గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, సెప్టెంబర్ 2011, గురువారం

పండిత నేమానివారిచ్చిన సమస్యాపూరణం చేద్దామా?

మొదటి వ్యక్తే పండిత నేమాని 
ఆర్యులారా!
ఉద్దండ పండిత నేమాని రామ జీగి సన్యాసిరావు గారు మనలో కవితా పాటవం పెంచడానికి ఎంతో కృషి చేయదలిచారు.వారి అవ్యాజానురాగం మనకు ద్విగుణీకృతోత్సాహం కలిగిస్తోంది.  
వారికి నా ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. 
పూరణార్థం వారు మనకు సూచించిన సమస్యను తిలకించండి. 
"భక్తి రసామృతమ్ము మన బ్లాగున పొంగు నిరంతరంబుగా"  
వారు ఈ సమస్యకు చేసిన పూరణమును వ్యాఖ్యలో చూడ వచ్చును
నాయొక్క పూరణమును కూడా వ్యాఖ్యలో ఉంచ గలను.
మీరు  మీ పూరణల ద్వారా పాఠకులకు ఆనందం కలిగించండి.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

15 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

శక్తినొసంగు దైవమని,శక్తియె దైవమటంచు భక్తితో
ముక్తిని కోరు సత్ కవులు ముచ్చటగా రసపుష్టిగల్గ సద్
భక్తిని రంగరించి మన బ్లాగుననుంచుచు నుంచుచు నుండిరెమ్మెతో.
"భక్తి రసామృతమ్ము మన బ్లాగున పొంగు నిరంతరంబుగా"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు కవిగారి పూరణము.

ముక్తియె ముఖ్య లక్ష్యమని బుద్ధి ప్రబోధమొనర్చు చుండ నా
సక్తి యెలర్ప సాధనలు సల్పుచు జ్ఞాన వికాస మానసుల్
రక్తిని గూర్చు నవ్య కృతులన్ విరచించుచు ప్రోత్సహింపగా
భక్తి రసామృతంబు మన బ్లాగున పొంగు నిరంతరంబుగా.

అద్భుతంగా పూరించారు కదండీ? వారికి నా ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

రక్తిగ వేణుగోపకుఁడు రంజిలఁ జిత్రకవిత్వవిస్ఫుర
చ్ఛక్తినిఁ జాట వ్రాసితివి సాయికినిన్ శతకంబు వ్రాసి యా
సక్తి చెలంగఁ బెట్టితివి చక్కని బ్లాగున రామకృష్ణ! స
ద్భక్తిరసామృతమ్ము మన బ్లాగున పొంగు నిరంతరంబుగా.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

రక్తిని రంగడించి రసరమ్యకవిత్వ పదార్చనాదినా
సక్తిని పెంచి, పండిత రసజ్ఞుల భావనకాలవాలమై,
ముక్తి పథంబు జూపి యశమున్ కలిగించెడు తల్లి శారదా
భక్తి రసామృతంబు మన బ్లాగున పొంగు నిరంతరమ్ముగాన్.

మిస్సన్న చెప్పారు...

శక్తి కొలంది సత్కవుల, సన్నుతకీర్తుల మంచి కైత,లా-
సక్తి రగుల్చు పోకడలు, చక్కని చిత్ర విచిత్ర ఛందముల్
రక్తిని జేయ నార్యులను రక్తిగ నుంచగ తెల్గు సాహితీ
భక్తి రసామృతమ్ము మన బ్లాగున పొంగు నిరంతరంబుగా!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

ఆస్తిలులైనవారు జగదంబను గొల్వగ వేదమంత్రమౌ
సూక్తములట్లు పద్యములు శోభలు గూర్చెను జాలమందు (inter net)
భక్తి రసామృతంబు మన బ్లాగున పొంగు నిరంతరమ్ముగాన్
నాస్తికులైనవారికిని నవ్యపథమ్మిది ముక్తిబొందగన్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
సవరణ : మొదటిపాదంలో "ఆస్తికులైనవారలకు" టైపాటుగా ఆస్తిలులు అయినది. ఆస్తికులు గా గ్రహింపప్రార్థన.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శక్తిని గల్గి యుండి, కడు శ్రద్ధగ నిచ్చుచు పద్యపాద మా
సక్తులు రేపి పూరణల చక్కగ జేయగ, తీర్చి దిద్దుగా
ముక్తము వోలె సత్కవులముచ్చట దీర్చగ, తెన్గు భాషపై
భక్తి రసామృతమ్ము మన బ్లాగున పొంగు నిరంతరంబుగా

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శంకరయ్య గారూ!

శంతస మాయెను! మీదు హృ
దంతరమున వెలుగు భక్తి తత్వము నాపై
నంతగ భావన చేసెను
చింతల్ విడిపోవు సుఖము చేకొందురికన్.

ధన్యవాదములండి!

సంపత్ కుమార్ గారూ!

ఎంతటి భావనా రమ్యత మీ పద్యంలో!మీ హృదయంలో ఉన్న సుస్థిరమైన భక్తి ఎంత మనోజ్ఞంగా ఉంటుందో మీ పద్యమే చూపిస్తోంది.
మీకు నా ధన్యవాదములండి !

మిస్సన్న గారూ!

యదార్థం ఎంత అద్భుతంగా చెప్ప వచ్చో మీ పద్యం చూస్తే తెలుస్తుంది. అద్భుతంగా ఉందండి పద్యం.
మీకు నా ధన్యవాదములండి !

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ!

భావనా రమ్యమైన మీపద్యం తప్పిన ప్రాసని కూడా గుర్తిచనంతగా అలరిస్తోందండి. ఐతే పద్యానికి ప్రాస కవనానికి భాష ముఖ్యం కదండీ!
ఇచ్చిన సమస్యలో ప్రాసాక్షరం ఏ అక్షరం ఉంటుందో అదే ఆక్షరం లేదా సంయుక్తాక్షరంనాలుగు పాదాలలోనూ రావాలి.గమనించే ఉంటారు. మీకు నేరుగా పంపిద్దామంటే నోరిప్లైలో పంపిరి మీరి.
ఈ రోజు మీరు తెలుసుకొనే ఈ క్రొత్త విషయం మీ పద్య రచనకు వన్నె తెసుంది.
శుభమస్తు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

హనుమచ్ఛాస్త్రి గారూ!

చాలా మనోజ్ఞంగా వ్రాసి నా హృదయానికి ఆనందం కలిగించిన మీకు నా ధన్యవాదములండి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా! ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

చింతా వారూ,
ఒక సందేహం ... మీకు అఖండయతి సమ్మతమేనా?

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

గురువుగారూ క్షమించ ప్రార్థన. ఆలస్యముగా బ్లాగులు చూచుట వలన
రెండు బ్లాగులలోనూ సమస్యా పూరణ చేయాలనే ఆతురతతో ప్రాస గమనింపక వ్రాసి పోస్టు చేసి, శకరాభరణంలొ 3 పాదాలు వ్రాయగా , నిద్ర ఆవహించినది. మార్గదర్శకులు, మహమహులైన మీరు, శ్రీ కంది శంకరయ్యగారు, శ్రీ పండిత నేమానిగారు యితర కవి మిత్రులు నన్ను మన్నింప ప్రార్థన.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

శక్తిని కూడగట్టుకొని శాస్త్రము తప్పక పద్యవృత్తమున్
యుక్తిగ వ్రాయ బూనితిని యోగ్యత చాలక తప్పితిన్ గతిన్
మౌక్తికపండితావళులు మార్గము జూపుచు ప్రోత్సహించగా
భక్తి రసామృతమ్ము మనబ్లాగున పొంగు నిరంతరంబుగాన్

మౌక్తికపండితావళులు = ముత్యములనెడి పండితుల హారము)

వాస్తవమైన వాక్కులివి ప్రాజ్ఞుల వ్యాఖ్యలు, మేటిపద్యముల్
ఆస్తులుకాగ బ్లాగునకు, హ్లాదము గూర్చెడు భక్తిభావముల్
ఆస్తికులైన వారలకు అంబను గొల్చెడు వేదమంత్రమౌ
నాస్యికులైన వారికిని నవ్యపథమ్మిది ముక్తి నొందగాన్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.