గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(దత్త పది3)

అంతర్జాల కవి పండితులారా!
నేడు కట్టమూరివారి కిచ్చిన దత్తపదినొక దానిని చూద్దాము.
"కట్ట - మూరి - చంద్ర - శేఖరా!"
రామాయణం ఇతి వృత్తంలో ఐచ్ఛిక వృత్తంలో పూరించవచ్చును.
కట్ట మూరి చంద్రశేఖర కవి యొక్క, నాయొక్క పూరణలను వ్యాఖ్యలో చూడ నగును.
మీరు మీ పూరణలతో పాఠకుల మనస్సులు ఆకట్టుకోండి.
జై శ్రీరాం.
జైహింద్.
Print this post

12 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాముడు జానకిన్ వలచి,రంజిల నామెకు తాళి కట్టగా.
శ్రీమతియై రహించినది సీత! మహాజనమూరిలోన శ్రీ
రాముని జూచి సంతసిలి రాజ్య సుపాలన్ రామచంద్ర మే
క్షేమము గూర్ప చేయ గన, చేయగలేదుగ? చంద్రశేఖరా !

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చంద్రవదన జనని జానకి కొరకును
ధర్మమూరితి కయి దాసుడేగె
ఇందు శేఖరాంశ , యెల్ల కార్యము దీర్ప
కడలి పైన యానకట్ట వెలిసె.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మందాకిని గారూ! మీ పూరణ బాగుంది. ఐతే దత్త పదులు ఇచ్చినవి క్రమంలోనే నాలుగింటినీ నాలుగు పాదాలలో వాడితే ఇంకా రంజుగా ఉంటుందండి.
ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శుభశీస్సులు. ఈ సమస్యను చూడండి.

బృందావన తత్పరున్ మహేశున్ గొలుతున్

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

సుందర కార్తీకంబున
మందిరమున నిల్పి నాను మాధవ శివులన్
అందరి శుభములు గోరుచు
బృందావన తత్పరున్, మహేశున్ గొలుతున్

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ దత్త పదికి శ్రీ కట్టమూరి వారి పూరణము.

వావిరి రామ చంద్రుడటు వారిధి కటగ వానరాళి శో
భావహమైన పద్ధతిన భంగ మృదంగపు నాదమూరి, లో
నావహిలంగ ధైర్యుఅ మ్భయమ్మున,వేరఘు రామచంద్ర సౌ
ఖ్యావహ నీవు మాకు శరణంచు సుధీగుణశేఖరా యనెన్.

కంది శంకరయ్య చెప్పారు...

కట్టలుక రావణాసురు మట్టుబెట్టఁ
దలఁచి శూరతన్ మూరిన దాశరథికి,
రామచంద్రమూర్తికి, మునిరక్షకునకు,
రాజశేఖరాశ్రితపాదుకే జయమగు.
(మూరిన = అతిశయించిన)

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కట్ట సేతువు కోతులు కలసి, రామ
మూరితి, హనుమ, సౌమిత్రి మొత్తమంత
చంద్ర వదనకై కదలిరి జయ ఇన కుల
శేఖరా! యని యసురుల చేటు కొరకు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ! నేమానివారు సూచించిన సమస్యను ఎంత వేగంగా పూరించి పంపించారండి! సంతోషం. అభినందనలు.

కంది శంకరయ్యగారూ! ఆ శ్రీరామ చంద్రమూర్తికే జయము పలికిన మీ పూరణము అద్భుతము. ధన్యవాదములండి.

హనుమచ్ఛాస్త్రి గారూ! మీరు పద్య రచనకు చేస్తున్న సాధన అభినందనీయము. చక్కగా వ్రాస్తున్నారు.అభినందనలు.
కొరకు అనే దానిలో ర కి బదులు ఱ వ్రాయడం సరైనదండి.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

కట్టకడకును గాంచితి కనుల మిమ్ము
మూరిబోవును మీకీర్తి ముగ్ధరూప
రామచంద్రా శబరి నేను, రసభరితము
శేఖరంబైన ఫలమిది సీతనాథ

మూరిబోవును = వర్ధిల్లును
శేఖరము = శ్రేష్ఠము

గురువుగారూ మిడి మిడి జ్ఞానంతో వ్రాసున్న వాడను.
నా తప్పిదాలను మన్నించి సరిచేయ ఫ్రార్థన.

ఊకదంపుడు చెప్పారు...

"కట్టలేముస్వామి కడలికి వంతెన
న్నురికి రావ సంద్రమూరిలోకి
రామచంద్ర!"యనశరముగొనెచ్చరములు ( శరముగొని + ఎచ్చరములు )
చేసె శ్వేతఫేనశేఖరునకు?!

Pandita Nemani చెప్పారు...

మా పూరణ:
బృందారక వందితుని స
దానంద మహానిధాన మార్యాపతి య
ర్ధేందుధరుని శివుని సుజన
బృందావన తత్పరున్ మహేశున్ గొలుతున్
(సుజన బృంద అవన తత్పరుడు)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.