వినాయక చతుర్ధి సందర్భంగా మీ అందరికీ నా శుభా కాంక్షలు.
సహృదయ సాహితీ మిత్రులారా!
నిరతము సుఖ సంతోషము
కరుణించి యొసంగు గాత గణనాధుఁడు మీ
సురుచిర దరహాసములను
స్థిర పరచుత.మీకు శుభము సేయుత కృపతో.
ఈ శుభ సందర్భంలో మీ అందరికీ ఒక అపురూప వ్యక్తి శ్రీ పండిత నేమాని రామ జీగి సన్యాసిరావు గారు ఇచ్చిన ఒక సమస్యను మీ ముందుంచుతున్నాను.
"గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్"
ఈ సమస్యను మీరు పూరించి అవధానిగారి ప్రశంసలనందడంతో పాటు పాఠకాళికి ఆనందం కలిగించ గలరని ఆశిస్తున్నాను.
శుభమస్తు.
జైశ్రీరాం.
జైహింద్.
17 comments:
శ్రీ మహా గణాధిపతయే నమః
అందరకు వినాయక చవితి శుభాకాంక్షలు.
గుణ రహితము, రంగుల ప్రాం
గణముల విషపూ రితమ్ము ఘనముగ నుండే
గణపతి ప్రతిమల పూజకు
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్!
బ్లాగ్-మిత్రులకు, వినాయక చవితి శుభాకాంక్షలు
ఈ సమస్యకు నా పూరణము.
అణిమాది సిద్ధులైనను
గణుతింతురు చవితినాడు గణనాధునిలన్.
గణుతింపక, పూజింపక
"గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్.
పండిత నేమాని
ఈ సమస్యను పూరించిన విధము తిలకించండి.
గణపతి దుస్థితి గని హిమ
ఘృణిమంతు శపించె శీతగిరిసుత యక్కా
రణమున శీతాంశుండుడు
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్
వారికి అభినందనలు.
పెద్దలకు, మిత్రులకు వినాయక చతుర్థి శుభ కామనలు
గణపతి విఘ్నంబులకౌ
గణుతింపగ వేలుపనుచు కానిపనులకై
ప్రణతులు, ప్రణుతులు చేసిన
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్!
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు.
క్షణకాల మ్మైనను నుడు
గణపతి నెవరైనఁ గనినఁ గలుఁగు నపక్షే
పణము నపనింద వచ్చును
గణపతి సుముఖుండు కాఁడు కాఁడు చతుర్థిన్.
(ఉడుగణపతి - నక్షత్రసమూహానికి నాయకుడు - చంద్రుడు)
అద్భుతమైన మీ ఆలోచనకు, పూరణకు నా అభినందనలండీ హనుమచ్ఛ్స్స్స్త్రి గారూ!
ఉలిమిరి సూర్య నారాయణ గారూ! మీకూ వినాయక చతుర్థి సందర్భంగా శుభా కాంక్షలండి.
మిస్సన్న గారూ! గణపతి హృదయాన్ని ఆవిష్కరించారండి. మీకు నా అభినందనలు.
యస్సార్ రావు గారూ! మీకూ వినాయక చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలండీ.
చిలమకూరి విజయ మోహన్ గారూ! మీకూ వినాయక చతుర్థి సందర్భంగా శుభాకాంక్షలండీ.
శంకరయ్య గారూ! ఉడు గణపతి దర్శన ఫలాన్ని చక్కగా వివరిస్తూ చక్కగా పూరించారండీ! అభినందనలు.
పండితులు ,గురువులు , పూజ్యులు , పెద్దలు , పిన్నలు .అందరికీ వినాయక చవితి శుభా కాంక్షలు
గణు తింపగ దివిజులలో
పణతిగ నగ్రజుని గెలిచి భగవంతుం డౌ !
గణుతింఛి కుడుము లిడినచొ
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్దిన్ !
రాజేశ్వరక్కా! మీ పద్య రచనాభిలాష నాకెంతో ఆనందం కలిగిస్తోందమ్మా.అభినందనలు.
శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి శ్రీ పండిత నేమాని వారికి శ్రీ కంది శంకరయ్య గారికి నమస్కారములు. మిత్రులకు శుభాకాంక్షలు.
తృణమని పణమని నెంచక
కణసాంతము మ్రింగు నట్టి ఘన నాయకులన్
గణుతించ వినాయకులని
గణపతి సుముఖుండు కాడు కాడు చతుర్థిన్ !
ఆర్యా!నరసింహ మూర్తిగారూ! మీ అభిమానానికి ధన్యవాదాలు.
మీరు ఉప యోగించిన న - ణ ల యతిని సరస వళి అంటారు.
అ-య-హ. లు, చ-ఛ-జ-ఝ-శ-ష-స లు, న-ణ లు పరస్పరం యతి చెల్లుతాయి.
కావన మీరుపయోగించిన యతి సాధువే.
అభినందనలు.
మీ పూరణం బాగుందండి. సంతోషం.
తొణకడు దురమునఁ సమరాం
గణపతి; సుముఖుండు కాడు కాడు - చతుర్థిన్
మణిమయవిరచితవసుభూ
షణాదికముల నధికముల సత్తువ గొనినన్.
(చతుర్థిన్ = కొఱకు, కై)
(సమరాంగణపతి తనకొఱకు శత్రువులు మణిమయ రత్న హారాదులను పంపినా వాటికి లొంగి సమరాన్ని చాలించడు.)
అజ్ఞాత గారూ! ఎంతో అద్భుతంగా సమరాంగణపతికి అన్వయిస్తూ చేసిన మీ పూరణ ప్రశంసనీయముగానున్నది.
మీకు నా అభినందనలు. మీ నామధేయాన్ని మేము తెలుసుకోవచ్చుననుకుంటే తెలియజేయ గలరని ఆశిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.