జైశ్రీరామ్.
ఆర్యులారా! మీరు ఆనందించే వార్త. ఎంతకాలంక్రింద వ్రాసినదో నా శ్రీమన్నారాయణ ద్విత్వనకార ప్రాస శతకమును బ్రహ్మశ్రీ దేవీదాస్ రావుగారు ముద్రింపించి మా యింటికి పంపించారు.
👇🏼
విషయ
సూచిక.
పండితాభిప్రాయములు.
నా
మదిలోని మాట.
శ్రీమన్నారాయణ
శతకము
అంకితము.
అక్షరక్రమములో
పద్యముల వివరణ.
నేను,
నా రచనలు.
పండితాభిప్రాయములు.
మనోజ్ఞం.
అవధాన భారతి. సాహితీ చతురానన, ఛందో వైవిధ్య నిష్ణాత, స్వర్ణకంకణ, కవిగండపెండేర పురస్కారపు గ్రహీత, విద్వాన్ చక్రాల లక్ష్మీకాంత రాజారావు, ఎం.ఏ.
చిత్ర కవిత్వ విశారదులు, నానావిధ ఛందః ప్రయోగ నిష్ణాతులు, సంస్కృతాంధ్ర ప్ండితులు, రస హృదయులు, సహృదయులునగు శ్రీమాన్ చింతా రామకృష్ణారావు గారు నాకు ఆత్మీయ సాహితీ మిత్రులు. వారి మైత్రీ బంధము మత్ పూర్వ పుణ్య ఫలం.
వీ రెంత విజ్ఞాన సంపన్నులో అంత వినయ సంపన్నులు. వీరి పిలుపులో
ఆత్మీయతా బంధం, చెప్పరాని మరో బంధం యిమిడి ఉంటుంది. వీరి ప్రతీ కావ్యం ఏదో వినూత్న విచిత్ర విశేష కావ్య వస్తు బాంధవ్యం కలిగి
ఉంటుంది.
వీరు రచించిన శ్రీమన్నారాయణ శతకం చదివితిని. ద్విత్వ నకార
ప్రాసతో అష్టోత్తర శత పద్యములు, అందు ప్రతీ పద్యం ఏదో ఒక
విశేషాంశం మనకు అందిస్తుంది. నవ విధ భక్తివిశేషాలు, హరి విశేష లీలలు, ప్రస్తుత సామాజికాంశములు, పంచభూతముల శక్తి తత్త్వము, భగవంతునికి భక్తునికి
మధ్య గల అనురాగ భావన, దైవార్చనలు, నామస్మరణము
చేయుట వలన కలుగు పుణ్య విశేషాలు,యిలా ఎన్నింటినో వీరు
దృష్టాంత పూర్వకముగా వివరించారు.
నేడు వ్రాయుచున్న శతకములలో వీరిదొక
ప్రత్యేకమైన రచన. ఇలాగా వ్రాయవచ్చా? అను శంకకు వీరు తీసుకున్న మకుటమే
నిదర్శనము. శ్రీమన్నారాయణ అను మకుటం తృతీయ పాదాంతమున
అక్షరముంచి చతుర్థ పాదాదిగా వ్రాసి, శతకవాంగ్మయమున ఒక
వినూత్న మార్గమును కవు;లకు అందించారు. పద్య
కవులకు ఇది ఒక ఉదాహరణ కావ్యం కాగలదు.
79. శా.
పెన్నాగంబును బాన్పుగాఁ గొనితివా? పెన్నీటిపై వాసమా? అనే పద్యము చూడగనే నాకు కలిగిన అభిప్రాయము. తే.గీ. హృద్యభావార్థ సంబద్ధ పద్యమిద్ది - భక్తితాత్పర్య సంయుక్త పద్యమిద్ది పద్మనేత్రకృపాపాత్ర పద్యమిద్ది - భవమునందంగ దిక్సూచి పద్యమిద్ది.
శా.
చింతావారి మనోభిరామమగు సచ్చిద్బావమందాకినీ ప్రాంతోద్యానవనాంతసీమ
రమణీయాకార పుంస్కోకిలా స్వాంతోద్భూతమనోజ్ఞగీతవిలసత్పద్యస్వరాభిజ్ఞత న్సంతోషాత్మఁబఠించితిన్ముకుళితస్వాంతాన
వందించితిన్.
పాఠకులైన మనమందరం వీరి శతకమును చదివి, శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులమగుదుము గాక,. వీరి నుండి మరిన్ని కావ్యములు వచ్చునట్లు ధీశక్తిని, ఆరోగ్య సంపదను, ఆయుస్సౌభాగ్యమును హరి అందించును గాక.
ఇట్లు బుధజన విధేయుఁడు
చక్రాల లక్ష్మీకాంత రాజారావు. విశ్రాంత సంస్కృతోపన్యాసకులు,
హైదరాబాదు. తే.23 – 9 – 2022
శ్రీమన్నారాయణ పద్యకవచము.
శ్రీ ఆముదాల మురళి. శతావధాని .. తిరుపతి.
శ్రీ చింతా రామకృష్ణారావు గారు చతుర్విధ
కవిత్వ నిర్మాణ చణులు. అవధానకళా పారీణులు,
నిరంతర భగవచ్చింతనా పరులు, వారి వైఖరి
పరానుసంధానమై ప్రత్యూష పవనాంకురములతో పాటు
పలికరిస్తుంది. కరుణాంఋతాన్ని చిలుకరిస్తుంది.
ఏకదిన శతక రచనా నైపుణ్యం గల వీరు వేగాతివేగోక్తి లోను, నులుకడలోను, రస బంధుర కవిత్వం చెప్పగలరు. వీరి అనేకానేక కృతులలో
అనేక విలక్షణతలు అనేకంగా ఉంటాయి. ఈ అనేకత్వం వెనుకనున్న
ఏకత్వం వారి అద్వైత స్థితి.
నల్లేరుపైబండి నడకలా పద్యాన్ని నడిపించగల
చింతా వారికి శతక రచన చిటికెలో పని. ఐతే వీరి వైఖరీ వాక్కు పాఠకులలో
శబ్దబ్రహ్మానందాన్ని కలిగించడానికి కావలసిన పద పదార్థ సామగ్రిని ప్రోగు చేసి,
రస ప్లావితం గావించడం ఈ శతక ప్రత్యేకత. సాధారణంగా
మకుటం పాదాంతంలో ఉటుంది కాని, నవనవోన్మేష సుధాధారాపాత
ధీమంతులు యోచన అపూర్వముగా ఉండుట సహజమే కదాఽందుకే వీరు శ్రీమన్నారాయణ అన్న
మకుటాన్ని చతుర్థ పాదంలో ద్విత్వ నకార ప్రాస కనుగుణంగా ఉపనిబద్ధం గావించారు.
తత్ కారణంగా శతకం ఏకప్రాస ఘటితమైనది. సర్వ
శార్దూల పద్య సమాశ్రితమైన యీ శతకం శత్రు షట్క శార్దూలములకు శరభంఋగమై
భసిల్లుచున్నది. పద్యం పది కాలాలపాటు నిలవాలన్నా పది
నాల్కలపై నడయాడాలన్నా హృదయంగమ శైలీ విన్యాసం అవసరం. ఆశైలిని పుణికి పుచ్చుకొన్న
అవధానశేఖరులు, చిత్రకవితా సమ్రాట్టులు చింతావారు. దీనికి శతకమే తార్కాణ్ము. రసవదలంకార శయ్యా సౌభాగ్య
పరిపుష్టమై, పద్యమునందు దైవ భక్తి జోడించి, ప్రతీ పద్యం ఒక ప్రార్థనాపద్యం అయ్యేటట్లు మలచి తాత్పర్య సహితంగా
ప్రకటింపఁ బూనడం వారి సౌహార్ద భావమునకు నిదర్శనం. ఇందలి
పద్యరాజములు కొన్ని పురాణ గాథల సంబంధమై, మరికొన్ని
ఉపనిషన్మంత్ర వ్యాఖ్యానములై, ఇంకొన్ని అపూర్వ భావనా విశేష
భాజనములై, ఆర్తి, నివేదన, పశ్చాత్తాపాది సమున్నత గుణ శోభితములై అలరారుచున్నవి. భగవంతుఁడు సర్వ జీవులయందు సముఁడై యున్నాడని, వారి
క్షుత్పిపాసాదులు తీర్చునని, భిన్నుండై తపించు హాలికులకున్
గేలిచ్చి కాపాడునని, అస్తి నాస్తి విచికిత్స తొలగించునని,
సూర్య, చంద్ర వాయువులు శ్రీమన్నారాయణుఁడే నని,
అతడు సంపూర్ణుఁడని, అదే సర్వ వేద తత్త్వమని
సోహం అంటే చాలునని, దానికి దాసోహమ్మను భావన అవసరమని, కన్నులకున్న శక్తి క్షీణించు లోపల జ్ఞాన నేత్రం తెరుచుకోవాలనీ, కాలత్రయమునందు హరి నామ స్మరణే ధ్యేయమని, తెలియఁజెప్పెడి
పద్యములు భక్తులపాలిట ఉపాధేయములు.
భక్తుఁడు కవి అయితే రామచరిత మానసమవుతుంది. కవి భక్తుఁడయితే
శ్రీమద్రామాయణమౌతుంది. రెండు ప్రయోజనాలూ సమున్నతాలే. కవిత్వము భక్తి సమతా స్థితిలో సాగే ఈ శతకంలో చింతావారు కొన్నిచోట్ల
వాల్మీకిలా, చాలా చోట్ల తులసీదాసులా కనిపిస్తారు. పద్య రచనకిది పెద్దబాల శిక్షవంటి రచన.
ద్విత్వ నకార ప్రాసాక్షరాలన్నీగుదిగూర్చినట్లు
ఒకే చోట దొరకటం ప్రారంభకులకు వరం.
అంతే కాదు చాల సంబోధనలు సాభిప్రాయములై ఔచిత్యంతో ఉండేటట్లు, చర్విత చర్వణములు గాక, గణపూరణలు గాక, యతిప్రాసానుకూలములై, పంటికింద రాయివలెనుండక, పాయసమునందలి జీడిపప్పువలె కలిసిపోయినవి. రూఢికి రూఢి,
లక్షణకు లక్షణ, వ్యంజనకు వ్యంజన, అలంకారమునకు అలంకారము, వక్రతకు వక్రత, ధ్వనికి ధ్వని, ఇలా సర్వ లక్షణ లక్షణోపేతమైన ఈ
శతకరాజము పాఠకులకు అభీష్ట సిద్ధిదాయిని యగుట అతిశయోక్తి కాదు. పఠన పాఠన విధికి మనన నిధిధ్యాసలకు, యీ పద్యములు
ఆలంబనములై వర్తిల్లగలవు.
ఈ నాలుగు మాటలు ముంజేతి కంకణమునకు అద్దము వంటివే. పాఠకులు హాయిగా లోనికి ప్రవేశించవచ్చు. ఆస్తికిలై అభ్యుదయ పరంపర సాధకులై, ముముక్షువులై శ్రీమన్నారాయణ చరణ సరోజ భ్రమరాయమాన ద్విరేఫంబులై, విజ్ఞాన సంపన్నులై, సామీప్య సాలోక్య సారూప్య సాయుజ్యాది క్రమ ముక్తి నొందెదరు గాక.
ఆముదాలమురళి.
తిరుపతి. తే.20 – 9 – 2022.
నా మనసునాకట్టుకొన్న శ్రీ మన్నారాయణ శతకం
బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి గారి స్పందన.
ప్రథమంగా.....శ్రీ చింతా రామకృష్ణారావు
గారికి నమస్కృతులు . ఎందుకంటే ....కవీశ్వరులనీ......
మాకు తెలిసిన గొప్పవారిలో
ఒకరనీ కాదు
. ఈ పుస్తకం చదువుతుంటే మాఊరి గుడిలో
మా భావనారాయణ స్వామిని రామకృష్ణారావు గారి పద్యాలతో
ప్రార్థిస్తున్నట్లున్నది. మాదిపొన్నూరు
.అక్కడ ప్రసిద్ధ దైవము శ్రీ భావ నారాయణ స్వామియే.
రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి విగ్రహం గుడికి ఎదురుగా ఉంటుంది. నాయుడు గారు ఆగుడికి చాలా మాన్యాలు ఇచ్చారుట.
శతకం చదవటం మొదలుపెట్టాను. మొదటి పద్యం శ్రీ న్నీ వక్షమునందు నిల్పి
చదువుతుంటే ఈ క్రింది భావాలు కలిగినయ్యి .
"హరిహరి సిరియురమున గల హరి" అని వామనావిర్భావమునకు ముందే యురమున సిరి
ఉంటుందని భాగవతంలో చెప్పారు. అయితే, ఆ స్థానము నిరూపించబడినది
వామనావతారంలో.కపటవామనుడే స్వయముగా , "సిరి యుతొల్లి గలదు" అని చెబుతాడు. .
దానము ఇవ్వబోయే .ముందు బలి "సత్యహీనుని మోవజాలననుచు బలుకదే తొల్లి భూదేవి"
అంటాడు, సత్యపదవీ ప్రమాణతత్పరుండు.ఇక వటుడింతంతై సత్యలోకం ను దాటిన తరువాత
లోకాలు యేయే స్థానంలో ఉన్నవో చెబుతూ "మనంబున చంద్రుండును వక్షంబున కమల హస్త
యగు లక్ష్మి యు " అంటాడు భాగవతకారుడు. వామన రూపంలో గాని విశ్వరూపం లో గాని లక్ష్మి స్థానం వక్ష స్థలం. ఇక "సత్య సన్నుతగుణా అన్న "సత్య" పదం బలిచక్రవర్తిని ఉద్దేశంచినదే. సత్యం కోసం తెలిసి...ఆయన. త్రైలోక రాజ్యం వదులుకున్నాడు.శతకం వామనావతారసూచనతో మొదలు కావటం శుభవిజయ సూచకం. శ్రీ తో ఆరంభంఎటూ ఉండనేఉంది}. ఇక గ్రంథం లోకి వెళితే కొన్ని పద్యాలు స్థాలీ పులాక న్యాయంగా చూద్దాము. నాకు అన్ని గొప్ప పద్యాలలో బాగా ఆకట్టుకున్న పద్యం ఇది
నిన్నున్ జూచెద పక్షులన్ బశువులన్ దృగ్గోచరంబౌదునీ
వెన్నింటన్గలవన్నిటన్ గనియెదన్ సృష్టిం వివేకంబుతోన్
భిన్నంబంతయు గానరాదనియు నీవేగా దయాపూర్ణశ్రీ
మన్నారాయణ నీవు లేని యెడలన్ మాకెట్లు కానంబడున్ …31.
సరిగ్గా ప్రాణావసాన సందర్భమున ఇదే కోరాడు పరీక్షన్మహారాజు కూడా . వారం రోజులలో భగవంతుడిని గూర్చి తెలుసుకోవాలనుకున్నాడు
36 పన్నీటన్ జలకంబులాడెదవు నీ భక్తాళిచే నిత్యమున్
కన్నీరింతయు కారనీయని మతిన్ కారుణ్యమే చూపవా?
ఇక్కడ రామకృష్ణారావు గారు దేవుడిని దాదాపు నిలదీశారు
ఏమయ్యా మా పన్నీటిలో జలకమాడి మా కన్నీటిని తుడవవా ...అని నిర్మొహమాటంగా అడిగారు. ఇదినిందాస్తుతి. తిట్టినట్లు కనబడుతుంది కానీ పొగడ్త అవుతుంది. ఇది భక్తి కావ్య లక్షణాలలో ఒకటి.
38. జన్నంబుల్ పచరించి సాధకుడు నీ సామీప్యమున్ జెంది....
ఇది ఒక రకంగా దేవుడి యొక్క జగత్కారణత్వానికి ఒకపరీక్షయజ్ఞంచేస్తేనే భక్తపాలనయా ..లేకపోతే లేదా ..జన్మ నిచ్చిన వాడికి జంతువుల పాలనా బాధ్యత లేదా?జన్మనిచ్చాడనటానికి ప్రమాణం బ్రహ్మ సూత్రాలు " జన్మాత్ యస్య యతః " అని ఘోషిస్తున్నయ్యే .నారుపోసినవాడు నీరుపోయటం ప్రకృతిలోన్యాయం . ఇది బాధ్యత గుర్తుచేయటం
39 ( 38 వ పద్యానికి కొనసాగింపు ఈపద్యం)
లోకంలో దరిద్రుడు అన్నమో రామచంద్రా అంటూ అర్థిస్తాడు . ధనవంతులు ఆ అన్నాన్ని పారబోస్తారు " భగవంతుడా నీ అన్నం అందరికీ లభించాలీ అంటూ రామకృష్ణారావు గారి లాంటి వారు భగవంతుని ప్రార్థిస్తారు. ఇది మనిషి తాను సుఖంగా ఉండి సామాజిక బాధ్యతను పెంచమని ధ్వని(ఈ పుస్తకం కమ్యూనిస్టు ల కంట బడకుండా ఉంటే మంచిది. కనపడితే మాకు ఇంకొక కవిదొరికాడనిచంకలుగుద్దుకుంటారు )
40 ఉన్నావన్నిట గానరావు హృదిలో నున్నట్టి నీ రూపమున్ "
విచిత్రం ....అన్ని చోట్ల దేముడున్నాడుట కానీఎవరికీ కనబడట. దేవుడు అందరి కంటే మాయగాడు. మనవాళ్లు చూపించేది ఇంద్ర జాల విద్య . నిజానికది విద్యయే నిజం కాదు దేవుడు చేసేదే నిజమైన యింద్రజాలం.
41 శూన్యమే పూర్ణమునకు కారణం
ఈ ప్రపంచంలో అన్నీ సాద్య వస్తువులే. ఆకాశం ఒకటే సిధ్దవస్తువు...జగత్కారణాన్ని ఆకాశవత్ సర్వగతఃనిత్యః " అని సూత్రం. ఆకాశం సృష్టి చేయబడలేదు. " ఆత్మనః ఆకాశః సంభూతః " అని అన్నారు కానీ ఆత్మగోచరం కాదు . ఆకాశమే మన మనసుకి తెలిసే శూన్యం.
42 రామకృష్ణారావు గారు వాస్తవ దృక్పథాన్ని కలిగిన అతీంద్రయ దృష్టి కలిగిన కవులు.
హాలికున్ గనుమ....'అని రైతును గూర్చి ప్రార్థంచారు.పాత మహాకవులెవరూ (ఒక్కపోతన మినహా) రైతును గూర్చి పట్టించుకున్నవారెవరూ లేరు. రాయల వారిదగ్గరనుంచి వారి ప్రభువుల వరకు అందరూ రైతుపండించిన పంట తినేచరిత్ర సృష్టించారు. చరిత్ర కుఅన్నమే ఆధారం. దానికి రైతేమూలం. ఈవిధంగా చూస్తే చాలా మంచి పద్యాలు ఉన్నయ్
50 వ పద్యంలో
నిన్నే సూర్యుని గా తలంచితిని పో ...
ప్రాణాన్ని మనం ఎందుకు పూజించాలో ఇందులో తెలిపారు సూర్యుడు రాత్రి ఉండడు
చంద్రుడు పగలుఉండడు.కానీ వాయివు పగలూ రాత్రీ భేదం లేకుండా ఉంటాడు. వాయువు ( ప్రాణ) దేవత అన్నది వేద ప్రామాణికం వాయుర్వై క్షేపిష్ఠాదేవతా "
58 వ పద్యంలో
భక్తుడి యొక్క దీనావస్థ చెప్పాడుపన్నీటితో స్నానం చేయిస్తే కన్నీరు మిగిలిస్తాడుట దేముడు
భగవంతుడు కష్టాలు కలిగించడు అని నమ్మకంగా ఏ భక్తుడు చెప్పడు ఇక్కడ. శబ్దసౌందర్యం అర్థ సౌందర్యం సమానం గా ఉన్నయ్
ఇక 108 వ పద్యం లో రామకృష్ణారావు గారు తమ ప్రచ్చన్న త వీడి ప్రత్యక్షంగా తమ వివరణకు
చెప్పుకున్నారు. సన్యాసి రాజు గారు రత్నాంబ గారుతల్లి దండ్రులను పూజించి ఈ శతకం రాశాను అనిచెప్పారు స్వ గోత్రనామాదులను చెప్పుకోవటం ఒక ప్రయోజనం అయితే చదువరులకు భారతీయసంప్రదాయాన్నిఆచరించి చూపటం ముఖ్య ప్రయోజనం. .పాశ్చాత్య రచయితలు ముందుమాటలలోఎంతమంది తల్లిదండ్రులకు నమస్కరిస్తారో తెలియదు వాళ్ల చరిత్ర వారితోమొదలయి వారితోనేముగుస్తుందేమో తెలియదు.పుస్తకం పూర్తి సౌందర్యం అనుభవించాలంటే పూర్తిగా చదవాలిసిందే.
పిల్లల పాఠ్య పుస్తకాలలో ఇందులో కొన్ని పెడితే బాగుంటుందేమో . ఎందుకంటే శతకాలు కూడా అధునిక కాలంవస్తున్నయ్యన్న సత్యం పిల్లలకు తెలియాలి.
ఈ పుస్తకం చదవటానికి ఇచ్చిన శ్రీ చింతా రామకృష్ణారావు గారికి ధన్యవాదాలు శ్రీ మన్నారాయణుడుసంపూర్ణానుగ్రహం చూపి రామకృష్ణారావుగారిని కటాక్షించు గాక అని మనందరంప్రార్థిద్దాము
శ్రీమన్నారాయణునకు నమస్కరిస్తూ
ఎ సి పిశాస్త్రి
బ్రహ్మశ్రీ
అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారు
నేను
రచించిన శ్రీమన్నారాయణశతకముపై తమ అమూల్యమైన అభిప్రాయమును పంపియున్నారు.
వారికి
ధన్యవాదములు తెలుపుతూ
ఇక్కడ
అందరికీ పఠన యోగ్యంగా ఉంచుచుంటిని.
జైశ్రీమన్నారాయణ.
ఇక
పఠింపఁగలరు.
మధుపర్కం
రసిక లోక పూజ్యులు , సాహితీ
బంధువులకు మాన్యులు శ్రీ
చింతా
రామ కృష రావు కవి గారు
ఆ
నారాయణుఁని సంబోధిస్తూ " శ్రీ
మన్నారాయణ శతకం" వ్రాశారు
. శతకమంతా శార్దూలాలే . చాలా
రాజసం గా తిరుగుతూఉంటయ్యి
సాహితీ
"చింతా "వనం
లో
.
"
శ్రీ మన్నారాయణ" అనేది
సంస్కృతం లో సంబోధనా
ప్రథమా విభక్తి . అంటే
భక్తుడు నారాయణుని దర్శించుకుని సమక్షంలో చూస్తూ పిలవటం ...... . దేముడిని
అంత
దగ్గరగా చూడటంసాధ్యమా !
ఎందుకు కాదు . "అంతర్బ
హి శ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః " అని
ఒక పక్కన ఋషులు వారి అపరోక్షాను భూతిని చెబుతుంటే.... లోపల
హృదయానికి చాలా దగ్గరగా పిలిస్తే పలికేంత దూరం లోనే ఉన్నాడు నారాయణుడు . అందుకే
రామకృష్ణ రావు గారు అంతర్ముఖులై ఈ శతకం వ్రాశా రు.
అదే ఈ శ్రీ మన్నారాయణ అనే సంబోధన
.
ఇక ఛందస్సు
మాటకొస్తే
.. పరిపక్వమైన అంతరంగాలకి ...... ఎందుకో
తెలియదు
... శార్దూలం స్పురిస్తుందా అనిపిస్తుంది.ప్రాచీన ఋషుల దగ్గరనుంచి ఎలకూచి బాల సరస్వతి దాకా ..
సంధ్యా వందనం
లో"ముక్తావిద్రుమ హేమనీల ధవలై ..". నుంచి
కాళి దాసు శ్లోక చతుష్టయం
"
యాస్యత్యద్య శకుంతలేతి .హృదయం ..." మీదుగా
ఎలకూచి బాలసరస్వతి {అజంత పరిచ్చేదంలొ
"
కర్ణాంతాయత చారునేత్ర కమలా !కర్పూర చూర్ణ త్రిపా
ద్వర్ణ శ్రీ కర మంత్ర రూపిత విభాస్వద్రూప !చిద్రూప!సౌ
వర్ణోదంచిత మంచబిందుమయ దీవ్యద్దివ్య సింహాసనాం
తర్ని ష్పం ద విహార
!హార కలికోద్యత్కాంచికా భూషణా
ఇక రామకృష్ణ రావు గారి పద్యాలూ చూస్తే
మొదటి పాదంలో పరిస్థితి వర్ణన/తీర్మానం ,రెండోపాదం
లో
కష్టం లేక అనుమానం .. మూడో
పాదంలో దాని పుష్టి లేక పరాకాష్ఠ నాలుగో
పాదంలో సమస్యా మోక్షణం ... అటు
ఇటుగా ఈ విషయం గా
సాగుతుంది రావు గారి శతకం . ఇంకా
ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు . దీనికి
కారణం ఆ ఛందస్సు గంభీర భావానికి బాగా సరిపోవటమా లేక శార్దూలం పేరులో ఉన్న గాంభీర్యమా... ఏమో
... మనమెంతటి వా రం తేల్చటానికి.
ఇక కావ్య గానం
...
ఈ మాట ఎవరు మొదలుపెట్టారో గాని ప్రాచీన కాలం నుంచి మన కవులకు ఉన్న మంచి/చెడ్డ పేరు ఇది. ద్రావిడ కవులు వచనం కూడా పాట గా
చదువుతారని రాజశేఖరుడు చెబుతాడు.
గద్యే ప ద్యే అథవా మిశ్రే కావ్యే కావ్య మనా అపి
గేయే గర్భే స్థితః పాఠే సర్వో అపి ద్రావి డః కవిః
ద్రావిడ దేశీయుడగు కవి ప్రతి యొక్కడును కావ్య జ్ఞాన వంతుడై గద్య
కావ్యమైనను పద్య కావ్యమైనను చంపు కావ్యమైనను సంగీత గర్భముగా పఠించును . (సప్తమోధ్యాయము
కావ్య మీమాంస )
శార్దూలం ఛందస్సు అందుకో గానే పాడాలని అనిపిస్తుందేమో
ఇక పురాణ వాచస్పతి శ్రీ బంకుపల్లె మల్లయ్య సాస్ట్రీ గారైతే సామవేద దండాన్వయ ఉపోద్ఘాతం లో "గానమునాకింత
ప్రాధాన్యము ఇవ్వవలెనా అంటే..
ఇవ్వవలెను
,.తపస్సు వలన గాని సమాధి వలన గాని గానము చేత క లిగిన భావోద్రేకము కలుగదు. భావోద్రేకమే భగవంతుని కనుంగొనుటకు సాధనము. "
వారే ఇంకొక చోట " సమస్త
వేదమంత్రములును గాన రూపమున
సంధానమొనర్చ వీలగునేమో ముందు రానున్న మహర్షులు యోజించ వచ్చును .. " అన్నారు.
అందుకేనేమో ..ఈ
పద్యాలూ విన్న గాయకులు (నాతో సహా)
మేమంటే మేము అని ముందుకు వచ్చి పద్యాలు పాడుకోవటం మొదలయింది.
శతక గానమంతా భావోద్రేకం తో భగవంతుని కనుక్కునే ప్రయత్నమే కదా. కాలం దృష్ట్యా అధునాతనం కావచ్చు. కానీ భగవంతుడు నిత్య సత్యమే కదా
.
పద్యాలకీ మంత్రాలకీ పెద్ద తేడాలేదు.
పురాతన పద్యాలే మంత్రాలు
అధునాతన పద్యాలుకూడమంత్రాలే.అంటే అధునాతన మంత్రాలు
రెండు ఛందస్సు రూపం లో వచ్చినవే .
వేదానికి ఛందస్సు అనేపేరుంది.
ఇక పద్య శిల్పానికొస్తే ..
మన్నారాయణ శబ్దమే శార్దూలాన్ని దూరాహ్వానం చేసింది. ద్విత్వ "న" కార ప్రాస . ద్విత్వ "న" కార ప్రాస దుష్కర ప్రాస కాదు కానీ క్లిష్టానికి అక్లిష్టానికి మధ్యలో ఎక్కడో ఉంటుంది. కనుక నిఘంటువు లో ఉన్న ద్విత్వ న కార "మ"గణా లన్నీ బొట్టుపెట్టించుకుని పిలిపించుకుని మరీ వస్తయ్ . ఇక్క డే కవి జాగ్రత్త పడ్డారు . ఏ మాత్రం కృత్రిమత్వం లేకుండా , ధారా శుద్ధి లోపించకుండా .. తర్కం చెడకుండా , సహజం గా వాలిన తీగ యొక్క సౌందరాన్ని చూపించారు. దీనికి వారిని అభినందించాలి .
ఇక పేరుకి శ తకమైనా 108 పద్యాలుంటయ్యి .ఇది సంప్రదాయం. ఆలయాల్లో పూజ గాని , బహుసంఖ్యాక లింగ ప్రతిష్ఠ లు గాని.
మన వైదికం లో 108 కి
ప్రత్యేక స్థానం ఉంది.
దాని అసలు అర్థం ఇప్పుడు చెప్పుకోకపోతే అసలు చెప్పుకునే అవకాశమే
రాదు.
వేదకాలంలో త్రేతా
యుగం లో..... పది
సంఖ్యకే చాల గొప్ప ఉండి ఉంటుంది.
అందుకే యజ్ఞాలు ఎక్కువ చేశా డు అని చెప్పటానికి "దశరథుడు " అన్నారు . యజ్ఞాన్ని వేదం రథం తో పోలుస్తుంది. ఎందుకంటే యజమానిని స్వర్గానికి తీసుకెళ్లే ప్రయాణ సదనం కనుక .
ఇక ద్వాపర యుగానికి నగరాలూ ప్రజలు సంఖ్య పెరిగినట్టుంది. 100 ఎక్కవ సంఖ్య గా చెప్పటం మొదలైంది. అందుకే కౌరవులు 100 మంది అని రాశా డు. వ్యాసుడు. బహుశ ఎక్కువ అని చెప్పటానికి 100 అని చెప్పటం మొదలు పెట్టరేమో . ఆ విధం గానే "శత మనంతం భవతి " అనే ఆశీర్వచన మంత్రం వచ్చి ఉంటుంది. రోజూ యజమాని అగ్నహోత్రం చేయాలి . అది ఉదయం సాయంత్రం . అంటే రోజుకి రెండు సార్లు. ఏదైనా కారణం తో అగ్నిహోత్రం చేయటం మానేస్తే 4 రోజుల తరువాత ఆ అగ్ని లౌకికాగ్ని అయిపోతుంది. దాహపాకా లకు మాత్రమే పనికొస్తుంది అంటే ......మంటే.... అవుతుంది. అగ్నిభగవానుడు కాదు. మొత్తం నాలుగు రోజులలో 8 సార్లు అవుతుంది. అట్లా మానేసినప్పుడు అగ్నిని 100 తో పాటు ప్రాయశ్చిత్త సంఖ్యా అయిన 8 తో గూడా చేయాలి . అందుకని అగ్నికి 108 సంఖ్యా అంత ప్రాధాన్యమయింది.కనుక శతం అన్న చోటల్లా నూట ఎనిమిది అని మనం అను వదించు కోవాలి . కనుక మన వైదిక మతం లో 108 కి ఆ విధం గా ప్రాధాన్యం వచ్చింది . గుడికి వెళ్లే వారు సామాన్యంగా అగ్ని ఉపాసన చేసే వారుండరు. అందుకని దేముడిని శత నామాలతో పూజించవారు అష్టోత్తర శతం చేయిస్థారు
కవిత్వం కూడా ఒక రకం గా అగ్ని ఉపాసనా కదా . దేముడు
కూడా అగ్ని ఏ కదా .
:'అహం వై శ్వానరో భూత్వా పచామ్యన్నాం చతుర్విధం" అని
విష్ణువే చెప్పాడు.అందుకే దేముడికి సంబంధించినది ఏదైనా 108 సార్లు
చేస్తారు.
గాయత్రీ జపం తో సహా.
చింత రామకృష్ణ రావు గారు చేసిన శతకం ఉభయ తారకం .. అంటేఆయనకు లోకానికి ఇద్దరికీ ఉపయోగం . పరోపకారాన్ని మించిన పుణ్యం ఏ తీర్థము ఇవ్వదని కాశీఖండం లో వ్యాసుడు చెప్పాడు కదా మధుపర్కం అంటే వరపూజలో అల్లుడికి ఇచ్చే పెరుగు తేనె కలిపిన పానీయం ..
ఇట్లు.
అందుకూరి శాస్త్రి.
బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారికి
నా హృదయపూర్వక ధన్యవాదములు.
చిత్రగర్భకవితావతంశులు, గౌరవశ్రీ చింతారామకృష్ణారావు విరచిత
"శ్రీమన్నారాయణ శతకము"- పై.
బ్రహ్మశ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. … జుత్తాడ.
నూతన ఛందోగర్భ కవితాసుమపారిజాతము నర్తన, మనోరమ, సుభిక్ష, దదామీతి, వర్ఛశ్వినీ, సంస్తుత్య,హేతుభూత, చిదానంద
సమ్మోదినీ, ముక్తిహేతు గర్భ-"జన్మధన్య"-వృత్తము.
" జన్మధన్య-వృత్తము." ఉత్కృతిఛందము.మ.భ.స.మ.య.య.త.ర.లగ.గణములు.
యతులు.10,18.ప్రాసనీమముగలదు.
*శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద!సమ్మోదమౌ!జీవన్ముక్తిహేతు!భూతమౌ
మా' మాధుర్యంబగు!మహిమం!మదార్తిం!దొలగించుగా!మావద్దివ్యసంస్తుతింజనున్!
రామా! మీదౌ! శతక" మిలం! రథారోహణంబౌ!,ఘనా! ప్రావర్ఛశ్వులం వెలుంగిడున్!
దామంబౌదివ్యు!గళముం!దదామీతి"మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతం గనెన్!*
భావము:- శ్రీమన్నారాయణ స్ఫురణము మనస్సున కానంద మొసగును.
జీవన్ముక్తికి హేతుభూతమదియే. ఈశతకము, శ్రీమన్మహాలక్ష్మి మహిమచే
మాథుర్యము సంతరించుకొనును. నాయొక్క యనగా ఆత్మాకమైన (ఆత్మగల
ప్రతీజీవికి) కష్టములను తొలగించును కదా! లక్ష్మీప్రదమైన, మనోహరమైన
స్తుతితో నలరారును. రామా=శ్రీయుతులురామకృష్ణార్యా! మీచే రూపుదిద్డఁబడిన మీదైన
శ్రీమన్నారాయణ శతకము ఈ రసాతలమున క్రొత్తకాంతులతో వెలుగులిడును. జ్ఞానప్రబోధ యగును.
కంఠహారముగా సురలగళాకంఠవమై తనరును. మోక్షదాయినియైన!మీకృతివలన మీజన్మ ధన్యత నందెను.
1.గర్భగత"-నర్తనా"-వృత్తము. బృహతీఛందమమ.భ.స.గణములు.వృ.సం.241.ప్రాసగలదు.
*శ్శ్రీమన్నారాయణ స్ఫురణం! - మా"-మాథుర్యంబగు మహిమన్!
రామా! మీదౌ! శతక. మిలన్! - దామంబౌ! దివ్యు గళమున్?*
2.గర్భగత"-మనోరమ"-వృత్తము. అనుష్టుప్ఛందము.య.య.లగ.గణములు.వృ.సం.74.ప్రాసగలదు.
*చిదానంద సమ్మోదమౌ? - మదార్తిం తొలంగించుగా!
రథారోహణంబౌ!ఘనా! - దదామీతి! మోక్షంబనన్?*
3.గర్భగత"-సుభిక్ష"-వృత్తము. బృహతీఛందము.మ.జ.ర.గణములు.వృ.సం.169.ప్రాసగలదు.
*జీవన్ముక్తి హేతు భూతమౌ? - మావద్దివ్య!సంస్తుతిం జనున్?
ప్రావర్ఛశ్వులం!వెలుంగిడున్? - తావజ్జన్మ!ధన్యతం గనెన్?
4.గర్భగదదాదదామీతి"-వృత్తము. అత్యష్టీఛందము.మ.భ.స.య.య.లగ.గణములు.
యతి.10.వ.యక్షరము. ప్రాసనీమముగలదు.
*శ్రీమన్నారాయణ స్ఫురణం?చిదానంద సమ్మోదమౌ?
మా"-మాథుర్యంబగుమహిమం!మదార్తిందొలంగించుగా!
రామా!మీదౌ శతక మిలం?రథారోహణంబౌ!ఘనా?
దామంబౌ దివ్యు గళముం?దదామీతి మోక్షంబనన్?*
5.గర్భగత"-వర్ఛశ్వినీ"-వృత్తము. అత్యష్టీఛందము.య.య.య.త.ర.లగ.గణములు.
యతి.9.వ.యక్షరము. ప్రాసనీమముగలదు.
*చిదానంద సమ్మోదమౌ?జీవన్ముక్తి హేతు భూతమౌ?
మదార్తిం దొలంగించుగా!మా"-వద్దివ్య సంస్తుతిం జనున్!
రథారోహణంబౌ!ఘనా!ప్రావర్ఛశ్వులం?వెలుంగిడున్!
దదామీతి"-మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతం గనెన్!*
6.గర్భగత"-సంస్తుత్య"-వృత్తము. ఉత్కృతిఛందము.య.య.య.త.ర.య.మ.న.లగ.గణములు.
యతులు.9.18.ప్రాసనీమముగలదు.
*చిదానంద సమ్మోదమౌ!జీవన్ముక్తి హేతుభూతమౌ!శ్రీమన్నారాయణ స్ఫురణం!
మదార్తిం దొలంగించుగా!మా"-వద్దివ్య సంస్తుతింజనుం?మా,మాథుర్యంబగు మహిమన్?
రథారోహణంబౌ!ఘనా!ప్రావర్చశ్వులంవెలుంగిడుం!రామా!మీదౌ శతకమిలన్!
దదామీతి!మోక్షంబనం?తావజ్జన్మ!ధన్యతంగనెం!దామంబౌ!దివ్యు గళమున్!*
7.గర్భగత"హేతుభూత"-వృత్తము.ధృతిఛందము.మ.జ.ర.మ.భ.స.గణములు.
యతి.10,వ.యక్షరము. ప్రాసనీమముగలదు.
*జీవన్ముక్తి! హేతుభూతమౌ? శ్రీమన్నారాయణ స్ఫురణం?
మా"-వద్దివ్యసంస్తుతిం!జనుం?మా"-మాథుర్యంబగు!మహిమన్?
ప్రావర్ఛశ్వులం వెలుంగిడుం!రామా! మీదౌ ! 'శతక ' మిలన్?
తావజ్జన్మ! ధన్యతం గనెం? దామంబౌ! దివ్యు గళమున్!*
8. గర్భగత"-చిదానంద"-వృత్తము. ఉత్కృతిఛందము.మ.జ.ర.మ.భ.స.య.య.లగ.గణములు.
యతులు.10,19. ప్రాసనీమముగలదు.
*జీవన్ముక్తి!హేతుభూతమౌ!శ్రీమన్నారాయణస్ఫురణం!చిదానంద!సమ్మోదమౌ
మా'-వద్దివ్య!సంస్తుతిం జనుం!మా'మాధుర్యంబగు!మహిమం!మ'దార్తిం! దొలంగించుగా?
ప్రావర్ఛశ్వులం!వెలుంగిడుగా!రామా!మీదౌ'శతక'మిలం?రథారోహణంబౌ! ఘనా!
తావజ్జన్మ!ధన్యతం గనెం?దామంబౌ దివ్యు గళముం?దదామీతి!మోక్షంబనన్*
9.గర్భగత"-సమ్మోదినీ"-వృత్తము. అత్యష్టీఛందము.య.య.య.మ.న.లగ.గణములు.
యతి.9.వ.యక్షరము. ప్రాసనీమముగలదు.
*చిదానంద!సమ్మోదమౌ!శ్రీమన్నారాయణ!స్ఫురణం?
మ'దార్తిం!దొలంగించుగా?మా"-మాథుర్యంబగు?మహిమన్!
రథారోహణంబౌ!ఘనా!రామా! మీదౌ!'శతక ' మిలన్?
దదామీతి మోక్షంబనం? దామంబౌ! దివ్యు గళమున్!*
10.గర్భగత"-ముక్తి హేతు"-వృత్తము.
ఉత్కృతిఛందము.య.య.య.మ.న.య.త.ర.లగ.గణములు. యతులు.9.18.ప్రాసనీమముగలదు.
*చిదానంద!సమ్మోదశ్రశ్రీమన్నారాయణ!స్ఫురణం?జీవన్ముక్తిహేతుభూతమౌ?
మ'దార్తిం!దొలంగించుగా?మా"-మాథుర్యంబగు!మహిమం! మా"-వద్దివ్య సంస్తుతిం జనున్!
రథారోహణంబౌ!ఘనా!రామా!మీదౌ'శతక'మిలం?ప్రార్ఛశ్వులలం వెలుంగిడుగా!
దదామీతి మోక్షంబనం?దామంబౌ!దివ్యు గళముం!తావజ్జన్మ! ధన్యతం!గనెన్!*
భక్తి ప్రబోధాత్మకమైన మీకృతి
యాచంద్రతారార్క మీపుడమిని నిలుచుటయే కాక శ్రీమన్నారాయణుని
కరుణాకటాక్షములు లోకమునకుప్రసరించునుగాత!సమస్త సన్మంగళాని భవంతు!సర్వేజస్సుఖినోఃభవంతు!
ఇట్లు,
తమ విశ్వసనీయుడు.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
బ్రహ్మశ్రీ పొన్నెకంటి సూర్యనారాయణరావుగారు
నాచే రచింపఁబడిన శ్రీమన్నారాయణశతకముపై వారి అభిప్రాయమునుగ్గడించియున్నారు. చూడఁగలరు.
జైశ్రీమన్నారాయణ.
శ్రీ మన్నారాయణ శతకమును గూర్చి
..... నా యాలోచన.
సోదరుడు....పొన్నెకంటి సూర్యనారాయణ రావు. భాగ్యనగరము.
30.04.2018.
తమ అమూల్యమయిన అభిప్రాయమునందించిన శ్రీపొన్నెకంటి సూర్యనారాయణరావు సహోదరులకు ధన్యవాదములు.
నా మదిలోని మాట.
ఆత్మస్వరూపులయిన పాఠకులకు సాధకులకు నమశ్శతములు. ఆ శ్రీమన్నారాయణుని దయ ఎప్పుడు ఏ విధంగా
ఎవరికి లభిస్తుందో చెప్పఁ జాలము.
హైదరాబాదులొ శ్రీ చింతమనేని కృష్ణారావుగారిజయంతి సందర్భముగా ఏర్పాటు చేసిన
సభకు వేదవతి అక్కయ్యగారి ఆహ్వానం మేరకు కీ.శే.జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారితో కలిసి వెళ్ళియుంటిని. అక్కడ సభలో ముఖ్య అతిథి వక్త అయిన శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారి ఉపాన్యాసము
విని వారికి ఒక శార్దూల పద్యమును వ్రాసి పఠించితిని. అదివినిన
అందరూ సంతసించినారు.
ఆ రాత్రి నా మనసులో శ్రీమన్నారాయణుని తలపులే మెదలుచూ శ్రీమన్నారాయణ మకుటముతో
పద్యము వ్రాసి ప్రాతః కాలముననే మిత్ర బంధు కోటికి వాట్సప్ ద్వారా పంపి యుంటిని.
ఎందరెందరో ప్రశంసించుటతో ఉత్సాహము ఉరకలెత్తి రోజూ ప్రాతః కాలముననే ఒక
పద్యము వ్రాసి పంపుచుండగా ద్విత్వనకార ప్రాసతో నూట ఎనిమిది పద్యములు ఆ శ్రీమన్నారాయణుని
తలపులే వ్రాయించినవి. ప్రతీ రోజూ పాఠకుల ప్రశంసలే ఈ పద్యములు
ప్రభవించుటకు మూలమయ్యెను. ఆ శ్రీమన్నారాయణుని ప్రేరణ పాఠకమహాశయులద్వారా
నాకు లభించి నన్ను శ్రీమన్నారాయణ శతక కర్తగా చేసినవి. ముఖ్యముగా
డా.శ్రీ డీ.వీ.జీ.యే. సోమయాజులు గారు, శ్రీ డిల్లీస్
పండి గారు, ఇంకనూ మహనీయులు కొందరు నా పద్యములలో అనౌచిత్యములుగా
అనిపించిన ప్రయోగములను సూచించుచు నాకు సహకరించుచు ఈ శతక రచనకు తమ ప్రోత్సాహము నందించెడివారు.
పేరు పేరునా అందరికీ నా ధన్యవాదములు.బెంగుళూరు
నివాసి శ్రీమతి దోర్భల బాలసుజాత నన్ను అన్నయ్యా అని ఎంతో ప్రేమగా పిలుచుచు శ్రీమన్నారాయణ
శతక పద్యములు కొన్నాళ్ళు పాడి పంపుచుండగా పద్యముతో పాటు గానమును కూడా అందరికీ పంపెడివాడను.
బంగారమునకు పరిమళము అబ్బినట్లున్నదని అందరి మెప్పును పొంద గలుగుట నా
భాగ్యము. గాత్రము సరిగా లేక శ్రీమతి సుజాత సహోదరి పాడలేకపోవుచుండగా
నాకు ఆ భగవంతుడిచ్చిన మామగారు బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రి గారు రోజూ పద్యములు
పాడుచు పంపుటతో పాఠకులకు అందించి ప్రసంసింపబడెడివాడను. ఇట్లు
ఎందరెందరో పాడుచూ పంపుచుండెడివారు.
ఈ విధముగా గాయకుల, వేల సంఖ్యలో ప్రోత్సహించిన పాఠకులపేర్లు చెప్పనలవి కాదు. పేరు పేరునా ప్రత్యక్షముగా పరోక్షముగా నన్ను ప్రోత్సహించిన మహనీయులందరికీ ఆ
శ్రీమన్నారాయణుని అనుగ్రహము లభింపవలెనని కోరుట తప్ప మరే విధముగనూ వారి ఋణము తీర్చుకొనఁ
జాలను. అందరికీ నమస్సులు.
బ్రహ్మశ్రీ బాబూ దేవీదాసురావుగారు శ్రీమన్నారాయణ శతక పద్యములు రోజూ పఠించి
పరమానందముతో ఈ శతక ముద్రణా అవకాశము తనకు కలిగించమని ఎంతో సహృదయతతో అడిగిరి.
ఆశ్రీమన్నారాయణుని ఆజ్ఞగా భావించి వారికి ఈ శతకమును కృతజ్ఞతా పూర్వకముగా
ముద్రణార్థము అందఁ జేసితిని. వారు దీని ముద్రణ చేయించి భక్తజనాళికి
శ్రీమన్నారాయణుని కృపామృత వితరణ గావించియుండిరి. వారికి నా హృదయపూర్వక
ధన్యవాదములు. పాఠకమహాశయులు శ్రీమన్నారాయణుని భక్తటి ఈ శతకమును
తన్మయులై పఠించుతరి గుణములు తోచిన అవి శ్రీమన్నారాయణుని కృపాకటాక్షముగా భావించగలరనియు,
దోషములు కనిపించిన అవి నా అజ్ఞానమున దొరలినవిగా భావించి మన్నించగలరని
ఆశించుచున్నను.
కోరినతోడనే ఈ శతకముపై తమ అమూల్యమయిన అభిప్రాయములను అందజేసిన పూజ్యులు శ్రా
అందుకూరి చినపున్నయ్యశాస్త్రిమామగారికి, డా.చక్రాల లక్శ్హ్మీకాంత రాజారావు గారికి, శతావధాని శ్రీ
ఆముదాల మురళి గారికి నా ధన్యవాదములు. నాకు చేదోడు వాదోడుగా ఉండి
నిరంతరమూ నారచనలకు ప్రోత్సాహమందించుచున్న నాఅర్థాంగి చి.ల.సౌ.విజయలక్ష్మిగారికి, నా కుటుంబ
సభ్యులకు నా ఆశీస్సులు.ఈ శతకమును వ్రాయించి నాకోరిక మన్నించి
స్వీకరించిన కృతిభర్త శ్రీమన్నారాయణుని సహస్ర పాదములకు సహస్రాధిక ప్రణామములు.
జై శ్రీమన్నారాయణా..
ఇట్లు
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
శ్రీమన్నారాయణ శతకము
.(అష్టోత్తర శత ద్విత్వ నకార
ఏక ప్రాస శార్దూలావళి)
రచన. చింతా రామకృష్ణారావు.
1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబుఁ జేకూర్చు నీ
వన్నన్ మాకుఁ బ్ర మోదమే. సుగుణ సౌహార్ద్రంబులన్ మాకు మే
మున్నన్నాళ్ళునుఁ దక్కఁ జేయుదువు, దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ!
సత్య సన్నుత గుణా!
మద్భాగ్య సంవర్ధనా!
భావము.
దీనోద్ధారకా! ఓ దేవాది దేవా! సత్యము కారణముగా సన్నుతింప బడెడి గుణములు కలవాడా! నా
భాగ్యమును ప్రవృద్ధి చేయువాఁడా! శ్రీమన్నారాయణా! మేమున్నన్నాళ్ళును సుగుణ
సౌహార్ద్రంబులను మాకు కలుగ చేతువని లక్ష్మీదేవిని నీ వక్షస్థలముపై నిలిపి, మంచివారికి
శ్రేయస్సును చేయించెడి నీవన్నచో మాకు చాలా యిష్టమే సుమా.
2. శా. నిన్నున్నే ధర నెంచఁగాఁ దగుదునా? నీరేజపత్రేక్షణా!
పున్నామాదులనుండి కాచెదవుగా, పూజ్యుండ! నన్నెంచుచున్.
మన్నింతున్ మది నిన్ను నేను. గనుమా మర్యాదనే నిల్పి, శ్రీ
మన్నారాయణ! కావుమీజగతిఁ బ్రేమన్ మీ రమాసాధ్వితోన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓ పద్మనేత్రుఁడా! భూమిపై నిన్ను నేను ఎంచుటకు సరిపోదునా? ఓ
పూజ్యుఁడా! నన్ను గుర్తించుచు పున్నామాది నరకముల నుండి మమ్ము కాపాడుదువు కదా. నిన్ను
గుర్తించి నేను గౌరవింతును. నామర్యాద నిలిపుచు, లోకమున ప్రేమతో కూడిన దైవ గాథలతో నన్ను
కాపాడుము.
3. శా. క్రన్నన్ గావఁగ వచ్చి ప్రోతు వనుచున్, గన్పింతువీవంచు నో
కన్నా! చిత్త కవాటమున్ దెఱచి, నిన్ గాంచంగ నేనుంటి, నా
కన్నుల్ కాయలు కాచుచుండె, నయినన్ గన్పింప రావేల? శ్రీ
మన్నారాయణ! గాంచ నేరనయితో మాన్యా! మదిన్ వెల్గు నిన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓ కన్నతండ్రీ! వేగమే కాపాడుటకు వచ్చి నన్ను కాపాడుదువనియు, నీవు నాకు
కనిపింతువనియు, నా హృదయ కవాటమును తెరచి యుంచితిని. నా కన్నులు కాయలు
కాచుచుండెను అయినప్పటికీ నీవు నాకు కనిపించగా రావేమి? నా హృదయముననే నీవు
ప్రకాశించుచున్నప్పటికీ నిన్ను చూచుట నే నెఱుఁగకుంటినా?
4. శా. అన్నా కేశవ! మాధవా! నృహరి! మోహాతీత! గోవింద! రా
మన్నా! కృష్ణుఁడ! వామనా! సకల ప్రేమాధార! విశ్వేశ! యే
మన్నన్ నీదు ప్రశస్తనామమగు. మోహాంధంబునే బాపు. శ్రీ
మన్నారాయణ! నీదు నామ మహిమన్ మమ్మున్ సుఖంబందనీ.
భావము.
ఓ అన్నా. శ్రీమన్నారాయణా! కేశవా! మాధవా ! నరహరీ ! మోహాతీతుడా ! గోవిందుడా!
ఓ రామన్నా ! ఓ కృష్ణుడా! వామనా! సమస్తమైన ప్రేమాధారమైనవాడా! ఓ లోకేశా!
మేము ఏది పలికినప్పటికీ అది నీ యొక్క.పేరే యగును. మోహాంధకారమును
పోగొట్టును. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.
పోగొట్టెడివాడా. నీ నామ మహీమచే మమ్ములను సుఖమునందనిమ్ము.
5. శా. ఎన్నం జాలుదె? దేవ! నీదు పద సంస్పృశ్యంబు నా చిత్తమం
దెన్నెన్నో మహిమల్ కనం బరచునే! దృష్టాంతముల్ పెక్కులో
కన్నా! నా కనులారఁ జూచుటకు నేఁ గాంక్షించుదున్. నీవె శ్రీ
మన్నారాయణ! నీదు పాద వరపద్మమ్ముల్ కనం జేయుమా.
భావము.
ఓ దేవా! శ్రీమన్నారాయణా! నీ పాద స్పర్శను కనీసము నేను మనసున ఊహించుటకైనను
సరిపోదునా? ఓ కన్నతండ్రీ! ఎన్నెన్నో మహిమలను నీ పాదములు కనఁబరిచెననుటకు పెక్కు
ఉదాహరణలు కలవు. అట్టి నీ పాద పద్మములను నా కనులారా చూడవలెనని నేను కోరుకొందును.
నీవే నీ పాద పద్మములు నాకు చూచునట్లుగా చేయుము.
6. శా. నిన్నుం గాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముఁగా నేర్పుతోన్
గన్నుల్ వేయిగ, కాళ్ళు వేయి, శిరముల్ గాంచంగ వేయుండుటన్,
సున్నాయౌ పరి పూర్ణమందు నిను దాసుల్గాంచినారయ్య! శ్రీ
మన్నారాయణ! చూతునన్నిట నినున్ మన్నించి నిన్ గాంచనీ.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ధీ నిధులు నిన్ను నిత్యాత్మునిగా లోకములో వేయి కన్నులుగ, పాదములు
వేయిగా వేయి శిరములుగా నీకు ఉండుట. శూన్యమయిన ఆకారములో పరిపూర్ణ స్వరూపుడుగా నీ
దాసులు నిన్ను నైపుణ్యముతో చూడఁగలిగిరి. నిన్ను నేను అన్నింటియందును చూతును. నన్ను
మన్నించి నిన్ను చూడనిమ్ము.
7. శా.
కన్నా మంటిని దిన్న
నిన్ జనని వేగన్ నోరు చూపించుమో
యన్నా యంచును దిట్టినంతటనె మోహబ్రాంతులన్ బాపుచున్
నిన్నున్నట్టి జగమ్ము చూపితివిగా నీవేను కృష్ణుండ! శ్రీ
మన్నారాయణ! మేము కూడ కనలే మా చూపరావేలరా?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నేవు కృష్ణుఁడుగా ఉన్నప్పుడు నీ తల్లి నీవు మన్ను తింటివని ప్రేమను కూడా
విడిచిపెట్టి నిన్ను ఏదీ నీ నోరు చూపించు అని కోపగించి పలుకగా ఆమెలో ఉన్న
మోహభ్రాంతులను పోగొట్టుచు నీలో ఉన్న సమస్త విశ్వమును చూపితివికదా. మేము మాత్రము నీవు
ఆవిధముగా చూపినచో చూడలేమా యేమి. మై మాకు చూపుటకు నీవేలరాకుంటివి?
8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మున్నుంచి మన్నించు నీ
నన్నున్, నా నిను నెన్నునాన్నను ననూనా! మున్నె మన్నించు నో
కన్నా! రక్షకు డీవె కాదె. మనమున్ గాంచన్ మహోదార! శ్రీ
మన్నారాయణ! కావుమయ్య. జగతిన్ మంచిన్ గృపన్ గావుమా. !
భావము.
పరిపూర్ణుఁడవైన ఓ శ్రీమన్నారాయణా! ఇతః పూర్వమే నిన్ను మనసులో ముందుగా నిలిపి
మన్నించు నీవాడినైన నన్ను, నాకు సంబంధించిన నిన్ను గుర్తించెడి నా యొక్క అన్నను
ముందుగానే మన్నించునటువంటి నీకన్నారక్షకులింకెవరు?
మనసుపెట్టి చూచెడి మహోదారగుణ
సంపన్నుఁడా! కాపాడుము. లోకమున మంచిని కృపతో కాపాడుము..
9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,
బిన్నన్, నేఁ గనఁ జాలనయ్య నిను గోపీనాథ! యంతర్ముఖుం
డెన్నంజాలు నినున్, శుభాస్పదుఁడ! నీవే నాకు కన్పించు. శ్రీ
మన్నారాయణ పూజ్య పాద జలజా! మాం పాహి. సర్వేశ్వరా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీవు నా హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభతో కొలువై యున్నావు.
నేను చిన్నవాడిని. నిన్ను ఏ విధముగనూ నిన్ను చూచుటకు సరిపోను. అంతర్ముఖుఁడైనావాడి
నిన్ను గుర్తించగలడు. ఓ శుభాస్పదుఁడా! నీవే నాకు కన్పించుము. ఓ పూజ్య పాదపద్మములు
కలవాడా! సర్వేశ్వరా! నన్ను రక్షించుము.
10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ మిధ్యా స్వరూపుండవై!
మన్నున్ గాంచిననుంటివీవె యచటన్ మాదేవరా! యెట్లు నీ
వున్నావన్నిట నెల్ల వేళలను ? నేనున్నా నిటన్, జూడు. శ్రీ
మన్నారాయణ! నీదు పాదములె సమ్మాన్యుండ! నన్ జూడనీ.
భావము.
ఓ శ్రీమన్నారాయణా!
జగత్కారకుడవైన ఓ శ్రీకృష్ణా!
ఆకాశమును చూచినచో అక్కడ
మిధ్యాస్వరూపుఁడవై నీవే నిండియున్నావు. భూమిని చూచినను అక్కడ కూడా నీవే నిండియున్నావు.
ఓ మా దైవమా! అన్ని సమయములందును అన్ని ప్రదేశములయందునుఏ విధముగా నీవుంటివి?
ఇక్కడ నేనుంటిని. నన్ను చూడుము. నీ పాదద్వయమును నా మనమున గౌరవముతో గాంచునట్లు
చేయుము.
11. శా.
పున్నెంబుండును బేదలన్ గనుమయా. పోషింపఁగా లేక తా
మన్నంబైనను బెట్టలేక సుతులన్ బాధించుచున్నారు. నీ
వున్నావన్నది సత్యమై ప్రబలఁగా నోదార్చి పోకార్పు. శ్రీ
మన్నారాయణ!బాధలన్ బ్రజలకున్, మాకీవ మూలంబుగా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీకు పొణ్యముండును.పేదవారిని చూడుము. తమ సంతానమును పోషింప
లేక కనీసము వారికి అన్నమైనను పెట్టలేక, ఆకలిబాధకు లోనగునట్లు చేయుచున్నారు.
నీవున్నావన్న విషయము సత్యమై వ్యాపించునట్లుగా అట్టి పేదలనోదార్చి, వారి పేదరికము
పోగొట్టుము. శ్రేష్టమైన మనసు కలవాడవయి వారి కష్టములను మాపివేయుము.
12. శా. పున్నెంబే కద పేద సాదలకుఁ బ్రాపుం గొల్ప నీవున్నచో.
మన్నింపంబడు దీవెగా? దయను రామా! కావు మమ్మంచు వా
రున్నం గానవు, నీకు నొప్పగునొ? కాదో పాపమిట్లున్న? శ్రీ
మన్నారాయణ! శ్రీరమా రమణ! ప్రేమం జూపుమా వారిపై!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీవున్నట్లైనచో పేదసాదలకు ఆధారము కల్పించితివేని అది నీకు పుణ్యమే
కదా. వారిచేత నీవేకదా గౌరవింపఁబడుదువు? ఓ రామా దయతో మమ్ము కాపాడుమయ్యా అనుచు ఆ
పేదలు నిన్ను ప్రార్థించుచున్నను నీవు చూడవుకదా. ఇది నీకు సముచితమగునాయేమి? ఈ
విధముగ చేసిన నీకు పాపమంటదా? ఓ రమారమణా! నీవు అట్టి వారిపై ప్రేమను చూపుము.
13. శా. కన్నుల్ కల్గఁగ జేసితీవె కనఁగాఁ గన్నార నిన్ గానఁగాన్.
గన్నా! నిన్ గనుఁగొన్న మన్ననయెగా? కన్పింప రావేల? కా
కున్నన్ సర్వ జగంబునన్ గనమనా, యుత్సాహమున్ నిన్ను, శ్రీ
మన్నారాయణ! కాంతుమన్నిట నినున్ మర్మంబు పోకార్చినన్!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఆలోచింపగా కన్నులనిండుగా నిన్ను చూచుట కొఱకు నీవు మాకు కన్నులను
కల్గునట్లు చేసితివి. ఓ కన్నయ్యా! నిన్ను చూచినచో మాకు గౌరవమే కదా. అటువంటప్పుడు మాకు
కనిపించవేమి? ఆ విధము కానిపక్షమున సమస్త లోకమున ఉత్సాహముతో నిన్నే చూడమనా? మాలో
మాయను నీవు పోవునట్లు చేసితివేని అన్నింటి యందును నిన్నే మేము చూచెదము.
14. శా. కన్నుల్ సూచెడి శక్తి కల్గియును నిన్ గాంచంగ లేవేలనో?
మన్నైపోయెడి దేహమందు కల నిన్ మర్యాదగాఁ జూడలే
కున్నన్ గన్నులవేల మాకుఁ? గననీవో నిన్ను గుర్తించి? శ్రీ
మన్నారాయణ! దేహివౌచుఁ గల నిన్ మా కండ్లతోఁ జూడనీ.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! కన్నులకు చూచెడి శక్తి యున్నప్పటికీ ఎందుచేతనో కాని నిన్ను
చూడలేకపోవుచున్నవి మన్నైపోయే ఈ శరీరమునగల నిన్ను గౌరవప్రదముగా చూడలేకపోయినచో
అట్టి కన్నులు మాకెందులకు? నిన్ను గుర్తించి చూడనీయవా యేమి? దేహధారివై మా రూపములో
నున్న నిన్ను ఈ కన్నులతో చూడనిమ్ము.
15. శా. కన్నారన్ నినుఁ గాంచ వేడుక, జగత్ కల్యాణ రూపుండ! నే
నున్నానంతట చూడు నన్ననుచు మా యూహల్ నిజంబంచు, మా
పున్నెంబై కనిపించుమొక్కపరి. మేమున్ నీకు కన్పింప శ్రీ
మన్నారాయణ! నీదు మంచి కననీ. మాపూజలందించనీ.
భావము.
లోక కల్యాణ స్వరూపా! ఓ శ్రీమన్నారాయణా! మా కన్నులారా నిన్ను చూడవలెనని మాకు వేడుక.
నేను అంతటా ఉన్నాను అనుచూ మా ఊహలు నిజమే అనుచు ఒక్కపర్యాము మేమూ నీకు
కనిపించు విధముగా మా ముందు నిలిచి, మా పుణ్య ఫలమై కనిపించుము. నిన్ను మనసారా చూడనీ.
మా పూజలు నీకు మేమందించునట్లు అనుగ్రహింపుము.
16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయఁగాఁ.
గన్నన్ నీ దర హాసమే కనవలెన్ గాంచంగ మోక్షంబు. లే
కున్నన్ జన్మము వ్యర్థమే కనఁగ దీనోద్ధారకా! దేవ! శ్రీ
మన్నారాయణ! ప్రేమతోడుత మమున్ మన్నించి రక్షింపుమా.
భావము.
దీనోద్ధారకా! ఓ శ్రీమన్నారాయణా! విన్నట్లైతే మాలో క్రమ్ముకొనిన భ్రాంతులు మాసిపోవువిధముగా నీ
నామమే వినవలెను కదా. చూచినట్లైతే మోక్షము పొందజేయు నీ చిఱునగవే కనవలెను. ఆ విధముగ
కానినాడు ఈ జన్మము వ్యర్థమే సుమా. నీవే మమ్ములను చూచి, మన్నించి రక్షించుము.
17. శా. వన్నెల్ చిన్నెలు భ్రాంతి కారకములా భ్రాంతిన్ హృదిన్ గోర్కెలౌ
నెన్నన్ దద్గతి శత్రు షట్కమలమున్, దృష్టంబులౌ దుర్గతుల్.
కన్నుల్ మూలములింతకున్, గనుక నేఁ గాంక్షింతు జ్ఞానాక్షి. శ్రీ
మన్నారాయణ! జ్ఞాన నేత్రమగుచున్ మాయందు నీవుండుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఈ జగత్తులోని వన్నెలు చిన్నెలు కేవలము మాలో భ్రాంతి పుట్టుటకు
మూలములు. అట్టి భ్రాంతి కారణముగా మాలో కోరికలు జనించును. ఆ విధముగా అరిషడ్వర్గము
మాలో అలముకొనును. ఆపై దుష్టమైన అధోగతులు నిశ్చయము.. ఇన్నింటికీ కన్నులే మూలము
కనుక నేను నిన్ను జ్ఞాననేత్రమును మాకు ప్రసాదించుమని కోరుచుందును. నీవే జ్ఞాన నేత్రముగా
నీవే ఉండుము.
18. శా. విన్నన్ జాలును నీదు నామ మహిమల్, వీనుల్ శుభంబుల్ కనున్.
విన్నన్ లౌకిక దౌష్ట్యముల్ పతనమే వీనుల్ ప్రబోధించు, నో
యన్నా! నీ శుభ నామ దివ్య సుధ జ్ఞేయంబై వినం జేసి, శ్రీ
మన్నారాయణ ముక్తి దాతవయి, మా మర్యాదనే నిల్పుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా!నీ నామ మహిమను విన్నంత మాత్రమున చెవులు శుభములు
పొందును.లౌకికమైన దౌష్ట్యములను ఈ చెవులు విన్నచో పతనమునే ప్రబోధించును. నీయొక్క
శుభప్రదమైన దివ్యమైన నామామృతమును జ్ఞేయమగుచు వినునట్లు చేసి మాకు ముక్తి దాతవయి,
మా మర్యాదను నిలుపుము.
19. శా. పున్నెంబెంతగఁ గావలెన్ గొలువ నీ పూజ్యాంఘ్రి సాహస్రమున్?
గన్నుల్ కాయలవెంత కాయవలె నిన్ గాంచంగ విశ్వేశ? పో
తన్నన్ గావలెనా నుతింప నిను మోహ భ్రాంతులన్ వీడి? శ్రీ
మన్నారాయణ! మా మదిన్ నిలువుమా! మమ్మున్ గృపన్ జూడుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీ పూజ్య పాదములను సేవించవలెనన్న మాకెంతటి పుణ్యఫలము
ఉండవలెనయ్యా? ఓ విశ్వేశ! నిన్ను చూచుటకొరకై ఎదురు చూచుచు కన్నులెంతగా కాయలు
కాయవలెను? మోహభ్రాంతులను విడిచిపెట్టి నిన్ను నుతింపవలెనన మేము భాగవతోత్తముఁడైన
పోతన్నగా అవవలెనా? మా మదిలో నీవు నిలిచియుండుము. మమ్ములను కృపతో చూడుము.
20. శా. జున్నున్, బాలును, మీగడల్, పెరుఁగు, సంశోభన్ మదిన్ దోచు నా
వెన్నల్, ఘుంఘుమలాడు నేయియును, సేవింపంగ నీకుండఁగా,
నన్నింటిన్ విడి మన్నుతింటివని మీ యమ్మే నినున్ గొట్టె, శ్రీ
మన్నారాయణ! చూడ నన్నిట నినున్మాకున్ బ్రబోధింపనో?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! జున్ను, పాలు, మీఁగడ, పెరుగు, వెన్న, నేయి, ఇవన్నియు నీకు ఉండగా
వీటినన్నింటినీ విడిచి మన్నును తింటివని నిన్ను నీ తల్లి దండింపఁ జూచెను కదా! ఆవిధముగా
మన్నుతినుట, నిన్ను అన్నింటిలోను చూచెడి విధానమును మాకు ప్రబోధించుట కనియా?
21. శా. ఉన్నావీవిట నన్నుఁ జేరి యని, స్నేహోత్సాహ సంపన్నులై
నన్నున్ మాన్యులు సన్నుతింతురయ. నేనా? నీవ? స్తుత్యార్హతన్
వన్నెన్ గాంచుట? నే గ్రహించితిని. నీ వన్నెల్ ననుం జేరి శ్రీ
మన్నారాయణ! నన్ను నిల్పుటను, సన్మాన్యత్వమున్ గొల్పుటన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఇచ్చట నీవు నన్ను చేరి ఉన్నావని స్నేహ భావముచే కలిగిన ఉత్సాహమే
సంపదదగా కలవారైమాన్యులు నన్ను సన్నుతి చేయుదురు. స్తుత్యార్హతతో నీవా నేనా వన్నెను
గాంచిట? ఆలోచింపగా నీవు నన్ను చేరి నన్ను స్థిరపరచుటకును, సమ్మాన్యత్వము కల్పించుటకును
నీవు చేయుచున్నదని నేను గ్రహించితిని.
22. శా. నిన్నున్ గోరఁగ లేదు పుట్టుటకునై, నీవేలఁ బుట్టించితో?
పున్నెంబీయఁగ వేడ లేదు. నిను నే భోగంబులం గోరలే
దున్నన్నాళ్ళును నీదె బాధ్యత కదా! యుద్ధారకుండీవె. శ్రీ
మన్నారాయణ! కన్న నీవె సతమున్ మమ్మున్ గృపన్ జూడనౌన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా!నిన్ను మేము మమ్ములను పుట్టించమని మేము కోరలేదుకదా. మరి నీవేల
మమ్ము పుట్టించితివి?నిన్ను మేము పుణ్యమునీయమని కోరలేదు. భోగభాగ్యములను కోరుట లేదు.
ఉన్నన్నాళ్ళును బాధ్యత నీదే కదా.మమ్ములను ఉద్ధరించువాడవు నీవే కదా. మమ్ములను కన్నట్టి
నీవే ఎల్లప్పుడూ కృపతో చూడనగును కదా.
23 శా. పున్నెంబెన్నఁగ నేది యౌను? గుడిలోఁ బూజించ నిన్ బున్నెమా?
పన్నుల్ గట్టుచు నేల దున్ని ప్రజకై పండించుటే పున్నెమా?
ఎన్నాళ్ళైనను సేద్యమున్ విడిచి పూజింపంగ నెట్లౌను? శ్రీ
మన్నారాయణ నిన్ను నాత్మఁ గనుచుం బ్రార్థింప పున్నెంబెగా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఎన్నిక చేసి చూచినచో పుణ్యమనాగా ఏది యగును? గుడిలో నిన్ను పూజించుట
పుణ్యమగునా? పన్నులు కట్టుకొనుచు భూమిని దున్నుచు ప్రజలకై పంటలు పండించుట
పుణ్యమా?ఎన్నాళ్ళు గడుచుచున్నను వ్యవసాయము చేయుట మాని నిన్ను గుడికి వచ్చి కొలుచుట
ఎట్లు కుదురును? నిన్ను మనసులో తలచుకొని, ప్రార్థించినచో పుణ్యమేకదా.
24. శా. సాన్నిధ్యంబున నిల్పు నీకు ననునీశా భక్త కల్పద్రుమా!
సన్నద్ధుండను నీ పదార్చనవిధిన్ సంతోషమున్ బొంద నీ
దన్నున్నన్ భవ బంధముల్ తొలఁగు ఖేదంబుల్ విడున్ గాదె. శ్రీ
మన్నారాయణ భక్తియుక్తిమెయి నీ మాహాత్మ్యమున్ గాంచనీ.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓ పరమేశా! భక్తులపాలిటి కల్పవృక్షమా! నన్ను నీకు సమీపమున నిలుపుము.
నీ పాదార్చన చేయుట అనే పని వలన సంతోషము పొందుటకు నేను సిద్ధముగా ఉంటిని. నీ దన్ను
ఉన్నచో భవ బంధములు తొలఁగిపోవును, భాధలు కూడా నశించునుకదా. భక్తితో
కూడుకొన్నవాడినయి నీయొక్క మాహాత్మ్యమును చూడనిమ్ము.
25. శా. ఉన్నావీవు మదిన్ సుచేతనముగా, నున్నావు దేహంబవై.
యున్నావెల్లెడ స్థావరంబులను నీవున్నావుగా దేవ మే
మెన్నంజాలని జంగమంబునను. నీవే సత్యమై నిల్చి, శ్రీ
మన్నారాయణ! కానలేకునికి యీ మాలోని `మా’భావనే.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీవు చైతన్య రూపములో నిత్యము మాలో ఉంటివి. ఈ శరీర ముగా ఉన్నదియు
నీవే. అన్ని కదలని వాటియందును నీవుంటివి. అన్ని కదిలెడి వాటియందును నీవుంటివి. నీవు
నిత్యుఁడవై అంతటను ఉంటివి. పరిపూర్ణ స్వరూపుఁడవైన మేము కానలేకపోవుటకు కారణము మాలో
గూడుకట్టుకొని యున్న మాది, మేము అనే మా అహం భావనయేయే కదా!.
26. శా. ఉన్నామంచు నహంకరించితిమొ? మేమున్నట్లు సాక్ష్యంబుగా
మన్నైపోవక వన్నెలన్వెలుఁగుచున్ మాన్యప్రథన్ జూపనౌ
నెన్నాళ్ళైనను. గాని లేమటుల మా యిచ్ఛానుసారంబు, శ్రీ
మన్నారాయణ! నీవె మేమగుటచే మాయన్నదే లేదిలన్.
భావము.
మేముంటిమి అని అహంకరించుచు మేము ప్రవర్తించుదుమా? అట్లైన మా ఉనికికి సాక్ష్యముగా
ఎన్నటికీ మట్టిలో కలియకుండా, ఏన్నాళ్ళైనను కళ కాంతులతో మా మాన్యప్రథను ప్రదర్శింప
వలెను కదా? మరి మేము కోరుకొను విధముగా మేము ఉండలేము. ఓ శ్రీమన్నారాయణా! నీవే
మేమయి యుండగా మరి మా అనెడిది లేనే లేదు. అంతా నీవే సుమా!
27. శా. నిన్నున్ నమ్ముదురయ్య మేలుఁ గనఁగన్ నిత్యంబిలన్ సజ్జనుల్.
నిన్నున్ నన్నును నమ్ముకొన్న ఘనులన్ నిష్ఠన్ గృపం గావు మా
పన్నత్రాతగ నిల్చి, భక్త సులభా! ప్రారబ్ధముల్ బాపు శ్రీ
మన్నారాయణ మంచి మార్గమిడు. సంపత్కారకా శ్రీధరా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! తమకు శుభములకొఱకు సుజనులు నిత్యమూ నిన్నునమ్ముదురు. నిన్ను,
నిన్నుగూర్చి తెలిపెడి నన్నును నమ్ముకొనెడివారిని నిత్యము నిష్ఠతో కాపాడుము. ఓ సంపత్కారకా! ఓ
శ్రీధరా! ఓ భక్త సులభా! ఆపదలనుండి రక్షించువాడివై నిలిచి మా ప్రారబ్ధములు పోఁగొట్టి, మాకు
మంచి మార్గమిడుము.
28. శా. నిన్నే గంటిని పండితాళి మదులన్ నేర్పార నుండంగ, ని
న్నెన్నున్ మన్నన నా సుధీమణి గణం బేమా మహత్వంబు! మా
కన్నుల్ ముందర నిన్ను నిల్పుదురు రాగ ద్వేషముల్ బాప, శ్రీ
మన్నారాయణ! పండితాళి మదులన్ భాసింతువో నిత్యమున్?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! పండితుల మనసులలో నీవు నైపుణ్యముతో ఉండగా నేను వారిలో నిన్నే
చూచితిని. ఆ జ్ఞానుల సమూహము మన్నన చేయుచు వారి మనసులలో నిన్నే ఎన్నును. అహా! ఏమా
గొప్పఁదనము! మాలోని రాగద్వేషాదులను మటుమాయము చేయుట కొఱకు నీ గాధలు తమ
ఉపన్యాసములద్వారా ఆవిష్కరించుచు మా కన్నులముందు నిన్ను నిలుపుదురుకదా. నీవు
ఎల్లప్పుడు పండితుల మనసులలో ప్రకాశించుచుందువా.
29. శా. కన్నుల్ నిండుగఁ గాంతిరేఖలవిగో కారుణ్యపూర్ణంబులై,
మిన్నున్ మించెడి నీలివర్ణమదిగో మేలైన నీ మేనునన్,
కన్నుల్ పండువ కాదె కాంచ నిను శ్రీకాంతా శుభోపేత! శ్రీ
మన్నారాయణ! భక్త పాలన గుణా! మాకన్నులందుండుమా!
భావము.
భక్తపాలనగుణసంపన్నుడవైన ఓ శ్రీమన్నారాయణా! ఆహా! మా కన్నులు నిండుగా కారుణ్యముతో
ప్రకాశించుచు కనిపించు నీ కాంతిరేఖలు అవిగో, కనిపించుచున్నవి. ఆకాశమును మించిపోయెడి
నీలివర్ణము అదిగో నీ శరీరమున కానవచ్చుచున్నది. ఓ శ్రీకాంతుడా! శుభోపేతుఁడా! నిన్ను
చూచినచో కన్నులపండువేకదా. నీవు మా కన్నులలోనే ఉండిపొమ్ము.
30. శా. ఎన్నో జన్మలు ఘోరమైన తపముల్ హృద్యంబుగాఁ జే సినన్
నిన్నుం జూడగఁ జాలరైరి ఋషులో నిత్యుండ! నీవే మమున్
గన్నారన్ గనుడంచుఁ జూపుదువు నీ కల్యాణ రూపంబు, శ్రీ
మన్నారాయణ! సర్వమీవె కద! ప్రేమన్ జూతుమన్నింట నిన్.
భావము.
నిత్యుఁడవైన ఓ శ్రీమన్నారాయణా! ఘోరమైన తపస్సులు ఎన్నో జన్మలు హృద్యముగా చేసినప్పటికి
ఋషులు నిన్ను చూడలేకపోయిరి. నీ మంగళప్రదమైన రూపమును మమ్ములను కనులారా
చూడమని చూపుదువు నీవు. అంతా నీవే కదా. నిన్ను మేము అన్నింటియందును ప్రేమతో
చూచెదము.
31. శా. నిన్నుం జూచెదఁ బక్షులన్ బశువులన్, దృగ్గోచరంబౌచు నీ
వెన్నింటం గలవన్నిటన్ గనియెదన్ సృష్టిన్ వివేకంబుతోన్.
భిన్నంబింతయుఁ గానరాదవియు నీవేగా! దయాపూర్ణ! శ్రీ
మన్నారాయణ! నీవె లేని యెడలన్ మాకెట్లు కానంబడున్?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! పక్షులయందున, పశువులయందున నేను నిన్నే చూచెదను సుమా. కంటికి
కనఁబడుచు నీవు ఎన్నింటిలో ఉండియుంటివో అన్నింటియందును నిన్ను వివేకముతో చూచెదను.
ఏమాత్రము భేదమనునదే ఈ సృషికి నీకు మధ్య కనఁబడదు. కనిపించెడి గొప్ప శోభలెల్లప్పుడు నీకు
సంబంధించినవే కదా! నీవు లేవు అనునదేదైనా ఉన్నచో అది మాకు ఏవిధముగ కనబడును?
32. శా. మన్నైపోవడు దేహి. దేహ జగతిన్మార్తాండుఁడై వెల్గు నె
నెన్నోకర్మలొనర్ప జేసి తుదకున్ హీనంబు గాన్ శక్తి, యా
క్రన్నన్వీడి పరంబు చేరు, నిహమున్ బ్రాప్తించు బాపంబొ. శ్రీ
మన్నారాయణ పుణ్యమో. తమరివే. మాకేలనీ ప్రాప్తముల్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! దేహముననుండు దేహియైన ఆ ప్రాణశక్తి మట్టిగా అవడు. అతడు
యీ శరీలమనెడి లోకములో సూర్యుడై వెలుగుచుండి ఆ దేహముచే ఎన్నో కర్మలను
చేయజేసి, తుదకు శరీరమునందలి శక్తి క్షీణించగా ఆ శరీరమును విడిచి
వెడలిపోవును. ఇక్కడ చేసెడి కర్మల వలన లభించెడిది పాపమో లేక పుణ్యమో, అవి
తమరివేసుమా. ఈ కర్మ ఫలములు మాకవసరము లేదు.
33. శా. మిన్నున్ మన్నునునేకమైననగు, నీ మీదన్ బ్రమోదంబు పొ
మ్మన్నన్ బోవఁగరాని మార్గమిడు నీ మంచిన్, మనోజ్ఞంబుగా
నెన్నంజాలు పదంబులే దొరకవే, హే భక్త మందార! శ్రీ
మన్నారాయణ! నీ పదాంబుజములన్ మాకందనీ కొల్వఁగా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఆకాశము భూమి ఒకటిగా ఐపోయినను ఐపోవచ్చునుగాక.మాకు నీపై ఉన్న
మిక్కిలి యిష్టము మాత్రముపొమ్మన్నను పోకుండా ఉండు మార్గమును మాకు
కల్పించునటువంటినీలో ఉన్న మంచిని మనోజ్ఞముగా ఎన్నుటకు తగిన పదములే కరువైపోయినవి.
ఓ భక్త మందారా! నీ పద పద్మములనుమేము కొలుచుకొనుటకు వీలుగా మాకు అందనిమ్ము.
34. శా. విన్నన్ జాలును నీ మహాద్భుత కథల్ విశ్వాసమున్ నిల్పి. నే
నున్నానంచు మనమ్మునన్ నిలిచి దీనోద్ధారకుండా మమున్
మన్నైన దగులంగనీక జగతిన్ మన్నించి కాపాడు శ్రీ
మన్నారాయణ! భక్త బాంధవ! తరమ్మా నిన్ బ్రశంసింపగన్?
భావము.
దీనులనుద్ధరించెడివాడవైనఓ శ్రీమన్నారాయణా! నీపై విశ్వాసముంచి నీకు సంబంధించిన
అద్భుతమైన కథలను విన్నచో సరిపోవును. నేనున్నాను మీకు అనుచు మా మనస్సులలో
నీవునిలిచి మాచేతికి ఎటువంటి ఖిలము అంటుకోకుండా చూచుచు, లోకమును కాపాడు
భక్తబాంధవుఁడవు. అట్టి నిన్ను ప్రసంసించుట మా తరమగునా.
35. శా. నిన్నేనమ్ముచు నైహికంబుఁ గనరే నిన్గాంచు భక్తాళి, నీ
దన్నున్ గైకొని జీవనంబు గనరే దారిద్ర్యనారాయణుల్,
కన్నా! ని న్నెదలందుఁ గాంచు ఘనులన్ గాపాడు నిత్యంబు శ్రీ
మన్నారాయణ! భక్త పాలన చణా! మా మాట మన్నింపుమా.
భావము.
భక్తులను పాలించుటయందు నైపుణ్యము కలవాడా! శ్రీమన్నారాయణా!మహనీయులు
నిన్నేవిశ్వసించిఐహిక వాంఛలను విడిచిపెట్టి మనుచుడిరి. దారిద్ర్యముతో
కొట్టుమిట్టాడుచున్నవారు నీ దన్నునే నమ్ముకొని జీవితమును గడుపుదురు.ఓ కన్నా! నిన్నే నిత్యము
మనసులో భావించు మహనీయులను నిత్యము నీవే కాపాడుము. ఈ విషయములో నీవు మా మాటను
మన్నించితీరవలయునుసుమా.
36. శా. పన్నీటన్ జలకంబు లాడెదవు. నీ భక్తాళిచే నిత్యమున్,
గన్నీరింతయు కారనీయని మతిన్ కారుణ్యమే చూపవా?
యెన్నాళ్ళీ కరుణావిహీన మతివై యిట్లుందువో నీవు శ్రీ
మన్నారాయణ! కావు భక్త జనులన్ మన్నించి పోషించుమా!
భావము.
ఓ శ్రీమన్నారాయణుడ! నిత్యము నీ భక్తుల సమూహముచేత పన్నీట జలకములాడెదవు.
అట్టిన్నీకు,ఆ భక్తులకు కన్నీరించుకైనను కారకుండా చూచే కరుణా స్వభావమే లేదా యేమి?
నీవింకాఎన్నినాళ్ళు ఈ విధముగా కరుణ లేనివాడవై ఈ విధముగా ఉందువు?భక్తజనులనుమన్నించి,
కాపాడుచుచు, వారిని పోషించుము.
37. శా. నిన్నున్ గోరెద నాలకించు మనవిన్ నిత్యా! లసద్భక్తి సం
పన్నుల్, పేదలటంచు నెంచకుము. సంభాసించు నీ మానసం
బెన్నంజాలఁ గఁ జేసి మేల్కొలుపు, నీవే వారియందుండి శ్రీ
మన్నారాయణ! సత్య పోషణ గుణా! మాన్యావనా! శ్రీఘనా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా!సత్యమును పోషించు గుణము కలవాడా! శ్రేష్ఠమైన పూర్ణ చంద్రుని బోలు
ముఖము కలవాడా! నిన్ను నేను కోరుచుంటిని. నా మనవినాలకించుము. గుణ సంపన్నులనీ,
పేదలనీ భేదమునుకనిగియుండకుము. వారిలో నీవుండి ప్రకాశించే నీ మనసును గుర్తించునట్లు
చేయుము. .
38. శా. జన్నంబుల్ పచరించి సాధకుఁడు నీ సామీప్యమున్ జేర తా
నెన్నున్. నేనెటు నిన్నుఁ జేరుదునొ? నే నే జన్నమున్ జేయలే
దిన్నాళ్ళైనను. దేవదేవ నిను నే నే రీతి దర్శింతు? శ్రీ
మన్నారాయణ! నీదు నామ జపమే మార్గంబుగానెంచితిన్ !
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నిన్ను దర్శింప గోరు సాధకులు యజ్ఞములాచరించినీ సమీపమునకు చేరగా
తలంచును. నేను నిప్పటికినీ ఏ యజ్!జమూ చేయలేదు కావున ఏ విధముగా నిన్ను చేరగలను? ఓ
దేవదేవా! నేను నిన్నేరీతిని దర్శింప గలుగుదును? నిన్ను చేరుట కొఱకు నేను నీ నామ జపమును
మాత్రము మాననుసుమా.
39. శా. అన్నంబో రఘురామ యంచు జనులాహారంబు నర్ధింత్రు, సం
పన్నుల్ క్రిందను, మీదఁ బోయుదురు. భవ్యా! నీ మదింగాంచితే?
యన్నంబీవె. లభింపుమందఱికి. దేహార్తిన్ దొలంగించు! శ్రీ
మన్నారాయణ! ఆర్త సాధు జనులం బాలించు, భుక్తిప్రదా!
భావము.
భవ్యుఁడవైన ఓ శ్రీమన్నారాయణా!అన్నమో రామచంద్రా యని పెక్కురు ఆహారము కొఱకై నిన్ను
వేడుకొందురు. సంపన్నులు తాము తిన్నది జీర్ణమవక బాధపడుచుండుటను మనసుపెట్టి
చూచితివా? అన్నము నీవే కదా? అందరికీ లభింపుమయ్యా. ఆకలి బాధను తొలగించుము. ఓ
భుక్తిప్రదా! పేదలను సాధుజనులను నీవు పాలించుమయ్యా.
40. శా. ఉన్నావన్నిటఁ, గానరావు. హృదిలోనున్నట్టి నీ రూపమున్
గన్నారం గనఁ జాలు వారలు జగత్ కల్యాణ సందర్శకుల్.
పున్నెంబుండును నీకుఁ గానఁ బడుమా. ముక్తిన్ బ్రసాదింప. శ్రీ
మన్నారాయణ ! నిన్ను నమ్మిన ననుం భావింపుమా నీ మదిన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా ! నీవు అన్నింటిలోను ఉన్నావు. ఐనా కంటికి కనబడవు. మనసులోనే ఉండే నీ
రూపమును ప్రత్యక్షంగా చూడగలుగువారు జగన్మంగళ దర్శకులే కదా ! నీకు పుణ్యముండును.
మాకు కనిపింపుము. చక్కని ముక్తిని మాకు ప్రసాదించుటకు, నిన్ను నమ్మియున్న నన్ను నీ
మనసులో ఒక్కపర్యాయము భావన చేయుము.
41. శా. సున్నా పూర్ణము. సృష్టి మూలము. సుధీశుల్ నిన్నుఁ బూర్ణంబుగా
నెన్నన్ జాలుదు రీవు పూర్ణమగుదో? యెన్నన్ మహత్ పూర్ణమౌ
కన్నుల్ గానఁగ లేని రూపమున నాకాశంబునన్ నిండి, శ్రీ
మన్నారాయణ మొత్తమీవె యగుదో? మాకీవెఱింగింపుమా.
భావము.
సున్నాయే పూర్ణమని, సృష్టికి మూలమని జ్ఞానులు నిన్ను పూర్ణ స్వరూపుఁడవని, భావింతురు. కావున
నీవు పూర్ణ స్వరూపుఁడవా? పరిశీలించి చూచినచో మహత్తరమైన పూర్ణ స్వరూపుడుగా కన్నులు
చూడలేని సుస్వరూపమున ఆకాశమంతయు నిండియుండి మొత్తమంతా నీవే నిండి యున్నావా?
నన్ను మన్నించి నాకు తెలియఁ జేయుము.
42. శా. అన్నంబెవ్వనిచే సృజింపబడునయ్యాద్యుండు రైతన్నయే.
తన్నుందాను కృశింపఁ జేసుకొని సత్తన్ గూర్చు జీవాళి కిం
కెన్నాళ్ళైనను మారనట్టి బ్రతుకై యిబ్బందులన్ బొందు. శ్రీ
మన్నారాయణ! హాలికున్ గనుమ ! సమ్మాన్యున్ గృపన్ బ్రోవుమా.
భావము. ఓ శ్రీమన్నారాయణా! మేము తినెడి ఆహారమైన అన్నము ఎవనిచే సృజింపఁబడుచున్నది?
ఆ ఆది పూజ్యుఁడు వ్యవసాయము చేయు రైతన్నయే కదా.
తనను తాను కృశించిపోవునట్లుగా శ్రమ
చేయుచు జీవకోటికి శక్తిని కూర్చుచుండేను. తనకిక ఎన్నాళ్ళైనను మారక ఎప్పుడూ ఇబ్బంది
పడుతూనే ఉండును కదా! అట్టి హాలికుని నీవు కరుణతో చూడుము. సన్మాన్యుఁడైన అతనిని
ఎల్లప్పుడు నీవు కాపాడుచుండుము.
43. శా. ఖిన్నుండై తపియించు హాలికునకున్ గేలిచ్చి కాపాడు నీ
వున్నావన్న నిజంబు నెన్నునటు నీ యున్కిన్ నిరూపించు. భా
వౌన్నత్యుండగు హాలికున్ గనుము స్నేహార్ద్రాంతరంగుండ! శ్రీ
మన్నారాయణ! పోతనార్యునివలెన్ మా రైతులన్ గానవో?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! వ్యవసాయము చేయు హాలికుడు కష్టములవలన శోకించుచు మిక్కిలి
తపించుచుండెను అట్టి రైతునకు నీచేతిని అందించి సహాయపడునటువంటి నీవు ఉన్నావన్న
సత్యమును గుర్తించునట్లు నీ యునికిని నిరూపించు ఉన్నత భావములు కలిగియున్న రైతును
చూడుము. పోతన్నను చూచిన విధముగామాకు ఆహారము పండించు మా రైతులను
కాపాడకుందువా?
44. శా. కన్నా! నీ పద సేవకై విరులు సంకల్పించి పుష్పించుచున్.
వన్నెల్ చిన్నెలు నీ పదాంకితముగా భావించి యుప్పొంగవే,
మున్నేపున్నెము జేసి పుట్టినవొ యీ పూవుల్ నినున్ జేర. శ్రీ
మన్నారాయణ! నా హృదబ్జమును బ్రేమన్ నిన్నిఁకన్ జేరనీ.
భావము.
ఓ కన్నా! పూవులు నీ పాద సేవకొఱకై సంకల్పించి వికసించుచు తమ వన్నెలు, చిన్నలు
నీపాదములకంకితమగునని మనసులో భావించుకొనుచు పొంగిపోవుచుండును. నీపాదములను
చేరుటకు ఈ పూవును పూర్వము ఎటువంటి పుణ్యమును చేసియుండెనోకదా! ఓ శ్రీమన్నారాయణా!
నా హృదయ పద్మమును కూడా ఇంక ప్రేమతో నిన్ను చేరనిమ్ము.
45. శా. పున్నెంబో, మరి పాపమో యెఱుగ నేఁ బుష్పంబులన్ గోయుచున్ ,
నిన్నున్ బూజలొనర్చుచుంట. జగతిన్ధీశాలి పాపయ్య గా
రెన్నెన్ బుష్ప విలాపమున్ , దెలియుఁగా. హృద్యంబుగానుండు. శ్రీ
మన్నారాయణ ! పుష్పముల్ తునుముటన్ మాకంటునా పాపముల్ ?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! పుష్పములను తునిమి నీకు పూజలు చేయుచుండుట అను పని పుణ్యమో లేక
పాపమో నేను ఎఱుఁగను. లోకమున ధీశాలియైన జంధ్యాల పాపయ్యశాస్త్రి పుష్ప విలాపమును
గుర్తించి ఖండికగా వ్రాసెను. ఆ విషయము నీకు తెలుసును కదా. అది మిక్కిలి హృద్యమైన ఖండిక.
ఆ విధముగ పుష్పములు తునుముట వలన మాకు పాపములు కలుగునా?
46. శా. నన్నున్ గావఁగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ
వున్నావందఱికోసమంచుఁ గని , దీనోద్ధారకా ! స్వార్థమున్
మున్నే వీడి , నమస్కరించుట తగున్ , బూజ్యుండ ! నీపైన శ్రీ
మన్నారాయణ ! భారముంచఁ, గృపతో మన్నించి రక్షింపవో?
భావము.
దీనోద్ధారకుడవైన ఓ శ్రీమన్నారాయణా ! నన్ను కాపాడుట కొఱకు నిన్ను రమ్మనినచో అది నా
స్వార్థమే అగును కదా. ఆ విధముగా కాక , నీవున్నది ఆందరికోసమూనని భావించి , స్వార్థమును వీడి ,
నీకు నమస్కరించి , నీపై భారము వేసినచో కృపతో నీవే మమ్ము రక్షింపకుండా ఉండ గలవా ?
47. శా. పిన్నల్ పెద్దలు మంచి చెడ్డలనుచున్ బేర్కొంచు సిద్ధాంతముల్
నిన్నున్ నమ్మిన వారినెన్ని పలుకన్ నీవారు సందేహులై
యున్నావంచును లేవటంచు మదినెన్నో భావముల్పొంద, శ్రీ
మన్నారాయణ ! సత్యమున్ దెలుపుచున్ మాన్పింతువే శంకలన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా ! చిన్నవారూ , పెద్దవారూ కూడా నిన్ను నమ్మియున్న భక్తుల వద్ద ఇది మంచి
ఇది చెడ్డ అనుచూ ఏవేవో సిద్ధాంతీకరించి చెప్పుచుండుట చేత నీ భక్తులు సందేహములోపడినవారై
నీవు ఉన్నావని , లేవని , మనసులో అనేక భావములను పొందుచుండ, నీవు సత్యమును తెలియ
జేయుచు సందేహములను పారద్రోలుదువు కదా..
48. శా. భిన్నత్వంబుననేకతన్ గలిగి నీవే మాకునన్నింటిలో
నున్నావంచు నెఱుంగఁ జేయు మతితో నొప్పారితో ? కానిచోఁ
గన్నుల్ ముందట నుండియుందువు కదా కన్పించుచున్ మాకు. శ్రీ
మన్నారాయణ ! మా ముదంబు కొఱకై మా ముందె నీవుండుమా !
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! అన్నింటిలోను మాకు నీవు ఉన్నావనుచు తెలుపుట కొఱకు మా ముందే
భిన్నత్వములో ఏకతను కలిగి యుంటివా ? అటుల కానిచో మా కన్నుల ముందరే మాకు
కన్పించుచు ఎదురుగా ఉండెడివాడవు కదా. మా సంతోషము కొఱకై మాకు ఎదురుగా ఉండుము.
49. శా. కన్నుల్ మూసిన నీ పదాబ్జములనే కాంచన్ మదిన్ గోరుదున్.
గన్నుల్ చూచిన నీ స్వరూపమొకటే కాంక్షింతుఁ జూడంగ. నీ
సాన్నిధ్యంబునె కోరుదున్నిరతమున్ సాయుజ్యముం గోరి. శ్రీ
మన్నారాయణ ! మార్గమీవెకద సన్మార్గంబు నేఁ జేరగన్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా ! నా కన్నులు మూసియున్నప్పుడు నీ పాదపద్మములనే చూడ గోరుదును. నా
కన్నులు చూచుచుండు సమయమున నీస్వరూపమును మాత్రమే చూడ గోరుదును. నీ
సాయుజ్యము చేరుటకు ఎల్లప్పుడు నీ సాన్నీధ్యమునే కోరుదును. నేను సన్మార్గమును జేరుటకు
50. శా. నిన్నే సూర్యునిగాఁ దలంచితినిపో నీవుండవే రాత్రులన్
నిన్నే చంద్రుడవంచు నెంచఁ గనినన్ నీవుండలేవే పవల్.
నిన్నున్ వాయువనంగ న్యాయమగు. క్షోణిన్ శ్వాసవై వెల్గు శ్రీ
మన్నారాయణ ! నీవె రాత్రి, పవలున్ , మత్ ప్రాణశక్తిప్రదా !
భావము.
నాకు ప్రాణశక్తినొసగువాడా ! శ్రీమన్నారాయణా ! నిన్నే నేను సూర్యునిగా భావించినచో నీవు
రాత్రులందు కానరావు కదా. పోనీ చంద్రునిగా తలంచుదమన్న నీవు పగలు కానరావు. నిన్ను
వాయువుగా భావించుటయే న్యాయము. భూమిపఒ ప్రాణికోటికి శ్వాసవై వెల్గువాడా! నీవే రాత్రీ
51. శా. ఔన్నత్యంబున వెల్గు సజ్జనుల భావౌన్నత్యమే దుష్టులం
దున్నన్ మేలుగ సాగదే జగతి? భావోదారులై శిష్టులై
పున్నామాదులఁ జేరకుండి. నిను సత్పూజ్యున్ మదిన్ గొల్త్రు. శ్రీ
మన్నారాయణ ! సత్ప్రవర్ధనమగుnన్ మంచిన్ బ్రవర్ధింపుమా, cin br
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఉన్నతముగా ప్రవర్తించు సజ్జనులలోనుండే భావౌన్నత్యమే
దుష్టులయందునూ ఉండినచో ఈ లోకము మంచిగా కొనసాఢదా ? ఉదార భావులై
మంచిగాప్రవర్తించువారై పున్నామాది నరకమంలకు చేరక సత్పూజ్యుడవయిన నిన్ను తమ
మనసులో కొలుతురు. మంచి ప్రవృత్తి కొఱకు మార్గమును చూపుము.
52. శా. ఎన్నాళ్ళీ కొఱగాని కర్మ ఫల దుష్కృత్యంబులంజేయుటిం
కెన్నాళ్ళీ దురపిల్లు కర్మ గతులన్ హేయంబుగానుంట? నీ
వన్నింటిం గని మిన్నకుండుదు విదేమైనన్ బ్రమోదంబె? శ్రీ
మన్నారాయణ! కర్మముల్ గడపి, ప్రేమన్ ముక్తిఁ గల్పింపుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఎన్నాళ్ళవరకూ ఈ వ్యర్థమైన పురాకృత కర్మఫలములుగా సంప్రాప్తించిన
దుష్కృత్యములను చేయుట? ఇంకా ఎన్నాళ్ళు ఈ దుఃఖించు కర్మగతులలో హీనముగా జీవించుట?
అన్నీ నీవు చూచుచుండియు మిన్నకుందువు. ఇదేమైనా సంతోషమా? ఈ కర్మలను పోఁ జేసి
ప్రేమతో మాకు ముక్తిని ప్రసాదించుము.
53. శా. కన్నుల్, కాళ్ళును , జేతులున్, మెదడు, నోంకారోజ్వలచ్చిత్తమున్,
మన్నైపోయెడి సర్వ సంపదలు, సమ్మాన్యంపు జిహ్వాగ్రమున్ ,
గన్నా ! నీ కథలాలకించు చెవులున్, గానంగ నీచేత శ్రీ
మన్నారాయణ ! వెల్గు. నీవరిగినన్ మాయున్ గదా యిన్నియున్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! బాహ్యేంద్రియములు , జ్ఞానేంద్రియమగు చిత్తము. నీవు శరీరములో
నుండుటచే ప్రకాశించును. నిత్యుడవైన ఓ హరీ ! నీవు శరీరమును వీడి పోయినచో ఇవన్నియు
మాసిపోవును కదా.ప్రాణశక్తివైన నీవే నిత్యుఁడవు. భౌతికమైన యీదేహాదులు అనిత్యములే.
54.శా. చెన్నారన్ ననుఁ జేరఁదీసిన హరీ ! శ్రీనాథ ! సర్వేశ్వరా !
ఎన్నాళ్ళైనను నీ పదాబ్జములు నా హృత్పీఠిపై నిల్పెదన్.
నిన్నే నమ్మిన నన్నుఁ బోలు జనులన్, నిర్భాగ్యులన్ బ్రోచు శ్రీ
మన్నారాయణ ! నీ కృపన్ దెలుపఁగా మాకౌనె ? సంపత్ఫ్రదా !
భావము.
ప్రేమతో నన్ను చేరదీసినవాడవైన ఓ శ్రీ నాథుడా ! ఓ సర్వేశ్వరా ! ఎంత కాలము గడచినను
నేను నీ పాద పద్మములను నా హృదయమనెడి సింహాసనముపైననే నిలిపి ఉంచెదను.
నిన్నుమాత్రమే నమ్మియుండెడి నావంటి ప్రజలను , నిర్భాగ్యులను ప్రోచెడి ఓ శ్రీ
మన్నారాయణా ! ఓ సంపత్ప్రదుడా ! నీకు గలకృపాస్వభావమును వివరిఃచుట మాకు
తరమగునా !
55. శా. నిన్నే నమ్ముచు మన్ననమ్మున మనన్ నేనెంచుచుండంగ, న
న్నెన్నో వేదనలంటి చిత్తమున నిన్నేకాగ్రతన్ గొల్వనీ
వెన్నాళ్ళీవిధినుంచనెంచితివి? రావేలన్ ననున్ గావ? శ్రీ
మన్నారాయణ! వేదనల్ సమయ ధర్మ ప్రీతిఁ జేకూర్చుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నేను నిన్నే నమ్ముకొని గౌరవముగా జీవించవలెనని భావించుదును.కాని
ఎన్నోవిధముల బాధలు నా మనసును చుట్టిముట్టి నిన్ను తదేక దీక్షతో కొలవనీయకున్నవి.
ఎన్నాళ్ళీవిధముగా నన్ను నీవు ఉంచవలెననుకొనుచుంటివి? ఈ వేదనలను బాపి నన్ను
కాపాడుటకు రావేమి? నా బాధలు సమసిపోయినచో ఏకాగ్రతతో నిన్ను నేని సేవించుదును కదా!
56. శా. మున్నే వేదములుగ్గడించె నిను సంపూర్ణుండుగా. సత్యమే.
అన్నీ గాంచఁగ నర్థమయ్యెనయ నీ వన్నింటిలో నుంట. యే
మన్నన్ దక్కువె నిన్ను. సత్యమగు నిన్నాత్మన్ సదా నిల్పి , శ్రీ
మన్నారాయణ కాంతు, నన్నుఁ గృపతో మన్నించి, లోన్ వెల్గుమా.
భావము.
నిన్ను సంపూర్ణుడవని వేదములానాడే ఉగ్గడించినవి. నిజమే.
అన్నీ చూచుచున్నప్పుడు ఇది సత్యమని నాకర్థమయినది. నిన్ను ఏమన్నను అది
తక్కువే యగును. నిత్య సత్యమైన నిన్ను నా ఆత్మలో నిత్యము నిల్పి నిన్నుఁ జూచుకొనుచుందును.
కృపతో నీవు నాలో ప్రకాశించుము.
57. శా. మిన్నంటున్ మది హర్షచంద్రికలు నీ మీదన్మనంబుంచినన్.
జన్నంబుల్ పని లేదు. నీ తలపులే సద్యజ్ఞసత్కార్యముల్.
మన్నింపంబడు దేవ! నీవిక మమున్ మన్నించి కాపాడు. శ్రీ
మన్నారాయణ ! యజ్ఞతత్వమిదె కాన్ మా యజ్ఞమీవే సదా.
భావము.
ఓశ్రీమన్నారాయణా ! నీపైనే మనసును నిలబెట్టినచో మా సంతోషములు
ఆకాశమునంటును.యజ్ఞములతోపనియేమున్నది. నిన్నుగూర్చిన ఆలోచనలే మంచి యజ్ఞములు
చేయుట యనెడి మంచిపనులుమన్నించేటువంటి గుణము కలిగి యుండుట చేత
గణింపబడువాడా !మమ్ములను మన్నించి కాపాడుము. ఓ
శ్రీ మన్నారాయణా ! యజ్ఞతత్వము ఇదే అయి యుండగా యెల్లప్పుడూ మాయజ్ఞము నీవే సుమా.
58. శా. పన్నీటిన్ జిలికించి నిన్నుఁ గొలిచే భక్తాళికిన్ భాష్పముల్ . . . ?
కన్నీటిన్ గలిగించు దుష్ట తతికిన్ గామ్యార్థ సంప్రాప్తియున్ . . . ?
విన్నన్ నవ్వెరె నీ విలాస గతికిన్? విశ్వంబు నిట్లేల శ్రీ
మన్నారాయణ! చేయుచుంటి వకటా! మా మంచి నీకొప్పదా?
భావము.
ఓ శ్రీమన్నారాయణా ! నీకు పన్నీటితో స్నానము చేయించుట మున్నగు సేవలు చేయు
భక్తులసమూహమునకు కన్నీరు , ఇతరులచే కన్నీరు పెట్టించు దుర్మార్గుల సమూహమునకు
కామ్యార్థలాభము,
అయ్యో ఇట్టి నీ విలాసముతో కూడిన నడవడి విన్నవారు నవ్వరా? నీవు సృష్టిని ఈ
విధముగా ఎందుకు చేయుచుంటివి? మా మంచితనము నీకు ఒప్పదా?
59. శా. కన్నుల్ గొల్పి, కనంగఁ జేసి, మదిలోఁ గాంక్షల్ ప్రవర్ధింప, నీ
వన్నెల్ చిన్నెలశాశ్వితంబులను దేవా! నీవె కల్పించి, మ
మ్మున్నిల్పం గనుదో దురాత్ములుగనో పూజ్యుండ! ధర్మంబె? శ్రీ
మన్నారాయణ! మంచి దృష్టినిడినన్ మర్యాదగా మెల్గమే?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! మాకు కన్నులనిచ్చి అన్నిటినీ చూచునట్లు చేసి, ఈ చూచుట మూలముఅ
మాలో కోరికలను ప్రకోపింపఁ జేయుట కొఱకు లోకములో అశాశ్వితమైన వన్నెలు చిన్నెలు
నీవే
కల్పించి మమ్ములను దురాత్ములుగా నిలుప దలచినావా? నీకిది ధర్మమగునా? నీవు మంచి దృష్టినే
ప్రసాదించినచో మేము మర్యాదగా ప్రవర్తింపకుందుమా?
60. శా. తిన్నన్ నీ కృప లేనినాడరుగదే దుపించు దధ్యన్నమై
నన్నీసత్కృప గల్గ రాళ్ళయినజీర్ణంబౌనిదే వింత. నీ
కన్నన్ వింత మరేమి కల్గు భువి శ్రీకాంతా మనోద్భాస!. శ్రీ
మన్నారాయణ ! జీర్ణ శక్తినిడుమా మన్నించి జీవాళికిన్.
భావము.
ఓ శ్రీ మన్నారాయణ ! నీ కృప లేకపోయినచో మేము తీనెడి ప్రకాశవంతమైన పెరుగూ
ఆన్నమైనా జీర్ణము కానేరదు. నీ కృప కలిగియున్నచో రాళ్ళైనా జీర్ణమగును కదా.
ఇదే విచిత్రము. నీకన్నా వింత భూమిపై మరేమి ఉండును ?
లక్ష్మీదేవి హృదయమున ప్రకాశించువాడవైన హరీ ! జీవాళిని మన్నించి
జీర్ణశక్తీని ప్రసాదించుము.
61. శా. అన్నైవత్తువు నన్ను కావ కృపతోనానంద సంధాయివై,
అన్నాయంచును వచ్చి చేరుదువు నన్నా త్రంబుతో తమ్ముగా
నన్నన్నా భవదీయ సత్కృపకునంతన్నట్టిదే లేదు. శ్రీ
మన్నారాయణ ! భక్తపాలనపరా ! మత్పుణ్యభాగ్యా ! హరీ !
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీవు ఆనందమును కూర్చువాడవై నాకు అన్నగా కాపాడ వత్తువు.
భక్తపాలనపరుడా. నా పుణ్యభాగ్యమైన శ్రీ హరీ. ఆ నీవే నన్ను అన్నాయని
పిలుచుచు ఆతురతతో తమ్ముడుగా నన్ను చేరుదువు. అన్నన్నా. నీ కృపకు అంతు
అనేటువంటిదే లేదుకదా.
62. శా. మన్నించందగు వారలంచుఁ గనుమా మాన్యుండ నీ భక్తులన్.
మన్నించన్, బరివర్తనమ్మునను సమ్మాన్యాళిగా మారి, యా
పన్నత్రాతవటంచుఁ గొల్తురు కదా. ప్రార్థింతు మన్నింప. శ్రీ
మన్నారాయణ ! మంచి పెంచుమిలలో మా పూజ్య దేవా ! హరీ !
భావము.
ఓ శ్రీమన్నారాయణా ! మన్నించుట అనెడి శుభ లక్షణము నీకున్నదికదా.
మాన్యుడా. నీ భక్తులను నీవు మన్నించినచో వారిలో పరివర్తన కలిగి ,
సుగుణములచే సమ్మాన్యాళిగా మారి , నిన్ను ఆశన్నత్రాతవని సేవింతురు కదా. ఆ
విధముగా నీవు మన్నింప గలందులకు నేను నిన్ను ప్రార్థింతును. మా పూజ్యదైవమా! భూమిపై
మంచిని పెంచుము.
63. శా. కొన్నాళ్ళేకద భూమిపై బ్రతుకు. మా కోపాదులం గాలమే
యెన్నాళ్ళైనను వ్యర్థమౌన్. కనవొ ? నీవీ మార్గమున్ వీడి మే
మున్నన్నాళ్ళును ప్రేమతో బ్రతుకనీ. ఉద్రేకముల్ బాపి. శ్రీ
మన్నారాయణ ! శాంతిమార్గమున సమ్మార్గంబునన్ నిల్పుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! మేము భూమిపై ఉండునది కొన్నినాళ్ళేకదా. మాకున్న
కోపతాపాదుల వలన ఎంత కాలమున్నను నిరుపయోగమగుచున్నదికదా. నీవు గుర్తించవా ?
నీవు ఈ మార్గమును విడనాడి , మేము బ్రతికి ఉన్నంత కాలము మాలోని కోపాదులను
పోగొట్టి , ప్రేమతో బ్రతుకునట్లు చేయుము. మమ్ములనుశాంతిమార్గములో మంచి
మార్గములో నిలుపుము.
64. శా. అన్నన్ జాలును సోహమంచు , మరి దాసోహమ్మటంచంటి, నేఁ
బిన్నన్, నేర్వను నన్ను నీ కొసగుటన్ విశ్వాసమున్ గొల్ప. నా
విన్నాణంబది చాలకుండెనయ. సంవేద్యంబె నీకిద్ది. శ్రీ
మన్నారాయణ ! నీకు తోచినటులే మమ్మందఱిన్ జేయుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఆ పరమాత్మను నేనే అనిన చాలును. నేను నీ ముంగిట
దాసోహమ్మనుచుఃటిని. నీకు నమ్మకము కలుగు విధముగా నన్ను నేనునీకు
ర్పించుకొనుట యెఱుగను. అందుకు నాకు గల విజ్ఞానము సరిపోవుట లేదు. ఆ విషయము
నీకు తెలిసినదే. నీకం తోచిన విధముగా మా అందరినీ నీవే చేయుము.
65. శా. కొన్నాళ్ళేమొ శిశుత్వమున్గొలిపి యింకొన్నాళ్ళు కౌమారమున్.
గొన్నాళ్ళంచిత యౌవనంబు నిడి , యింకొన్నాళ్ళు వార్ధక్యమున్.
గ్రన్నన్ గొల్పి దురంత దుస్థితి మమున్ గ్రమ్మన్ నిరీక్షించు శ్రీ
మన్నారాయణ! నీకు ధర్మ మిదియా? మాకెందుకీవ్యర్థముల్?
భావము.
ఓశ్రీమన్నారాయణా ! మాకు కొన్నాళ్ళపాటు బాల్యము , కొన్నాళ్ళు కౌమారము ,మరికొన్నాళ్ళు
యౌవనము , యింకొన్నాళ్ళు వార్ధకము కొలిపి అంతు లేనిదుస్థితి మమ్ము చుట్టిముట్టగా
నిరీక్షింతువు. నీకు ఇదేమైనా ధర్మమా! ఈనిరుపయోగమైనవన్నియు మాకెందులకయ్యా?
66. శా. పిన్నల్ నిర్మల చిత్తశోభితులెగా. పెద్దౌదురవ్వారలే.
పిన్నన్ లేని దురంత దుష్కృతులిలన్ బెద్దైనచో నబ్బునే !
ఎన్నాళ్ళిట్టులొనర్తువీవిటుల నీకే చెల్లునేదైన. శ్రీ
మన్నారాయణ ! నిర్మలత్వమిడి సన్మార్గంబునన్ నిల్పుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! పసివారునిష్కల్మష మైన మనస్సు కలవారే కదా. ఆ పసివారే
పెరిగి పెద్దవారగుదురు. భువిపై బాల్యమందు లేని దురంతమైన చెడ్డ పనులు
పెద్దవారవగానే వచ్చునా ? ఈ విధముగా నీవు ఎంతకాలము చేయుదువు? ఏదైనా నీకే
చెల్లును కదా! మాకు నిర్మలత్వమును ప్రసాదించి మంచి మార్గములో నిలుపుము.
67. శా. సున్నంబైననునన్నమైన సముఁడౌ శుద్ధాత్మవిజ్ఞాని, కిం
చిన్నాభీలము నేర డుబ్బడు సడిన్, జిత్తంబు పొంగించినన్.
విన్నాణంబది నీవు గొల్పినదెగా వెల్గొందునీరీతి. శ్రీ
మన్నారాయణ ! జ్ఞానభాగ్య గతులన్ మాకున్ బ్రసాదించుమా.
(కించిత్ + నాభీలము = కోచెమయిన బాధను, సడి = నింద.)
భావము.
ఓశ్రీమన్నారాయణా! విశుద్ధమైన ఆత్మజ్ఞానము కలవానికి సున్నమైనను , అన్నమైనను ఒక్కటేకదా.
భూమిపై అతనిని నిందించినను , పొగడినను చిన్నపుచ్చుకొనడు అటులనే పొంగిపోడు.
ఆట్టి
విజ్ఞానము నీవు కలిగించినదే కదా. ఈ విధముగా ప్రకాశించును. జ్ఞాన భాగ్యమును
వరముగనొసంగువాడా. మాకునూ ప్రసాదింపుము.
68. నిన్నున్ మించిన భక్త రక్షకునిలన్ నేనెన్ననో శ్రీహరీ!
నన్నున్ మించిన స్వార్థవర్తనుఁడు కానంరాడదెట్లందువా,
నిన్నున్ నా మదిలోనె శాశ్వతముగా నిల్పంగ వాంఛింతు శ్రీ
మన్నారాయణ నాది స్వార్థమయినన్ మన్నించు నా స్వార్థమున్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓశ్రీహరీ! నిన్ను మించినటువంటి భక్త రక్షకుని నేనీ పృథ్విపై చూడ లేదు.
నన్ను మించిన స్వార్థపరుని కూడా కనిపించడు. అదెట్లనందువా...నిన్ను శాశ్వితముగా నా
మనస్సులో నిల్పివేయవలెనని నేను కోరుకొనుచుందును.. ఇది నా స్వార్థమే అయినప్పటికీ నా
స్వార్థమును మన్నించుము.
69. శా. వెన్నల్ పాలు మనంబులే, కయికొనున్ వెన్నుండటంచున్ ఘనుల్
వెన్నన్ మెక్కకు. వెన్నవంటి మదులన్ వేగాచి కైకొమ్మటం
చున్నిన్నార్తినిఁ గోరుచుందురుగదా. శుద్ధాత్మ సంభాస! శ్రీ
మన్నారాయణ! నీవె శాశ్వతము. నన్ మన్నించి చేకొమ్మయా.
భావము.
శుద్ధాత్మతో ప్రకాశించు ఓ శ్రీ మన్నారాయణా ! మహాత్ములు తమ మనస్సులే యని ,అవి నీవు
స్వీకరింతువని భావించి , నీవు వెన్న తినుట యెందులకు ? మా మనసులేవెన్న పాలు.
స్వీకరించుమని నీ దరికార్తితో చేరి కోరుచుందురు. నీవే మాకు శాశ్వము. నన్ను నీవు
మన్ననముతో
చేనుకొము.
70. శా. కన్నుల్ కాంచెడి శక్తి కోల్పడును. నిన్ గానంగ జ్ఞానాక్షి నా
కున్నన్ జాలును. నీవొసంగుమది నాకున్ దివ్య చక్షుప్రదా!
ఎన్నాళ్ళైహిక దృష్టితో మనగనౌనీశా! పరంధామ ! శ్రీ
మన్నారాయణ! భక్తి గొల్తు నిను. శ్రీమాత్రాత్మనాథా! హరీ.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! లక్ష్మీతల్లియొక్క హృదయేశ్వరా ! శ్రీవారి రీ ! మాకుకలిగియున్న యీ కన్నులు
కొన్నాళ్ళకు వాటీకి ఊఃడే చూచే శక్తీని కోల్పోవును.నిన్ను నేను చూచుట కొఱకు నికు జ్ఞాన
నేత్రముండిన చాలును. నిన్ను నేనుసేవిఃతును. అది నాకొసగుము. ఐహిక దృష్టితో ఎన్నాళ్ళు
జీవనముకొనసొగించనగును ?
71. శా. సన్నేతల్ స్పృహణీయమౌ గరిమతో సత్కార్యముల్ చేయుచున్.
నిన్నేమున్ను స్మరింత్రు సంతసమునన్ నీ దివ్య తేజంబె, సం
పన్నంబౌనటు చేయఁ గార్యముల నుద్భాసింపగాఁ జేసి. శ్రీ
మన్నారాయణ ! సజ్జనాళి కృషినే మన్నించి దీవించుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా ! మంచి నాయకులు వారికిగల మహనీయత యొక్క ఆధిక్యముతో మంచిపనులు
చేయుచు , నీకు గల గొప్ప తేజస్సే తాము చేపట్టిన కార్యము ప్రకాశితమగునట్లు చేసి సుసంపన్నము
అగునట్లు చేయుట కొఱకు ముందుగా సంతోషముతో నిన్నే స్మరించుదురు. అట్టి మంచివారి
ప్రయత్నమును నీవు మన్నించి వారిని దీవింపుము.
72. శా. సన్నంబై చనుచుండెనాయువు. మనశ్శాంతిన్ నినుం గొల్వనే..
క్రన్నన్ వచ్చి ప్రశాంతికూర్చుమయ. నాకన్నన్ హితుల్ లేరనన్.
మన్నైపోవకమున్నె నేను నిను సమ్మాన్యా! మదిం గాంచ శ్రీ
మన్నారాయణ ! నీ పదాంబుజములం బ్రాణంబు చేరున్ గదా.
భావము.
సమ్మాన్యుడవైనవాడా! ఓ శ్రీమన్నారాయణా! చిన్నదయిపోవుచు నా ఆయుర్దాయము
తరిగిపోవుచున్నది. నేను శాంత మనస్కుడనై కనీసము మనసులో భావింపనైను లేదు. నా కన్నా
హితులు నీకు లేరనునట్లుగా నీవు వెంటనే వచ్చి నాకు ప్రశాంతత కలిగించుము. నేను భూమిలో
కలిసిపోవక మునుపే నిన్ను మనసులో చూచినచో నా ప్రాణము నీ పాద పద్మములను చేరును కదా.
73. శా. నిన్నన్ మొన్నను నేడు రేపు, సతమున్ నీ నామ సంకీర్తనే.
నన్నున్ నిల్పెడి ప్రాణ శక్తి, నృహరీ! నాకున్న ధీ యుక్తియున్,
మన్నింపంబడు పద్య ధారవగుచున్ బ్రాప్తించుచున్ బ్రోచు శ్రీ
మన్నారాయణ నిన్ స్మరించు గుణమున్ మాకిమ్ము నిత్యమ్ముగా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! గౌరవింపఁబడే పద్య ప్రవాహముగా నాకు లభించుచు నన్ను కాపాడే
ఓనరసింహా! ఎల్ల వేళలా నీ నామ సంకీర్తనమే నన్ను నిలిపెడి ప్రాణ శక్తియును, నాలోని
ధీయుక్తియును అయియున్నది. నిన్ను నిరంతరము స్మరించు గుణమును మాకిమ్ము.
74. శా. ఎన్నం జాలని భవ్య భాగవతులన్ హృద్యంబుగానొప్పు శ్రీ
మన్నామాద్భుత వాక్సుధా లహరివా ? మచ్చిత్త సంవాసివై
క్రన్నన్ వెల్వడు సత్ కవిత్వ ఝరివా ? కారుణ్యవారాశి! శ్రీ
మన్నారాయణ! దివ్య శక్తినిడి , నీమంబొప్ప నిన్ గొల్వనీ.
భావము.
ఎన్నజాలనంతటి గొప్ప భాగవతోత్తములలో హృద్యముగానొప్పునట్టిశ్రీమన్నారాయణునికి
సంబంధించిన వాగమృత లహరివా ? నా హృదయమున నివశించుచుక్రన్నన వెల్వడునటువంటి
మంచి కవితా ప్రవాహమా నీవు? కరుణా సముద్రుడివా ?ఓ శ్రీ మన్నారాయణా ! మాకు దివ్యమైన
శక్తినొసగి నిన్ను భక్తితోసేవించునట్లు చేయుము.
75. శా. ఎన్నోశంకలవాత్మలో కలుగు నీ వీతీరునీసృష్టి చే
యన్నీకున్ గల మూలమేది ? మహనీయంబైన యామూలమీ
వెన్నాళ్ళే తపమాచరించి గనితో ? సృష్ట్యాదినే నీకు శ్రీ
మన్నారాయణ! సాధ్యమెట్లయినదో ? మా శంక పోకార్పుమా.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! ఎన్నో అనుమానములు ఐవి నా ఆత్మలో కలుగుచున్నవి. నీవు
ఏ విధముగా ఈ సృష్టిని చేయుటకు నీకు కలిగిన మూలాధారమేది ? గొప్పలయిన ఆ
మూలాధారమును నీవు ఎన్నాళ్ళు ఎటువంటి తపస్సూను చేసి పొఃదితతివో ?
సృష్ట్యాదినే నీకు ఇది ఏవిధముగా సాధ్యమయినదో ? మా అనుమానములను నివృత్తి
చేయుము.
76. శా. వెన్నన్ బోలిన మానసుండవనుచున్ వేమారు నిన్గొల్త్రు కా
వన్నిన్ వేడుచు భక్తపాళి. కనవో ? వారిన్ గృపన్ జూడవో ?
నిన్నేనమ్మిన భక్తులన్ నిలుపుమా. నిర్భాగ్యులన్ గాచు శ్రీ
మన్నారాయణ ! నమ్మకంబు కలుగన్. మా మాట మన్నింపుమా.
భావము.
నిర్భాగ్యులను కాపాడెడి స్వభావమున్న ఓశ్రీమన్నారాయణా! వ్నవనీత సుకుమా
హృదయుడవని భక్తులు తమను కాపాడమని , నిన్ను సేవించి అనేక పర్యాయములునిన్ను
వేడుకొందురు. అది నీవు గమనింపవా ? వారిని కృపతో చూడవా ? నిన్నుమాత్రమే నమ్ముకొనిన
భక్తులను నిలుపుము.నీపై మాకు నమ్మకము. కలుగునట్లుచేయుటకు మామాట మన్నింపుము.
77. శా. కన్నా ! కన్నులు కల్గినట్టి ఘనులే గర్వాంధతన్ వర్తిలన్
కన్నుల్లేని కబోదిగా పుడమిపై గాంచున్ గదా జన్మమున్.
ఎన్నంజాలరదేలనో?వలచు దుష్కృత్యంపు దుర్వృత్తి. శ్రీ
మన్నారాయణ! మార్పుకొల్పుమనఘా ! మౌఢ్యంబు పోకార్పుమా.
భావము.
ఓ కన్నయ్యా ! కన్నులు కల్గిన మహనీయులే గర్వాంధ ప్రవృత్తులైనచో భూమిపైకన్నులు లేని
కబోదిగా జన్మింతురు కదా. ఈ విషయమును వారు ఎందుచేతనోగుర్తింపరు. చెడు వర్తనతో కూడిన
ప్రవృత్తినే ఈష్టపడుదురు. పాపరహితుడవైనఓ శ్రీమన్నారాయణా ! అట్టివారీలోని మౌఢ్యమును
నశింప జేయుము. వారిలోమార్పును తీసుకురమ్ము.
78. శా. నిన్నున్ గూర్చిన భక్తి సంయుత కథల్ నేర్పున్ ప్రబోధించు శ్రీ
మన్నారాయణ నామ ధారివయి నీ మాహాత్మ్యముల్ నీవె మా
కున్నిత్యమ్ము వివేకమున్ దెలుపు వైకుంఠా! చిదానంద ! శ్రీ
మన్నారాయణ! భక్తపక్ష! శుభముల్ మాకబ్బు నీ సత్కృపన్.
భావము.
ఓ వైకుంఠా! చిదానందరూపా ! శ్రీమన్నారాయణా ! నీకు సంబంధించిన భక్తి కథలను నేర్పుతో
ప్రబోధించు శ్రీమన్నారాయణ పేరుతోనొప్పుచు , నీ కథలను నీవేనిత్యము మాకు వివేకముతో
తెలుపుచుంటివా.
భక్తుల పక్షము వహించువాడా ! నీ వలననే మాకు పుణ్యము లభించుచున్నది.
79. శా. పెన్నాగంబును బాన్పుగాఁ గొనితివా? పెన్నీటిపై వాసమా?
మున్నీటన్ వసియించు నీవు ప్రజలన్ మున్నీటిలో ముంచఁబో
కన్నా, మ్రొక్కెద నీకు. మాకు సుగతిన్, హాయిన్ బ్రసాదించు.శ్రీ
మన్నారాయణ భక్తులన్ గరుణతో మన్నించి కాపాడుమా.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! పెద్ద పామును నీవు శయనించుటకు ఆధారముగా చేసుకొంటివా? సముద్రమ్ఏ
నీకు నివాస ప్రదేశమా? సముద్రముపైన నివాసముండెడి నీవు ప్రజలను మాత్రము మున్నీటిలో
ముంచఁబోకుము సమా. ఓ దేవా! నీకు మ్రొక్కెదను మాకు సద్గతిని సుఖమును ప్రసాదించుము. నీ
భక్తులను మన్నించి నీవు కరుణతో కాపాడుము.
80. శా. ఎన్నన్ రాముఁడుగా జనించి సుఖమీవేపాటిగాఁ బొందితో?
కన్నా! కృష్ణుఁడుగా సుఖంబుఁ గనితో కష్టంబులే కాని. యీ
మున్నే కల్గిన నీవు పుట్టిన సరే భూమిన్ వ్యధన్ కల్గు. శ్రీ
మన్నారాయణ! మాదు భాధలెఱుఁగన్ మా భూమిపై పుట్టుదే?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఆలోచించి చూచినచో నీవు రాముఁడుగా భూమిపై పుట్టి యేపాటి
సుఖముననుభవించితివి? ఓ కన్నా! నీవు కృష్ణుఁడుగా పుట్టికష్టములే తప్ప సుఖింపఁ గలిగితివా? యీ
భూమిపై పుట్టిననాడు నీకయిననూ బాధలు తప్పవు సుమా.
మా బాధలను తెలుసుకొనుటకొఱకని
నీవీ భూమిపై పుట్టుచుందువా?
81. శా. నిన్నున్ బోలుదు రార్యులెల్ల పృథివిన్ నీనామ సారూప్యతన్.
బిన్నల్ పెద్దలు వారినెన్నుదురుగా విశ్వాసమేపారఁగా.
నిన్నే నీవు సృజించుకొందువొ హరీ ? నేర్పారఁగాఁ బ్రోవ. శ్రీ
మన్నారాయణ! లోకలోకముల ధర్మప్రీతిఁ గాపాడుచున్.
భావము.
ఓ
శ్రీమన్నారాయణా!
పుడమిపై ఆర్యులు నీ నామ సారూప్యముచే నిన్ను పోలి యుందురు.
ఆబాలగోపాలము వారిని గుర్తించి విశ్వాసముతోఫ్రశంసింతురు. నీ నేర్పు మీర లోకలోకముల
ధర్మౌను ప్రీతితో కాపాడుచు నిన్ను నువ్వే ఈవిధముగా పుట్టించుకొందువా ?
82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నారోగ్యమున్,
విన్నన్ జాలును భూసురుల్ పలుకు భావిన్దెల్పు పంచాంగమున్.
కన్నా దివ్య యుగాదినాడు, నిజ సంకల్పంబులీడేరు. శ్రీ
మన్నారాయణ! నిత్య చేతనమిడన్ మాలో నుగాదైతివా?
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఓ కన్న తండ్రీ. ప్రతీ సంవత్సరమూ ఉగాది రోజున ఉగాది పచ్చడిని తినిన
చాలును. భాతిని, ఆరోగ్యమును కలిగించును. భూదేవతలు పలికెడి భావిని తెలియజేయు
పంచాంగమును వినీనసరిపోవును. మా సంకల్పములన్నియు నెరవేరును. మాలో నిత్య చైతన్యము
కల్పించుటకు నీవు మాలో ఉగాదివై యుంటుందువా.
83. శా. కొన్నన్మానస పీఠిపై నిలుపగా గోవింద ! నీ పాదముల్
చెన్నారన్ గొన నొప్పు మాకు శుభముల్ శ్రీ దేవి కల్పింపఁగా.
మిన్నున్ దాకును మా ముదంబు గని నీ మేలైన పాదాళి. శ్రీ
మన్నారాయణ ! మాదు పుణ్యఫలముంబండించు నీ సత్కృపన్.
భావము.
ఓ గోవిందా! నీ పాదములను మా మనసు ఆనెడి సింహాసనముపై నిలుపుటకు గ్లహిఃచినచో
ఆ లక్ష్మీదేవి కటక్షముచే మాకు చెన్నుగా శుభములు స్వీకరింపనొప్పును. నీ మేలచన పాదములను
చూడగనే మా ఆనందము ఆకిశమునంటును. ఓ శ్రీ మన్నారాయణా!.నీమంచి కృపతో మా
పుణ్యములు పండింము.
84. శా. ఎన్నన్ బుణ్య ఫలంబు స్వర్గసుఖమే హేలావిలాసాలతో
నన్నన్మాకది చేసినంతె కద? మాకత్యంత సౌఖ్యంబు మే
మున్నన్ నీదరినబ్బు సత్యమిది. లేకున్నన్ వృథా కాదె. శ్రీ
మన్నారాయణ! నీ పదాబ్జమమరన్ మాకేలనీ స్వర్గముల్ ?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! మనము గుర్తించినచో మేము చేసుకొనెడి పుణ్యము వలన ప్రాప్తించెడి ఫలము
శుభమునుద్దీపింప చేయుచు స్వర్గ సౌఖ్యమే యిచ్చుననినఅది మేము చేసుకొనినది ఎంత పుణ్యమో
అంత మాత్రమే కదా. మేము నీసమీపముననున్నచో మాకు అత్యంత సౌఖ్యము లభించును. ఇది
సత్యము. ఆ విధముగాకానినాడు ఈ పుణ్యాదులు నిరుపయోగమే. నీ పాదపద్మములే మాకు
అమరినచో యీపుణ్యములిక మాకెందులకు? వ్యర్థమే సుమా.
85. శా. భిన్నంబన్నది లేదు భావమున భావింతున్ నినున్ నా మదిన్.
మన్నారాయణ! నీవె నన్ను సతమున్ మన్నించి రక్షింతువే.
నిన్నున్ వీడి మనంగలేను సుగతిన్ నిత్యుండ నాకీవె. శ్రీ
మన్నారాయణ! మన్మనోజ్ఞ శుభ నామా! శ్రీకరా! మాధవా!.
భావము.
శ్రీమన్నారాయణా! మన్మనోజ్ఞ శుభ నామా! శ్రీకరా! మాధవా! నాలో ప్రకాశించే నిన్ను నమ్ముట
విషయములో నా భావనలో భిన్నమన్నదే లేదు.నీవు నా నారాయణుడవు. నన్ను ఎల్లప్పుడు
మన్నించి రక్షించుదువు. నిన్నువిడిచి మంచి మర్ర్గమున జీవించలేను. ఈ లోకములో నాకు నీవే
భాగ్యము.
86. శా. మన్నింపంబడుదీవు శోధన కళా మాన్యత్వమున్ గూర్చి, సం
పన్నంబౌనటు చేయఁ గల్గిన మమున్ మాజీవితంబున్, స్వభా
వౌన్నత్యంబున నిల్పి, నిచ్చలు నిరంతానందసంధాయి! శ్రీ
మన్నారాయణ! సత్ప్రవృద్ధ మహిమా! మా మాట లాలింపుమా.
భావము.
అంతులేని ఆనందమును కలిగించువాడా ! మంచిని పెంచెడివాడా ! ఓ శ్రీమన్నారాయణా!
మా మాటలను ఆలకించుము. మమ్ము శోభన ప్రకాశముతో శ్రేష్టముగా చేసి , మాజీవితమును
సుసంపన్నమగునట్లును చేయగలిగితివేని నీవు ఎల్లప్పుడూ మన్నింపబడుదువు.
87. శా. యన్నామైవ మహత్ప్రపుణ్యఫలదమ్ , హర్ష ప్రదమ్ , సత్ప్రదమ్,
యన్నామైవ దురంత పాప హరణమ్ , యత్ సౌఖ్యదమ్ , భాగ్యదమ్ ,
తన్నామంబన నీదు నామ మనుచున్ దర్శించు భక్తాళి. శ్రీ
మన్నారాయణ! నీదు నామమెదలో మార్మ్రోగనీ నిత్యమున్.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా! ఏ పేరు జగత్తున ఏకైక పుణ్య ఫలమునొసగునో , ఏ పేరు
అత్యద్భుతమైనదో , ఏ పేరైతే పాపములు పోకొట్టెడి గొప్పదైన పేరో , ఏ పేరైతే
ఆయువునొసంగునో , ఆ పేరు నీ పేరే అనుచు భక్తులు ఆత్మలో దర్శింతురు. నీ
నామమును నిత్యమూ మా మదిలో మార్మ్రోగునట్లనుగ్రహింపుము.
88. శా. ఎన్నున్ భారత జాతి నీ ప్రతిభ నీ సృష్టిన్ బ్రవర్ధింప నీ
కన్నన్ గర్తయు, కర్మయున్, గ్రియయు లోకంబందు లేదం చిటుల్
నిన్ను న్నమ్మఁగఁ జేసినట్టి ఘనుడా! నిన్నెప్డు గీర్తింతు? శ్రీ
మన్నారాయణ! భారతీయులమదిం భాసించుమెల్లప్పుడున్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఈ సృష్టిని ప్రవర్ధింపఁ జేయుటలో నీకన్నా కర్త, కర్మ, క్రియ, వేరొకరు లేరని
భారత జాతి నీ ప్రతిభను గుర్తించును. ఈ విధముగానిన్ను నమ్ము విధముగా చేసిన గొప్పవాడా.
నిన్నేవిధముగా నేను పొగడగలను?నీవు యెల్లప్పుడూ భారతీయుల మనసులలో ప్రకాశించుచూ
ఉండుము.
89. శా. పున్నామాదిగఁ గల్గు నీ నరకముల్ పూరింప మాచేత నీ
వన్నింటిన్ గనుచున్ దొసంగులను మోహభ్రాంతిఁ జేయింతువా !
యన్నన్నా! మనసెట్టులొప్పు నరకంబందున్ మమున్నిల్ప. శ్రీ
మన్నారాయణ! మంచిచేసెడి మతిన్ మాకిమ్ము నిన్గొల్వగాన్.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! పున్నామాది మహా నరకములను నింపుటకని
నీవన్నీచూచుచూకూడా మోహాదులు కల్పించి మాచేత పాపములు
చేయించుచున్నావా? అన్నన్నా. మమ్ములను నరకమున నిలుపుటకు
నీకు మనసెట్టులొచ్చును ? మంచి చేయవలెననెడి బుద్ధి మాకిమ్ము.
నిన్నుకొలిచెదము.
90. శా. ఎన్నో జన్మల పుణ్య కర్మ ఫలమే యిద్ధాత్రి సీతమ్మ. నీ
వన్నెల్ పెంచుచు వెల్గ నీ సతిగ దేవా! రామచంద్రప్రభూ!.
కన్నా! మీదు వివాహమున్ జరుపుటన్ జ్ఞానంబు సిద్ధించు. శ్రీ
మన్నారాయణ! భక్తులన్ సతము ప్రేమంజూచి దీవింపుడీ.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ఓభూకాంతారమావల్లభా! ఓ స్వామీ! పెక్కు జన్మలలో చేసినపుణ్యఫలముగా ఈ
ధాత్రిపై సీతమ్మతల్లి నీ పత్నియై నీ కన్నులలో కాంతియైప్రకాశించు విధముగా మీ వివాహము
చేయుటచే మా సంతోషము ఆకాశమునంటును.మీరెల్లప్పుడూ భక్తులను కృపతో చూచుచు
దీవించుడు.
91. శా. నిన్నున్ గన్నదదెవ్వరయ్య? కలగా నిర్మించి యీ లోకమున్
క్రన్నన్ మంటిగ చేయు నిన్ను గనిరే, కన్పించినన్ వారలన్
మున్నే కారణముగ్గడింపుడనుచున్ మోమాటమున్ వీడి శ్రీ
మన్నారాయణ! ప్రశ్న వేయుదుమయా. మన్నించుమీ ప్రశ్నకున్.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నిన్ను గన్నట్టి ఆ తల్లిదండ్రులెవరు? ఈ లోకమును కలగాకల్పించి మన్నులో
కలిపివేయుచున్న నిన్నువారు ఎందు నిమిత్తము కనియుండిరో?వారే ఇప్పుడు మా ముందున్నట్లైతే
ముందుగా నిన్ను ఎందుకు కనిరో తెలియజేయుడని నిర్మొహమాటముగా ప్రశ్నించుదుము. ఈ
విధముగా ప్రశ్నించుచున్నందుకునీవు మమ్ములను మన్నించుము.
92. శా. వెన్నే చాలదు నిన్నుఁ బోల మదిలో విశ్వాస మొప్పారినన్.
మిన్నంటన్ జను. కొండ పోలదు నినుం బృథ్విన్ బ్రకోపంబునన్.
నన్నున్ వెన్నమనంబుతోఁ గనుమయా ! నాలోన నీవుండి. శ్రీ
మన్నారాయణ! దన్ను నీవె కద. ప్రేమంజూడుమెల్లప్పుడున్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! నీకు మాపై విశ్వాసమొప్పారినచో మాపై చూపెడి నీమనసులో గల
సుకుమారతకు వెన్నయైనను సరిపోలదు. ఓ సుధీపూర్ణుడా. కఠినత్వమే కలుగునెడల
ఆకాశమునంటెడి కొండైనను సరిపోలనేరదు. నాలో నీవుండి నన్ను నీ వెన్నవంటి
మనసుతో కనుము. మాకు ఆధారము నీవేకదా. ఎల్లప్పడూ ప్రేమతో చూడుము.
93. శా. ఛిన్నంబేలనొనర్తు వీ బ్రతుకులన్? జిత్రంబుగానుండె. నీ
విన్నాణంబున సృష్టిఁ జేసితివిగా. విశ్వంబె నీ స్వంతమై
యున్నం గాని మమున్ గలంచ సుఖమై యొప్పారునా నీకు ? శ్రీ
మన్నారాయణ! సౌఖ్యదుండవగుమా. మమ్మున్ భువిన్ నిల్పుమా.
భావము.
ఓశ్రీమన్నారాయణా! ఈ మా బ్రతుకులను విచ్ఛిన్నము చేసెదవేమి? ఇది
విచిత్రముగానున్నది. నీ విజ్ఞానముతోనీ సృష్టి చేసితివి. ఈ సృష్టి మొత్తమే
నీ స్వంతమై యున్నప్పటికీ మమ్ములను కలతలపాలు చేసీననే నీకు సుఖముగానుండి
నీకు ఒప్పునాయేమి? నీవు సౌఖ్యప్రదుడవగుము.మమ్ము భూమిపై మమ్ములను సుఖముగా
ఉండునట్లు చేయుము.
94. శా. ఎన్నన్ నీకును నాకు చాల మఱపే. హే దేవ! నా తప్పు లె
న్నున్నన్ నీకవి గుర్తు రావు. కృపనన్నుత్తేజితుంజేయ నీ
వెన్నో చేయుదవన్ని నేను మఱతున్. దృష్టంబిదేనయ్య. శ్రీ
మన్నారాయణ! నీ కృపే వరముగా మా బోంట్లకున్ దేవరా.
భావము.
హే దేవా! శ్రీ మన్నారాయణా! గణించి చూచినచో నీకూ నాకూ మరుపే సుమా.
ఏవిధముగానందువేమో. నా వల్ల ఎన్ని తప్పులున్నను నీకు అవేవియు గుర్తుకు
రావు. అటులనే నాలో నిత్యమూ చైతన్యమును కొలుపుచూ నాకొఱకై నీవు ఎన్నో
చేయుచుందువు. అవేవియు నాకు గుర్తుకు రావు. ఇదేకదా మనకు కనబడుచున్న
విషయము. ఓ దేవరా. ఇటువంటి నీ కృపాగుణమే మావంటివారికి వరముకదా.
95. శా. కొన్నే మాకునెఱుంగునట్టులుగ నింకొన్నింటిపై సందియం
బన్నా కొల్పితివేల ? నీకుఁ దగునా? యాత్మస్వరూపంబు మా
కెన్నంగల్గెడి శక్తినీయఁ దగదా? యీశా నినుం గాంచ శ్రీ
మన్నారాయణ! శంకలెల్లఁ దొలగున్. మాయన్విసర్జించనౌన్.
భావము.
ఓశ్రీమన్నారాయణా! కొన్నింటిని మాత్రమే మాకు తెలియునట్లుగను, ఇంకొన్నింటి
విషయములో సందేహములను కలిగించితివెందులకు ? ఇట్లు సందేహాస్పదముగ చేయుట
నీకు తగునా? కోరికతో నిన్ను మేము తెలుసుకొనుట కొ్ఱకు ఆత్మస్వరూపమును
గ్రహింప గల్గెడి శక్తిని మాకు కల్గించుట నీకు తగదా? నిన్ను చూచినచో మా సందేహములు
తొలగిపోవును. మాయను మేము విడిచిపెట్టుట సాధ్యమగును..
96. శా. కన్నారన్ గనఁబోవ నిన్నుఁ, గలుగున్ గన్నీరు మున్నీరునై,
యన్నన్నా కనుటెట్లు నిన్ను? మహనీయానందమెట్లబ్బు? నీ
కన్నన్ గాంచగనెవ్వడుండు జగతిన్? గాంక్షింతు నిన్గాంచ. శ్రీ
మన్నారాయణ! కన్నులన్ వెలుగుమా. మా మానసంబెంచుమా.
భావము.
ఓ
శ్రీమన్నారాయణా!
నిన్ను కనుల నిండుగా చూడబోవ కన్నీరు మున్నీరగును.అయ్యయ్యో. నిన్ను
మరి యే విధముగా చూడనగును? నిన్ను చూచుట వలన కలిగెడిమహదానందమేవిధముగా
లభించును?
ఈ సృష్టిలో చూడదగువారు నీకన్నా ఎవరుందురు?నిన్ను చూడ వలెనని
కోరుకొందును. మా మనసు గ్రహించుము. మా కన్నులలోవెలుగుము.
97. శా. ఎన్నో బాధ్యతలాత్మ మెచ్చనివి నాకేలన్? మహా దేవ!. నీ
కన్నన్బ్రీతి హితంబు వేరు కలదా, కామాదిషట్శత్రువుల్
నన్నున్వీడవు. ధర్మమెట్లొనరుతున్? నా యోగమున్ మార్చి శ్రీ
మన్నారాయణ! సత్య ధర్మ హిత సన్మార్గంబు కల్పింపుమా.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా! న మనస్సు చేయుటకంగీకరించని ఎన్నో బాధ్యతలనిన్నాళ్ళుగా నాపై
మోపితివి. నీకన్నాప్రియమైనదీ హితమైనది వేరే ఏదైనా ఉన్నదాయేమి. కామాది శత్రుషట్కము
నన్ను వీడిపోవు. ఇఃక నేను ధర్మమేరీతిగా ఆచరింపనగును. నాయోగమునే మార్చివేసి సత్య ధర్మ
హిత సన్మార్గములను నాకుష కల్పింపుము.
98. శా. సున్నుండల్, వడపప్పు, బూరె, లరిసెల్, శుద్ధోదకం, బుప్పు. క్షీ
రాన్నంబున్, బులిహోర , నేయి, వడలాహారంబుగాఁ జేయుచున్,
మున్నే నీకుఁ దినంగఁ బెట్టుదుముగా. మూర్కొందువే కాని, శ్రీ
మన్నారాయణ. కొంచెమైనఁ గొనవో? మా తృప్తికైనన్ హరీ! ?
భావము.
ఓ శ్రీమన్నారాయణా! సున్నుండలు , వడపప్పు , బూరెలు , అరిసెలు , మంచినీరు ,
లవణము , పరమాన్నము , చిత్రాన్నము , గారెలు, పుణుకులు , సమస్తమైన మనోహర
పదార్థములు ముందుగానే నీకు భుజించమని పెట్టుదుము కదా. ఎందుచేత నీవు
కొంచెమైనను తినకుందువు? మూర్కొందువే కాని మా తృప్తి కొఱకైనను తినవు కదా.
99. శా. జొన్నన్నంబయినన్ లభింపదు కదా శోధింపఁ గోట్లుండినన్.
సన్నన్నంబె లభించు నీదు కృపచే సన్మాన్యతం బేదకై
నన్నీ వల్లనె. యెంత వింత! దయఁ గన్నన్ జాలదే మాకు. శ్రీ
మన్నారాయణ! జీవితేశ! సదయన్ మమ్మేలు లోకేశ్వరా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! మాకు పుణ్యముచే లభించినవాడా. మా జీవితేశా. దయతో మమ్ము పాలించు
లోకేశ్వరా!.ఆలోచించగా కోట్లున్నను జొన్నన్నమయినా లభింపకపోవుట, పేదవానికయినా
సన్నబియ్యపన్నమే లభించుటవీటికి నీ కృపయే కారణము. ఆహా. ఇది నీవల్లనేకదా! యెంత వింత!
100. శా. అన్నీ నీ కెరుకే కదా. వరములే నాశింపఁగానేల? నా
కన్నుల్ గానని నాదు భావిని కనంగా నీకె సాధ్యంబు. నీ
కున్నే జెప్పఁ బనేమి? నీకె తెలియున్. గోరన్ నినున్ నేను. శ్రీ
మన్నారాయణ! 'వంద'నంబులయ. నా మార్గంబు నీవేనయా.
భావము.
ఓ
శ్రీమన్నారాయణా!
నన్ను గూర్చిన అన్ని విషయములు నీకు తెలియునుకదా. నీనుండి
వరములను నేనాశించ వలసిన పని యేమున్నది? నా కన్నులు చూడలేని నాభవిష్యత్తు చూచుట
నీకే సాధ్యమగును. నీకు నేనిక చెప్పవలసిన పనియేమున్నది?ఏమి చేయ వలయునో నీకే
తెలియును. ఇంక నేను నిన్నేమీ కోరను. నీకునమస్కారములు. నాయొక్క మార్గము నీవేసుమా.
101. శా. నిన్నున్ నన్నును నమ్మినట్టి మహితుల్ నీ పేరిటన్ వ్రాయు శ్రీ
మన్నారాయణ దివ్యపద్య పఠనన్ మాన్యత్వమున్ బొంది , సం
పన్నుల్ సంతస పూర్ణులై ప్రబలుతన్. ప్రఖ్యాతినార్జించి. శ్రీ
మన్నారాయణ! వారినెల్ల గని సమ్మాన్యంబుగాఁ బ్రోవుమా.
భావము.
ఓ శ్రీ మన్నారాయణా ! నిన్నును , నన్నును విశ్వసించునటంవంటి మహాత్ములు నేను నీ పేరున
వ్రాయుచున్న శ్రీ మన్నారాయణ పద్యమువలన మాన్యత్వమును పొంది , సంపన్నులుగను
ప్రఖ్యాతిని సంపాదించి , సంతోషముతో నిండినవారయి ప్రబలుదురు గాక. వొరినందరినీ నీవు
ప్రేమతో చూచి , సన్మాన్యముగా చేసి కాపాడుము.
102. శా. కొన్నింటన్ గమనీయ కావ్య గుణముల్, కొన్నింట సద్బోధనల్,
కొన్నింటన్ వర భావ రమ్య సుగతుల్, కూర్మిన్ గనన్ జేయు నీ
వన్నింటన్ వర పద్యరూపుఁడవు. భావాతీత గోవింద! శ్రీ
మన్నారాయణ! దేవ దేవ! మహితా! మద్భావనోద్భాసితా!
భావము.
నా భావనలో మిక్కిలి ప్రకాశించువాడా! ఓ శ్రీమన్నారాయణా! నీవు రచింపించిన యీ
శ్రీమన్నారాయణ శతకమున గల పద్యములలో కొన్నింటిలో కమనీయమైన కావ్య గుణములు,
కొన్నింట మంచిని చూపే బోధనలు, కొన్నింటిలో భావ రమ్యమైన సత్కవితా విధానములు, ప్రేమతో
చూచునట్లు చేసెడి నీవు అన్నింటిలోను పద్యరూపముననుంటివి. భావాతీతుడవయిన ఓ గోవిందా!
ఓ పాప రహితా! నీకు ‘వంద’నములు.
103. శా. మన్నింపందగు దోషముల్ కలిగినన్ మా దేవ దేవా! ననున్.
నిన్నే మానసమందు నిల్పితినయా నే వ్రాయు వేళన్ బ్రభూ!
యెన్నంజాలను దోషముల్. మదిని నిన్నే నెన్నగన్ జాలి. శ్రీ
మన్నారాయణ! దోషముల్ కలిగినన్ మన్నించు. దోషాపహా!
భావము.
మా దేవదేవా! ఓశ్రీమన్నారాయణా! దోషములున్నచో నన్ను మన్నింపదగును. ఓ ప్రభూ. ఈ
పద్యములువ్రాయు సమయమున నిన్నే నేను మనసులో నిలీపితిని సుమా.మదిలో నిన్నే
ఎన్నుటకు సరిపోయి యున్న నేను దోషములనెన్న సరిపోను. దోషములనుపరిహరించువాడా! నా
దోషములు మన్నించుము.
104. శా. నన్నున్ జిత్ర కవీశుడంచు సుజనుల్ నా బాధ్యతన్ బెంచ, నీ
వన్నెల్ చిన్నెలు చిత్ర గర్భ కవితన్ భాసించి నా గౌరవం
బెన్నంజేయుచు నిల్పు నన్నుఁ గవిగా. హే మాధవా! నీవె. శ్రీ
మన్నారాయణ! చిత్ర బంధ కవి కాన్, మర్యాద నాకబ్బెనే!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! సుజనులు నన్ను చిత్రకవీశ్వరుఁడు అని అనుచు, నా బాధ్యతను పెంచగా నీక
సంబంధించిన వన్నెలు, చిన్నెలు, నా చిత్ర బంధ గర్భ కవితలలో భాసించి నా గౌరవమును
పరిగణించునట్లు చేయుచు, నన్ను కవిగా నిలుపును. ఓ మాధవుఁడా! నీవే చిత్రబంధ కవివయి
యున్నావు. ఆ విధముగా నీవుండగా ఆ మర్యాద నాకు లభించుచున్నది కదా!
105. శా. నిన్నున్నమ్మితినంచు నమ్మితివి నన్. నీ పేరుతో పద్యముల్
క్రన్నన్ వేకువనే రచించి, చదువంగాఁ బంపి భక్తాళికిన్
నన్నున్ మన్ననలందగాఁ గనితి వానందంబుతో నీవు. శ్రీ
మన్నారాయణ! నీ కృపామృతమునే మాకందగా జేసితే.
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నిన్ను నమ్మితినని నన్ను నీవు విశ్వసించితివి. నీపేరుతో పద్యములను
వేకువనే రచించి చదువుట కొఱకు నీ భక్తులకు పంపిమన్ననలందునట్లు ఆనందముతో
నన్ననుగ్రహించితివి. నీ కృపామృతమునే మాకుఅందుకొనునట్లు చేసితివా.
106. శా. అన్నా! నీ నగుమోము బాధలను బోకార్పున్ గదా! యేల నీ
వెన్నాళ్ళైనను గానరావు? కన నింకెన్నాళ్ళు రాకుందువో?
కన్నా! కన్నులలోన నిన్ నిలిపి నే కన్మూయునాడైన శ్రీ
మన్నారాయణ! కావరమ్ము వరదా! మద్భాగ్యమోక్షప్రదా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! నీ నగుమోముబాధలను పోగొట్టును కదా! ఎన్నాళ్ళైనా నీవు ఎందులకు కనిపింప
రావు?
చూడగా ఇంకా ఎన్నాళ్ళు నీవు రాకుండా ఉందువోకదా.
ఓ కన్నతండ్రీ!
ఓ వరదా! నాకు
భాగ్యమైనవాడా! మోక్షమును ప్రసాదించువాడా! నా కన్నులలో నిన్ను నిలిపి నేను కన్ను
మూయునాడైనను నన్ను కాపాడుటకు రమ్ము.
107. శా. ఉన్నంజాలును దేవ సంతతము నా యుచ్ఛ్వాస నిశ్వాసలై.
కన్నన్ జాలును కాంతులీను కనులన్ కారుణ్య! మిత్రుండవై.
నిన్నున్నే వరచిత్ర గర్భకవినై నేర్పారఁ జూపింతు శ్రీ
మన్నారాయణ లోకులెన్నఁగ మహిన్, మాన్యుండ! ముక్తిప్రదా!
భావము.
ఓ శ్రీమన్నారాయణా! ముక్తిని ప్రసాదించు ఓ సర్వ శ్రేష్టుఁడా! నీవు నా ఉచ్ఛ్వాసనిశ్వాసవై ఎల్లప్పుడు
ఉండిన చాలును.ఓ కారుణాస్వభావా! నీ కాంతులు చిందే కనులతో మిత్రుల సమూహమై నన్ను
చూచిన చాలును
108. శా. చిన్నా! సద్గురు రాఘవార్యు కృపచే సిద్ధించెనీవిద్య. నే
మన్నింపంబడు రామకృష్ణఁడ, కవిన్. మా తండ్రి సన్యాసిరా
ము న్నాతల్లిని రత్నమాంబను మదిన్ బూజించి, పద్యాళి, శ్రీ
మన్నారాయణ! వ్రాసితిన్ గొనుమ. ప్రేమన్ మంగళాకారుఁడా!
భావము.
ఓ చిన్నామంగళాకారుఁడవైన ఓ శ్రీమన్నారాయణా! మద్గురుదేవులు కల్వపూడి
వేంకటవీరరాఘవాచార్యుల కృపచే యీ విద్య నాకు లభించినది. సహృదయులచే
మన్నింపఁబడునేను చింతా వంశజుఁడనైన రామకృష్ణారావు అను పేరు కల సుకవిని. మా
తండ్రిగారయిన సన్యాసిరామారావుగారిని, మా తల్లిగారయిన వేంకటరత్నమాంబను, ముందుగా
మదిలో పూజించి, పిదపనిన్నెంచి యీ శతకము వ్రాసితిని. శ్రీ మంతా! ఓ శ్రీమన్నారాయణా!
నీవీశతకమును కృతిభర్తవై స్వీకరింపుము.
స్వస్తి.
అంకితము.
ఉన్నావీవు హృదబ్జమందు కొలువై యూహా
స్వరూపంబునన్
త్వన్నామంబున వ్రాయఁజేసిన కృతిన్,
తత్త్వప్రదీపా హరీ!
క్రన్నన్ గైకొనుమంకితంబిడితి లోకాధీశ
నీకిద్ది, శ్రీ
మన్నారాయణ! పాఠకాళిని కృపన్ మన్నించి
కాపాడుమా.
శ్రీమన్నారాయణ శతకము. రచన.
చింతా రామకృష్ణారావు.
అక్షర క్రమములో
పద్య సంఖ్య
64. శా. అన్నన్ జాలును సోహమంచు , మరి దాసోహమ్మటంచంటి, నే
42. శా. అన్నంబెవ్వనిచే సృజింపబడునయ్యాద్యుండు రైతన్నయే.
39. శా. అన్నంబో రఘురామ యంచధికులాహారంబు నర్ధించు, సం
4. శా. అన్నా! కేశవ! మాధవా! నృహరి! మోహాతీత గోవింద! రా
106. శా. అన్నా! నీ నగుమోము బాధలను పోకార్పున్ గదా! ఏల నీ
100. శా. అన్నీ నీ కెరుకే కదా. వరములే నాశింపగానేల? నా
61. శా. అన్నైవత్తువు నన్ను కావ కృపతోనానంద సంధాయివై,
107. శా. ఉన్నంజాలును దేవ సంతతము నా యుచ్ఛ్వాస నిశ్వాసవై
26. శా. ఉన్నామంచు నహంకరించితిమొ మేమున్నట్లు సాక్ష్యంబుగా
40. శా. ఉన్నావన్నిట. కానరావు. హృదిలో నున్నట్టి నీ రూపమున్
21. శా. ఉన్నావీవిట నన్నుఁ జేరి యని, స్నేహోత్సాహ సంపన్నులై
25. శా. ఉన్నావీవు మదిన్ సుచేతనముగా, నున్నావు దేహంబువై.
9. శా. ఉన్నావీవు హృదంతరాళమున స్నేహోదార సంపత్ప్రభన్,
5. శా. ఎన్నం జాలుదె? దేవ నీదు పద సంస్పృత్యంబు నా చిత్తమం,
74. శా. ఎన్నం జాలని భవ్య భాగవతులన్ హృద్యంబుగానొప్పు శ్రీ
94. శా. ఎన్నన్ నీకును నాకు చాల మరుపే. హే దేవ! నా తప్పు లె
84. శా. ఎన్నన్ బుణ్య ఫలంబు స్వర్గసుఖమే యిచ్చున్ శుభోద్దీప్తితో
80.శా. ఎన్నన్ రాముఁడుగా జనించి సుఖమీవేపాటిగాఁ బొందితో?
52.శా. ఎన్నాళ్ళీ కొఱగాని కర్మ ఫల దుష్కృత్యంబులంజేయుటిం
88.శా. ఎన్నున్ భారత జాతి నీ ప్రతిభ నీ సృష్టిన్ బ్రవర్ధింప నీ
30. శా. ఎన్నో జన్మలు ఘోరమైన తపముల్ హృద్యంబుగా చేసినన్ 90.శా. ఎన్నో జన్మల పుణ్య సత్ఫలముగానిద్ధాత్రి సీతమ్మ నీ
97.శా. ఎన్నో బాధ్యతలాత్మ మెచ్చనివి నాకేలన్? మహా దేవ!. నీ
75.శా. ఎన్నోశంకలవాత్మలో కలుగు నీ వీతీరునీసృష్టి చే
51. శా. ఔన్నత్యంబున వెల్గు సజ్జనుల భావౌన్నత్యమే దుష్టులం
77. శా. కన్నా ! కన్నులు కల్గినట్టి ఘనులే గర్వాంధతన్ వర్తిలన్
7. శా.
కన్నా మంటిని దిన్న
నిన్ జనని వేగన్ నోరు చూపించుమో
48. శా. కన్నా! నీ పద సేవకై విరులు వేగంబే విడున్ బ్రొద్దుటే.
96. శా. కన్నారన్ గనబోవ నిన్ను, కలుగున్ గన్నీరు మున్నీరమై
15. శా. కన్నారన్ నినుఁ గాంచ వేడుక, జగత్ కల్యాణ రూపుండ! నే
13. శా. కన్నుల్ కల్గగ జేసితీవె కనఁగా కన్నార నిన్ గానగాన్.
70. శా. కన్నుల్ కాంచెడి శక్తి కోల్పడును. నిన్ గానంగ జ్ఞానాక్షి నా
53. శా. కన్నుల్, కాళ్ళును , జేతులున్, దనువు, నోంకారోజ్వలచ్చిత్తమున్,
59. శా. కన్నుల్ గొల్పి, కనంగఁ జేసి, మదిలో కాంక్షల్ ప్రవర్ధింప నీ
14. శా. కన్నుల్ జూచెడి శక్తి కల్గియును నిన్ గాంచంగ లేవేలనో
29. శా. కన్నుల్ నిండుగ కాంతిరేఖలవిగో కారుణ్యమున్ వెల్గుచున్,
49. శా. కన్నుల్ మూసిన నీ పదాబ్జములనే కాంచన్ మదిన్ గోరుదున్.
83. శా. కొన్నన్మానస పీఠిపై నిలుపగా గోవింద ! నీ పాదముల్
63.శా. కొన్నాళ్ళేకద భూమిపై బ్రతుకు. మా కోపాదులన్ కాలమే
65.శా. కొన్నాళ్ళేమొ శిశుత్వమున్గొలిపి యింకొన్నాళ్ళు కౌమారమున్.
102.శా. కొన్నింటన్ కమనీయ కావ్య గుణముల్, కొన్నింట సద్బోధనల్,
95. శా. కొన్నే మాకునెఱుంగునట్టులుగ నింకొన్నింటిపై సందియం
3. శా. క్రన్నన్ గావగ వచ్చి ప్రోతు వనుచున్, కన్పింతువీవంచు, నో
43. శా. ఖిన్నుండై తపియించుచున్న హలికున్ కేలిచ్చి కాపాడి నీ
108.శా. చిన్నా! సద్గురు రాఘవార్యు కృపచే సిద్ధించెనీవిద్య. నే
54. శా. చెన్నారన్ నను చేరదీసిన హరీ ! శ్రీనాథ ! సర్వేశ్వరా !
93. శా. ఛిన్నంబేలనొనర్తు వీ బ్రతుకులన్? చిత్రంబుగానుండె. నీ
38. శా. జన్నంబుల్ పచరించి సాధకుఁడు నీ సామీప్యమున్ జేరఁగా
20. శా. జున్నున్ బాలును, మీగడల్ పెరుగు, సంశోభన్ మదిన్ దోచు నా
99. శా. జొన్నన్నంబయినన్ లభింపదు కదా శోచింప కోట్లుండినన్.
82. శా. తిన్నన్ జాలు నుగాది పచ్చడిని, భాతిం గొల్పు నారోగ్యమున్,
60. శా. తిన్నన్ నీ కృప లేనినాడరుగదే దుపించు దధ్యన్నమై
46. శా. నన్నున్ గావగ రమ్ము నీవనినచో నా స్వార్థమే యౌను. నీ
104.శా. నన్నున్ జిత్ర కవీశుడంచు సుజనుల్ నా బాధ్యతన్ బెంచ, నీ
73. శా. నిన్నన్ మొన్నను నేడు రేపు, సతమున్ నీ నామ సంకీర్తనే.
91. శా. నిన్నున్ గన్నదదెవ్వరయ్య? కలగా సృష్టించి యీ లోకమున్
6. శా. నిన్నుంగాంచిరి ధీనిధుల్ జగమునన్ నిత్యాత్ముగా నేర్పుతోన్
78. శా. నిన్నున్ గూర్చిన భక్తి సంయుత కథల్ నేర్పున్ ప్రబోధించు శ్రీ
22. శా. నిన్నున్ గోరగ లేదు పుట్టుటకునై, నీవేల బుట్టించితో?
37. శా. నిన్నున్ గోరెద నాలకించు మనవిన్ సృష్టిన్ గుణోపేత సం
31. శా. నిన్నుం జూచెద పక్షులన్ బశువులన్, దృగ్గోచరంబౌచు నీ
101.శా. నిన్నున్ నన్నును నమ్మినట్టి మహితుల్ నీ పేరిటన్ వ్రాయు శ్రీ
105.శా. నిన్నున్నమ్మితినంచు నమ్మితివి నన్. నీ పేరుతో పద్యముల్
27. శా. నిన్నున్ నమ్మిన మేలటంచు సుజనుల్ నిత్యంబు నమ్మున్ నినున్,
81. శా. నిన్నున్ బోలుదు రార్యులెల్ల పృథివిన్ నీనామ సారూప్యమున్.
68. శా. నిన్నున్ మించిన భక్తరక్షకునిలన్ నేనెన్ననో శ్రీహరీ!
2. శా. నిన్నున్నే ధర నెంచఁగా తగుదునా? నీరేజ పత్రేక్షణా!
28. శా. నిన్నే గంటిని పండితాళి మదులన్ నేర్పార నుండంగ, ని
35. శా. నిన్నేనమ్ముచు నైహికంబుఁ గనరే నిన్గాంచు భక్తాళి, నీ 55. శా. నిన్నే నమ్ముచు మన్ననమ్మున మనన్ నే భావనన్ జేతు, న
50. శా. నిన్నే సూర్యునిగా తలంచితినిపో నీవుండవే రాత్రులన్
36. శా. పన్నీటన్ జలకంబు లాడెదవు నీ భక్తాళిచే నిత్యమున్,
58. శా. పన్నీటన్ నిను సేవ చేయు ఘనులౌ భక్తాళికిన్ భాష్పముల్ . . . ?
66. శా. పిన్నల్ నిర్మల చిత్తశోభితులెగా. పెద్దౌదురవ్వారలే.
47. శా. పిన్నల్ పెద్దలు మంచి చెడ్డలనుచున్ పేర్కొంచు సిద్ధాంతముల్
89. శా. పున్నామాదిగ గల్గు యీ నరకముల్ పూరింప మాచేత నీ
11. శా. పున్నెంబుండును బేదలన్ గనుమయా ప్ంషింపఁగా లేక తా.
19. శా. పున్నెంబెంతగ కావలెన్? గొలువ నీ పూజ్యాంఘ్రి సాహస్రమున్?
23. శా. పున్నెంబెన్నఁగ నేది యౌను? గుడిలోఁ బూజించ నిన్ బున్నెమా?
12. శా. పున్నెంబే కద పేద సాదలకు ప్రాపుంగొల్ప నీవున్నచో
45. శా. పున్నెంబో, మరి పాపమో యెఱుగ నేన్. పుష్పంబులన్ గోయుచున్
79. శా. పెన్నాగంబును బాన్పుగాఁ గొనితివా? పెన్నీటిపై వాసమా?
85. శా. భిన్నంబన్నది లేదు భావమున భావింన్ నినున్ నమ్ముటన్.
44. శా. భిన్నత్వంబుననేకతన్ గలిగి నీవే మాకునన్నింటిలో
62. శా. మన్నించే గుణమీకు కల్గెను కదా మాన్యుండ ! నీ భక్తులన్
86. శా. మన్నింపంబడుదీవు శోభన లసన్మాన్యంబుగా జేసి సం
103.శా. మన్నింపందగు దోషముల్ కలిగినన్ మా దేవ దేవా! ననున్.
32. శా. మన్నైపోవడు దేహి,దేహ జగతిన్మార్తాండుఁడై వెల్గు తా
57. శా. మిన్నంటున్ మది హర్షచంద్రికలు నీ మీదన్మనంబుంచినన్.
10. శా. మిన్నున్ గాంచిన నీవె నిండితివటన్ కృష్ణా! జగత్ కారకా!
33. శా. మిన్నున్ మన్నునునేకమైననగు, నీ మీదన్ ప్రమోదంబు పొ
8. శా. మున్నే నిన్ను మనమ్మునన్ మననమున్ మున్నుంచి మన్నించి
56. శా. మున్నే వేదములుగ్గడించె నిను సంపూర్ణుండుగా. సత్యమే.
87. శా. యన్నామైవ మహత్ప్రపుణ్యఫలదమ్ , హర్ష ప్రదమ్ , సత్ప్రదమ్,
17. శా. వన్నెల్ చిన్నెలు భ్రాంతి కారకములా భ్రాంతిన్ హృదిన్
18. శా. విన్నన్ జాలును నీదు నామ మహిమల్ వీనుల్ శుభంబుల్ కనున్
34. శా. విన్నన్ జాలును నీ మహాద్భుత కథల్ విశ్వాసమున్ నిల్పి. నే
16. శా. విన్నన్ నీ శుభ నామమే వినవలెన్ విభ్రాంతులం బాయగా
76. శా. వెన్నన్ బోలిన మానసుండవనుచున్ వేమారు నిన్గొల్త్రు కా
69. శా. వెన్నల్ బాలు మనంబులే. కయికొనున్ వెన్నుండటంచున్
92. శా. వెన్నే చాలదు నిన్ను బోల మదిలో విశ్వాస మొప్పారినన్.
1. శా. శ్రీన్నీవక్షమునందు నిల్పి, సుజన శ్రేయంబు చేయించు నీ
72. శా. సన్నంబై చనుచుండెనాయువు. మన:శాంతిన్ నినుం గొల్వనే.
71. శా. సన్నేతల్ మహనీయతా గరిమతో సత్కార్యముల్ చేయుచున్
24. శా. సాన్నిధ్యంబున నిల్పు నీకు ననునీశా భక్త కల్పద్రుమా!
67. శా. సున్నంబైననునన్నమైన నొకటే శుద్ధాత్మవిజ్ఞానికిన్
41. శా. సున్నా పూర్ణము. సృష్టి మూలము. సుధీశుల్ నిన్ను పూర్ణంబుగా
98. శా. సున్నుండల్, వడపప్పు, బూరె, లరిసెల్, శుద్ధోదకం, బుప్పు. క్షీ
శతకముద్రాపకులు.
బ్రహ్మశ్రీ బాబూ
దేవీదాసరావు.
శా. విన్నన్ నేర్చినఁ
బుణ్యమేయనుచు దేవీదాసు భావించి, *శ్రీ
మన్నారాయణ* రూపమౌ శతకమున్ మన్నించి ముద్రించి రీ
యన్నన్ శ్రీహరి
ప్రేమతో గనుత, ధ్యేయంబొప్ప రక్షించుతన్,
సన్నామాంచిత! మీ యుదార గుణమున్ సాధ్యంబె వర్ణింపగన్?
నేను, నా రచనలు
కృతికర్త.
భాషాప్రవీణ చింతా రామ కృష్ణా రావు. P.O.L., M.A.,
విశ్రాంత ఆంధ్రోపన్యాసకుఁడు.
ఫ్లాట్ నెం. A 601. శిల్పాస్ ఆర్వీధర్మిష్ఠ... డీమార్టుకు ఎదురుగా.. మియాపూర్, హైదరాబాద్. 49.
తెలంగాణా. భారత దేశము. చరవాణి 8247384165
రచనలు.
1) అశ్వధాటి సతీ శతకము.( ప్రాస నియమముతో, ప్రతీపాదమునా మూడు
ప్రాసయతులతో ఒక్క రోజులో వ్రాసినది.)
2) ఆంధ్రసౌందర్యలహరి.
3) ఆంధ్రామృతమ్, పద్యవిపంచి, యువతరంగమ్. బ్లాగుల
నిర్వహణ.
4) కాళిదాసు కాళీ అశ్వధాటికి తెలుఁగు పద్యానువాదము.
5) చంపక భారతీ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
6) నేరెళ్ళమాంబ సుప్రభాతము.
7) పురుష సూక్త ఆంధ్ర పద్యానువాదము.
8) ప్రజ పద్య సీస గర్భిత ఆటవెలది కృష్ణ శతకము.
9) బాలభావన శతకము.
10) మేలిమిబంగారం మన సంస్కృతి. సంస్కృత సూక్తిశ్లోకములకు తెలుఁగు పద్యానువాదము.
11) రమాలలామ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
12) రామకృష్ణ శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
13) రుద్రమునకు తెలుగు భావము.
14) లలితా శ్రీచంద్రమౌళీశ్వర శతకము.
(ఒక్క రోజులో వ్రాసినది.)
15) వసంతతిలక సూర్య శతకము.
16) విజయభావన శతకము.
17) వృద్ధబాలశిక్ష శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
18) వేదస్తుతి, షోడశ
చిత్రకవితలు.
19) శ్రీ అవధానశతపత్రశతకము.
20) శ్రీచక్రబంధ అష్టలక్ష్మీ స్తోత్రము.
21) శ్రీచక్ర బంధ సప్తస్వర సర్వమంగళాష్టకము.
22) శ్రీచక్రబంధ మంగళాష్టకము.
23) శ్రీచక్రబంధ శ్రీరామ దశకము.
24) శ్రీమదాంధ్రభగవద్గీత చింతా(తనా)మృతం.
25) శ్రీమద్యాదాద్రి శ్రీనృసింహ శతకము.(అష్టోత్తరశత నృసింహనామాంచిత
118 ఛందో గర్భ చిత్ర సీసపద్య శతకము.)
26) శ్రీమన్నారాయణ శతకము.(ద్విత్వనకార ఏక ప్రాసతో)
27) శ్రీయాజ్ఞవల్క్య శతకము. (ఒక్క రోజులో వ్రాసినది.)
28) శ్రీ లక్ష్మీ సహస్ర నామాంచిత సహస్రపద్యదళ
పద్మము.
29) శ్రీలలితా సహస్ర నామాంచిత పద్యసహస్రదళపద్మము.
30) శ్రీవేణుగోప కంద గీత గర్భ చంపకోత్పల
శతకము. (బంధచిత్రకృతి ఒకే శతకమున
మూడు మకుటములతో మూడు శతకములు.)
31) శ్రీ శిరిడీశ దేవ శతకము,(వారం రోజులలో వ్రాసినది.)
32) శ్రీశివాష్టోత్తరశతపంచచామరావళి
(శివశతకము.) (ఒక్క రోజులో వ్రాసినది.)
33) సుందర కాండ.(రామాన్వయముగా
కందపద్యములు, సీతాన్వయముగా తేటగీతి
పద్యములు, హనుమదన్వయముగా ఉత్పలమాలలుతో సుందరోత్పల నక్షత్రమాల.)
34) సురగవి నవ రత్నమాలిక. (చిత్రకవితా ప్రసూనములు.)
35) స్వతంత్ర భారత వజ్రోత్సవము సందర్భముగా
రకార ప్రాసతో అష్టోత్తర శత పాద
ఉత్పలమాలిక
36) ౨౨౦౦. అనంత ఛందము కొఱకు శతకము.37) శ్రీమన్నారాయణీయము పద్యానువాదము.
38) రమా (ఏకప్రాస) శతకము. (౨౯ – ౩ – ౨౦౨౪ ఏక దిన విరచితము)
39) మూకపంచశతి పద్యానువాదము.
40) శ్రీరామాష్టోత్తరశత నామాంచిత
అష్టోత్తరశతఛ్ఛందరాఘవశతకము.
స్వస్తి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.