గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, సెప్టెంబర్ 2011, గురువారం

కట్టమూరి జీవన భారతంలో అవధాన పర్వం.(సమస్యాపూరణ16)


సలలిత సత్కవిత్వ విలసన్నిత పూజ్య కవీశ్వీంద్రులార! ధీ
కలితుఁడు కట్టమూరి గుణ గణ్యుడెదుర్కొని పూరణంబునుం
పలువురు మెచ్చ జేసిన సమస్యను మీకెఱిగింతు నిచ్చటన్. 
తెలివి ప్రకాశమౌనటుల దివ్య ప్రపూరణఁ జేసి పంపుడీ!
"రతి పతి సోదరుండు రతి రాజుగ వెల్గెను. చిత్రమున్నదే?"
దీనికి నా పూరణమును,
జ్ఞానాంభోనిధి యగు మన కవి పూరణమున్,
మానితముగ నుంచెద, వ్యా
ఖ్యానంబున. ప్రీతి తోడ కనుఁడది మీరల్. 
ధన్యవాదములు.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

18 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యలు నా పూరణము.

రతి పతి మన్మధుండట పరాత్పరు పుత్రకుఁడట్టులేను భా
రతిపతి బ్రహ్మ దేవుఁడు పరాత్పరు పుత్రుడె.అన్న దమ్ములే!
అతులితమైన సృష్టి సుమహాద్భుత కార్య ధురీణులైరి. భా
"రతి పతి సోదరుండు రతి రాజుగ వెల్గెను. చిత్రమున్నదే?"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఈ సమస్యలు అవధాని గారి పూరణము.

అతులిత భావనా గరిమకాస్పదమై తగ పండితోత్తముల్
చతురత మీర నే సభల చాతురి జూపుద మన్న మున్నుగా
సుతులను జెసి కీర్తనల నూతన రీతి భజించునట్టి భా
"రతి పతి సోదరుండు రతి రాజుగ వెల్గెను. చిత్రమున్నదే?"

Pandita Nemani చెప్పారు...

అతనుడు. పంచబాణుడు, మహర్షివరేణ్యులనైన కామపీ
డితులను జేయు దిట్టగ గడించె యశమ్ము వసంతుతోడ సం
తతము రసాబ్ధి దేల్చును ముదమ్మున ప్రేమికులన్ బళారె! భా
రతిపతి సోదరుండు రతిరాజుగ వెల్గెను చిత్రమున్నదే?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సితకరవర్ణశోభితవు శింజిత నూపుర పల్లవాంఘ్రి! యా
రతి యవలీల రీతులఁ బరాజితురాలయె. నీదు భర్తయా
రతిపతిసోదరుండు;
రతి రాజుగ వెల్గెను చిత్రమున్నదే
గతి నటు వెల్గె నాతడిక కాయము లేక విచిత్రమాయెనే?

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సతతముసృష్టిఁ జేయునతి సంవిదుడా, విదుషీలలామ భా
రతి పతి సోదరుండు, రతి రాజుగ వెల్గెను. చిత్రమున్నదే-
చతురతబాణ విద్యను గజాననుతండ్రివిరోధియయ్యెనే,
రతి పతిహీన యౌగతి యరాతిగ నయ్యెనె లోకనాథుకున్.

అజ్ఞాత చెప్పారు...

అతి సుకు మారుడేను; మకరాంకశశాంకమనోజ్ఞమూర్తి వా
గతిశయ భూషణుండు నొక కన్యఁ కరంబును పట్టి హ్లాదమం
దు తడవ కూర్మితోఁ వదినె ధూపము వ్రేల్చి ముదంబుఁ బట్టె హా
రతి; పతి సోదరుండు రతిరాజుగ వెల్గెను. చిత్రమున్నదే?

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఒక పడతి తన చెల్లి 'రతిని' తన మరదికి జోడు కూర్చి మురియు సందర్భం ...

అతి సుకుమారి యీలలన యల్లన సాగిన హంసలేడ్చుగా !
అతనిని జూడ చుక్కలవి యాకస మందున నుండ నేర్చునా !
హితముగ జోడు గూర్ప మరి హెచ్చెను శోభలు; వీరు చెల్లెలౌ
రతి - పతి సోదరుండు; ' రతి - రాజుగ' వెల్గెను. చిత్రమున్నదే?

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:
పూర్వ కవులకు వందనములర్పిస్తూ

స్తుతమతులైన పండితులు స్తోత్రము జేయగ నాలకించె భా
రతిపతి సోదరుండు, రతిరాజుగ వెల్గెను చిత్రమున్నదే
అతులిత మాధురీమహిమ,హాయినిగొల్పెడు దివ్యగంధముల్
సతతము సంతసంబులను జాతికి బంచెడు జాణ యాతడే

గురువుగారు నా పూరణలో ఏ విధమైన దోషములున్ననూ మన్నింప ప్రార్థన.

మిస్సన్న చెప్పారు...

"ఇతడు మనోహరాఖ్యుడగు నీడగు పెండ్లి కుమారు డెన్న గ-
న్నతివల డెందమున్ గెలుచు నందము వీనిది, చెల్లి కౌను లే
జత" యనె నక్క నీరజ, సుజాత వచించెను "వీడు పిన్ని భా -
రతి పతి సోదరుండు, రతి రాజుగ వెల్గెను. చిత్రమున్నదే!"

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీ పండిత నేమాని వారు చేసినది పూరణ అనడం కంటే వర్ణన అనడం సముచితం. అంత బాగుంది పద్యం. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

మందాకిని గారి రెండు పూరణలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ బాగున్నాయి. రచనలో సౌకుమార్యం ఆకళింపు చేసుకుంటే ఇట్టి పద్యాలు వ్రాయడంలో వింతేముంది? వారికి నా అభినందనలు.

రతిని హారతిగా స్వీకరించి చేసిన అజ్ఞాత గారి పూరణ కూడా సముచితంగా ఉంది. వారికి నా అభినందనలు.


ఓహో! హనుమచ్ఛాస్త్రి గారి పూరణము అతిశయోక్తులతో చాలా చక్కగా ఒప్పిదమై ఉంది. వారికి నా అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారి రచన బాగుంది.మన్మధుని ఆవిష్కరించారు పద్యంలో. బాగుంది. వారికి నా అభినందనలు.

రచనలో సంభాషణా పటిమ చూపించిన చతురులు మిస్సన్నగారు. వారికి నా అభినందనలు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారూ,ధన్యవాదములు. మిత్రులందరి పూరణలూ చమత్కారభరితమై శోభిస్తున్నాయి. పండితుల వారి వర్ణన చక్కటిధారతో సాగింది. అందరికీఅభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

స్థితమతి గాఁడు పుష్పములు చివ్వున రువ్వుచు లోకమందుటన్
మతులను మభ్యపెట్టు సుకుమారపు చింతల, నాత్మవృత్తిలో
జితిఁబడె నీశ్వరుండు పరచిత్తుడునై యతిక్రోధమూన భా
రతి పతి సోదరుండు రతిరాజుగ వెల్గెను, చిత్రమున్నదే ?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

నరసింహ మూర్తిగారూ! మన్మధుని జీవితాన్నే అవిష్కరించారండి ఒక్క పద్యంలో. అద్భుతం.
మొదటి పాదం చివర లోకమందుటన్ అనా? లేక లోకమందు తన్ అనా?
ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సోదరు లందరి పూరణలు మనసుని అలరింప జేస్తున్నాయి. సోదరి " మందాకిని " మీ పేరులానే మీ రచనా స్రవంతి , ప్రసంసనీయం. అందరికీ అభినందనలు + ధన్య వాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కా! చాలా సంతోషం. మీ ప్రోత్సాహం రచయితలకు ద్విగుణీకృత ఉత్సాహాన్ని ఇస్తుందమ్మా. ధన్యవాదాలు.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! ధన్యవాదములు.
కవిమిత్రులందరూ అద్భుతముగా పూరించారు. అందరికీ అభినందనలు.

గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

స్థితమతి గాఁడు పుష్పములు చివ్వున రువ్వుచు లోకమందు తా
మతులను మభ్యపెట్టు సుకుమారపు చింతల, నాత్మవృత్తిలో
జితిఁ బడె నీశ్వరుండు పరచిత్తుడునై యతిక్రోధమూన భా
రతి పతి సోదరుండు రతిరాజుగ వెల్గెను, చిత్రమున్నదే ?

శ్రీ రామకృష్ణా రావు గారూ మీ సున్నితమైన సూచనకు ధన్యవాదములు.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

అక్కయ్యగారూ, అంతా పరమేశ్వరానుగ్రహం. మీ అభిమానం, ఆశీస్సులు. అంతే గదండీ!

పూరణలన్నీ గొప్పగా ఉన్నాయి. మిత్రులందరికీ అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.