గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, మార్చి 2026, శుక్రవారం

పంచపాషాణాలు. టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట పద్య ప్రతిపదార్థ తాత్పర్యాదులు.

జైశ్రీరామ్. 

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు

1వ పాషాణం.
షడ్జామడ్జ కరాడ్జ వీడ్జన సుధా డ్జాలంబు ధడ్జాఖరే
యధ్యః ఖడ్గ ధరే ధరే ఖణఖణే ఖర్జూర లుడ్భ్రాడ్భ్రమః
లుడ్భ్రాయాస్పద యడ్గ్ర డడ్గ్ర డడడా షడ్గ్రడ్గ్ర డడ్గ్రడ్గ్రహా
షడ్జానః పురచాతురస్సుర గణేశద్యోతి విద్యోదయః

మరొకవిధంగా కూడాఉందిచూడండి.
షడ్జామడ్జకరాడ్జవిడ్జ వసుధజ్జాలాంఛిదజ్జాఖరే
జడ్జటకిట్కిధరఢ్గరేడ్ఘన ఘనఖడ్జోతవీడ్జట్భృమ విఢ్యా
లుఢ్భ్రమలుట్ప్రయట్రయపదా డడ్గ్రరడడ్గ్రరహ
పాదౌటేట్ప్రట టట్రయట్పుట రసప్రఖ్యాత సఖ్యోదయా

పాల్కురికి సోమనాధుడు వ్రాసిన అక్షరాంక పద్యాలు-  
02 వ పద్య  ప్రతిపదార్థ తాత్పర్య విశేషాలు

డమరుగజాత డండడమృడండమృడండ మృడండ మృండమృం
డమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడంకృతివిడంబిత ఘూర్ణిత విస్ఫురజ్జగ
త్ర్పమథన తాండవాటన "డ"కారనుతా బసవేశ పాహిమాం!

ప్రతిపదార్థం
బసవేశ = ఓ బసవేశ్వరుడా !
డమరుగ= నీ చర్మవాద్య విశేషమునుండి
జాత =పుట్టిన
డండడ= డండడ అను చప్పుళ్ళతో
మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడం డమృం డమృం
డమృణ మృడండడం =మృడ (శివ)ధ్వనిని వెలార్చెడి మృడండ ....మృండమృణ మొదలయిన శబ్దములు
(అన్ని డ కార ధ్వనులు కావటం విశేషం)
కృతి=చేయుటను
విడంబిత=అనుకరించు
ఘూర్ణిత =తిరుగుడుపడినది
విస్ఫురత్=ప్రకాశించే, తళతళమని మెరిసే
జగత్= లోకమును
ప్రమథన =చిలుకు
తాండవ= నాట్యమునందు
అటన=సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !
డ"కారనుతా= డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !
మాం = నన్ను
పాహి= రక్షించు
తాత్పర్యము
ఓ బసవేశ్వరుడా ! నువ్వు తాండవ నృత్యము చేసే సమయంలో   నీ  డమరుకము నుండి డండడ,మృడండమృడండ మృడండమృండమృండమృణ మృడండడండ మృణడండడడండ మృడండమృం డమృం మొదలగు ధ్వనులు పుడుతున్నాయి.ఆ ధ్వనులతో పుట్టిన డమరుక కాంతులలో  లోకాలు  తిరుగపడుతున్నాయి.. అటువంటి అద్భుతమైన  డమరుక ధ్వనులు కలిగిన  లోకాలను చిలుకు  తాండవ నాట్యమునందు సంచరించువాడా ! (తిరుగువాడా!)ఓ పరమశివా !డ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !నన్నురక్షించు
విశేషాలు
శివుని చేతిలో నుండునది డమరుకము.
 ఆడమరుకమును వాయించుటకు మధ్యలో ఒక కొయ్యముక్క కడతారు.
 దానిని మణి అంటారు.
 డమరుకమును కదలించినపుడు మణి డమరుకమునకు అటు ఇటు  తగిలి డమరుకమును మ్రోగిస్తుంది.
ఆ డమరుక మణుల కాంతులను పాల్కురికి ఈ పద్యంలో  వర్ణించాడు.
డమరుకము :
శబ్ద గుణకము ఆకాశము. ఆకాశమునందు శబ్దము యొక్క ప్రకంపనలు ప్రయాణించును. మనము మంత్ర జపము చేసినపుడు కాని, వినినపుడు కాని స్పందనలు / తరంగాలు ఏర్పడి. అవి శివ ఢమరుక ధ్వని వంటి దానిని మన చెవులలో కలిగించును. మంత్ర పురశ్చరణ చేయుట వలన యోగికి ఆనందము కలిగి తాండవము చేయును. దీనికి గుర్తుగానే శివుడు  డమరుకను ధరించునని పెద్దలు చెబుతారు.

3వ పాషాణం.

టటకిట టట్టకిట్టటట కిట్టటటట్ట పద్య ప్రతిపదార్థ తాత్పర్యాదులు.

చ. టటకిట - టట్ట కిట్ట టట - కిట్టట టట్టట కిట్ట టట్ట కిట్

టటకిట టట్టకిట్ట టకి టట్టట టోన్ముఖ టంకృతి స్ఫుటో

త్కట పటహాది నిస్వన వియత్తల దిక్తట తాటితార్భటో

ద్భట పటుతాండవాటన, "ట"కారనుతా! బసవేశ పాహిమామ్!

పద విభాగము.

టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, 

ఉన్ముఖ టంకృతి, 

స్ఫుట+ఉత్కట

పటహ+ఆది, 

నిస్వన ,

వియత్తల, 

దిక్తట, 

తాటిత+ఆర్భట+ఉద్భట, 

పటుతాండవ+ అటన, 

"ట"కారనుతా! బసవేశ ,పాహిమాం!

అన్వయక్రమము. 

బసవేశ, టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట, ఉన్ముఖ టంకృతి, స్ఫుట+ఉత్కట .. పటహ+ఆది, నిస్వన ,వియత్తల, దిక్తట, తాటిత+ఆర్భట+ఉద్భట, పటుతాండవ+ అటన, "ట"కారనుతా! పాహిమాం

ప్రతి పదార్థము

బసవేశ = ఓ బసవేశ్వరుడా !

టటకి ట టట్టకిట్టటట కిట్టటటట్ట టకిట్టటట్టకిట్టటకిట టట్టకిట్టట కిటట్టట ట,= టకటక అను చప్పుళ్లతో

ఉన్ముఖ = పైకి విస్తరిస్తున్న

టంకృతి= ఆశ్చర్యముగొలుపు వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు కలిగిన

స్ఫుట= స్పష్టమైన.

ఉత్కట= భయంకరమైన

పటహ=తప్పెట

ఆది= మొదలైన

నిస్వన = ధ్వనులతో

వియత్తల=ఆకాశము

దిక్తట=దిక్+తట= దిక్కుల ప్రదేశములను తాకిన

తాటిత= కొట్టబడిన

ఆర్భట=కేకలతో

ఉద్భట=అధికమైన

పటు తాండవ= నేర్పుకలిగిన నాట్యములో

అటన=సంచరించువాఁడవైన ఓ పరమశివా !

ట"కారనుతా= టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా !

మాం = నన్ను

పాహి= రక్షించు

తాత్పర్యము

ఓ బసవేశ్వరుడా ! నీ శివతాండవము టకటక అను చప్పుళ్లతో పై పైకి విస్తరిస్తున్న వింటినారియొక్కధ్వనుల వంటి ధ్వనులు కలిగినది. స్పష్టమైనది. భయంకరమైనది.తప్పెట మొదలైన వాటి ధ్వనులతో ఆకాశము మరియు దిక్కుల అంచులను తాకుచున్నది.అనేక కేకలు కలిగినది.అధికమైనది. నేర్పుకలిగిన నాట్యములోతిరుగువాడా! టకారము అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.

4వ పాషాణం.

"ఢణ ఢణ ఢం మృఢం మృఢణఢం మృణఢంమృణ ఢంఢణోద్ధణం 

ధణనటన త్వదీయడమరూత మదార్చట ఢంకృతి ప్రజృం

భణ తుటితాభతార గణరాజ దినేశముఖిగ్రహప్రఘుర్ 

క్షణ గుణతాండవాటన "ఢ"కారనుత బసవేశ పాహిమాం!".

5వ పాషాణం.

పాల్కురికి సోమనాథుని అక్షరాంక పద్యము.

ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణణ ణ్మృణ ణణ్మృణ ణ్మృణ
ణ్ణ ణ్మృణ నృత్త్వదీయసుఖవిక్రమ జృంభణ సంచలన్నభో
ణ్ణ ణ్మృణ ది క్క్వణ ణ్మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ స్వన
ణ్ణ ణ్మృణ తాండవాటన "ణ"కారనుత బసవేశ పాహిమాం!
తాత్పర్యము
ఓ బసవేశ్వరా ! ఓ శివా ! ణణ్మృణ ణణ్మృణ ణ్మృ ణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ ణ్మృణణ్ణ ణ్మృణణ, ణ్మృణ అను శబ్దములు నువ్వు తాండవ నృత్యము చేయునప్పుడు పుడుతున్నాయి.
నీ పవిత్రమయిన తాండవ పరాక్రమముతో అతిశయిస్తూ ఆకాశము కదులుచున్నది. ఉణ్ణణ, మృణ అను శబ్దాలు దిక్కులందు ప్రతిధ్వనించుచున్నవి. మృణణ ణణ్మృణ ణణ్మృణ ణణ్మృణ మొదలగు అక్షర శబ్దములు దిక్కులందు మారుమ్రోగుతున్నాయి. ణణ్మృణ అను అక్షరముల సాన్నిహిత్యము కలిగిన ఓ బసవేశ్వరుడా ! తాండవనృత్యములో అటునిటు తిరుగువాడా!ఓ పరమశివా !ణ అను అక్షరముతో పలుమార్లు ఈ పద్యంలో పొగడబడినవాడా ! ఓ శివా ! నన్ను రక్షించు.

ద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.