Print this post

10 comments:

కంది శంకరయ్య చెప్పారు...

ఇడె పోతన్న నీ పదంబులకుఁ దా నేనాఁడొ కబ్బంబుఁ దా
నెడఁదన్ నిన్నె తలంచి భూవరులు దా మెంతెంత వేధించినన్
గడు కష్టమ్ముల సైచియున్ సిరుల కాంక్షల్ వీడి వాణీ! యిఁకన్
దడవింతైనను జూపవద్దు దయ విద్యాబుద్ధు లందింపవే!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గురువుగారూ నమస్సులు. ఎందరో మేధావులైన అవధానులను పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదములు.
ఎందరో మహానుభావులు, అందరకూ వందనములు

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణలో ‘ఇడె పోతన్ననీ పదంబులకు’కు బదులు ‘ఇడె పోతన్నయె నీ పదంబులకు’ అని చదువుకొన వలసిందిగా మనవి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ నిషిద్ధాక్షరికి నా పూరణము.

అజునిం బొందిన తేజమా! కమలజున్నానంద మున్ ముంచుచున్
సుజనాళిన్ కరుణించి కాచు జననీ! శోధించి నిన్నారయన్
ప్రజలే కొల్చి స్మరించుచుండ, సభలో భాగ్యంబు పండింపగా
సుజయంబున్ ప్రబలింతువమ్మ తలపన్. శోభిల్ల జేయన్ సదా!

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువుగారూ నమస్కారములు.

క్రితం వ్యాఖ్యలలో ( 11/09/2011) పూజ్యులు పండిత నేమాని గారు దసరా సందర్భముగా అమ్మవారి మీద పద్యాలను వ్రాయమని చెప్పారు. దీన్ని మీయాజ్ఞగా గైకొని నా ప్రయత్నమును జేసినాను. ఇందులోని తప్పులను మన్నిస్తూ తగు సవరణలు చేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

శ్రీవిగ్నేశుభజించెద
నావిర్భావమ్మునందునతి రమ్యంబై,
చేవల్ జూపిన వీరుని,
నావిద్యల గాచు మని, ప్రణామము జేతున్.

(పుట్టినవెంటనే తని తండ్రియైన ఈశ్వరునితో యుద్ధముజేసినాడని )

శ్రీ పార్వతీ దేవి
శ్రీ గౌరీ పరమేశ్వరీ త్రినయనీ, శ్రీరాజరాజేశ్వరీ,
యోగానందవిభాసినీ, సతత సద్యోల్లాసినీ, హాసినీ,
రాగద్వేషనివారిణీ, దనుజసామ్రాజ్యాంతక: కారిణీ,
వేగంబున్ నను బ్రోవుమమ్మ జననీ, వేదాంత సంధాయినీ

శ్రీ లక్ష్మీ దేవి

శ్రీరమ్యంబు, సమస్తలోకజనసంసేవానిధానంబు, నీ
హారస్వచ్చవిభాసితంబు, జనవిఖ్యాతంబు, జుంటీగ ఝుం
కారీశబ్ద తతంబు, విస్పురిత సత్కారంబులన్ గొన్న శ్రీ
శౌరీస్వాంతనివాసినీ, జనని సాష్టాంగప్రణామంబిదే.

(నీహారస్వచ్చ = మంచుబిందువులతో సమానమైన స్వచ్చత కలిగిన),

శ్రీ సరస్వతీ దేవి

శ్రీవాణీ, సురలోకపూజిత, ఘనశ్రీభాష్య సంధాయినీ,
చౌవేదాంతరభాసినీ, బహుళమౌ సౌజన్య విభ్రాజినీ,
నీవాగ్ధాటి సమస్తలోకములనున్ నిత్యంబు దీపించు, వా
గ్దేవీనీ శరణంబు వేడితి ననున్ దీవించు వేదాగ్రణీ.

(చౌవేదాంతరభాసినీ = నాల్గు వేదములలోను ప్రకాశించు తల్లి,)

పరమున్ గోరెదనిమ్మా,
వరమున్, భవబంధనముల వనధిన్ దాటన్,
శరణార్థుడ మన్నించుము,
కరుణారసమూర్తివమ్మ, గౌరీమాతా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ!
మీ పూరణ బాగుందండి.ధన్యవాదాలు.
ఐతే మొదటి పాదంలో నిషిద్ధాక్షరం ల, మీరు చేర్చాలని రెండవ వ్యాఖ్యలో చెప్పిన య,అనే వర్ణాలూ,
రెండవ పాదంలో భ,మ,అనే అక్షరాలు,
మూడవ పాదంలో న కార పొల్లులు రెండు,
ప్రయోగింప బడ్డాయి. అలా రాకూడదని పృచ్ఛకుని ఉద్దేశము.
పిసుపాటి చిదంబరశాస్త్రి గారు నిషిద్ధాక్షరాలను తప్పించి పద్యం పూరించారు.

శ్రీపతి శాస్త్రి గారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గరూ! భక్తి భావంతో మీరు వ్రాసిన పద్యాలు రక్తి కట్టిస్తున్నాయి.
ఇక దోషాలంటారా.... అవిగుణాలముందు చిన్నబోతున్నాయి. అవేమీ పెద్ద లెక్కలోకి రావు ఉన్నాగాని.
ఆ దేవత మూర్తులు మీయొక్క, మీద్వారా మాయొక్క కోర్కెలను తప్పక ఈడేర్చాలని మనసారా కోరుకొంటున్నాను.
ధన్యవాదాలు.

కంది శంకరయ్య చెప్పారు...

మన్నించాలి. తొందరలో గమనించలేదు. నా సవరించిన పద్యం ......

ఇడె నా పోతన నీ పదాబ్జమునఁ దా నేనాఁడొ కబ్బంబుఁ దా
నెడఁదన్ నిన్నె దలంచి రాడ్వరులు దా రెంతెంత వేధించినన్
గడు కష్టమ్ములఁ బెక్కు సైచియు సుఖంబుల్ వీడి, వాణీ! యికం
దడ వింతైనను జూపవద్దు దయ విద్యాబుద్ధు లందింపవే!

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కనుమా, కన్నునకింపుగా నిచట నాకై దాను కన్పించెనే,
వినవే, యల్లన సాగెనే సఖియరో! వీణాఝురుల్, వాణి కం
కణ, మంజీరము మ్రోగగా, కవివరుల్ కావ్యమ్ములేవ్రాసిరే,
తనువున్ మానసమీవిధిన్ మనల తాదాత్మ్యంబు చెందించెనే.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువుగారూ ధన్యవాదములండీ. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. దోషములేవైనా వుంటె తెలియజేసి నన్ను చక్కదిద్ద ప్రార్థన.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.