జైశ్రీరామ్.
1.శా:- శ్రీ కల్యాణ మనోజ్ఞ భాష, మధువుల్ చిందించు సద్భాష, య
స్తోకంబై వెలుగొందు భాష, శృతి మాధుర్యంబునన్ శ్రోతలన్
లోకాతీత మనోజ్ఞ భావ గణనా లోలత్వమున్ నిల్పు, సత్
ప్రాకట్యంబుగ వెల్గు భాష తెలుగే ప్రాశస్త్యమొందెన్ భువిన్.
2. శా:- శ్రీ మద్భారత జాతి కీర్తి జగతిన్ చెన్నారగా చేయు నా
ధీమంతుల్ మహితాంధ్రులౌట కనినన్ వ్యక్తంబగున్ తెల్గునన్
శ్రీమద్భారతి దివ్య తేజసము సంసేవ్యంబుగా నొప్పి, సు
క్షేమంబున్ సమ కూర్చునంచు, తెలుగే దివ్యంబటంచున్ భువిన్.
3.ఉ:- అట్టి మనోజ్ఞభాష, సుమహద్విభవంబున వెల్గు భాష. నే
డిట్టి దురంత దుస్తితిని తూలుచు సోలుచు నుండె. హేతువున్
పట్టి కనంగ, తేటపడు. బానిస తత్వము బాయ నేరకీ
పట్టున తెల్గువారు పర భాషల వర్ధిలఁ జూచు చుండుటే.
4.శా:- మాధుర్యంబును కల్గి, సజ్జనుల సమ్మాన్యంబుగా వెల్గి, శ్రీ
మేధాధిక్యత తోడ నొప్పి, జగతిన్ మేల్బంతిగా నుండి, స
ద్బోధల్ గొల్పిన యాంధ్ర భాష జగతిన్ పూర్వాకృతిన్ గోల్పడెన్.
మేధావుల్ గమనించి తెల్గు జననిన్ మేల్గూర్చి రక్షింపనౌన్.
5.క:- అమ్మా తెలుగుల వెలిగే - ‘మ మ్మీ’జగతిని నిలుపుట మహనీయతయా?సమ్మాన్యతనుం‘డే, డి’గ - సమ్మతి యొనరుతువె? ‘నా(అ)న్న’చక్కని జగతిన్.
6. చతుర్వింశ త్యధిక (24) ద్వివిధ గతి (48) కంద - గీత గర్భ చంపక మాల.
శ్రీ తెలుగే సుధామధుర చిద్విలసత్ ప్రభ మాన్య భాషదే.
మా తెలుగే సుధీవరులు మాన్యులు మెచ్చెడి భవ్య భాషయున్.
నే తలతున్ ధరిత్రి గణనీయ లయాన్విత శ్రేయ భాషయౌన్.
భూ తలమున్ సదా `తెలుగు’ పూజ్యులు మెచ్చెడి దివ్య భాషయౌన్.
7. నక్షత్రబంధ కందము :- ( మ ధు ర మ గు – జా ను తె లు గు )
మదిని గను, మన తెలుగు. సా
రథివై పలుకం దగు నొనర గురు సుతేజా!
సు ధను, తెలుగు ధుర్యుం, గని
తెద తెలుప శృతి మధుర మగు నిది జాగృతమౌన్ !
8. శ్రీచక్ర బంధ గీతము.
వెలుగు చూపరా! శ్రీ హరా! వేడుదింతె!
గతి రచింపరా! శ్రీశ! మేల్ గాంచగాను
యక్ష సుర సేవ్య! శ్రీ జ్ఞాన భిక్ష చాలు.
వెలుఁగ జేయగ తెల్గును వేలు పీవె.
9.సీ:- అవధాన ప్రక్రియ నాంధ్రుల సత్కీర్తి - వెలయించె నల్దిశల్ తెలుగు భాష.
మహనీయ గణనీయ మర్యాద మన్ననల్ - కలిగించు ఘనమైన తెలుగు భాష.
నైతిక విలువలు భౌతిక దార్ఢ్యత - కళ కాంతులను గూర్చు తెలుగు భాష.
సభ్యతా సంస్కార సన్మాన్య సంపత్తి - నిలఁ గూర్చు మహనీయ తెలుగు భాష.
గీ:- అట్టి సద్భాష విడనాడినట్టి వారు.
తెలుగు సంస్కార దూరులౌ. తెలియుడయ్య.
పరుల పంచన చేరుచు బ్రతుక గనుట
తల్లి యుండియు కోల్పోయి తల్లడిలుట.
10.క:- మంగళ కరమగు తెలుగును
మంగళ గుణ పూర్ణులెన్ని మంగళ మొందున్.
మంగళ మగు తెలుగునకున్
మంగళము సమున్నతాంధ్ర మహనీయులకున్.
స్వస్తి.
జైహింద్.
2 comments:
ఆర్యా, ప్రణామాలు. తెలుగులోని మాధుర్యాన్ని అందమైన నడకతో సాగిన మీ పద్యాలలో గ్రోలి ఆనందించాను. 'చతుర్వింశ త్యధిక (24) ద్వివిధ గతి (48) చంపకమాల ' గురించి తెలుపవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
తెలుగు వెలుగులు విర జిమ్ముతున్న మీ పద్యాలు రసరమ్యం గా ఉన్నాయి .
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.