జైశ్రీరామ్.
అ వ ధా ని ప్ర వ రు లు - 4.
రచన..శ్రీ మద్దూరి రామమూర్తి.
యువకుల్ కొందరు సంస్కృతాంధ్రముల కావ్యోక్తుల్ దగన్ నేర్చి, తా
మవలీలన్ రచియించు చుండిరిట పద్యంబుల్ రసోత్సాహులై,
యవలన్ వారు శతావధాను లగుచున్ ఖ్యాతిన్ గడింపంగ నా
కవులన్ గాంచి ముదంబు నందితిని. యా కావ్యజ్ఞులన్ మేటియై
నవ భావమ్ముల ఆముదాల మురళీ నాముండు గణ్యుండు గాన్
సు వధానామృత పానుడయ్యె తలపన్ లోకా జగన్. అట్లె వా
క్పవియై సత్కవియై వధాని యయి రాంభట్లాహ్వయుం
డొప్పె, మే
ల్మి విభాసిల్ల అపర్ణ శాంతు లిరువుర్ లీలా విలాసంబుగా
నవధానంబులు జేసి వాసిగని రార్యాళుల్ నుతింపన్ భువిన్.
స్తవమున్ గాంచె ప్రభావతమ్మ మహిళా ధన్యావధానమ్మునన్.
వివరింపన్ మరిడాన శీను కవి నిల్పెన్ తా వధాన ధ్వజం.
బవురా! యంచు బుధుల్ నుతింప సరభీ మాన్యుండు వెల్గెన్. సం
స్తవ మొప్పన్ బహుళా వధానముల తాతా వంశ సందీప శ
ర్మ వధానాఖ్య విహార భూములను రారాజత్ కళామూర్తియై
దివిషద్భాష వధానముల్ సలిపి నుత్తేజమ్ము కల్గించె, తా
నవధానమ్ములు జేసి మెప్పు గనె నా ఆకెళ్ళ భాను ప్రమో
ద విశేష ప్రతిభల్ వెలార్చుచు, లలిత్ ధాత్రిన్ యశోధన్యుడై
యవధానాంగణమందు శోభిలెను.విద్యావంతుడై పృథ్వి మై
ల వరాఖ్యుండవధానియౌ మురళి లీలన్ వెల్గె మేల్మేలనన్.
బవరంబందున సత్యభామ యన విద్వన్మూర్తియౌ చంద్రికా
కవయిత్రిన్ స్మరియింతు.
నవ్విధిని నా కామేశ్వరీదేవి తా
నవధానమ్మున మేటియై వెలిగె.విద్యావామ నర్చించు
చున్
అవనిన్ తా అవధాయకీ యనగ జంధ్యాలాఖ్య వంశాంబ ధీ
ప్రవరుల్ మెచ్చగ సుబ్బలక్ష్మి వెలిగెన్ పద్యాళి నందించు చున్
అవధాన ప్రతిభన్ యశమ్ము గొనె పేరయ్యాహ్వయుం డెన్నగా !
నవధానాహవ రాఘవుండనగ విఖ్యాతిన్ గడించెన్ యశో
రవి ధీ మాన్యుడు పోచిపెద్ది కుల సుబ్రహ్మణ్య మష్టావధా
న విధానమ్మున. తాదృశమ్ము గను జానాదుర్గ వంశాబ్జుడే
ఛవిమద్రత్నమనంగ వెల్గె,కవితాస్థన్ సత్యనారాయ
ణుం
డు విరాజత్ చెరువూరి దివ్య కుల భానుండొప్పె కావ్యజ్ఞుడై.
స్తవమున్ గాంచె వధానియై ములుగు అంజయ్యాఖ్యు డా రీతి ధా
త్రి వెలింగెన్ సుమి ఓం ప్రకాశ్ బుధులు సంప్రీతిన్ నుతింపన్. భువిన్
స్తవమున్ గాంచెను ముద్దువంశజుడు రాజయ్యా ఖ్యు డీరీతి స
త్కవియౌ గంగుల ధర్మరాజు ఘనుడై గణ్యుండునై యొప్పె తా
నవధానాంగణమందు. శారద పద ధ్యానాత్ములై యొప్పు వీ
రి వలెన్ భారత భారతీ సుమధుర శ్రీ గల్గగా నెందరో
అవధానమ్ముల సభ్యరంజక మహా హ్లాదమ్ము నందించుచున్
ప్రవరాదృత్యభిలగ్న మానసము తద్భవ్యాద రాహూతి బ్రా
జ్ఞ విపశ్చి త్కవిరాడ్రసజ్ఞ సుమ భాస్వద్వాటి చెల్వొందగా
నవ భావమ్ము లొసంగిరీభువికి.
శ్రీ జ్ఞానేశ్వరీ మాత యీ
యవధానాళిని బ్రోచుగాత ! సతమవ్యాజానురాగాల వా
క్ఛవి యొప్పారగ కీర్తిమంతు లయి సత్కావ్యాళి సృష్టింప నిం
పవు భావంబుల మాలికన్ మలచితిన్ మద్దూరి వంశాబ్జుడన్ .
కవితామాత పదాబ్జ సీధు రసమున్ జ్ఞానార్థినై గ్రోలుదున్
అవధాన ప్రవణుండునై ప్రకటిత జ్ఞానాత్మ భాస్వద్యశో
నవ చాంద్రీ తతదిక్తటుండగు రసానందున్ గురున్ గొల్చెదన్
కవులే స్రష్టలు ద్రష్టలంచు సతమున్ కైమోడ్పు లర్పించె దన్
అవధానిన్ భువి రామమూర్తి యను నాఖ్యాతుండ దీవించుడీ !
అవధానాగ్రణులార ! భవ్య కవులారా ! కీర్తులన్ జల్లుచున్
భువనానందద! బాసరాంబ! సతమున్ పోషించుతన్ మిమ్ములన్.
మద్దూరి రామమూర్తి.
వినతి.
సుకవి వరేణ్యులారా ! అవధానాగ్రణులారా ! నేను విన్న చూచిన అవధానులను ప్రస్తావించితిని. ఇంకను ఎందరో మహనీయులైన అవధానులు ఉండవచ్చును. వారందరు ప్రాతః స్మరణీయులే. వారిని ప్రస్తావించకున్న నన్నుమన్నించ గలరు. బుద్ధి పూర్వకముగ చేసినది కాదు. ఇందులో వరుస క్రమము కూడ తప్పి యుండ వచ్చును. ఏ వరుసలో నున్నను వారు మహనీయులే. ఈ 215 పాదముల మాలికను ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
మద్దూరి రామమూర్తి.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.