గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2024, శుక్రవారం

శ్రీధరీయం. 96 మరియు 97.బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి

జైశ్రీరామ్.

బ్రహ్మశ్రీ మహాదేవమణి ధూళిపాళ 

🌹శ్రీధరీయం 96🌹

సద్యఃస్ఫూర్తి విరాజమాన ధిషణా 

చాంపేయ సంపత్ప్రదామ్

విద్యుత్కోటి సమానగాత్ర రుచిరాం 

వేదప్రభా శాటికామ్

మాద్య ద్వీక్షణ పుంజికా వివృత పశ్యత్ఫాల భాగ్యోదయామ్

పద్యార్చ్యాం మణిమానసాబ్జ నిలయామ్ 

 శ్రీ శ్రీధరీం భావయే.

🌹మణిశింజిని 🌹

ఎంతటి మహాకవియైనా , పండితవరేణ్యుడైనా తనకు అవసరం అయిన సమయానికి తనకు సిద్ధించిన విషయం గుర్తుకు రాకపోతే ఎందుకూ లాభంలేదు.ఆసద్యఃస్ఫూర్తిని అమ్మవారే ప్రసాదించాలి.అది ధిషణ అనే మెరుపు తీగెల తో మెరిస్తే అదే కవిపండితులకు మంచి సంపద.దాన్ని ఆశాంభవీ దేవి ప్రసాదిస్తుంది.

🥀ఆతల్లి పయ్యెద గా వేసుకొనే వస్త్రం మామూలు బట్టకాదు.వేదచైతన్యమే ఆతల్లికి పైవస్త్రంగా మారింది.🥀 మన్మథ బాణాలకు కూడా లొంగని ఆ శాంకరీ దేవి మత్తెంకిచే చూపులకు శంకరుడు వివశుడై  ఆనందంతో ఉప్పొంగ గా దేహచైతన్యంతో మరింత భాగ్యవంతుడౌతాడు.🥀ఆతల్లి నా మనోబ్జంలో నివసిస్తూ నా పద్యశ్లోకాలతో సేవింపదగినది అవుతోంది.అట్టి మదుపాస్య శ్రీధరిని సంభావిస్తున్నాను.🥀

          🌹 శ్రీధరీయం 97 🌹

కోటీరంబు కవీంద్రకోటికి , వచఃకోటీక ఝాటోల్లసత్

శాటీకంబు విరించి బోటికి, మనస్సౌరభ్య ఘుంఘుంఘుమత్

పాటీరంబు మహత్ సుహృత్పటలికిన్ ,

ప్రాంచన్మనీషా స్ఫురత్

ధాటీకంబుల నీపదార్చనను సంభావించనీ శ్రీధరీ !

             🌹మణిశింజిని 🌹

అమ్మా ! కవిశ్రేష్ఠులు సహితం నాపాండితిని వారి అవసరం మేరకు కిరీటం లా శిరోధార్యం చేసుకొనేలా , 

🥀నామాటలనే ఆరుద్రపురుగుల సమూహంతో అందగించే ఛందః శాటి భారతీదేవికి ఎదపై వస్త్రం అయ్యేలాగూ , నానిర్మల మైన మనస్సుయొక్కసురభిళం మహాత్ములపాలిట మంచిగంధం అయ్యేలాగూ చేసి , మిక్కిలి అతియించే  నా బుద్ధి ప్రకాశం యొక్క ధాటితో నిత్యం నీ పాదాలను సేవించే లా నన్ను మలుచు తల్లీ శ్రీధరీ !🌹

       🌸ధూళిపాళ మహాదేవమణి 🌸 

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.