గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మార్చి 2020, శుక్రవారం

తమసోమా.

జైశ్రీరామ్.
🙏🏻ఓం నమో నారాయణాయ🙏🏻
తమసోమా.
శ్రీమంతంబుగ మిత్రపాళి పొగడన్ జీవించుచీవుంటివో?
ఏమాత్రంబయినన్గ్రహింపఁ దగవో? యీ సృష్టి నే శక్తి నిన్
ధీమంతుండుగ సృష్టి చేసెనొ, కృపన్ దేజంబునే గొల్పెనో?
ప్రేమన్ నీ మది నిల్పి జీవతతినే ప్రేమింపగా జేసెనో?
ధీమంతా! గ్రహియించి తన్మహితమౌ తేజస్స్వరూపంబునే
ప్రేమన్ నీమదిఁ గొల్వకుంట తగునా? విశ్వాసమే లేదొకో?
నీ మాన్యత్వము, నీదు శక్తి, ఘనమౌ నీ జ్ఞాన సంపత్తియున్,
నీమంబున్ జరియించు తత్వమును తానే నీకు కల్పించి, నిన్
బ్రేమన్ గాచుచునుంట నీవు కనవో? విజ్ఞాన తేజోనిధీ!
యేమాయెన్ ఘనమైన నీ యెరుక? నీ యిచ్ఛానుసారంబుగా
ప్రేమన్ మిత్రుల నెప్పుడున్ బొగడుచున్ పేరున్ గనన్ జూతువో?
ధీ మాహాత్మ్యము వ్యర్థమైన విషయోద్దీప్తంబవన్ నీవహో!
కామక్రోధ సలోభమోహ మద సంకాశంపుమాత్సర్యముల్
భూమిన్ బెంచగ ఖర్చు చేయ కనుదో? మూర్ఖత్వమెట్లబ్బె? నీ
వీమాత్రంబయినన్ గ్రహించవొకొ? దేహిన్ వీడి దేహంబుపై
ప్రేమన్ బెంచుకొనంగనేల? మదినావిర్భావమౌ జ్ఞానమున్
క్షేమంబున్ గలిగించు నాత్మపయినే జేర్చన్ శుభంభౌనుగా?
యీ మాయామయ లౌకికాంశములపై నేలా మదిన్ నిల్పు టా
శ్రీమాతాహృదయేశ్వరున్ నిలుపినన్ జిత్తంబునన్  మేలగున్.
నీమంబొప్పగ నీవు చేయు రచనల్, నీధ్యాస, నీ పూరణల్,
శ్రీమంతా! ఫలమేమి గొల్పును గనన్ జిన్మార్గమున్ జూపునా?
యే మార్గంబు సుఖంబటంచు కనితో హే రామకృష్ణా! మహత్
ద్ధూమంబందున తల్లడిల్లఁ గనుదో తూలించు నా దుర్గతిన్?
ప్రేమోద్ధాముని శ్రీహరిన్ బడసి సుశ్రేయంబులే గాంచఁగా
నీమంబొప్పగ పూజ చేయ కనుమా. నీ చిత్తమందెంచు మీ
శ్రీమార్గంబును పూనుమింక నృహరిన్ చేరంగ మార్గంబు. పో
రామిన్ గాంచగ జాలలేవొ? కనుమా. ప్రార్థించుమా శ్రీహరిన్.
🙏🏻జైశ్రీమన్నారాయణా🙏🏻
చింతా రామకృష్ణారావు.
జైహింద్
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.