జైశ్రీరామ్.
మధునాపంతుల వారి ఆంధ్ర పురాణము
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
ఆయన పొందికగా, పుస్తకం లాంటి మనిషి. ఆ పుస్తకం లగువు బిగువుల మనిషిలా చరిత్ర సృష్టించింది.ఆయన పేరు మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ. ఆ పుస్తకం పేరు ఆంధ్రపురాణం.
సాహిత్యంగా - వ్యక్తి చరిత్రను గాని, దేశ చరిత్రనుగాని రకరకాలుగా రచించవచ్చు. పాతకాలంలో బసవపురాణం, కాటమరాజు కథ, పల్నాటి వీరచరిత్ర, అన్నమాచార్య చరిత్రలలాగా ద్విపదగా చెప్పవచ్చు. కుమార ధూర్జటి కృష్ణరాయ విజయంలాగా ప్రబంధంగా చెప్పవచ్చు. రాయప్రోలు, విశ్వనాథలాగా ఆంధ్రావళిగానో, ఆంధ్రప్రశస్తిగానో, ఖండకావ్యాలుగా చెప్పవచ్చు. హంపీ క్షేత్రాన్ని కొడాలి సుబ్బారావుగారు చిత్రించినట్టు స్థల స్మృతి పురాణంగా కీర్తించవచ్చు.
తెలుగు సాహిత్యంలో చారిత్రకత వృత్తాల కావ్య రచన కొత్త కాకపోవచ్చుగాని-
ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక కావ్యాలకు- ముఖ్యంగా మహాకావ్యాలకు ఒక ఒరవడి పెట్టినవారు, రాణాప్రతాప సింహ చరిత్ర కావ్యనిర్మాత దుర్భాక రాజశేఖర శతావధాని. ఆయన ప్రేరణతో శివభారత కావ్యంవ్రాసినవారు గడియారం వేంకట శేషశాస్ర్తీ. ఈ క్రమంలో చెప్పదగినవి తుమ్మల సీతారామమూర్తిగారి మహాత్మ కథ. వానమామలై వరదాచార్యులుగారు పోతన చరిత్ర ముదిగొంత వీరభద్రమూర్తిగారి వందేమాతరం- వీటన్నింటిలో విభిన్నంగా, విశిష్టంగా నిలిచిన మహాకావ్యం ఆంధ్రపురాణం.
ఇప్పుడు పేర్కొన్న కావ్యాలు చారిత్రక మహాపురుషుల గురించీ ఏక దేశమైన ఒక ఉద్యమతత్వంగురించీ చిత్రించినవి.
ఆంధ్రపురాణ నిర్వహణ ప్రణాళిక వేరు. మహాకావ్యం అనే మాటనిక్కడ బరువును బట్టీ, పరువును బట్టీ వాడుతున్నారు.
అలనాడెప్పటిదో.. ఋగ్వేద ఐతరేయ బ్రాహ్మణంలోని శునశే్శపుని కథతో ఎత్తుకుని క్రీస్తుశకం 1633-1673 నడుమ తంజావూరు రాజ్యాన్ని పాలించిన విజయరాఘవుని నాటివరకు తెలుగువారి చరిత్ర, ఒక రాజవంశంకాదు. ఒక పాలకుడు కాదు. ఒక తరహా జీవన విధానం కాదు. తరచి చూసేకొద్దీ అగాధం. ఏది చరిత్ర? ఏది కల్పన? తేల్చి చెప్పడం దుష్కరం.
‘‘తెలుగున వేలయేండ్లుగా/ గతించిన గాథల పెంపు
కొండ గుర్తుల పెనుగుంపుగాని/ ‘‘యిది రూఢిగ నిట్టిది’’ నాగ దెల్ప
నెవ్వలన నసాధ్య’’-మని- మధునాపంతులవారే కావ్యావతారికలో 34వ పద్యంలో అననే అన్నారు. అయినా ఒకపాటి చరిత్రాన్ని నేర్పు తీర్పు పరిశీలకులు- తడవి, ప్రోవులు పెట్టినదాన్ని- ఆధారం చేసుకుని సత్యనారాయణ శాస్ర్తీగారు పురాణించడానికి బృహత్ ప్రయత్నం చేశారు. కావ్యం, పురాణం, ప్రబంధం అనే పదాలను, ఆంధ్రపురాణాన్ని సాహిత్యంగా పరిగణించే సందర్భంగా కావ్య సామాన్యార్థాలుగా మనం గ్రహించాలి.
సంప్రదాయార్థంలో సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితాలనే పంచలక్షణ లక్షితార్థంలో ఆంధ్రపురాణాన్ని చూడకూడదు. ‘‘త్రిలింగరాజ వంశ్యానుచరిత్ర’ ప్రధానంగా తానీ కావ్యం రచిస్తున్నానని, మధునాపంతులవారు వివరించారు- అవతారిక అయిదవ వచనంలో.
పునఃప్రతిష్ఠా పర్వాంత పద్యాల్లో
‘‘నాచే నీ చరిత్ర ప్రబంధమిటు సందర్భింప’’బడిందని చెప్పి- మొత్తం కావ్యం చివర, నాయక రాజపర్వం తరువాత- పర్వాంత పద్యాల మొదటలో - ‘కావ్య కవితా కల్యాణ నీరంధ్రమైన’ మహావీర చరిత్ర వినిపించడం పూర్తయిందన్నారు.
కనుక- ఆంధ్ర పురాణం- ఏకకాలంలో పురాణం, ప్రబంధం, కావ్యంగా పరిగణించడం ఈ కవికిష్టం.
అమలోదాత్తం- ధర్మనిర్వహణ మర్యాదం- విద్యాకృతశ్రమం- అయోధన రంగ సంగతపరోగ్రం పశ్యం- అశా తటాక్రమిత స్వచ్ఛయశం- కావ్య కవితా కల్యాణ నీరంధ్రం- అనే ఆరు విశేషణాలతో మహావీర చరిత్రను, ఈ ఆంధ్ర పురాణంలో కథన చేయడమైంది.
ఆంధ్రుడనగ నెవ్వ! డాంధ్ర దేశాభిఖ్య/ యేల వెలసె! న నెడి యిట్టి ప్రశ్న
ములకు, బదులుగాగ బలికెడి తొలినాటి/ గాథలొందు రెండు కలవు పుడమి’’
అంటూ ప్రారంభించి సత్యనారాయణశాస్ర్తీగారు 1.ఉదయపర్వం 2.శాతవాహనపర్వం, 3.చాళుక్య పర్వం, 4.కాకతీయ పర్వం, 5.పునఃప్రతిష్ఠ పర్వం, 6.విద్యానగర పర్వం, 7.శ్రీకృష్ణదేవరాయ పర్వం, 8.విజయపర్వం, 9.నాయకరాజ పర్వం- అంటూ తొమ్మిదంశాలుగా వింగడించి సంప్రదాయ పద్యరచనా సంవిధానం, అవతారికతో సహా 2052 పద్యవచనాలతో ఈ రచన చేశారు.
-ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
జైహింద్.
1 comments:
good describe
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.