గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ19)

ఆర్యులారా! ఈ నాడు అవధానిగారు పూరించిన మరొక సమస్యను చూద్దాము.
"కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబునన్"
ఈ సమస్యకు అవధాని గారి యొక్క, నాయొక్క పూరణములను వ్యాఖ్యలలో చూడ నగును.
మీరు మీ భావనా పటిమతో ఈ సమస్యను పూరించి వ్యాఖ్యలద్వారా ప్రకటించి, తద్వారా పాఠకాళికి ఆనంద కారకులు అగుదురని ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్. 
Print this post

9 comments:

Pandita Nemani చెప్పారు...

కుక్షిప్రోద్భవ నిష్ఠుర క్షుదిత దుష్క్రోధాంధకారంబునన్
సాక్షాఛ్ఛైల సుతా మహేశ్వర నివాస స్థానమౌ కాశిపై
ప్రక్షీణాత్మ వివేకశాలియగు నా వ్యాసుండు ఘోరంబుగా
నాక్షేపించుచు శాపమీయ దొడగెన్ హా! ఎట్టి దౌర్భాగ్యమో ?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబునన్
చక్షుష్యమ్మగు పాదచక్షువునిడెన్ సామాన్యభక్తుండటన్.
వక్షస్థానమునందు కోరికొలువై వాసమ్మునున్నమ్మ,దాఁ
పక్షీంద్రేంద్రుని లక్ష్మి వీడెనట,సౌభాగ్యమ్ము నవ్వేళనున్.

కంది శంకరయ్య చెప్పారు...

అంబరీశుని వృత్తాంతం ...

సాక్షాద్విష్ణువరప్రసాది యగు రాజశ్రేష్ఠుఁ డాసక్తుఁడై
యక్షయ్యవ్రత మాచరించి కొనె నత్యంబందు తీర్థంబునే
వీక్షించెన్ మునిసత్తముం డలిగి రప్పించెన్ మహాకృత్యనే
కుక్షిప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారమ్మునన్.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు నా పూరణము.

"కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబున
న్నక్షయ్యంబగు జ్ఞాన దీప్తి తొలగున్నత్యంత పుణ్యాత్మకుల్
సాక్షీభూతముగా వసించెదరు సంసారంబునన్ శాంతితో!
కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధతన్ వీడుడీ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యకు అవధాని గారి పూరణము.

అక్షయ్యంబగునాంధ్ర దేశమున అయ్యా రామ యంచున్ జనుల్
కుక్షుల్ చేతను బట్టి కూటి కొఱకై కొండంత దూరంబులున్
చక్షుల్ చమ్మగిలన్ ధనంబు లట కాస్తంతైన లేకుంటచే
"కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబున"

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

ప్రకృతి వైపరీత్యమువలన జరిగిన సునామీ ప్రభంజనములో చిక్కి అన్నముకొఱకు వేచియున్నటువంటి ఒక బాధితుని స్థితి.

భక్షింపన్ కడకేమికల్గిన మహాభాగ్యంబదేయంచు తా
వీక్షించెన్, మది రోసె, శక్తి సడలెన్, భీతావహుండయ్యె, నీ
శిక్షల్ తానిక ఓర్వనంచు చెలగెన్, ఛీత్కారముల్ బల్కుచూ,
కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారమ్మునన్.

Pandita Nemani చెప్పారు...

అయ్యా! ఈ సమస్యలో ఆకలితో కడుపు మండిపొతున్న వాని కోపము వలన కలిగిన హాని మాత్రమే వర్ణింపబడాలి. డుర్వాసుడు పట్టుదలతో చేసేడు కాని ఆకలితో కాదు. అలాగే భృగు మహర్షి దురహంకారంతో చేసేడు. అందుచేత కొందరు పూరణలను సరిచేసుకోవాలి అనుకుంటాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు గారు వ్యాసుఁడు కాశీని శపింప బూనిన వృత్తాంతాన్ని తీసుకొని సమస్యను అద్భుతంగా పూరించారు. వారికి ధన్యవాదాలు.

మందాకిని గారు వృత్త రచనలో అందెవేసిన చేయి అని వారి పూరణ ద్వారా తెలుస్తోంది. వారికి నా అభీందనలు.

కంది శంకరయ్య గారు అంబరీషుని వృత్తాంతాన్ని తీసుకొని సమస్యను అద్భుతంగా పూరించారి. అభినందనలు.

శ్రీమాన్ నేమాని సన్యాసిరావుగారు చక్కని సూచన చేసారు. వారు చెప్పిన అంశాన్ని గుర్తించ వలసి ఉంది. వారికి ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

కుక్షి ప్రోద్భవ నిష్ఠుర క్షుధిత దుష్క్రోధాంధకారంబునన్
ఆక్షేపించుదు రెల్ల లోకముల నాహారమ్ముకై , వారలన్
రక్షించున్ శివుడన్నపూర్ణమను సంరంభమ్ముతోవేడి,దాఁ
భిక్షాపాత్రనుఁ జేతఁబట్టి, దయతోపిల్లాండ్రపై ప్రేమతోన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.