గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, నవంబర్ 2016, శుక్రవారం

ప్రాతః స్మరామి. శ్లోకత్రయము. . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్
శ్లో. ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాతమతత్వం!
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్!
యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం!
తత్బ్రహ్మ నిష్కల్మహం న చభూతసంఘః!!
జ్ఞానోజ్వలత్సచ్చిదానంద రూపంబు, యోగాళికిన్నిత్యముద్యత్శరణ్యంబు, ముక్తిప్రదానాత్మ తత్వంబు నేదల్తు నా యంతరంగాన ప్రాతః సమాయత్త ప్రఖ్యాతమౌ వేళ. ఏ బ్రహ్మ రూపంబు జాగ్రత్ సుషుప్తంబు, స్వప్నంబులన్ దెల్యు, భేదంబె లేనట్టి బ్రహ్మంబు నేనే. కనన్ బంచ భూతాళి రూపంబు నేకాను. సముద్యత్ చిదానంద రూపంబు నేనే యటంచున్ తలంతున్ గ. ప్రాతః సమాయుక్త వేళన్. తలంతున్, తలంతున్, తలంతున్, తలంతున్.
భావము. సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.
శ్లో. ప్రాతర్భజామి చ మనోవచసామగమ్యం!
వాచోవిభాన్తి నిఖిలా యదనుగ్రహేణ!
యం నేతి నేతి వచనైః నిగమా అవోచు!
స్తం దేవ దేవమజ మచ్యుతమాహురగ్ర్యం!!
మనసుకు మాటకు అందని బ్రహ్మను ప్రాతః కాలము నే తలతున్. తలపుల చిక్కిన బ్రహ్మము నెదనిడి సేవింతున్నే సేవింతున్.ఆ .  .  .బ్రహ్మ యనుగ్రహముండుట చేతనె వాక్కులు సర్వము వెలుగొందున్, కాదిది కాదిది యని వేదంబుల వేబ్రహ్మంబును తెల్పెడినో, ఆ జనన మరణ విరహితుడౌ దేవుఁడు ఘనుఁడని పండితులెల్లఁ గనున్.
భావము. మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.
శ్లో. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం!
పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యాం!
యస్మిన్నిదం జగదశేషమశేష మూర్తౌ!
రజ్జ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం వై!!
అజ్ఞానాంధం బునకావల గలసుజ్ఞానోజ్వల తేజమె బ్రహ్మ, సనాతనుఁడాతఁడు, పురుషోత్తముఁడతఁడఖిల జగతి పతి యంతయు నతఁడా చేతో రూపుని ప్రాతః కాలము చిత్తమునందున నే తలతున్, నా చిత్తమునందున నే తలతున్, నా చిత్తమునందున నే తలతున్.ఆత్మ రజ్జువది బ్రమలకు లోనై సర్పముగా మది కనఁబడుటెఱిఁగితి. శాశ్వితమగు నా బ్రహ్మము నా మది వెలుగై నిలిచుత యెల్లపుడున్.
భావము. అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.
శ్లో. శ్లోకత్రయమిదం పుణ్యం లోకోత్రయ విభూషణం!
ప్రాతః కాలే పఠేద్యస్తు సగత్సేత్పరమం పదం!!
ముచ్చటఁగా పై మూడు పాటలను నిచ్చలు ప్రాతః కాలమ్బందున సచ్చిద్బ్రహ్మము నాత్మను తలచుచు నుచ్చరించినను ముక్తిలభించున్.ఇహ పర సుఖములు చేతికి చిక్కున్.నిత్యము సత్యము బ్రహ్మ పదార్థము ప్రాతః స్మరనము ధన్యొపాయము. ప్రాతః స్మరణము ధన్యోపాయము. ప్రాతః స్మరణము ధన్యోపాయము.
భావము. ఈ మూడు శ్లోకములు మూడు  లోకములకు అలంకారములు,  ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పఠింతురో వారు ఇహ పర సౌఖ్యములందుదురు.
జైహింద్..
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మూడు లోకములకు అలంకారమైన శ్లోకములను ప్రాత:కాలమున పఠించుటవలన ఇహపరము లందు సుఖ సౌఖ్యములు లభించునని మంచి శ్లోకమూల ద్వారా తెలియ జెప్పినందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.