గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఏప్రిల్ 2025, ఆదివారం

రేపు జరగబోయే సీతారామ కల్యాణం సందర్భంగా ఈరోజు నాంపల్లి సమీపంలో జరిగిన ఎదురుకోలు కార్యక్రమం. తే. 05 - 4 - 2025 Yedurukolu 2025 SRBS 1937 is live

జైశ్రీరామ్.
ఎదురుకోళ్ళులో ప్రారంభంలోనే
రామునిపక్షమువారు చదివే మొదటి పద్యం.
👇🏻
జై శ్రీరామ్.🙏🏻
ఆర్యులారా అందరికీ శ్రీరామజయం.
👇🏻
శా.  శ్రీరాముండు వరూత్తముండగుటచే సీతామహాసాధ్వినే
 
మా రాముండు వివాహమాడదలచెన్ మాకన్నిటన్ సమ్మతం

బీ రమ్యాత్మనొసంగి పెండ్లి త్వరితంబే చేయుడీ మీర లో

పేరున్గాంచిన జ్ఞానులార! శుభముల్ విఖ్యాతి మీకందెడున్.🙏🏻
౧. సీత తరపున ప్రశ్న.
౧. ఓం శ్రీసీతాయై నమః | 
శా.  శ్రీమన్మంగళ గణ్య దేవతయె మా సీతా మహాసాధ్వి, మీ
రాముండంతటి వాఁడె కోరుకొనె మా రమ్యాత్మయౌ జానకిన్, 
ధీమంతుల్ జనకాత్మజన్ కొలుతురే దేదీప్యమానంబుగా,
నేమాత్రంబగు నీడు రాముఁడిలపై నీసాధ్వికిన్? జెప్పుడీ!
1. రాముని తరపున సమాధానము.
1. ఓం శ్రీ రామాయ నమః.
శా.  శ్రీరాముండిల వీరుఁడై నిలిచె నీ పృథ్విన్, మహాకార్ముకం
బీ రాముండె దళించి, సీతమదిలో హృద్యంబుగా నిల్చుటన్
మీ రామామణికొప్పు రాఘవుఁడె, స్వామిన్ సద్వరూత్తంసుగా
మీరేలన్ గ్రహియింపకుండిరకటా? మీదేమి పాండిత్యమో?

౨. సీత తరపున ప్రశ్న.
౨. ఓం జానక్యై నమః | 
జ్ఞానికి మాత్రమే తెలియు జానకి జన్మరహస్య మెన్నగా,
మౌనముతోడ నాత్మలను  మా జనకాత్మజ స్తుత్యనామమున్
ధ్యానము చేసి పొంగుచును ధన్యతగాంతురు మౌనులే భువిన్,
ఈ నయవర్తి కీడగునె యింపుగ మీ రఘురాముఁడిద్ధరన్? 
2. రాముని తరపున సమాధానము.
2. ఓం రామభద్రాయ నమః
ఉ. భద్రతఁ గొల్పు నేర్పుననె వర్ధిలె శ్రీరఘురామ భద్రుఁడై,
సద్రసరమ్య వాఙ్మహిత సారము శ్రీరఘురామ నామమే,
భద్రముగా నిరంతరము భార్యగ సీతను పొంది చూచు, సం
పద్రమణీ లలామ కిల వాసిగ నీతఁడె యీడు జోడగున్.

౩. సీత తరపున ప్రశ్న.
౩. ఓం దేవ్యె నమః | 
ఏ దేవి శుభనామమే దారి యగుచుండు నిహపరంబులు కనన్ మహిని ప్రజకు,
ఏ దేవి రూపంబు నెద నెంచి ప్రార్థింప నిట్టులే పనులౌను సృష్టి లోన,
ఏ దేవి జనకుండె యిహపరంబులు గనన్ నీ తల్లినే పెంచె నింపుగాను,
ఏ దేవి మూలమో యీ సృష్టికంతకు నాదేవియే సీత, యనుపమ సతి,
తే.గీ.  అట్టి  యా దేవితో సరి యెట్టులగును
రామచంద్రుండు చెప్పడీ ! రామ రామ,
భూమిజాతకు నతఁడెట్లు పోలికగును?
సీత సరి జోడు లేరింక భూతలమున?
3. రాముని తరపున సమాధానము.
3. ఓం రాజీవలోచనాయై నమః.
సీ.  రాజీవ నేత్రుండు రాజేంద్రుఁడీ రఘు రాముండు ధరణిపై రమ్య గుణుఁడు,
జిత శత్రు వర్గుండు, నుత వాఙ్మి, మితభాషి, స్మితవక్త్రుఁ డనుపమ శ్రీకరుండు,
వేదాంత సారుండు, వేదాత్మ రూపుండు, విశ్వ విఖ్యాతుండు, విశ్వవిభుఁడు,
సత్యవ్రతుండును, సత్యవిక్రముఁడును, శివధనుర్భంగుండు, ప్రవరుఁడితఁడు,
తే.గీ. అట్టి శ్రీరామచంద్రునే యెట్టులిటుల
జోడు కాదంద్రు సీతకు? పాడిఁ దలచి
వరునిగా మీరు గుర్తించి, వాసిగనుఁడు,
రామచంద్రుండు సీతకున్ ప్రాణమగును.

౪. సీత తరపున ప్రశ్న.
౪. ఓం రమాయై నమః |
చం.  రమయన మాత సీత, గుణరమ్య సమావృత, రమ్య భాతి, మా
రమ యసమాన నేత్రి, కనరారు జగాన రమాసమానులే, 
రమకు సమానమై వెలుగ రామయటంచు పేరు కల్గినన్
రమకిలసాటియౌనె తమ రాముఁడు? రమ్య గుణాభిరాముఁడా?
4. రాముని తరపున సమాధానము.
4. రమ్యగుణాభిరామాయై నమః.
ఉ. రమ్యగుణాభిరాముడిల రాముఁడు, సత్యము, నిత్యుఁడాతఁడే,
సౌమ్య సుతత్త్వుఁడున్, సుగుణసారము రాముఁడు సీతపోలికన్,
గమ్యము చూపు భక్తులకు, కంజదళాక్షుఁడు, సృష్టి లోపలన్
రమ్యగుణాలవాలమగు రాముఁడె సీతకు ఈడుజోడగున్.

౫. సీత తరపున ప్రశ్న.
౫. ఓం రామాయై నమః.
ఉ.  ఒప్పిదమై రహించుటనె యొప్పుగ రామ యనంద్రు సీతనే,
గొప్పలు చెప్పుకో మరిగి కుంభినిపై నుత రామ నామమున్
చెప్పుకొనంగనౌనె? అది సిగ్గుగ లేదొకొ మీకు, వారికిన్?
ఇప్పుడు సీతకౌనె సరి? యేమని చెప్పుదు రయ్య? చెప్పుడీ!
5. రాముని తరపున సమాధానము.
5. ఓం రమాలంపట మానసాయ నమః |
ఉ. ఒప్పుగ పుట్టు సీత యని, యొప్పును రాముఁడు సీతకంచునే
గొప్పగ రామనామమును కూర్మిని ముందుగ పెట్టియుండుటన్,
ని ప్పనఁదగ్గ సీతకు మనీషులుమెచ్చెడి జోడు రాముఁడే,
యిప్పటికైన నమ్ముడయ, యీశ్వరి సీత, రమేశుఁ డీతఁడే.

౬. సీత తరపున అంగీకారము.
౬. ఓం మంగళాంగ్యై నమః.
ఉ.  స్వాగతమయ్య మీకు గుణసన్నుత రాముని కిత్తుమయ్య మా
శ్రీ గుణగణ్య సీత, నిక చేకొన శ్రీరఘురామచంద్రునిన్
వేగమె పెండ్లివేదికకు వేడుకగా గొనిపోదుమయ్య, సద్
యోగము లోకమంతటికి, నొప్పుగఁ గల్గఁగఁజేయ నిత్తరిన్.
6. రాముని తరపున సంతోషము.
6. ఓం మంగళస్వరూపాయ నమః.
ఉ.  సంతసమయ్యె మాకు, గుణసన్నుత సీతకు రామమూర్తికిన్
పంతులు మంత్రముల్ చదువ భక్తిగ నిప్పుడె పెండ్లి కార్యమున్
శాంతిగ లోకముల్ వెలుగ చక్కగ జేసెదమయ్య, రండయా!
చింతలు తీరుగాక, వరసిద్ధిని  మంగళమౌ ధరిత్రికిన్.  
స్వస్తి.
అమ్మ దయతో
చింతా రామకృష్ణారావు.
05 – 4 – 2025.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.