గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2011, శుక్రవారం

పండిత నేమాని వారు సూచించిన సమస్య మీ పూరణకై చూస్తోంది.

ఆర్యులారా!
మన మార్గదర్శకులు పండిత నేమాని వారు ఒక చక్కని సమస్యను పూరణకై సూచించారు. అది మీ ముందుంచుతున్నాను.
"సొమ్ములు లేనిచో సుగుణ శోభలు చుల్కన కావె యేరికిన్"
ఎంతసునాయాసంగా యదార్థానికి దర్పణంగా ఉందో చూచారా ఈ సమస్య! వారికి ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.
ఈ సమస్యకు నా పూరణను వ్యాఖ్యలో చూడనగును.
మీ పూరణలు పాఠకులకానందదాయకమై కవితాసక్తిని ప్రోత్సహిస్తాయని భావిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

12 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

"నమ్మిన రామచంద్రుడికి నా కృతి నిచ్చెద"నంచుఁ జెప్పుచో
బమ్మెర పోతనాఖ్యునికి బావగఁ జెప్పెను నీతిపాఠముల్
"సొమ్ములు లేనిచో సుగుణ శోభలు చుల్కన కావె యేరికిన్,
సమ్మతి తోడ రాజసభ చక్కగ నిచ్చును వైభవ"మ్మనెన్

Pandita Nemani చెప్పారు...

మా పూరణను చూడండి.
సొమ్ములు వాగ్విభూషలను సూక్తులసత్యములౌను జూచుచో
సొమ్ములు గల్గు నాతనికి జుట్టును దిర్గుచు స్వార్ధచిత్తులై
యెమ్మెలు సెప్పుచుం గడపుటే పొనగూర్చుచు నుండ సౌఖ్యముల్
సొమ్ములు లేనిచో సుగుణ శొభలు చుల్కన కావె యేరికిన్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

కమ్మని కంఠమున్ కలిగి గానము జేయనుపక్రమించినన్
ఢమ్మని మ్రోగుచున్ మదిని డోలికలూపు మృదంగనాదముల్
ఝుమ్మను చుండు వీణియలు జూడగ నాభరణమ్ములైనచో
సొమ్ములు లేనిచో సుగుణ శోభలు చుల్కన కావె యేరికిన్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కమ్మగ పాడ నేర్చినను గౌరవ సభ్యు చేరనీరు.వే
దమ్ములు నేర్చినన్, గవిత ధారగ చెప్పగ నేర్చినన్,భువిన్
సొమ్ములు లేనిచో సభల శోభిలనీరు.హసించు. కావునన్
సొమ్ములులేనిచో సుగుణశోభలు చుల్కన కావె యేరికిన్.

కంది శంకరయ్య చెప్పారు...

ఇమ్మహిలోన మానవున కెల్లవిధంబులనున్న యాస్తు లే
కమ్ముగ షడ్విరోధులను గల్గఁగఁ జేయు; సమంచితాంతరం
గమ్మున నాటినట్టి హిరకారగుణమ్ములె భూషలైన నా
సొమ్ములు లేనిదో సుగుణశోభలు చుల్కన గావె యేరికిన్.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

కమ్మని వంటకంబులును, కాచిన వెన్న, రసావళీ పరి
త్రమ్ము,ననాథకున్ బలిమి దానము జేయసుసాధ్యమౌనటే
సొమ్ములు లేనిచో?, సుగుణ శోభలు చుల్కన గావె యేరికిన్
సమ్మతి బల్క నేరక ప్రశంసలు జేయకనున్న యిద్ధరిన్.

పరిత్రమ్ము = భోజనము,

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

మందాకిని గారూ,

మహాధ్భుతమైన పూరణనిచ్చారండి. అభినందనాభివాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! సరిగ్గాపోతననే దృష్టాంతంగా తీసుకొని పద్యం వ్రాసినవాడనే. ఐతే ఎక్కడో చిన్న్ అసందేహం కలగడంతో మార్చేసాను.
ఐతే మీరు నేననుజున్న విధణ్గానే పూరణ చేయడం నకు నిజంగా ఆశ్చర్యం కలిగించడమే కాదు ఆనందం కూడా కలిగిస్తోందండి.
ధన్యవాదములు.


ఆర్యా! అవధాని గారూ! లౌకికాన్ని చక్కగా పద్యంలో వివరించి యదార్థానికి అద్దం పట్టారు.
ధన్యవాదములు.

శ్రీపతిశాస్త్రి గారూ!
ఒక కళాకారుని మానసిక స్థితిని వివరించినమీకు ధన్యవాదములు.

కంది శంకరయ్య గారూ! నిజంగా అద్భుతమైన భావ సమన్విత పూరణమండిమీది. ధన్యవాదములు.

సంపత్ కుమార్ శాస్త్రిగారూ! మీసంభాషణాత్మక పూరణము చాలా బాగుందండి. ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణలో ‘హిరకారగుణమ్ముల’ను ‘హితకారగుణమ్ములు’ గా చదువుకొనవలసిందిగా మనవి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సంపత్ కుమార్ శాస్త్రి గారు,
ధన్యవాదములండి.
నిజంగా ఈ నాటి పరిస్థితిలో అలాంటి భోజనం పెట్టాల్సినమాటే వస్తే మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళూ నిజం. ఎంతో అందంగా చెప్పారు. అందరి పూరణలూ బహు కమ్మగా ఉన్నాయ.
అందరికీ అభినందనలు.
గురువుగారు, ధన్యవాదములు. సొమ్ములు వద్దన్నప్పుడు మహానుభావులు, మన ఆంధ్రచరిత్రకే గర్వకారణమయిన ఆంధ్ర భాగవతాన్ని రచించిన వారు గుర్తుకు రాని వాళ్ళు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి ఏముందండి అందులో??
ధన్యవాదములు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఒక గృహిణి తన భర్తతో....

రమ్మని పిల్చినారు గద రాత్రికి పెండ్లికి వారి స్నేహితుల్
ఇమ్ముగ నొక్క హారమును ఇచ్చుట కేదియు లేదె, అచ్చ టన్
సొమ్ములు లేనిచో 'సుగుణ' ' శోభలు' చుల్కన; కావె యేరికిన్
సొమ్ముల పైన మోజు లవి చూపగ నల్గురి ముందు గొప్పగా !

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

గురువుగారూ మీ అనుమతితో నా పద్యం 2 వ పాదంలో యతి సవరించి
*ఢమ్మని మ్రోగుచున్ మిగుల డంబము బెంచు మృదంగనాదముల్*(డంబము=ప్రతిష్ట)
గా సవరిస్తున్నాను. (లేక ఢమ్మని బదులు *ఢుమ్మని* గా చెప్పవచ్చు.కాని అంత రమ్యముగా ఉండదు}. ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.