గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జనవరి 2020, మంగళవారం

అవధాని ప్రవరులు 2. రచన. శ్రీ మద్దూరి రామ్మూర్తి.

జైశ్రీరామ్.
అ వ ధా ని  ప్ర వ రు లు - 2.
రచన. శ్రీ మద్దూరి రామమూర్తి.

అవధాని ప్రవర ప్రనిర్మితి యశో హర్ష ప్రహర్షుండు, ర
మ్య వధానైక కళావతారము ,సతమ్మాత్మావధాని స్ఫుర
త్ప్రవరామ్నాయ, విశుద్ధ
మానసుడు, ప్రోత్సాహమ్ము నందించుచున్
కవితా కల్పక వృక్షమున్ నిలిపె. ప్రజ్ఞాశాలి నా పూజ్యునిన్
సి.వి.సుబ్బన్నను నే దలంచెద శుభాశీర్వాదమున్ గోరి, స
త్కవి మూర్ధన్యుడు మాన్యుడా అనుములాఖ్యాతుండు శేషేంద్రుడున్
ధ్రువతారౌచు వధాన లోకమున పేరున్ గాంచె నా స్వామి, ధీ
ప్రవరుండై యవధానియై యలరె చిర్రావూరి శ్రీ రామ శ
ర్మ వరేణ్యుండతనిన్ స్మరించెదను. రామబ్రహ్మమున్ గణ్యుడై
యవధానాటవి సంచరించె మృగరాజై పండితుల్ మెచ్చ, భా
ర్గవుడై దోర్బల శర్మ తా వెలిగె ప్రజ్ఞావంతులే మెచ్చ, కూ
ర్మి వధానమ్మున దిద్దితీర్చుచు సమున్మీలద్విశేషమ్ము లె
న్నొ వచించెన్ విజయా
శిషమ్ములిడె నన్నున్ ధన్యుగా జేసె, ధీ
దివిషద్వాహిని నోలలాడగ సదా దీవించె కావ్యజ్ఞుడౌ
శివరామాఖ్యుడు మాచిరాజుకులరాట్ శ్రీ రమ్యు డానందుడై,
యవధానమ్మున అష్టకాల నరసింహారాము డొప్పెన్ భువిన్.
కవి సస్నేహ కరావలంబ మహితాకారంబు సత్కీర్తి వా
మ విజృంభింప నరాల వంశజుడు రామారెడ్డి వాగీశుడై
అవధానాగ్రణియై గుణాధికుడునై ఖ్యాతిన్ గడించెన్ భువిన్.
శ్రవణానంద మొసంగె భూతపురి సుబ్రహ్మణ్య ధీశాలి  స
త్కవితా సూన మరంద ధారలను విజ్ఞానాళి కందించి, యే
యవరోధమ్ముల నైన లెక్కిడని కావ్యజ్ఞున్ గణేశున్ సదా
స్తవమున్ జేతు,తిగుళ్ళవంశ కుల హంసన్ శ్రీహరిన్ గొల్చెదన్.
కవియై, యష్టవధానియై చిటితొటీ గణ్యంపు వంశాబ్జుడై
స్తవమందెన్ విజయుండు. జ్ఞాన మణియై, సంస్కార సంశోభియై
పవలున్ రేలును భక్తి తత్పరత దైవమ్మైన గాయత్రినే
స్తవమున్ జేయు శతావధానియగు దత్తాత్రేయ శర్మాఖ్యుడున్
ధ్రువతారౌచు వధాని లోకమున పేరున్ గాంచె గండ్లూరిగా.
భువి భాసిల్లె మహావధానిగ జనుల్ భూషింప జ్ఞానాత్ముడై
కవియై కోవెల సుప్రసన్న .తలపన్ గాడేపలీ కుక్కుటే
శ వధానిన్ మరువంగ శక్యమె. మహా శబ్దంబులన్ బేర్చి తా
నవధానంబు లొనర్చె రావురి కులాఖ్యాతుండు ధన్యాత్ముడున్.
కవి రాజై శివగౌడు వెల్గెను మహా కావ్యావధానమ్మునన్.
పవియై వెల్గిన రాళ్ళబండి కవి భాస్వంతున్ ప్రసాదున్ మదిన్
స్తవమున్ జేతు వధాన రమ్య కవితా సారస్వతా మూర్తినిన్.
చవులూరించెడి మాట, మేన పులకల్ జంటింపగా దంట, స
త్కవితాలోలుడు, ధారణాసురుడనన్ ఖ్యాతుండు నైనట్టి ప్రౌ
ఢ వధానాధ్వహుడైన శ్రీ గరికపాడ్వంశ్యున్ నృసింహాహ్వయున్
స్తవమున్ జేయుదు.సత్కవీశు డనగా ధాత్రిన్ నుతిన్ గాంచు వా
క్ప్రవరున్ శ్రీ కడిమెళ్ళ వంశజు యశోభాగ్యున్ సహస్రా వధా
ని వరేణ్యున్ స్మరియింతు, తద్విధిని ధీ నిష్ఠాత్ముడై మాన్యుడై
కవులున్ బండితులున్ వధానులు రసజ్ఞ శ్రేష్ఠులున్ సాహితీ
దివిషన్నిర్ఝరిణీ సితచ్ఛదులు సందీపించ వాఙ్మూర్తిగా
కవిగా శ్రీ చెఱుకూరి వంశ్యుడు సమజ్ఞన్ సూర్యనారాయణ
ప్రవరుం డగ్నిగ తేజరిల్లె.బుధులున్ ప్రాజ్ఞుల్ నుతింపంగ స
త్కవియై దివ్య వధానియై సుగుణియై జ్ఞానాబ్ధియై మించె పా
టవ మొప్పన్ కవిలోక వంద్యుడగు కోటా వంశ చంద్రుండునౌ
కవి లక్ష్మీ నరసింహ పండితుడు.సత్కావ్యజ్ఞుడై మేటియై
కవిభానుండు రస ప్రవాహ విలసత్కావ్యాళి నిర్మాత, తా
నవధానాగ్రణి ధూళిపాల మహదేవాఖ్యున్ మణిన్ గొల్చెదన్.
నా స్పందన.
నవనీతంపు మహత్ కవిత్వ సుగతిన్ నైరాస్యమున్ బాపు స

త్కవితామాధురినందఁజేయు కవులన్ గణ్యావధానాళి నీ

భువి పైగల్గిన నేటివారిని ప్రభాపూర్ణుండు రామ్మూర్తి సం

స్తవమున్ జేసిరి. వీరి కీర్తి వెలుఁగున్ ధాత్రిన్ చిరస్థాయిగా.
🙏🏻

చింతా రామకృష్ణారావు.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.